Gandhiji
-
ఓట్ల గురించి జాతిపిత.. రాజ్యాంగ నిర్మాతతో మాట్లాడితే..
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు సాంచాలు నడుపుతూ బట్ట నేస్తున్నారు. వీధికుక్కలు చలికి ముడుచుకు పడుకున్నాయి. ఒక్కసారిగా చరచరమంటూ గర్జించిన మేఘానికి దిక్కులు దద్ధరిల్లడంతో జాతిపిత మహాత్మాగాంధీ ఉలిక్కిపడి లేచారు. గాంధీచౌక్‌లో నలుదిక్కులూ తేరిపార చూశారు. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం ముందుకెళ్లినా.. బాపూజీ కర్ర పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వైపు కదిలారు. మెడనిండా పూలదండలతో చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ఆదమరిచి నిద్రపోతున్న అంబేడ్కర్‌ను పిలిచారు. చిన్నపాటి పిలుపునకే దిగ్గున లేచిన అంబేడ్కర్.. ఇంత రాత్రి వేళ వచ్చిన గాంధీజీతో మాట కలిపారు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది. ♦ గాంధీజీ : ఏం లేదు నాయనా. పొద్దాంత మైకుల మోత. డప్పుసప్పుళ్లు.. నినాదాలతో నే నుండే గాంధీచౌక్ దద్దరిల్లుతోంది. వాళ్ల లొల్లి వశపడడం లేదు. ఎప్పటిలాగే పడుకున్న కానీ పొద్దాంత జరుగుతున్న లొల్లి గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు. ఉరుములతో మెల్కువ వచ్చి.. ఇటు వైపు వచ్చిన. నీకేం ఇబ్బంది లేదు కదా. ♦ అంబేడ్కర్ : అయ్యో అదేం మాట బాపు. నాకేం ఇబ్బంది లేదు. కానీ నా పరిస్థితి కూడా అంతే. మీరు ఇప్పటి దాకా చెప్పిన పాట్లన్నీ నాకూ తప్ప డం లేదు. కామారెడ్డి–కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రద్దీతో మరిన్ని కష్టాలు పడుతున్న. నా కంటే మీరే నయం. ♦ గాంధీజీ : అవునా.. నాయన. శాంతియుత మార్గంలో నేను సాధించి పెట్టిన స్వాతంత్య్రం.. నువ్వు ప్రసాదించిన రాజ్యాంగం చూస్తే.. నా మనసు కలికలి అవుతుంది. నేటితరం నేతలు.. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం పరిధిలోనే తెలంగాణ సాధించామని, నీ గురించి ఎవరూ యాది చేయరేం. ఎవరికీ వారే తెలంగాణ తె చ్చింది మేమే అంటే.. మేమే.. అంటూ అందరూ వాళ్ల డబ్బానే కొట్టుకుంటున్నారు. రాజ్యాంగం రాసిన నీ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ♦ అంబేడ్కర్: అవును బాపు.. వాళ్లు యాదిచేస్తే ఎంత చేయకుంటే ఎంత. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మేలు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాబద్ధంగా వచ్చింది. అయినా గిప్పుడు గా ముచ్చట్లు ఎందుకు బాపు. ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. ♦ గాంధీజీ : అవునవును. మొన్న ఓ నాయకుడు నామినేషన్ వేసేందుకు ఎంత మందితో ఊరేగింపు తీశారో తెలుసా? డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగుచేసి నామినేషన్ వేశారు. ప్రజాసేవ ఇప్పుడు ఎంతో ఖరీదైపోయిందో చూశావా.. ప్రజలకు సేవ చేసేందుకు ఇంత ఆరాటమా?! ♦ అంబేడ్కర్ : అంతెందుకు మహాత్మా. ఎన్నికల ప్రచారానికి జనానికి డబ్బులిచ్చి సమీకరించడం, ఊరేగింపులు తీయడ.. పూలదండలతో నిన్ను, నన్ను ముంచెత్తడం నచ్చడం లేదు. చూసే జనానికి నచ్చడం లేదు. నేటి తరం నేతలు నామినేషన్ టైమ్‌లోనే డామినేషన్ చూపించడం.. గెలిచిన తరువాత జనానికి కనిపించకుండా పోవడం పరిపాటే కదా. ♦ గాంధీజీ: అయ్యో అసలు సంగతి నీకు తెలియదు. ఎన్నికల సమయంలో చాటుమాటుగా మద్యం పంపిణీ చేస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఓట్లు పొందుతున్నారు. మహిళా సంఘాలకు నేరుగా డబ్బులివ్వడం, ఓట్లు మాకే వేయమని ప్రలోభాలకు గురిచేయడం మామూలైపోయింది. ♦ అంబేడ్కర్ : అవి కూడా నాకు తెలుసు మహాత్మా. అన్నీ తెలిసి ఈ కుళ్లును చూడలేక.. మీరు కళ్లు మూసుకున్నారు. నేను చూస్తూ కుమిలిపోతున్నాను. మీరు బోధించిన శాంతిమార్గాన్ని ఇప్పుడేలా మర్చారో చూశారా..? ♦ గాంధీజీ : నాయనా.. భీమ్రావు.. ఇవన్నీ నాకు తెలియనివి కావు. మీరు దేశవిదేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి హారతి పట్టారు. సచ్చీలురకే పట్టం కట్టేలా రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనల్ని రూపొందించారు. ఇంత చేస్తే ఏం లాభం. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మనం ఎవరిని ఉద్ధరించేందుకు వాటిని రూపొందించామో వారిలో చైతన్యం వచ్చేంత వరకు ఎవరూ ఏమి చేయలేరు. ♦ అంబేడ్కర్: అది కాదు మహాత్మా..! ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ పదవిలోకి రాగానే ఆ సొమ్మును వడ్డీతో సహా వందరేట్లు సంపాదించడం.. ఇదంతా ప్రజాసేవ కోసమే అంటే ఎవరైనా నమ్ముతారా..! పార్టీ టిక్కెట్ రాకుంటే వెంటనే మరో పార్టీలోకి దూకడం పరిపాటిగా మారింది. ♦ గాంధీజీ : నాయన నువ్వు, నేను ఎంత బాధపడినా లాభం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. చైతన్యం రావాలి. ఎవరూ మంచివారు.. ఎవరు స్వార్థపరులో గుర్తించే సోయి రావాలి. డబ్బుల కోసమో.. కులపోడు అనో ఓటు వేస్తే ఐదేళ్లు బానిసలుగా బతకాల్సిందే. ఎవరి మాటలు వినకుండా.. ఓటును అమ్ముకోకుండా.. నిబద్ధతతో మంచివారికి పట్టం కట్టే రోజులు రావాలి. అప్పుడే సుపరిపాలన సాధ్యం. ♦ అంబేడ్కర్ : నిజమే.. మనం ఎన్ని చెబితే ఏమిటి.. ఎన్నికల తీరు చూస్తే సామాన్యులు.. నిస్వార్థపరులు పోటీ చేయగలరా..? పోటీచేసినా తట్టుకోగలరా? నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు దాటొద్దు. కానీ డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారో చూశారా బాపూ! అందరూ ప్రజాసేవ చేస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తున్నారు. మందు పోస్తున్నారు. వాస్తవాలు ఏమిటో అందరికీ తెలిసినా ఓట్లు అమ్ముకుంటూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఓటర్లు మారితేనే మంచి పాలకులు వస్తారు.. వారి బతుకులు మారుతాయి. సరే కాని ఇగ తెల్లారిపోయింది. అదిగో.. వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి బస్సు రానే వచ్చింది. అటు మున్సిపల్ సిబ్బంది చీపుర్లతో వస్తున్నారు... ఇక నేను వెళ్తాను.. అంటూ... గాంధీజీ పెద్ద పెద్ద అడుగులేస్తూ వడివడిగా గాంధీచౌక్‌లోని దిమ్మైపెకి చేరిపోయారు. అంబేడ్కర్ సైతం కళ్లద్దాలను సర్దుకుని ఎప్పటిలాగే రాజ్యాంగాన్ని పట్టుకుని నిలబడ్డారు. ► అంతలోనే తెల్లారిపోయింది. యథావిధిగా సిరిసిల్ల జనసందడిగా మారింది. మైకుల ప్రచార మోత మళ్లీ మొదలైంది. నినాదాల జోరు తగ్గలేదు. ఆర్భాటపు ప్రచారాలు మరింత పెరిగాయి. ఇదంతా చూస్తున్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్లు ఎప్పటిలాగే మనసులోని బాధను అర్ధరాత్రి వేళ ఒకరినొకరు కలుసుకుని చెప్పుకుంటూ గుండెల్లో భారాన్ని దించుకుంటున్నారు. -
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
జైహింద్ స్పెషల్: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్
మన దేశంలో పంచాయతీ చట్టం 1951 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. స్వేచ్ఛా భారతంలో గ్రామాలు ప్రతి చిన్న విషయానికీ రాష్ట్రానికేసి చూడకూడదు, స్వశక్తితో స్వయం పోషకత్వం స్థితికి రావాలనే భావనతో పంచాయతీ చట్టం తీసుకొచ్చింది వుద్రాస్ ప్రావిన్స్. ఈ చట్టానికి ఇప్పుడు 71 ఏళ్లు. 2010 నుంచి ఏటా ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశేషం ఏంటంటే.. ఈ చట్టం రూపకల్పన, అవులులో ఒక తెలుగు వ్యక్తి పాత్ర ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ వ్యక్తే.. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా దశాబ్దాలకాలం పార్టీని ముందుకు నడిపించిన కల్లూరి చంద్రమౌళి. దేశంలో మరే ప్రజాప్రతినిధికీ లేనటువంటి చెక్ పవర్‌ను పంచాయతీ సర్పంచ్‌కు కట్టబెట్టారాయన. చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు మోపర్రుకు గాంధీజీ! తెనాలికి సమీపంలోని మోపర్రు చంద్రమౌళి స్వస్థలం. 1898లో జన్మించారు. హైస్కూలు విద్యలోనే సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు. తెనాలి, గుంటూరు, కలకత్తాలలో విద్యాభ్యాసం జరిగింది. 1919లో వివాహమైంది. 1920లో ఇంగ్లండ్ వెళ్లి అగ్రికల్చర్ బీఎస్సీ చదివి 1924లో ఇండియా తిరిగొచ్చారు. భారతీయ సంస్కృతిని రక్షించాలన్నా, ఇంగ్లండ్ దేశంలా వునదేశం అభివృద్ధి చెందాలన్నా స్వపరిపాలన అవసరవుని ఆయన భావించారు. దేశవ్యాప్తంగా పర్యటించి గాంధీజీ ఆశ్రవూనికి చేరి ఆయన సేవచేశారు. స్వగ్రామం మోపర్రుకు చేరుకుని స్వరాజ్య ఉద్యవూన్ని ఆరంభించారు. 1929లో గాంధీజీని మోపర్రుకు రప్పించారు. తెనాలి నుంచి ఎక్కువవుంది యువకులను స్వరాజ్య ఉద్యవుంవైపు వుళ్లించారు. అనేకసార్లు జైలుకెళ్లారు. 1933–62 వరకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 1934లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని తెనాలిలోనే ఏర్పాటుచేశారు. తెనాలి కేంద్రంగానే జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు నడిపారు. జిల్లా బోర్డు అధ్యక్షుడిగా సావుర్ధ్యాన్ని నిరూపించుకొని 1964లో తెనాలి నుండి శాసనసభ సభ్యునిగా, 1947లో భారత రాజ్యాంగసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947 వూర్చిలో ఏర్పాటైన మద్రాస్ ప్రావిన్స్‌లో ఓవుండూరి రావుస్వామి రెడ్డియార్ వుంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార వుంత్రిగా నియమితులయ్యారు. స్వరాజ్య ఉద్యవుంలో పాల్గొన్నవారికి భూవుులు ఇచ్చే ఏర్పాటు చేశారు. తర్వాత 1949లో కువూరస్వామి రాజా వుంత్రివర్గంలోనూ సహకార, స్థానిక స్వపరిపాలన వుంత్రిగా పనిచేశారు. సవుగ్ర పంచాయతీ చట్టం మంత్రిగా ఉన్న ఆ సమయంలోనే చంద్రమౌళి వుహాత్మాగాంధీ ప్రధాన ఆశయమైన గ్రామ స్వరాజ్యం కోసం దేశంలోనే మెుదటగా సవుగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గ్రామ పంచాయతి చట్టం–1950తో గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాస్తవమైన అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టి అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకొంటూ, గ్రావూల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. అందుకే గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పించారు. ఇళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, వూర్కెట్లపై పన్ను వసూలు అధికారాన్ని కల్పించారు. ఆవిధంగా గ్రామ ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. రూ.100 వరకు సివిల్ వివాదాలనూ గ్రామ పంచాయతీ కోర్టు పరిధిలోకి తెచ్చారు. నాడు వుద్రాస్ ప్రావిన్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలుండేవి. స్వయం నిర్ణయ ఉద్దేశం చట్టం అవుల్లోకి వస్తున్నపుడు చంద్రవ˜ళి చేసిన రేడియో ప్రసంగం అప్పట్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రావుసీవుల అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలను ఆయన సూటిగా వెల్లడించారు. ‘‘పంచాయతీలు ప్రతి అల్ప విషయానికి రాష్ట్ర ప్రభుత్వంకేసి చూడరాదు. ప్రతి స్వల్ప విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే ‘కేంద్రీకరణ విధానం’ ప్రజాపాలనకు ప్రధాన సూత్రమైన స్వయం నిర్ణయత్వానికి వుుప్పుతెస్తుంది’’ అన్నారు. ‘‘కొలదివుంది పాలకులు ఎచటనో ఒక చోటు నుండి, సర్వ గ్రావూలకు సంబంధించిన సవుస్యలన్నింటిని పరిష్కరింపబూనుట అసంభవవుు’’గా కూడా తేల్చారు. గ్రామీణ ప్రజలు విద్యావిహీనులు, సదా కలహాలతో కాలం గడుపుతారు... ఇలాంటివారు అధికార నిర్వహణకు అనర్హులు.. అని కొందరు శంకిస్తుంటారని చెబుతూ, ఇది అసవుంజసం అన్నారు. ‘‘చదవను రాయను నేర్చుటయే విద్య కాదు.. ఇట్టి చదువ#కంటే సద్గుణవువసరం. సుచరితులకు సదవకాశ మెుసగినచో సేవాతత్పరులయి, యోగ్యతను బడసి పైకి రాగలరు’’ అన్నారు. ప్రజలు తవుకు విశ్వాసపాత్రులయిన వారినే పంచాయతీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఒకవేళ స్వార్ధపరులనే ఎన్నుకుంటే దాని ప్రతిఫలం వారిని ఎన్నుకున్నవారే అనుభవిస్తారని కూడా చెప్పారు. ప్రజలు తవు అనుభవంతో తప్పులు గ్రహించి సరిదిద్దుకుంటారని చంద్రవ˜ళి భరోసాగా అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టం ఉద్దేశం.. గ్రామాలను స్వశక్తితో స్వయం పోషకత్వ స్థితికి తీసుకురావటమే నని చెప్పారు. ఇందుకు సుచరితులు, సుశిక్షితులు అయిన యువకులు అత్యవసరంగా కావాలని అని స్పష్టం చేశారు. – బి.ఎల్.నారాయణ -
గాంధీజీ ఫొటోల్లో అదే అద్భుతం.. ఆ ఘనత మార్గరెట్దే!
విభజన వేళ భారత్‌లో జరిగిన హింస ప్రపంచ చరిత్ర కనీ వినీ ఎరుగనిదని చరిత్రకారుల ఏకాభిప్రాయం. ఆ విషాదగాథ ఆధారంగా వందల గ్రంథాలు వచ్చాయి. వేల పేజీల సృజనాత్మక సాహిత్యం వచ్చింది. మతావేశాలతో చెలరేగిన ఆ కల్లోలాలలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షలని అంచనా. అపహరణకు గురైన వారు కావచ్చు, లైంగిక అత్యాచారాలకు బలైన వారు కావచ్చు– బాలికలు, యువతలు 75,000 నుంచి లక్ష. చరిత్ర చూడని భయానక శరణార్థి సమస్య వచ్చింది. ‘తమస్’ (భీష్మ సహానీ)’, ‘ఎ ట్రెయిన్ టు పాకిస్తాన్’ (కుష్వంత్‌సింగ్), ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ (ఊర్వశీ బుటాలియా), ‘ఏ టైమ్ ఆఫ్ మ్యాడ్నెస్’, ‘మిడ్నైట్ చిల్డ్రన్’ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్–స్పున్నర్), ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ (ల్యారీ కోలిన్, డొమినిక్ లాపిరె), ‘మిడ్నైట్ ఫ్యూరీస్’ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో, అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో ఆ విషాదం అక్షరబద్ధమైంది. జిన్నా ప్రత్యక్షచర్య పిలుపే ఇందుకు కారణం. కానీ విభజన నాటి విషాదాన్ని కెమెరా ద్వారా చిత్రబద్ధం చేసిన వారు మార్గరెట్ బర్కి వైట్. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలో మీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్ధులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకు కూర్చున్న అబ్బాయి, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవన్నీ ఏదో సందర్భంలో, ఏదో ఒక పత్రికలో చూసి ఉంటాం. ఇవన్నీ మార్గరెట్ వైట్ (1904–1971) ధైర్య సాహసాల వల్ల చారిత్రక ఫ్రేములకెక్కినవే. ఒక మహా మానవ విషాదాన్ని ఆమె చారిత్రక దృష్టితో దృశ్యీకరించారు. ఆ నలుపు తెలుపు ఫొటోల్లోనూ ఎర్రటి నెత్తురు చూసిన అనుభూతి తెచ్చారామె. రెండో ప్రపంచయుద్ధం ముగియగానే ఇంగ్లండ్ భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడం ఖాయమని తేలింది. అప్పుడు మార్గరెట్ అమెరికా నుంచి వెలువడుతున్న ‘లైఫ్’ పత్రికలో పని చేసేవారు (తరువాత ‘టైమ్’ మ్యాగజీన్‌కు మారారు). చాలామంది అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులూ, ఫొటోగ్రాఫర్ల మాదిరిగానే ఆమె కూడా (మార్చి, 1946) భారత్‌కు వచ్చారు. అసలు ఆమె ఉద్దేశం గాంధీజీ మీద వార్తా కథనం. కానీ ఆయన కార్యదర్శి చరఖా వడకడం వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పాడు. చాలా తొందరగా నేర్చుకుని వచ్చారామె. తీరా, ఆ రోజు సోమవారం. గాంధీజీకి మౌనవ్రతం. అయితే సహజ కాంతిలోనే ఫొటోలు తీయాలని, మూడు డిమాట్ ఫ్లాష్‌లు మాత్రమే ఉపయోగించాలన్న షరతులతో మొత్తానికి అనుమతించారు. గాంధీజీ రాట్నం ముందు కూర్చుని పేపర్ క్లిపింగ్స్ చూసుకుంటున్నారు. అలాగే ఫొటో తీశారు మార్గరెట్. గాంధీకి అత్యంత ప్రియమైన రాట్నం ముందు కూర్చుని ఉన్న ఫొటోల్లో ఇదే అద్భుతం. సహజ కాంతిలో తీయడంతో గాంధీజీ రుషిలా కనిపిస్తారు. చాలాసార్లు గాంధీ వెంటే పర్యటించారామె. జిన్నా, అంబేడ్కర్, నెహ్రూ వంటి ప్రముఖులందరి ఫొటోలు తీశారు. వార్తలు రాయడానికి ఈమెతోనే వచ్చారు ‘లైఫ్’ పత్రికా రచయిత్రి లీ ఎలీనన్. మార్గరెట్ కెమెరా పనితనానికి లీ కలం బలం తోడైంది. ఇలాంటి సమయంలో భారత్‌లో మహిళలు పనిచేయలేరని చాలామంది హితవు పలికారు. రవాణా సదుపాయాలు ఉండవని చెప్పారు. యువతులను అపహరించడం సర్వసాధారణం. ప్రాణాలకు ముప్పు సరే. అవన్నీ నిజమే అయినా మార్గరెట్ తట్టుకుని నిలబడ్డారు. అప్పటికి ఆమె వయసు పాతిక లోపే. ఒక పాత జీప్‌లో కెమెరా సామగ్రి, టైప్ రైటర్, ఇతర వస్తువులతో లాహోర్ వెళుతుంటే ఒకచోట శరణార్థుల గుంపు దాడి చేసింది కూడా. కానీ సైనికులు రక్షించారు. అమృత్సర్ దగ్గర బియాస్ నది వద్ద రైలు పట్టాలకు ఎడమ వైపున ఈగలు వాలుతున్న 17 శవాలను గమనించారామె. ఒక నదిలో కుళ్లి ఉబ్బిన శవాల వైపే చూస్తున్న రాబందులను చూశారు. ఆకలితో చనిపోయిన నాలుగేళ్ల బాలుడిని లాహోర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పక్కన ఖననం చేస్తున్న దృశ్యం చూశారు. జబ్బు పడిన మహిళను భుజం మీద మోసుకుంటూ వస్తున్న సిక్కును కెమెరాలో బంధించారు. ఈ సిక్కుతో పాటే భారత్‌కు బయలుదేరిన భారీ గుంపు (కఫిలా)లో 103 మందిని మధ్యలోనే చంపారు. ఇవన్నీ ఆమె ‘హాఫ్ వే టు ఫ్రీడమ్’ అన్న స్వీయ రచనలో నమోదు చేశారు. మరునాడే అమెరికా ప్రయాణమనగా, మార్గరెట్ గాంధీజీని కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ప్రయాణం రోజే గాంధీజీ హత్య జరిగింది. ఆదరాబాదరా వెళ్లారామె. శవం దగ్గరకు రానిచ్చినా, ఫొటోకు అనుమతి ఇవ్వలేదు. అయినా కెమెరాకు రహస్యంగా పని చెప్పబోయారు. ఫ్లాష్ వెలిగింది. అంతా ఆగ్రహించారు. కెమెరాలో రీలు లాగేసి, అక్కడ నుంచి గెంటేశారు. కెమెరా లెన్స్ లేదా ఆమె కళ్లు గమనించినదే అయినా అదంతా దేశ విభజన నాటి విషాద చరిత్రే. కానీ ఆ కంటికీ, ఆ లెన్స్కీ అందని విషాదం ఇంకా ఎంతో... ఎంతెంతో... ఉండిపోయింది. -డా. గోపరాజు నారాయణరావు -
గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత
సాక్షి, చెన్నై: మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన కల్యాణం, 1943 నుంచి 1948 వరకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. చెన్నైలోని కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు -
గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
నా లైఫ్‌లో మధుర ఘట్టం అదే: ఎస్పీ బాలు
ఇందుకూరుపేట: మనిషి మనిషిగా జీవించడమే గాంధేయతత్వమని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గాంధీజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. తొలుత ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూల మాలవేససి నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బాపూజీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడతుతూ.. ప్రతి ఒక్కరూ గాంధీజీ చెప్పిన సత్యం, అహింస మార్గాలను పాటిస్తే చాలునన్నారు. ఈ తరం వారు గాంధీజీ సిద్ధాంతాలను పాటించట్లేదని, వీరిని చూస్తే మహాత్ముడు బాధపడేవారన్నారు. మహా గాయకుడు జేసుదాసు గాత్రం లేకపోతే గురువాయూర్‌లో సుప్రభాతం లేదని.. కానీ అదే ఆలయంలో ఆయనకు ప్రవేశం లేదన్నారు. దేవుడు అందరి వాడని.. మధ్యలో ఈ నిబంధనలు ఏంటని ప్రశ్నించారు. ఓ తెలుగు అనువాద చిత్రంలోని గాంధీజీ పాత్రకు తన స్వరం అందించానని.. అది జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టమన్నారు. జాతిపిత ప్రారంభించిన ఈ ఆశ్రమాన్ని దేవాలయంగా చూసుకోవాలని బాలసుబ్రహ్మణ్యం కోరారు. -
ఈ దేశపటం.. పటేల్ ఆత్మ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అకుంఠిత దీక్షతో సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను (అక్టోబర్ 31, 1875–డిసెంబర్ 16, 1950) ‘ఇండియన్ బిస్మార్క్’గా పిలవడం మొదలయింది. అలాగే సర్దార్‌ను కూడా ఉక్కుమనిషి అనే పిలవడం పరిపాటి. పటేల్ గొప్ప భూమిపుత్రుడు. గుజరాత్‌లోని నాదియాడ్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి జవేర్భాయ్ పటేల్, మొదట ఝాన్సీ సంస్థానంలో సైనికుడు. తరువాత రైతు. తల్లి లాడ్‌బాయ్. దైవభక్తురాలు. వల్లభ్‌భాయ్ తన తండ్రితో కలసి పొలంలో దిగి పని చేసినవారు. చిత్రం ఏమిటంటే ఆయన తన 22వ ఏట మెట్రిక్ ఉత్తీర్ణులయ్యారు. మరో పదేళ్లకు 1910లో ఇంగ్లండ్ వెళ్లారు. పటేల్ టెంపుల్ టౌన్లో బారెట్లాలో చేరారు. అదే సంవత్సరం ఇన్నర్ టెంపుల్ ఇన్‌లో బారెట్లాలో చేరారు మరొక భారతీయుడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ. కానీ వయసులో ఇద్దరికీ ఎంతో తేడా. పటేల్ పెట్లాండ్, నాదియాడ్, బోర్సాద్ల నుంచి వస్తే, నెహ్రూ హేరో, కేంబ్రిడ్జ్లలో చదివి ఇన్నర్ టెంపుల్ వెళ్లారు. పటేల్ 26 మాసాల కోర్సును 20 మాసాలలోనే పూర్తి చేశారు. అన్ని పరీక్షలు ఒకేసారి ఉత్తీర్ణుడైనందుకు ఇచ్చే 50 పౌండ్ల బహుమానం కూడా అందుకున్నారు. 1913లో భారత్‌కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో బొంబాయి బారిస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. తను బొంబాయి ప్రెసిడెన్సీ వాడే అయినా బొంబాయిని ఆయన ఎంచుకోలేదు. తన స్వస్థలం గుజరాత్‌లోనే అహమ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. గోధ్రా, బోర్సాద్లలో కూడా పనిచేశారు. 1916కే చాలా ఖరీదైన న్యాయవాదిగా అవతరించారు. గాంధీజీకి కుడిభుజం అనదగిన పటేల్ తొలి రోజులలో ఆయన సిద్ధాంతాల పట్ల ఎలాంటి మక్కువ చూపలేదు. 1915లో గాంధీజీ అహమ్మదాబాద్ వచ్చారు. కొచ్రాబ్‌లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. చాలామంది యువ లాయర్లతో పాటు, ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉండేవారు. అహింస, గాంధీజీ చెప్పే జీవన విధానం ఇవన్నీ పటేల్‌ను అప్పుడు ఆకర్షించలేకపోయాయి. కానీ ఒక మిత్రుని సలహా మేరకు మొత్తానికి గాంధీని చూడడానికి వెళ్లారు పటేల్. అంత సాన్నిహిత్యం అనుభవించినా కూడా పటేల్ వెంటనే గాంధీని అనుసరించలేదు. 1916లో గుజరాత్ సభ, అంటే జాతీయ కాంగ్రెస్ గుజరాత్ శాఖ– బాంబే ప్రెసిడెన్సీ కాంగ్రెస్ సభలు నిర్వహించింది. అతివాదులు, మితవాదులు చాలాకాలం తరువాత ఆ వేదిక మీద పక్కపక్కనే ఆసీనులయ్యారు. గుజరాత్‌కు చెందినవానిగా మహమ్మద్ అలీ జిన్నా ఆ సభలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలు కూడా పటేల్‌ను కదిలించలేదు. చరిత్రాత్మకం అని అంతా చెబుతున్న లక్నో సమావేశాలకు కూడా పటేల్ వెళ్లారు. నచ్చలేదు. ఆఖరికి 1917లో ఆ శుభ ముహూర్తం వచ్చింది. గుజరాత్ సభ మరోసారి ప్రెసిడెన్సీ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఇంగ్లిష్‌లో కాకుండా, మాతృభాషలో అంటే గుజరాతీలో ఉపన్యసించవలసిందిగా గాంధీజీ వక్తలను కోరారు. జిన్నాకు ఇంగ్లిష్ తప్ప తన మాతృభాష గుజరాతీ కూడా రాదు. విఠల్‌భాయ్ పటేల్ (సర్దార్ అన్నగారు) గుజరాతీలో తడబడుతూ మాట్లాడారు. ఇదే తొలిసారిగా గాంధీగారి పట్ల పటేల్‌కు గౌరవ భావాన్ని కలిగించింది. అంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం కాదు, ఆయన పోరాట పంథా కాదు... గుజరాతీ మీద, మాతృభాషల మీద గాంధీజీ ప్రకటించిన గౌరవమర్యాదలే పటేల్‌ను కదిలించాయి. మరి ఆయన గొప్ప భూమిపుత్రుడు కాదా! పటేల్ ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు కూడా భారతీయులను ఏమన్నా అంటే సహించేవారు కాదు. స్వరాజ్య ఉద్యమం అనేక పాయలతో సాగింది. అందులో రైతాంగ పోరాటాలు కూడా భాగమే. గాంధీ తొలిదశలో రైతాంగ ఉద్యమాలే నడిపారు. తరువాత పూర్తి స్థాయి రాజకీయోద్యమం వైపు మొగ్గారు. పటేల్ ప్రయాణం కూడా అలా సాగిందే. ఇది కూడా గాంధీ పట్ల పటేల్ గౌరవాన్ని పెంచింది. ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ ఘడియలు గర్వించదగినవా? అంతకు ముందు దాదాపు సంవత్సరం పాటు భారతభూమి నెత్తురుతో తడియని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. ముస్లింలీగ్ ఆవేశం ముందు గాంధీజీ అహింస కకావికలైంది. దేశంగా రెండుగా చీలిపోవడం అతి పెద్ద విషాదం. ముస్లింలీగ్ రక్తదాహం ఫలితమే అది. అహింసాయు పంథాలో స్వరాజ్యం సాధించిన దేశమన్న కీర్తి కిరణం మాటున ఈ రక్తపాతం అప్పటికి కనుమరుగైంది. కానీ తరువాత తెలిసింది– అధికార మార్పిడి సమయంలో మరే ఇతర దేశంలోను ఇంతటి రక్తపాతం జరగలేదన్న వాస్తవం. అప్పటిదాకా ఉక్కుపాదంతో భారతదేశాన్ని తమ అధీనంలో ఉంచుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇంతటి హింసను, రక్తపాతాన్ని, దోపిడీని, లూటీని, మానభంగాలను మౌన ప్రేక్షకునిగా వీక్షించింది. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో భారత తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్ పటేల్ హోంశాఖను నిర్వహిస్తున్నారు. నెహ్రూ ప్రధాని. పైగా ప్రధాని పదవికి నెహ్రూ కంటే పటేల్ పట్లే పార్టీలో ఎక్కువ మొగ్గు ఉండేది. గాంధీ మాటను బట్టి పటేల్ ప్రధాని పదవి పోటీ నుంచి వెనక్కు తగ్గారు. నిరాశ పడలేదు. పైగా స్వతంత్ర భారతం పట్ల తనకున్న బాధ్యతను భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేటంత గొప్పగా నిర్వర్తించారు. ఆ కర్తవ్యమే – సంస్థానాల విలీనం. ఆనాడు దేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇవి ఈ దేశంలో అంతర్భాగాలైనప్పటికీ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది మౌంట్‌బాటన్ విభజన ప్రణాళిక. అది కూడా ఎలాంటి స్వాతంత్య్రం? ఇటు భారత్‌లో విలీనమయ్యే స్వేచ్ఛ, అటు పాకిస్తాన్లో చేరే వెసులుబాటు కూడా 1947, జూన్ 3 నాటి ఆ విభజన ప్రణాళిక కట్టబెట్టింది. సాంస్కృతిక ఏకత్వంతో పాటు రాజకీయ ఏకత్వం కూడా సాధించాలనీ, పాలనాపరంగా ఒకే ఛత్రం కింద దేశం ఉండాలన్న స్వరాజ్య సమరయోధుల ఆశలకి భంగపాటు కలిగించే నిర్ణయమది. నిజంగానే స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తిని కాపాడడానికి స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన తొలి కార్యక్రమం సంస్థానాల విలీనం. ఆ పని పటేల్ చేశారు. విలీనాల చరిత్రను గుర్తు చేసుకునే సమయంలో పటేల్‌తో పాటే మరో మహోన్నత వ్యక్తిని కూడా తలుచుకోవాలి. ఆయన వీపీ మేనన్. 1947లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో పటేల్ హోంమంత్రి, ఉపప్రధాని. వీటితో పాటు సంస్థానాల విలీనం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతికి వచ్చింది. గాంధీ, నెహ్రూల అభిమతం కూడా ఇదే. ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ కూడా కొంచెం సహకరించాడు. తాత్కాలిక ప్రభుత్వమే ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. మౌంట్‌బాటన్ రాజ్యాంగ వ్యవహారాల కార్యదర్శి వాప్పాళ పంగుణ్ణి మేనన్ (వీపీ మేనన్)ను పటేల్ ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ ఇద్దరూ కలసి 99 శాతం సంస్థానాల విలీనం పనిని పూర్తి చేశారు. మిగిలిన ఒకటి కశ్మీర్. ఆ పనిని నెహ్రూ తీసుకున్నారు. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ అంటే కశ్మీర్ సమస్యే. వీపీ మేనన్ దూరదృష్టి, పటేల్ జాతీయ దృక్పథం ఆ ఇద్దరిని 1947 జూలై నుంచే సంస్థానాల విలీనం కృషిని ఆగమేఘాల మీద ఆరంభించేటట్టు చేశాయి. సంస్థానాలకు స్వేచ్ఛను ఇవ్వడంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికే ఉంది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛనిస్తే దేశ ఏకత్వం ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే, దేశంలో 48 శాతం భూభాగం సంస్థానాల కిందే ఉంది. 28 శాతం జనాభా వాటిలో ఉండేది. ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛ కొనసాగి ఉంటే ఏం జరిగేదో చెప్పనక్కరలేదు. నిజానికి సంస్థానాధీశులలో అ«ధికులు బ్రిటిష్ జాతికీ, ప్రభుత్వానికీ కూడా తొత్తులే. వారిలో కొందరి వైఖరి అప్పుడే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారత్ ఉనికికే ప్రమాదకరంగా పరిణిమిస్తున్న సంకే తాలు కూడా వెలువడడం మొదలయింది. హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాఘడ్ సంస్థానాలు పాకిస్తాన్లో కలవడానికి సిద్ధమయినాయి. సంస్థానాల విలీనం కోసం పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. వాటిని మూడు వ్యూహాలుగా అమలు చేయించారాయన. మొదటిగా రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాలను వదులుకోవలసందని సంస్థానాధీశులను కోరారు. ఈ మూడు వదులుకుంటే సంస్థాలన్నీ భారత రాజ్యాంగం పరిధికి లోబడినట్టే. కాబట్టి అది రాజకీయ ఐక్యతలో తొలి మెట్టు కాగలదని పటేల్ భావించారు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వంతో గతంలో సంస్థానాలు చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు. దీనితో సంస్థానాలకు ఉన్న కొన్ని అధికారాలు రద్దయిపోతాయి. మూడోది అంతిమ అస్త్రం. యూనియనైజేషన్, డెమాక్రటైజేషన్ పేరుతో సంస్థానాలను విలీనం చేయడమే. కొందరిని భరణాలు ఎరవేసి లొంగదీసుకున్నారు. తిరువాన్కూర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాగఢ్, భోపాల్, కశ్మీర్ సంస్థానాధీశులు మొదట మొండికేసినా తరువాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. గ్వాలియర్, బరోడా, పటియాలా వంటి సంస్థానాలు పటేల్ పిలుపునకు వెంటనే స్పందించి విలీనానికి అంగీకరించాయి. నయానో భయానో ఇంకొందరిని లొంగదీశారు. 1947 ఆగస్టు 15వ తేదీకే చాలా సంస్థానాలను పటేల్ భారత్ యూనియన్‌లోకి తెచ్చారు. అంటే రెండు నెలల వ్యవధిలోనే. మధ్య భారతంలోని పిప్లోడా సంస్థానాధీశుడు కూడా మొదట బెట్టు చేసి 1948 మార్చిలో భారత యూనియన్‌లో విలీనం చేశాడు. జునాగఢ్‌లో ప్రజలు తిరుగుబాటు చేశారు. తరువాత ప్లెబిసైట్ ద్వారా సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య అవసరమైంది. ఇది సెప్టెంబర్ 17, 1948న భారత్‌లో విలీనమైంది. కశ్మీర్ ఉదంతం వీటికి భిన్నమైంది. పాకిస్తాన్ సైనికులు చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో భారత్‌లో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థానం పాలకుడు హరిసింగ్ ప్రకటించారు. సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టమే లేదు. వీటితో పాటు లక్షద్వీప్‌ను స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ నౌకాదళం చేసిన యత్నాన్ని కూడా పటేల్ మన నౌకాదళాన్ని పంపించి భగ్నం చేశారు. దేశ సరిహద్దు విషయంలో కూడా పటేల్‌కు ఉన్న దృష్టి విశేషమైనది. వాస్తవికమైనది. దేశ సార్వభౌమాధికారం సరిహద్దులను, భూభాగాన్ని రక్షించుకోవడం ద్వారా వ్యక్తం కావాలి. పటేల్ అదే చేశారు. భారత్, చైనా సంబంధాల గురించి పరిశోధించిన జాన్ డబ్లు్య గార్వెర్, ‘‘భారత్ పరిస్థితిని పటిష్టం చేయడానికి వాస్తవికమైన అంచనాలతో పటేల్ ఎన్నో సలహాలు ఇచ్చారు. సరిహద్దులలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. భారత సైన్యం సామర్థ్యం పెంచాలన్నారు. ఈశాన్య ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయవలసిన అవసరం గురించి చెప్పారు’’ అని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు సమ్మతం కాదని రాసినది కూడా గార్వెరే. పటేల్ అంటే ఈ దేశ పటానికి పరిపూర్ణతను, సంపూర్ణ రూపాన్ని సాధించిన రాజనీతిజ్ఞుడు. ఈ దేశం అంతర్యుద్ధాలకు చిరునామాగా మారిపోకుండా కాపాడినవారు పటేల్. భారతదేశ పటంలో ఐక్యమైన రాష్ట్రాలతో పాటు, వాటి వెనుక ఒక అంతస్సూత్రంలా పటేల్ ఆత్మ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. - డా. గోపరాజు నారాయణరావు -
పరాజయ ‘పట్టాభి’షిక్తుడు
‘పట్టాభి పరాజయం నా పరాజయమే’భారత జాతీయ కాంగ్రెస్ చర్రితలోనే కాదు, స్వాతంత్య్రం సమరంలో కూడా అత్యంత వివాదాస్పదమైన ప్రకటన ఇది. సాక్షాత్తు గాంధీగారి నోటి నుంచి వచ్చింది.సుభాష్‌చంద్రబోస్ వంటి ఒక మహోన్నత వ్యక్తికి దేశంలో, కాంగ్రెస్‌లో నిలువ నీడ లేకుండా చేసిన మాటలు కూడా ఆ రెండే అన్నది విస్మరించరానిది. 1938–1939 త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సుభాష్ బోస్ మీద ఓటమి తరువాత తన గురించి గాంధీజీ వెలిబుచ్చిన ఆ ఆక్రోశం గురించి పట్టాభి (భోగరాజు పట్టాభిసీతారామయ్య) ఏమన్నారో బయటకు రాలేదు. జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధిం చినా ‘త్రిపుర’ ఓటమిపై ఎవరో చేసిన వ్యాఖ్య ఫలితం గా పట్టాభి చరిత్రలో పరాజయ పట్టాభిషిక్తుడిగా మిగిలిపోయారు. కానీ గాంధీజీ అంతరంగాన్ని వడబోసిన గాంధేయులలో పట్టాభి ప్రప్రథముడు. శాసనోల్లంఘన ఉద్యమంలో (1932) అరెస్టయిన పట్టాభి (డిసెంబర్ 24,1880–డిసెంబర్ 17, 1959) జైలు శిక్ష తరువాత ఇల్లు చేరారు. మళ్లీ గాంధీ ఆదేశం రావడంతో అరెస్టుకు సిద్ధమవుతున్నారు.అప్పుడే గాంధీజీ నుంచి టెలిగ్రాం. వెంటనే వార్దా Ðð ళ్లారు పట్టాభి. ‘చెల్లని రూపాయిలాగా ఇలా వచ్చావేం, జైలుకు వెళ్లకుండా!’ నవ్వుతూ అన్నారట గాంధీజీ. ‘నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ టెలిగ్రాం వల్లే వచ్చాను’ అన్నారట పట్టాభి, అది చూపిస్తూ. అది గాంధీగారి కార్యదిర్శి పేరుతో ఉంది. ‘నేను ఇచ్చినట్టు ఎలా అవుతుంది మరి!’ అన్నారట గాంధీ మళ్లీ నవ్వేస్తూ. కానీ భాష మీదే అన్నారట పట్టాభి. నా భాషకి ప్రత్యేతక ఏమిటో? అడిగారట గాంధీ. టెలిగ్రాంలో ఉన్నది చూపించారు పట్టాభి. ‘విధిగా రా, వీలుంటే’ ఇదీ సారాంశం. ‘మరి విధిగా రా అంటే ఏమిటి? వీలుంటే అనడం ఏమిటి?’ నిలదీసినట్టు బదులిచ్చారట పట్టాభి, గడుసుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ బోస్ మీద పట్టాభి ఓటమి అనంతరం గాంధీజీ చేసిన ప్రకటనతో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో, దక్షిణ భారత చరిత్రలో పట్టాభి వంటి మేరునగధీరునికి దక్కవలసిన స్థానం దక్కకుండా పోయింది. పట్టాభి గుండుగొలను (ప్రస్తుతం పశ్చిమ గోదావరి, నాడు కృష్ణా జిల్లా)లో ఒక పేద కుటుంబంలో పుట్టారు. తల్లి గంగమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. పట్టాభి నాలుగో సంవత్సరంలో ఉండగానే తండ్రిని కోల్పోయారు. తన నలుగురు పిల్లలను చదివించాలన్న పట్టుదలతో గంగమ్మగారు ఏలూరుకు మకాం మార్చారు. పినతండ్రి పంపించే ఏడు రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం. అలాంటి స్థితిలో ఆయన ఎఫ్ఏ (నోబెల్ కళాశాల, మచిలీపట్నం), బీఏ.(క్రిస్టియన్ కళాశాల, చెన్నపట్నం) ఆపై ఎంబీసీఎం అనే ఆనాటి వైద్య విద్యలో ఉత్తీర్ణులయ్యారు. పేదరికంగా కారణంగా వచ్చే పొదుపరితనం, కష్టాలతో వచ్చిన పట్టుదల, దానితో చదువులో వచ్చిన ఏక్రాగత, జీవితం పట్ల ఏర్పడిన ముందుచూపు; రఘుపతి వేంకటరత్నంనాయుడు వంటి గురువుల వద్ద శిష్యరికం ఒక విశిష్ట వ్యక్తిగా పట్టాభి తనను తాను మలుచుకోవడానికి దోహదం చేశాయి. ఈ విద్యార్థి దశ నుంచే పట్టాభిలో స్వాతంత్య్రోద్యమ కాంక్ష మొదలయింది. 1898లో మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలు, అందులో ఆనందమోహన్ బోస్ ఇచ్చిన ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1903లో మళ్లీ మద్రాస్‌లోనే జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలు జరిగాయి. బెంగాల్‌కు చెందిన మేధావి, మహావక్త లాల్మోహన్ ఘోష్ ఆ సభలకు అధ్యక్షులు. ఆయన ఉపన్యాసాన్ని తన గురుదేవులు రఘుపతి వేంకటరత్నంనాయుడుగారి సరసనే కూర్చుని పట్టాభి ఆలకించారు. మరో ఐదేళ్లకి అక్కడే మళ్లీ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఈసారి రాస్బిహారీ బోస్ అధ్యక్షులు. అప్పటికి పట్టాభి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారారు. ఎంబీసీఎం పూర్తి చేసి మచిలీపట్నంలో వృత్తిని ఆరంభించారు. గాంధీగారి కంటే ఎంతో ముందు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్న చాలామంది మహనీయులలో పట్టాభి ఒకరు. ఎంతో లాభసాటిగా ఉన్నప్పటికి వైద్యవృత్తిని వీడి పట్టాభి స్వాతంత్య్రోద్యమంలో చేరారు. ఉద్యమం కోసం విరివిగా ఆదాయాన్ని తెస్తున్న వైద్యవృత్తిని పక్కన పెట్టినవారిలో పట్టాభి ప్రథములు. అంటే పూర్తి న్యాయం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వృత్తిలో ఆయన కొనసాగినది ఒక దశాబ్దం మాత్రమే. 1905లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం వచ్చింది. ఆ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పనిచేశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాల వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం స్ఫూర్తితోనే ఆ కళాశాల ఆవిర్భవించింది. పట్టాభి వైద్యవృత్తిని వీడిన 1916. అంటే హోమ్‌రూల్ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలం. అందులో అనీబిసెంట్ నాయకత్వంలో పనిచేశారాయన. స్వాతంత్య్రోద్యమం ఒక ఎత్తయితే, మద్రాస్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1906లో ఉద్యమం ఆరంభమైంది. ఇందులో కూడా పట్టాభి పాత్ర విశిష్టమైనది. ఆ సందర్భంలోనే ‘ఆంధ్ర రాష్ట్రం అసరమా? కాదా?’ అనే శీర్షికతో (1912లో) పట్టాభి ఒక పుస్తకం రాశారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన అనే గ్రంథాన్ని కూడా రాశారాయన. దేశంలో భాషల ప్రాతిపదికగా ప్రాంతాలను పునర్విభజించాలన్న వాదాన్ని ఆయన గట్టిగా ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగానే 1917 బొంబాయి కాంగ్రెస్ సభలలో ఆంధ్ర ప్రాంతం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిని గాంధీజీ సమర్థించలేదు. అనిబీసెంట్ కూడా పట్టాభి ప్రతిపాదనను వ్యతిరేకించారు. చాలా వాదోపవాదాలు జరిగాయి. ఇక్కడే లోకమాన్య తిలక్ పట్టాభి పక్షం వహించి, కాంగ్రెస్‌కు సంబంధించి ప్రత్యేక రాష్ట్రంఆ ఏర్పాటు చేయడానికి అవసరమైన తీర్మానం ఆమోదం పొందేటట్టు చేశారు. అప్పటికి గాంధీ స్వాతంత్య్ర సమరంలో కీలకంగా లేరు. అనిబీసెంట్ మాత్రం జాతీయ నాయకురాలిగా అవతరించారు. ఈ ఇద్దరి వాదనలను పూర్వపక్షం చేసి, తన ప్రతిపాదనకు విజయం చేకూరేటట్టు చేసుకునేందుకు, తిలక్ వంటి అగ్రనేతను తన వైపు తిప్పుకొనేటట్టు చేసుకునేందుకు ఆయన చేసిన వాదనలు ఆ సభలను విస్తుపోయేటట్టు చేశాయి. 1920లో కాంగ్రెస్ నాగపూర్‌లో ప్రత్యేక సమావేశాలు జరుపుకునే నాటికి గాంధీయే పట్టాభి అభిప్రాయానికి దగ్గరయ్యారు.ఆ సమావేశాల తరువాత రాష్ట్రాల పునర్విభజన గురించి నీకు అవగాహన ఉన్నది కాబట్టి దానిని పూర్తి చేయవలసిందని గాంధీయే పట్టాభిని కోరారు. ఆ ఆదేశానికి అనుగుణంగానే పట్టాభి దేశాన్ని 20 కాంగ్రెస్ రాష్ట్రాలుగా విభజించారు. గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలోను పట్టాభి తన వంతు పాత్రను నిర్వహించారు. కాంగ్రెస్ సభలలో వచ్చిన వివాదాలను పరిష్కరించడంలో కూడా ఆయన కీలకంగా ఉండేవారు. 1922, 23లలో శాసనసభల బహిష్కరణ ప్రతిపాదనను ఆయన సమర్థించారు. చిత్తరంజన్‌దాస్, విఠల్‌భాయ్ పటేల్ వంటి నాయకులతో ఆయన వాదించి మెప్పించారు. ఆయనను ఆ రోజులలో ‘ప్రతివాద భయంకరుడు’ అనేవారట. 1928లో భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసంఘం ఏర్పడింది. ఆ సంఘానికి పట్టాభి అధ్యక్షులు. నవంబర్ 28, 1923న ఆయన ప్రారంభించిన ‘ఆంధ్రాబ్యాంక్’ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంకుగా సేవలు అందిస్తున్నది. పట్టాభి స్వయంగా రచయిత. అంతంతమాత్రంగా నడుస్తున్న కృష్ణాపత్రికను ఆయనను లాభాల బాట పట్టించారు.తాను జన్మభూమి అనే పత్రికను నిర్వహించారు. ఆయన రాసిన భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర 1935లోనే వెలుగులోకి వచ్చింది (అయితే ఇది పూర్తిగా అసమగ్రమని చెప్పడానికి సంకోచించవలసిన అవసరం లేదు). త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక (1938) ఉదంతం రెండు విధాలుగా బాధాకరమైనది. ఒకటి బోస్ వంటి మహనీయుడిని దేశం నుంచి వెళ్లిపోయేటట్టు చేసింది. ఆ తరువాత ఆ మహావ్యక్తి పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదట్లో కమ్యూనిస్టులు ఆయనను అపార్థం చేసుకుని, విమర్శలు గుప్పించి వారు కూడా అపకీర్తి పాలయ్యారు. తరువాత అంశం– పట్టాభి చరిత్ర వేదిక నుంచి తెరమరుగు కావడం. పట్టాభి పరాజయం తన పరాజయమేనంటూ గాంధీ చేసిన ప్రకటనలోని అసంబద్ధతని నాటి కాంగ్రెస్ వాదులే కాదు, నేటి చరిత్రకారులు కూడా అర్థం చేసుకోలేదు. ఫలితమే చరిత్రలో పట్టాభి స్థానం మీద ఈ చీకటితెర. ఈ ప్రకటనలో పట్టాభికి ఎంతవరకు సంబంధం? ఇదే అసలు ప్రశ్న. డాక్టర్ పట్టాభి అధ్యక్షునిగా ఉండాలని కాంగ్రెస్ కార్యవర్గం, అగ్రనాయకత్వం భావించింది. కానీ బోస్ దీనిని తిరస్కరించి పట్టాభి మీద పోటీ చేశారు. గెలిచారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడేందుకు ఏర్పడిన సంస్థలో బోస్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా ఎలా తప్పు పట్టగలరు? ఆ సంస్థ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే సంప్రదాయం కూడా స్థిరంగా లేదు. చిత్రం ఏమిటంటే, గాంధీ ప్రకటన తరువాత పార్టీలో తనకు ప్రతికూల వాతావరణం ఏర్పడిన తరువాత బోస్ రాజీనామా ఇచ్చారు. అప్పుడు మళ్లీ పట్టాభిని అధ్యక్ష పదవిని స్వీకరించమని పార్టీ కోరింది. ఆయన నిరాకరించారు. ఇది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అయినా పట్టాభి ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహిస్తూనే ఉన్నారు. 1942 నాటి క్రిప్స్ రాయబారం సమయంలోను ఆయనది కీలక పాత్రే. కాంగ్రెస్కీ, సంస్థాన ప్రజామండలి మధ్య రాజీకి మంతనాలు జరిగాయి. ఆ సమయంలో సంస్థాన మండలి ఉపాధ్యక్షుడు పట్టాభి. క్రిప్స్ రాయబారం విఫలం కావడం, ఫలితంగా క్విట్ ఇండియా ఉద్యమం వెల్లువెత్తడం తెలిసినదే. ఆ సమయంలో పట్టాభి కూడా అరెస్టయ్యారు. పూనా జైలులోనే ఉన్నారు. డిసెంబర్ 9, 1946 భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. దీనికి మద్రాసు రాష్ట్రం నుంచి ఎన్నికైన విఖ్యాతులలో పట్టాభి ఒకరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పట్టాభి కృషి చేశారు.ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలోని సాధక బాధకాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ కార్యవర్గం జవహర్లాల్, వల్లభ్‌భాయ్ పటేల్. పట్టాభిలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. వీరు ఇచ్చినదే∙జేవీపీ నివేదిక.1952లో భారత ప్రభుత్వం పట్టాభిని మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. 1957 వరకు ఆ పదవిలో ఉన్న పట్టాభి తరువాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన కుమారుని వద్దకు వచ్చారు.అక్కడే కన్నుమూశారు. పట్టాభి ఒక స్వాతంత్య్రం సమరయోధుడే కాదు. ఆయన ప్రచురణకర్త. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించారు. ఆరోగ్యసూత్రాలతో పుస్తకం రాశారు. ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేశారు.ఆంధ్రాబ్యాంక్ వంటి వ్యవస్థకు రూపకల్పన చేశారు. అవటపల్లి నారాయణరావుగారు (జర్నలిస్టు, చరిత్రకారుడు) పట్టాభి మేధాశక్తి, అందులోని ఆర్థిక కోణం నుంచి చూస్తూ ఒక చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘‘పట్టాభిని ఎరిగినవాళ్లు ఆయన బ్రాహ్మణ శిరస్సు, వైశ్య హృదయం గల మనిషి అని చెప్పుకుంటారు.’’ - డా. గోపరాజు నారాయణరావు -
గురుదేవుడి మహాత్ముడు
రవీంద్రనాథ్ టాగోర్ గాంధీజీని ‘మహాత్ముడు’ అన్నాడు.ఆయన ఇచ్చిన ఆ గౌరవ సంబోధనను జాతి స్వీకరించడంతో గాంధీ ‘మహాత్మా గాంధీ’ అయ్యాడు.టాగోర్ని గాంధీజీ ‘గురుదేవ్’ అన్నాడు.అప్పటి నుంచి టాగోర్ అనే పేరుకు ‘గురుదేవ్’ సమానార్థకం అయ్యింది.టాగోర్, గాంధీజీ ఆత్మీయులు. పరస్పరం సత్యాన్ని అన్వేషించినవారు. సత్యాన్వేషణ కోసం పరస్పరం ఘర్షించుకున్నవారు.గురు దేవుని దృష్టి నుంచి మహాత్ముడిని చూసినప్పుడు మామూలు మనుషులుగా మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది.పాలకులు, యువత, ప్రజలు మహాత్ముడి ఆత్మధోరణిని సంపూర్తిగా అక్కర్లేదు... సహస్రాంశం అనుసరించినా ఈ దేశం సర్వోన్నతం అవుతుందనిపిస్తుంది.గురుదేవులు టాగోర్ వివిధ సందర్భాలలో గాంధీజీని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మహాత్ముడంటే గాంధీజీని నేను మహాత్ముడని అన్నాను. ఆ మాటకు నిజమైన అర్థమేమిటి? ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ దర్శనమిస్తుందో ఆ ఆత్మ కలిగినవాడే మహాత్ముడు. ఆ అర్థంలో గాంధీజీ మహాత్ముడు. మహాత్ముల కార్యకలాపాలు ఒకరి కోసమో ఇద్దరి కోసమో కావు. అవి మొత్తం ప్రపంచమంతటి కోసం. వాటికి పరిమితులేమీ లేవు. నిర్బంధాలు లేవు. అవి మొత్తం విశ్వం కోసం. గాంధీజీ కార్యకలాపాలు ఒక కులం మతం జాతి కోసం కాదు. అవి సకల మానవాళి కోసం. అందుకే ఆయన మహాత్ముడు. స్వీయ సేవను చేసుకోగలమా? మహాత్మునికి ఉన్న స్వీయ క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది... ఎప్పటికైనా ఆ క్రమశిక్షణను వదలకుండా ఆచరించదగ్గ చిత్తశుద్ధిని పొందగలమా చూసుకోవాలి. ఒకసారి మార్చి నెలలో గాంధీజీ శాంతినికేతన్లో కొద్ది రోజులు గడిపారు. దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టుకున్న నియమావళికి అనుగుణంగా శాంతినికేతన్లో కూడా ఆయన ఏ సేవకుడి సహాయమూ కోరలేదు. తన గది తనే తుడుచుకున్నాడు. తన పక్క తనే సర్దుకున్నాడు. తన గిన్నెలు తనే కడుక్కున్నాడు. తన గుడ్డలు తనే ఉతుక్కున్నాడు. శాంతినికేతన్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇది చూసి ప్రభావితులయ్యారు.వాళ్లల్లో చాలామంది గాంధీని అనుసరించాలని ఆరాటపడ్డారు. మార్చి 10వ తేదీన ఒక ప్రయత్నంగా విద్యార్థులు వంటవాళ్ల పనివాళ్ల పాకీవాళ్ల సేవల్ని పక్కన పెట్టేశారు. ఇదంతా గాంధీజీ పర్యవేక్షణలో జరిగింది. కాని కొన్నాళ్లకు కొన్ని ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఈ స్వీయ సేవను విడిచిపెట్టారు. కాని గాంధీజీ విడిచిపెట్టలేదు. విడువక పోవడమే మహాత్ముల లక్షణం. ఆయన త్యాగమూర్తి చాలామంది ప్రజానాయకులు త్యాగాలు చేస్తుంటారు. కాని అవి రేపు తాము పొందబోయే ఆకర్షణీయమైన లాభాలకు పెట్టుబడి అని భావిస్తారు. గాంధీజీ అందుకు విరుద్ధం. ఆయన త్యాగానికి మరోపేరు. ఆయన ఎట్లాంటి అధికారాన్నిగాని పదవినిగానీ సంపదనుగానీ పేరునుగానీ కీర్తిగానీ కోరుకోలేదు. కోరుకోరు. మొత్తం భారతదేశ సింహాసనాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన స్వీకరించడు. పైగా ఆ సింహాసనానికున్న వజ్రాలను ఒలిచి పేదలకు పంచి పెట్టేస్తాడు. అమెరికాలో ఉన్న డబ్బంతా ఆయనకు ఇస్తే దానిని మానవాళిని ఉద్ధరించడానికి పనికొచ్చే ఏదో ఒక పనికి ఖర్చు పెట్టేస్తాడు. ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా ఆయనేదీ ఆశించడు. చివరకు కృతజ్ఞతలు కూడా. ఆయనది క్రీస్తు ప్రభావం నన్నెవరన్నా గొంతు నులమబోతే నేను సహాయం కోసం అరుస్తాను. కాని గాంధీజీకి ఆ పరిస్థితి ఎదురైతే ఆయన సహాయం కోసం అరవడని కచ్చితంగా చెప్పగలను. తన గొంతు నులిమేవాడిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుతాడు. తాను మరణించవలసి వస్తే చిరునవ్వుతోనే మరణిస్తాడు. క్రీస్తు ప్రభావం అని మనం దేన్నయితే అంటామో అది ఆయనకుంది. ఆయన గురించి ఎంత తెలుçసుకుంటే అంత ప్రేమించగలుగుతాం. చెడును ద్వేషించాలి... చెడ్డవారిని కాదు మనం ద్వేషించవలసింది చెడును తప్ప చెడ్డవారిని కాదని మహాత్ముడు చెప్పాడు. దీనిని పాటించడం అసాధ్యం అనిపిస్తుంది. కాని దాన్నాయన తన జీవితంలో పాటించడం నేను చూశాను. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిష్కరించిన ఒక ప్రసిద్ధ రాజకీయవేత్తతో ఆయన మాట్లాడుతుండగా నేనక్కడున్నాడు. ఆ పెద్దమనిషితో మాట్లాడుతున్నది వేరే కాంగ్రెస్ నాయకుడైతే ఆ నాయకుడు ఆ పెద్దమనిషిని చాలా ఏహ్యభావంతో చూసి ఉండేవాడు. కాని గాంధీజీ అలా చేయలేదు. అతడు చెప్తున్నది సహనంతో సానుభూతితో పూర్తిగా విన్నాడు. అతన్ని కించపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అది చూసి నేను ‘గాంధీజీ తాను ప్రవచిస్తున్న సిద్ధాంతాల కన్నా ఉన్నతుడు’ అని అనుకున్నాను. ముందు తన మీదే.... మహాత్ముడు సమాజం కోసం ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించే ముందు ఆ కఠిన పరీక్షని తన మీద తాను విధించుకుంటాడు. త్యాగం కోసం ఎదుటివాళ్లకు పిలుపునిచ్చేముందు తనే స్వయంగా దాని మూల్యం చెల్లిస్తాడు. ముందు ఆయన తన సౌకర్యాలని వదులుకుని తక్కినవాళ్లను త్యాగం చేయమనడానికి సాహసిస్తాడు. ఒక చెడు విజయం కోసం ఆత్మను తాకట్టు పెట్టుకోవడం కన్నా సర్వం కోల్పోవడమే మంచిదనేది గాంధీజీ ఆదర్శం. ఈ ఆదర్శాన్ని రాజకీయాలలో ఆయన బలంగా ప్రతిపాదించాడు. ఇందుకు మనం మహాత్మాగాంధీని గౌరవించుకోవాలి. అవమానాన్ని ధైర్యంగా సహిస్తూ బాధను సహిస్తూ కూడా మనం తిరిగి హింసకు పూనుకోకపోతే మన మీద పీడన చేసే వారు తెల్లముఖం వేసి అశక్తులవుతారని ఆయన నేతృత్వంలో భారతదేశం ప్రతిరోజూ నిరూపిస్తూనే ఉంది. ఆ మనిషి నిజంగానే దేవదూత.ఆయనను మనం మహాత్ముడని పిలుచు కోవడం సముచితం. ఆయన నివసిస్తున్నది ఒక వ్యక్తిగత, సంకుచిత శరీరంలో కాదు. ఈరోజు భారతదేశంలో జన్మించిన రేపు జన్మించనున్న లక్షలాది ప్రజా హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. -
‘గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు’
పనాజి : మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు. ‘మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారు. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారు. భారతదేశం.. భారత్, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదు. అయినా తప్పులు జరగడం సహజం’ అని దలైలామా వ్యాఖ్యానించారు. -
డల్లాస్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
డల్లాస్, టెక్సాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో జాతిపితకి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో మంది ప్రవాస భారతీయులు డల్లాస్ (ఇర్వింగ్) లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ని సందర్శించి జాతిపిత 70వ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తనను స్థానిక గాయకుడు ఎస్ పి నాగ్రాత్ ఆలపించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ స్థానిక ప్రజల సహకారంతో అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను ఇక్కడ నిర్మించుకోవడం, భావితరాలకు స్పూర్తిదాయకంగా చూపడానికి అవకాశం కలిగిందని, గాంధీజీ సేవలను స్మరించుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీజీ 70 సంవత్సరాల కిందట మరణించినా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలతో మనందరి మధ్య ఎప్పటికీ సజీవంగానే ఉంటారని అన్నారు. దేశ స్వాతంత్ర కోసం దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులుగా మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ విశ్వ మానవాళికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉత్తేజితులయ్యారని గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కమల్ కౌషల్ అన్నారు. గాంధీజీ శాంతి, సహనానికి ప్రతి రూపమని, ఆయన గురించి ముఖ్యంగా యువతరం ఎంతో తెలుసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని ఐఏఎన్టి ఉపాధ్యక్షులు బిఎన్ చెప్పారు. గాంధీజీ తన సాధారణ, పారదర్శక జీవితంతో ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారని, ఆయనకు మరణం లేదని ఎన్ని దశాబ్దాలైనా అందరూ జాతిపితను గుర్తించుకుంటారని మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ చెప్పారు. -
గాంధీజీ ‘హేరామ్’ అనడం నేను విన్లేదు
చెన్నై: నాథూరాం గాడ్సే తుపాకీ తూటాకు నేలకొరిగిన మహాత్మా గాంధీ చివరిసారిగా ‘హేరామ్’ అన్నారో లేదో తనకు తెలియదని గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వెంకిట కళ్యాణం (96) చెప్పారు. తుదిశ్వాస విడవడానికి కొన్ని క్షణాల ముందు గాంధీ ‘హేరామ్’ అనలేదని కళ్యాణం దశాబ్దం క్రితం చెప్పడంతో అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై ఇన్నాళ్లకు కళ్యాణం స్పష్టతనిచ్చారు. ‘‘గాంధీజీ ‘హేరామ్’ అనలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ‘హేరామ్’ అనడం నేను విన్లేదు అని చెప్పా. ఆయన హేరామ్ అని అన్నారేమో.. నాకు తెలియదు. గాంధీజీపై కాల్పులు జరిగిన ఆ క్షణాన అక్కడంతా గందరగోళంగా ఉంది. అక్కడున్నవారంతా అరుస్తున్నారు. నాకసలేం వినిపించలేదు’’ అని ఆయన అన్నారు. 1943 నుంచి గాంధీజీ చనిపోయేదాకా ఆయనకు సహాయకుడిగా పనిచేశారు. -
గాంధీ విగ్రహానికి ప్రముఖుల నివాళి
డల్లాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) చైర్మన్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంవైస్ ఛాన్సలర్ వీ. దుర్గాభవాని, నంది అవార్డు గ్రహీత కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని గాంధీజీ విగ్రహాన్ని సందర్శించారు. టెక్సాస్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, విగ్రహాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ కృషిని మర్చిపోలేమని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గాంధీజీపై ఓ పాటను కూడా పాడారు. అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసిన ప్రసాద్ తోటకూరను దుర్గాభవాని అభినందించారు. ప్రపంచ నలుమూల నుంచి అమెరికాకు వచ్చేవారు గాంధీజీ విగ్రహాన్ని సందర్శిచి, స్ఫూర్తిని పొందుతున్నారని ఆమె అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రసాద్ తోటకూర రూ. 8 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. శాంతికోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం సంతోషకరమని కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ అన్నారు. -
జాతిపిత గాంధీ మనవడి దీనావస్థ
-
గాంధీ మనవడి దీనావస్థ
► ఆస్పత్రిలో చివరిరోజులు గడుపుతున్న కానూ గాంధీ ► జాతిపిత వారసుడైనా.. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి ► సొంత గూడు లేక.. ఆశ్రమాల్లో జీవితం వెళ్లదీస్తూ.. ► ఫోన్లో మోదీ ఓసారి మాట్లాడినా మారని దైన్య స్థితి సూరత్: ఉప్పు సత్యాగ్రహంలో దండి బీచ్‌లో ఓ పదేళ్ల పిల్లాడు గాంధీజీ చేతికర్ర పట్టుకుని నడిపిస్తున్న చిత్రం దేశ విదేశాల్లోనూ చాలా ప్రత్యేకం. చిత్రంలోని అప్పటి ఆ పిల్లాడి పేరు ‘కానూ రాందాస్ గాంధీ’ (ఇప్పుడు 96 ఏళ్లు). మహాత్ముడి మనవడు. గాంధీకి అత్యంత సన్నిహితులు, దండి సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండి బతికున్న అతికొద్ది (వేళ్లమీద లెక్కపెట్టగలిగేవారు) మందిలో కానూ గాంధీ ఒకరు. జాతిపిత మనవడిగా, నాసా శాస్త్రవేత్తగా ఘనమైన చరిత్రే ఉన్నా.. ఇప్పుడు పట్టించుకునేవారెవరూ లేక సూరత్‌లోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో దీనావస్థలో చివరి రోజులు గడుపుతున్నారు. భార్య శివలక్ష్మి(90) తప్ప నా అనేవారెవరూ ఆయనకు లేరు. జాతిపిత మనవడైనా.. మహాత్మాగాంధీ అత్యంత సన్నిహితుల్లో కానూ ఒకరు. చిన్నప్పుడు గాంధీ వ్యక్తిగత అవసరాలను కూడా కానూయే చూసుకునేవారు. స్వాతంత్య్రం వచ్చాక తదనంతర పరిణామాల్లో అప్పటి భారత్‌లో అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ సాయంతో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యనభ్యసించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు. ఈ సమయంలోనే మెడికల్ రీసెర్చర్ శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. 40 ఏళ్లు అమెరికాలోనే ఉన్న ఈ దంపతులు 2014లోనే భారత్‌కు తిరిగొచ్చారు. ఇక్కడ సొంత గూడు లేకపోవటంతో.. కొన్ని రోజులు ఆశ్రమాల్లో, సత్రాల్లో గడిపారు. సంపాదించిందంతా దానధర్మాలు చేయడంతో వీరి దగ్గర డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. పదిహేను రోజులుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఉచితంగా సేవలందిస్తూనే.. భార్యాభర్తల బాగోగులు చూసుకునేందుకు ఓ యువకుడిని నియమించింది. కానూ బాల్యమిత్రుడు, మహాత్ముడి అనుచరుడి మనవడైన అయిన ధీమంత్ బధియా (87) ఇటీవలే ఖర్చుల నిమిత్తం తన శక్తికి తగినంత అందజేశారు. అహ్మదాబాద్‌లో ఉండటం, వయసు మీద పడటంతో బాగోగులు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారని బధియా ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై, బెంగళూరుల్లో ఉంటున్న కానూ సోదరీమణులూ.. కదిలే పరిస్థితి లేకపోవటంతో ఫోన్లోనే వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మాటైతే చెప్పారు కానీ.. ఏడాది క్రితం ఓ కేంద్ర మంత్రి వీరి దీనావస్థ గురించి తెలుసుకుని ప్రధానితో మాట్లాడించారు. సానుకూలంగా స్పందించిన మోదీ.. సాయం చేస్తామని చెప్పినా ఇంతవరకు కేంద్ర, గుజరాత్ మంత్రులెవరూ వీరిని కలవలేదని తెలిసింది. ఆ తర్వాత వీరి గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని బధియా తెలిపారు. అక్టోబర్ 22న కానూకు తీవ్రమైన గుండెనొప్పి వల్ల పక్షవాతం వచ్చి ఎడమవైపు శరీరం పనిచేయటం లేదు. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. వెంటిలేటర్‌పైనే ఉన్నారు. శివలక్ష్మికి కూడా సరిగా వినిపించదని.. కళ్లు మందగించాయని ఆశ్రమం వైద్యులు తెలిపారు. ‘మహా త్ముడు స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి కోట్ల రూపాయల నిధులిస్తున్న ప్రభుత్వం.. జాతిపిత సిద్ధాంతాలకు, వారి కుటుంబ సభ్యులకు కనీస గౌరవం ఇవ్వటం లేదు. చివరి రోజుల్లో ఉన్న కనుపై ప్రభుత్వం ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకుంటే చాలు. ఇంకేం అవసరం లేదు’ అని బధియా ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్జీఎమ్ఎన్టీ ఆధ్వర్యంలో గాంధీజీ 147వ జయంతి
డల్లాస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గాంధీజీ 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధీజి మునిమనవరాలు అర్చనా ప్రసాద్.. భర్త హరిప్రసాద్‌తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా అసొసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో చేపట్టిన 'గాంధీ పీస్ వాక్' కార్యక్రమంలో చిన్నాపెద్దా అంతా తెలుపువస్త్రాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్జీఎమ్ఎన్టీ డైరెక్టర్ షబ్నం మోడ్గిల్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్నటువంటి వివాదాలకు యుద్ధాలు, గొడవలు పరిష్కారం కాదని కేవలం గాంధీజీ చూపిన శాంతిమార్గం అవసరమని అన్నారు. చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన అర్చనా ప్రసాద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అర్చనా ప్రసాద్ తన ప్రసంగంలో తండ్రి అరుణ్ గాంధీ స్థాపించిన గాంధీ ఇనిస్టిట్యూట్‌తో తనకు గల అనుబంధాన్ని తెలిపారు. -
'గాంధీజీని బ్రిటిష్ ఏజెంట్ అన్నా.. సారీ'
రాత్రి పడుకునేటప్పుడే అనుకున్నాను... గాంధీజీ కల్లోకి రాకూడదని. కానీ ఆయన వచ్చారు! ‘‘బాపూజీ..!’’ అన్నాను విస్మయంగా. గాంధీజీ బోసినవ్వు నా చెంపను తాకింది. రెండో చెంప చూపబోయాను. నాకంతటి యోగ్యత ఉందా అని ఆగిపోయాను. ‘‘ఆగిపోయావేం కట్జూ?’’ అన్నారు గాంధీజీ మళ్లీ నవ్వుతూ. ‘‘మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను బాపూజీ, మీరు బ్రిటిష్ ఏజెంటు అని కూడా అన్నాను’’ అని చెంపలేసుకున్నాను. ‘‘పర్వాలేదు కట్జూ, మోహన్‌దాస్ కరమ్చంద్ని మార్కండేయ కట్జూ విమర్శించకూడదని ఏ చట్టంలో ఉంది చెప్పు?’’ అన్నారు. ‘‘మహాత్మా, మీ అంతటివారితో నాకు పోలికా?!’’ అన్నాను. ‘‘కాసేపు మాట్లాడుకుందాం కట్జూ. నువ్వు జడ్జివి కాబట్టి కూర్చొని మాట్లాడు. జడ్జి దగ్గరకు వెళ్లిన వాళ్లెవరైనా నిలబడే మాట్లాడాలి కాబట్టి నేనిక్కడ నిలుచుని మాట్లాడతాను’’అన్నారు గాంధీజీ! ‘‘ఎంత మాట బాపూజీ’’ అని ఆయన కాళ్ల మీద పడిపోయాను. ‘‘అవును కట్జూ.. నేను నీ కల్లోకి రాకూడదని ఎందుకనుకున్నావ్’’ అన్నారు గాంధీజీ... గొప్ప క్షమతో నా భుజాలు పట్టుకుని పైకి లేపుతూ. ‘‘అనుకున్నాను బాపూజీ. నేను చెడు వింటున్నాను, చెడు చూస్తున్నాను, చెడు మాట్లాడుతున్నాను. అందుకే మీకు కనిపించకూడ దని అనుకున్నాను. అక్టోబర్ రెండున అసలే కనిపించకూడదనుకున్నాను’’ అని చెప్పాను. ‘‘చెడు వింటున్నాను, చెడు మాట్లాడుతున్నాను, చెడు చూస్తున్నాను అంటున్నావ్! అంత చెడేం ఉంది కట్జూ ఈ లోకంలో. ఎంత చెడ్డా... మనుషులంతా మంచివాళ్లే కదా’’ అన్నారు గాంధీజీ! అయ్యో బాపూజీ అనుకున్నాను. ‘‘మనుషులొక్కరే కాదు కదా బాపూజీ... ఈ లోకంలో జడ్జీలు కూడా ఉన్నారు’’ అన్నాను. గాంధీజీ కళ్లు పెద్దవి చేశారు. ‘‘క్వీన్ ఆఫ్ హార్ట్ అనే క్యారెక్టర్ గురించి మీరు చదివే ఉంటారు బాపూజీ. ఎవరు కనిపించినా వారి తలను నరికేయమని ఆదేశించడం ఆ క్వీన్ పని. ‘నేరారోపణ చేయాలి, విచారణ జరిపించాలి, శిక్ష విధించాలి. అప్పుడు కదా తల నరికేయడం’ అని నాలాంటి వాడెవడైనా అంటే.. ‘అవన్నీ తర్వాత, ముందైతే తల నరికేయండి’ అనేవారు క్వీన్. అలా కింగ్ ఆఫ్ హార్ట్‌లు అయ్యారు బాపూజీ ఈ జడ్జీలు’’ అని ఆవేదనగా చెప్పాను. ‘‘జస్టిస్ ఆర్.ఎం.లోథా, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ల గురించే కదా కట్జూ నువ్వంటున్నది’’ అన్నారు గాంధీజీ!! ‘‘నువ్వూ ఒక జడ్జివే కదా కట్జూ. సర్వోన్నతులైన న్యాయమూర్తులను అలా అనొచ్చా’’ అన్నారు గాంధీజీ మందలింపుగా. అకస్మాత్తుగా ‘సబ్ కో సన్మతి దే భగవాన్..’ పాట వినిపించింది! కల బయటి పాటకు, కల లోపలి గాంధీజీ అదృశ్యమైపోయారు. ‘జడ్జిని కాబట్టే జడ్జీలను అనగలిగాను బాపూజీ. మనుషులకు జడ్జీలను అనేంత ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ ఎక్కడిది... ఈ స్వతంత్ర భారతదేశంలో...’ అని గాంధీజీతో చెప్పాలనుకున్నాను. ప్చ్.. పాట నిద్ర లేపేసింది. (కట్జూ (మాజీ న్యాయమూర్తి) రాయని డైరీ) - మాధవ్ శింగరాజు -
మరపురాని బాపు గురుతులు
సందర్భం : నేడు గాంధీ జయంతి అనంతపురం కల్చరల్ : అహింస, శాంతి, సత్యాలకు ప్రతిరూపం మహాత్మాగాంధీ. గాంధీ స్ఫూర్తితో ఎంతో మంది జిల్లావాసులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారతమాతను దాస్యశంఖలాల నుంచి విముక్తి చేయడానికి గాంధీ దేశమంతటా పర్యటిస్తూ అనంతపురం జిల్లాకు వచ్చారు. కల్లూరు సుబ్బారావులాంటి వ్యక్తుల సహకారంతో హిందూపురం, గుత్తి, తాడిపత్రి, పెద్దవడుగూరు లాంటి ప్రాంతాలు సందర్శించారు. మహాత్ముడి వెంట నడిచిన ఎంతోమంది జిల్లావాసులు నేటికీ ఆయన ఆశయాలు పాటిస్తున్నారు. నాటి గురుతులను ఇప్పటికీ మరువలేకపోతున్నారు. గాంధీజీ అంటే మా తండ్రికి ప్రాణం మేము చిన్నగా ఉన్నప్పుడు గాంధీజీ జిల్లాకు వచ్చారు. మా నాన్న మేడా రామయ్య, చిన్నాన్న మేడా సుబ్బయ్య మహాత్మాగాంధీకి జిల్లాలో తోడుగా ఉన్నారు. గాంధీజీ ఆశయాలంటే వారికి పంచ ప్రాణాలుగా ఉండేవి. నేను గుంటూరులో చదువుకునే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మా సహచరుడుగా ఉండేవాడు. గాంధేయవాదాన్ని అతిగా ఇష్టపడే రోశయ్య ప్రభావం మాపై చాలా ఉంది. ఇప్పటికీ గాంధీజీ జయంతి, వర్ధంతులను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నాం. – మేడా సుబ్రమణ్యం, ఇన్‌కమ్‌టాక్స్ కన్సల్టెంట్, అనంతపురం గాంధీకట్టకు మహర్దశ! తాడిపత్రి టౌన్ : స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు మహత్మగాంధీకి తాడిపత్రి పట్టణంతో విడదీయలేని అనుబంధం ఉంది. 1942లో సత్యాగ్రహ ఉద్యమం బలోపేతం చేసేందుకు గాంధీ తాడిపత్రికి రైలులో వచ్చారు. పట్టణంలోని మెయిన్ బజారు, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయనకు గుర్తుగా కట్టను నిర్మించారు. ప్రస్తుతం ఆ కట్ట గాంధీకట్టగా పిలవబడుతోంది. మునిసిపల్ అధికారులు గాంధీ కట్ట వద్ద పార్కు ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ––––––––––––––––– అడిగుప్ప.. శాంతి బాట! గుమ్మఘట్ట : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాలు కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలంలోని అడిగుప్ప గ్రామస్తులు. దశాబ్దకాలంగా ఈ గ్రామంలో ఎవరూ మద్యం జోలికి వెళ్లడం లేదు. ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ అందరూ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తున్నారు. నిరక్షరాస్యత అధికంగానే ఉన్నా, తరతరాలుగా ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లను ఆచరిస్తూ హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో పయనిస్తున్నారు. పూర్వం ఇతర ప్రాంతాలకు చెందిన వారు గ్రామస్తులకు మధ్యం, కోడి మాంసం ఎరగాచూపి లోబరుచుకునేందుకు యత్నించగా, స్థానికంగా ఉన్న పాళేగాడు మద్యం ముట్టకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురికాకూడదని అప్పట్లో ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి వారు ఆ ప్రతిజ్ఞను శిరోధార్యంగా భావించి అనుసరిస్తున్నారు. -
మళ్లీ రాహుల్ యూటర్న్.. ఆరెస్సెస్‌పై కామెంట్స్!
మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. గాంధీజీ హత్యకు ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా బాధ్యుణ్ణి చేయలేమని రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ యూటర్న్ తీసుకొన్నారని విమర్శలు వస్తుండగా.. ఈ వివాదంపై ఆయన మళ్లీ స్పందించారు. ఆరెస్సెస్‌పై తాను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానంటూ మరోసారి ఆయన యూటర్న్ తీసుకున్నారు. 'ఆరెస్సెస్ విభజిత, విద్వేషపూరిత అజెండాపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. నేను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను' అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు పరువునష్టం దావా వేశారు. బుధవారం రాహుల్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. మహాత్మాగాంధీ హత్యకు కారణమంటూ ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా రాహుల్ నిందించలేదని, కానీ, దానితో అనుబంధమున్న వ్యక్తులే గాంధీజీ హత్యవెనుక ఉన్నారని పేర్కొన్నారని తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలపై రాహుల్ వెనుకకు తగ్గినట్టు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడ్డానని స్పష్టంచేశారు. -
రాహుల్.. బహిరంగంగా క్షమాపణ చెప్పు!
న్యూఢిల్లీ: 'మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న తన వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ బహిరంగంగా తప్పు ఒప్పుకోవాలి. ఈ విషయంలో వాస్తవాలను వక్రీకరించినందుకు ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే' అని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు ఆయనపై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణం కాదని, ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న వ్యక్తి జాతిపితను కాల్చిచంపారని తాజాగా రాహుల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ ప్రధాన ప్రతినిధి ఎంజీ వైద్యా ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. 'గాంధీజీ హత్యకు ఆరెస్సెస్ కారణం కాదని, ఆ సంస్థతో అనుబంధమున్న వ్యక్తే ఆయనను చంపారని రాహుల్ తాజాగా పేర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ పూర్తిగా వివరణ ఇవ్వాలి. ఏ రకంగా ఆ వ్యక్తి ఆరెస్సెస్‌తో అనుబంధమున్న వాడు, సంస్థలో అతని పాత్ర ఏమిటో కూడా రాహుల్ చెప్పాలి' అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్ తప్పు చేశారని, ఆయన తన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సిందేనని ఎంజీ వైద్యా అన్నారు. -
గాంధీజీ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి
ఏయూ గాంధీజీ నాయకత్వాన్ని యువతరం అందిపుచ్చుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో గాంధీ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.బి.ఎస్.వి రంగారావు, ఏయూ సాఫ్ట్‌స్కిల్స్ శిక్షకుడు చల్లా క్రిష్ణవీర్ అభిషేక్‌లు సంకలనం చేసిన గాంధీజీ ఆదర్శవాద నాయకత్వం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీని ప్రపంచ దేశాల నాయకులు మార్గదర్శకంగా తీసుకున్నారన్నారు. గాంధీజీ ఆవశ్యకతను నేటి సమాజానికి అన్వయించి విస్తత రూపాల్లో పరిశోధనలు జరపడం అవసరమన్నారు. గాంధీజీ ఆదర్శవాద నాయకత్వాన్ని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రతిబింబిచే విధంగా పుస్తకాన్ని రచించిన రచయితలను అభినందించారు. విభిన్న కోణాలలో గాంధీజీలోని నాయకత్వాన్ని చూపడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, కరిమిల్లి సంతోష్ కుమార్, ప్రహర్ష్ తదితరులు పాల్గొన్నారు. -
కోట్ల మందికి దారి చూపిన ఆ ‘వెలుగు’ ఇదే..
అంబేడ్కర్ జీవితం బడుగుల సేవకే అంకితం అది మహారాష్ట్రలోని మహద్ గ్రామం! ఆ గ్రామంలో ‘చౌదర్’ అని.. ఓ పెద్ద చెరువు. ‘పెద్దవాళ్ల’ చెరువు. దళితులు ఆ నీళ్లు తాగడానికి లేదు. కనీసం తాకడానికి లేదు. ముట్టుకుంటే చెరువు మైల పడిపోతుందట! ఈ అస్పృశ్యతను ధిక్కరిస్తూ యువ కెరటం కదిలింది. దళితులను తన వెంట రమ్మంది. అంతా చెరువు దగ్గరికి చేరారు. ఆ యువకుడు చెరువులోకి దిగాడు. దోసెడు నీళ్లతో గొంతు తడుపుకున్నాడు. ఆ దృశ్యం అగ్రవర్ణ దురహంకారాన్ని దగ్ధం చేసింది. నిమ్న వర్గాల హృదయాలను పులకింపజేసింది. ఆ యువ కెరటమే అంబేడ్కర్! నాటి నుంచి నేటి వరకు బడుగుల ఆరాధ్యుడిగా, జాతిని మేల్కొలిపిన వైతాళికుడిగా, రాజ్యాంగ నిర్మాతగా జేజేలు అందుకుంటూనే ఉన్నాడు. గురువారం ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని దేశం యావత్తూ ఘనంగా నివాళులర్పించింది. సంఘంలో దురాచారాలు రూపుమాపి, దళితుల అవమానాలకు చరమగీతం పాడిన ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాల సమాహారమిదీ.. - సాక్షి, హైదరాబాద్ జననం మధ్యప్రదేశ్‌లోని ‘మాహు’లో అంబేడ్కర్ 1891లో జన్మించారు. తండ్రి రాంజీ. తల్లి భీమాబాయి. 14 మంది సంతానం. అంబేడ్కర్ ఆఖరివాడు. అంబేడ్కర్ అన్నది ఇంటి పేరు. భీంరావు అసలు పేరు. ఓ టీచర్ అతడి మీద వాత్సల్యంతో ఇంటిపేరునే అసలు పేరుగా మార్చాడు. అలా భీంరావు.. అంబేడ్కర్‌గా ప్రసిద్ధులయ్యారు. మహద్, మాహు.. ఇలా అంబేడ్కర్‌ని ‘మహద్’నీయుడినీ, ‘మాహా’నీయుడిని చేశాయి. అంబేడ్కర్ వల్ల ఈ రెండు ప్రాంతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చదువు కోసం యుద్ధమే.. పెరిగి పెద్దయ్యాక గుక్కెడు నీళ్ల కోసం పోరాడిన అంబేడ్కర్.. బాల్యంలోనూ చదువు కోసం పోరాడారు! అసలు స్కూల్లో చేరడమే పెద్ద యుద్ధం అయింది. ఆ తర్వాత మెట్రిక్ వరకు రావడం ఇంచుమించు మహాభారత యుద్ధం లాంటి మహాదళిత యుద్ధం!! ఎంతమందిని ఎదుర్కొన్నాడో, ఎన్ని గడ్డు పరిస్థితుల్ని దాటుకుని వచ్చాడో! టీచర్లు, సాటి విద్యార్థులు అంతా.. అంటరానివాడికి చదువెందుకని ఈసడించినవారే. కానీ కొందరు దయామయుల చేయూతతో చదువు కొనసాగించి, 1907లో మెట్రిక్ పాస్ అయ్యారు అంబేడ్కర్. తర్వాత ఎల్ఫిన్స్టన్ ఉన్నత పాఠశాలలో చదివారు. అందుకు బరోడా మహారాజు ఆర్థిక సహాయం చేశారు. 1912లో అంబేడ్కర్‌కు బి.ఎ.పట్టా చేతికొచ్చింది. రమాబాయితో వివాహం మెట్రిక్ అయిన కొద్దిరోజులకే అంబేడ్కర్ వివాహం జరిగింది. వధువు రమాబాయి. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేళ్లు. పై చదువుల కోసం అంబేడ్కర్ అమెరికా వెళ్లే నాటికే రామాబాయి గర్భవతి. మొదటి సంతానం రమేశ్. తర్వాత గంగాధర్, యశ్వంత్. తర్వాత కూతురు. మొత్తం ఐదుగురు పిల్లల్లో యశ్వంత్ తప్ప మిగతా అంతా చిన్నప్పుడే చనిపోయారు. ఆఖరి పిల్లాడు రాజరత్న. ఆ సమయంలో రమాదేవిని నిర్వేదం అలుముకుంది. అంబేడ్కరే ధైర్యం చెప్పారు. అమెకు అన్ని విధాలా అండగా ఉన్నారు. కొలంబియాలో డాక్టరేట్ అంబేడ్కర్ జీవితంలోని పెద్ద మలుపు.. కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం. 1913లో 22 ఏళ్ల వయసులో.. బరోడా మహారాజు సాయాజీరావ్ గైక్వాడ్ ఉదారంగా ఇచ్చిన ఉపకారవేతనంతో అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో చదివేందుకు వెళ్లారు అంబేడ్కర్. అక్కడి అమెరిన్ జీవితం ఆయన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా- ఎ హిస్టారికల్ అండ్ ఎనలిటికల్ స్టడీ’ అనే అంశంపై అంబేడ్కర్ సమర్పించిన సిద్థాంత పత్రానికి కొలంబియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఇండియా వచ్చాక 1917లో బరోడా చేరారు అంబేడ్కర్. అక్కడికి రావడానికి ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో లా కోర్సులో పేరు నమోదు చేసుకున్నారు. బరోడా నుంచి తిరిగి లండన్ వెళ్లి 1921లో పట్టభద్రులయ్యారు. రెండేళ్ల తర్వాత బారిష్టరు వృత్తి చేపట్టారు. దళితుల కోసం అలుపెరుగని పోరు.. ఓటు హక్కు కమిటీలో పనిచేసిన అంబేడ్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం అలుపెరుగని పోరాటం సాగించారు. ఓటు హక్కు కమిటీ 1932 మే 1న తన పరిశీలనను పూర్తి చేసింది. అస్పృశ్య కులాలను మాత్రమే దళిత కులాలుగా (షెడ్యూల్డ్ కులాలు) పరిగణించాలంటూ తీర్మానించిం ది. కమిటీ నివేదికపై బ్రిటిష్ ప్రధాని వైఖరి ఎలా ఉంటుందోననే ఆందోళనతో 1932 మే 26న అంబేడ్కర్ లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్‌లోని ఉన్నతాధికారులను, మంత్రులను కలుసుకుని, వారికి ఒక నివేదిక సమర్పించారు. అంబేడ్కర్ కృషి ఫలితంగా 1932 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటన మేరకు దళితులకు రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేక స్థానాలు లభించాయి. దళితులకు తమ ప్రత్యేక ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఒక ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక ఓటు వేసే హక్కు కూడా దక్కింది. అప్పటికే జైలులో ఉన్న గాంధీజీ ఈ విషయం తెలియగానే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గాంధీజీపై సానుభూతి గల కాంగ్రెస్ నాయకులంతా అంబేడ్కర్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ప్రైమరీ ఎన్నికల గురించి, ప్రత్యేక స్థానాల కాలపరిమితి గురించి పేచీలు పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రైమరీ ఎన్నికలు తీసివేయవచ్చని, ప్రత్యేక స్థానాలపై మాత్రం పదిహేనేళ్ల తర్వాత దళితుల్లో అభిప్రాయ సేకరణ జరపాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. దీంతో హిందూ నాయకులు గగ్గోలెత్తిపోయారు. మరోవైపు గాంధీజీ ఆరోగ్యం క్షీణించసాగింది. ఎటూ తోచని స్థితిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రస్తావన లేకుండానే పూనా ఒప్పందంపై సంతకాలకు అంబేడ్కర్ అంగీకరించారు. దళితులకు కాంగ్రెస్, గాంధీజీ చేసిన ఈ అన్యాయంపై ఆయన తన గ్రంథంలో విపులంగానే రాశారు. అనారోగ్యం... సతీ వియోగం దళితుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగకుండా పనిచేస్తూ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు అంబేడ్కర్. అధిక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. కంటిచూపు బాగా క్షీణించడంతో కళ్లద్దాలు మార్చాల్సి వచ్చింది. విశ్రాంతి అనివార్యం కావడంతో వైద్యుల సలహాపై బోర్డీలో కొన్నాళ్లు, మహాబలేశ్వర్‌లో కొన్నాళ్లు ఏకాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. బోర్డీలో ఉన్నప్పుడు తనను కలవడానికి ఎవర్నీ రానిచ్చేవారు కాదు. సముద్ర తీరం పక్కన ఉండే ఆ ప్రదేశం అంబేడ్కర్‌కు చాలా నచ్చింది. సముద్రంలో ఆయన రోజూ ఈత కొడుతుండేవారు. మహాబలేశ్వర్‌లో ఉన్నప్పుడు సన్నిహిత మిత్రులను కలుసుకునేవారు. విశ్రాంతి అనంతరం రెట్టించిన ఉత్సాహంతో బాంబే తిరిగి వచ్చారు. వెంటనే రాజ్యాంగం ముసాయిదా ప్రతి తయారీలో నిమగ్నమయ్యారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అంబేడ్కర్ భార్య రమాబాయి 1935 మే 27న కన్నుమూశారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన అంబేడ్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 1937 ఎన్నికల్లో పెద్ద ప్రభావాన్నే చూపింది. మొత్తం 17 మంది అభ్యర్థులను బరిలో నిలపగా, 15 మంది గెలుపొందారు. 1937 జూలై 19న కాంగ్రెస్ అధికార స్వీకారం చేసింది. బాంబే అసెంబ్లీలో అంబేడ్కర్, జమ్నాదాస్.. వీరిద్దరే ప్రతిపక్షాలలో ఉద్ధండులుగా ఉండేవారు. ఆ తర్వాత అంబేడ్కర్ అఖిల భారత నిమ్న జాతుల సమాఖ్య పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ 1952 ఎన్నికల్లో పోటీ చేసి, 34 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిలిపి రెండు స్థానాలను దక్కించుకుంది. ఆ రెండింటిలో ఒకటి మహారాష్ట్రలోని షోలాపూర్ కాగా, రెండోది తెలంగాణలోని కరీంనగర్. ఆ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓడిపోయారు. అయితే కరీంనగర్ నుంచి ఎం.ఆర్.కృష్ణ గెలుపొందారు. వివిధ రాష్ట్రాల్లోని 215 శాసనసభా స్థానాలకు పోటీ చేయగా, 12 మంది గెలిచారు. వారిలో ఐదుగురు హైదరాబాద్ రాష్ట్రం నుంచి, ఇద్దరు మద్రాసు ప్రావిన్స్ (ఆంధ్ర ప్రాంతం ఇందులోనే ఉండేది) నుంచి గెలుపొందారు. హైదరాబాద్ అసెంబ్లీకి గెలిచిన వారిలో జె.ఎం.రాజమణిదేవి (సిరిసిల్ల), బి.ఎం.చందర్రావు (మహబూబాబాద్), బుట్టి రాజారాం (జగిత్యాల), ఆంధ్ర ప్రాంతంలోని అమలాపురం నుంచి బొజ్జా అప్పలస్వామి ఉన్నారు. ఆ తర్వాత అంబేడ్కర్ ఆ పార్టీని మూసేసి, అణగారిన వర్గాల కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం హైదరాబాద్ రాష్ట్రంతో అంబేద్కర్‌కు మంచి అను బంధం ఉంది. ఆయన తరచుగా హైదరాబాద్ వస్తుండేవారు. సమావేశాలలో పాల్గొనేవారు. సి కింద్రాబాద్‌లోని ‘షెడ్యూల్డ్ కేస్ట్ ఫెడరేషన్’ హైదరాబాద్‌లోని ‘హైదరాబాద్ స్టేట్ డిప్రెస్స్‌డ్ క్లాసెస్ అసోసియేషన్’ల ఆహ్వానం మేరకు 1944 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చారు అంబేద్కర్. ఆయన్ను చూడడానికి, ఆయన మాటలు విన డానికి జనం వెల్లువెత్తారు. హైదరాబాద్‌కు వస్తే ప్రముఖరాజకీయ నాయకుడు జె.హెచ్.ఇ. సుబ్బ య్య ఇంట్లో బస చేసేవారు. కేంద్రమంత్రివర్గం నుంచి రాజీనామ చేసిన తరువాత వారం రోజుల పాటు సుబ్బయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు అంబేద్కర్. ఉస్మానియా యూనివర్శిటీ పరిసరాల్లోని పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని ఆయన బాగా ఇష్టపడేవారు. హైదరాబాద్ సంస్థానంలో తొలిసారిగా దళితుల సభ జరిపించారు అంబేద్కర్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ‘రాజులకు రాజు వచ్చుచున్నాడు’ ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌కు లెక్కలేనంత మంది అభిమానులు ఉండేవాళ్లు. ఎంతో మంది దళిత విద్యార్థులకు ఆయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చాలామంది అభిమానులు అంబేద్కర్‌కు ఉత్తరాలు రాస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని అసంఖ్యాక అభిమానులు ఆయన్ను ఎలాగైనా ఇక్కడికి రప్పించాలని బలంగా అనుకున్నారు. ఈ పనిని దళిత సంక్షేమం కోసం కృషి చేస్తున్న నందనారు హరికి అప్పగించారు. హరి విన్నపం ప్రకారం 1944లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు అంబేద్కర్. మొదట అనకాపల్లి వచ్చారు. నగరంలో పండగ వాతావరణం కనిపించింది. ఎటు చూసినా అంబేద్కర్ గురించి చర్చలు. వైశ్యసంఘం వారు 50 వేల రూపాయల విరాళాలు సేకరించి అంబేద్కర్‌కు ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశారు. ‘రాజులకు రాజు, మహారాజు-మాలరాజు వచ్చుచున్నాడు. చూచుటకు రండి’ అట్టల మీద రాసిన ఇలాంటి వాక్యాలు అన్ని వీధుల్లోనూ కనిపించాయి. స్టేషన్ నుంచి అంబేద్కర్‌ను తీసుకువెళ్లడానికి 24 ఎడ్లు కట్టిన పూలరథం ఏర్పాటయింది. అయితే ఈ రథంలో రావడానికి అంబేద్కర్ నిరాకరించారు. కారులోనే ట్రావెలర్స్ బంగళాకు చేరుకున్నారు. సాయంత్రం మునిసిపల్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. సభ పూర్తయిన తరువాత హరిజన వాడలను సందర్శించారు. అనకాపల్లి తరువాత విశాఖపట్టణం, పాలకొల్లులలో జరిగిన సభలలో ప్రసంగించారు అంబేద్కర్. విశాఖపట్నం నుంచి రైల్లో వెళుతున్నప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన జనంతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడేవి. కాకినాడ, గుడివాడ, రామచంద్రాపురం, కొవ్వలి, ఏలురు పట్టణాలకు వెళ్లి అక్కడ జరిగిన సభలలో ప్రసగించారు. రాజమండ్రిలో అంబేద్కర్ ఘనస్వాగతం లభించింది. అంబేద్కర్‌ను చూడాలనే ఉత్సాహం మాత్రమే కాదు, ఆయన ఏంమాట్లాడతారు అనే ఆసక్తి కూడా సభకు వచ్చేవారిలో ఉండేది. ఆయన ప్రసంగాల గురించి జనం ఆసక్తిగా చర్చించుకునేవారు. రాజ్యాంగ పరిషత్తులో తొలి అడుగు స్వతంత్ర భారతదేశాన్ని అసమానతలులేని, వివక్షకు తావులేని సన్మార్గంలో పయనింపజేసేది రాజ్యాంగం. తన జాతి జనుల కోసం అంబేడ్కర్ ఆ రాజ్యాంగ పరిషత్తులో స్థానం సంపాదించాలనుకున్నారు. 1946 మే 6న బ్రిటన్ విడుదల చేసిన రాజపత్రం ప్రకారం స్వతంత్ర భారత దేశం రాజ్యాంగ ఏర్పాటుకు సంబంధించిన వివిధ విషయాల పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. 1946 జూలై, అగస్టులలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యాంగ పరిషత్తుకి సభ్యులను ఎన్నుకుంటారు. అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి రాకుండా కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ బెంగాల్‌కు చెందిన నిమ్న జాతుల నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ అంబేడ్కర్‌ని బెంగాల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నాయకునిగా అక్కడి ముస్లిం లీగ్ నాయకులతో మాట్లాడి బెంగాల్ అసెంబ్లీ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు వెళ్లేలా చేశారు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడిగా... రాజ్యాంగ రచనా సంఘం 1947 ఆగస్టు 29న ఏర్పాటైంది. దానికి అంబేడ్కర్‌ని అధ్యక్షునిగా నియమించారు. అంబేడ్కర్ అత్యంత దీక్షగా ఐదు నెలల్లో రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేసారు. 114 రోజులలో దాన్ని అసెంబ్లీ చేత ఆమోదింపజేశారు. కెనడా రాజ్యాంగం రచనకూ, చర్చకూ, ఆమోదానికీ కలిపి రెండు సంవత్సరాల నాలుగు నెలలు పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగానికి పట్టింది అతి తక్కువ సమయం. కేవలం ఐదు నెలలే. దీన్నిబట్టి అంబేడ్కర్ కార్యదీక్ష, అసాధారణ ప్రతిభ స్పష్టం అవుతోంది. 1948 నవంబర్ 29న రాజ్యాంగంలోని 11వ ఆర్టికల్‌లో చెప్పిన అస్పృశ్యతా నిర్మూలన విధానాన్ని సభ్యుల హర్షాతిరేకాల మధ్య ఆమోదించుకున్నారు. 1949 నవంబరు 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పదవికి రాజీనామా.. ప్రతిపక్ష నేతగా సభలోకి రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేడ్కర్ మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే దేశంలోని స్త్రీల విముక్తికి, ఆర్థిక హక్కుకి సంబంధించిన అంశం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా తయారు చేసేందుకు భారత ప్రభుత్వం 1941లో బి.ఎన్.రావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ హిందూ కోడ్ బిల్లుని రూపొందించింది. అసమానతలకు తావులేని సమాజాన్ని కాంక్షించిన అంబేడ్కర్ స్త్రీపురుష సమానత్వ సాధనకు అనేక మార్గాలన్వేషించాడు. సంఘంలో స్త్రీల ప్రాధాన్యతను కీలకంగా భావించి ఈ బిల్లుని తయారు చేసి 1950 నవంబర్‌లో 32 పేజీల ప్రతిని పార్లమెంటు సభ్యులందరికీ పంపారు అంబేడ్కర్. అంబేడ్కర్ చేతిలో రూపుదిద్దుకున్నఈ బిల్లు సమాజ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తుందని హిందూ సంస్థలు మండిపడ్డాయి. కానీ నెహ్రూ ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించారు. సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ ఈ బిల్లుని వ్యతిరేకించారు. బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది కానీ ఆమోదం పొందలేదు. ఇందుకు నిరసనగా 1951 సెప్టెంబర్ 27న విసుగుచెందిన అంబేడ్కర్ న్యాయశాఖా మంత్రి పదవికి అంబేడ్కర్ రాజీనామా చేసారు. మరునాడే ప్రతిపక్ష నాయకునిగా సభలోనికి అడుగుపెట్టారు. ప్రతిపక్ష నాయకునిగా కూడా విశేష కృషి చేయగలరని అంబేడ్కర్‌పై విశ్వాసాన్ని ప్రకటించారంతా. అంబేడ్కర్ మరింత స్వేచ్ఛగా ప్రసంగాలు మొదలు పెట్టారు. బుద్ధం శరణం గచ్ఛామి.. మానసికంగా ఎంత శ్రమకైనా అంబేడ్కర్ వెనుదీయలేదు. కానీ దేహం మాత్రం అనుకూలంగా లేదు. అపెండిసైటిస్, రక్తపోటుతో బాధపడ్డారు. 1954 ప్రాంతంలో కాళ్లలో నరాల బలహీనత వచ్చింది. ఎనిమిదేళ్ల ముందునుంచే మధుమేహం ఉంది. నిల్చోవడం కష్టమైంది. పడక కుర్చీలో కూర్చుని, ఎదురుగా ఉన్న బల్ల మీది దిండ్లపైన కాళ్లు చాపుకుని కూర్చునేవారు. ఇట్లాంటి స్థితిలో కూడా ‘ద రిడిల్స్ ఇన్ హిందూయిజం’ పుస్తకం ప్రారంభించారు. ‘హిందూమతంలో పుట్టినా, హిందువుగా మాత్రం చావను’ అన్న అంబేడ్కర్‌ను బౌద్ధం ఆకర్షించింది. 1955 నుంచి అంబేడ్కర్ అనారోగ్యం మరింత దిగజారుతూ వచ్చింది. అయినా బౌద్ధంపై పుస్తకం రాయడం మొదలుపెట్టారు. ‘ద బుద్ధా అండ్ హిస్ గాస్పెల్’ పేరుతో అది అచ్చయింది. ‘బుద్ధా అండ్ హిజ్ దమ్మా’ పేరుతో మరొక పుస్తకం ప్రారంభించారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో బుద్ధ జయంతిన అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. భగవాన్ బుద్ధునికీ జై, బాబాసాహెబ్ కీ జై అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్, సవితాదేవి దంపతులతోపాటు ఆ రోజు సుమారు మూడు లక్షల మంది బౌద్ధదీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నేనీనాడు తిరిగి జన్మించాను’ అంటూ అంబేడ్కర్ ఉద్వేగంగా ప్రసంగించారు. మహానిర్యాణం ఒకరోజు జ్వరం వచ్చిన తోటమాలిని పరామర్శించి తిరిగివస్తూ, ‘మృత్యువంటే అతడు భయపడుతున్నాడు, కానీ నాకేం భయం లేదు, ఏ క్షణాన్నైనా రానీ’ అని కార్యదర్శి రత్తూతో అంబేడ్కర్ అన్నారు. కానీ మృత్యువు ఆయన చెంతే ఉంది. 1956 డిసెంబర్ 4న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సమావేశానికి అంబేడ్కర్ హాజరయ్యారు. తెల్లారి జైన నాయకులు వస్తే వారితో మాట్లాడారు. అనంతరం, అలసటగా ఉండటంతో తలకు రత్తూ నూనెతో మాలిష్ చేస్తుండగా సోఫా మీద తాళం వేస్తూ మంద్ర స్వరంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ పాడుకున్నారు. తర్వాత కొద్దిగా అన్నం తిని తన పర్సనల్ లైబ్రరీలోని కొన్ని పుస్తకాలను పడకగదిలో పెట్టించుకున్నారు. ‘చల్ కబీరా భవసాగర్ డేరా’ కబీరు గీతం పాడుతూ పడక గదికి చేరుకున్నారు. డిసెంబర్ 6న ఉదయం 6:30కు చూసినప్పుడు నిద్రిస్తున్నారనే అనుకున్నారు సవితాదేవి. కానీ ఆయన దేహం అప్పటికే భవసాగరాన్ని దాటేసింది. ఆ వార్త లక్షలాది జనాన్ని శోకసంద్రంలో ముంచేసింది. గాంధీని ఎదిరించిన ఒకే ఒక్కడు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో గాంధీజీని ఎదిరించిన ఒకే ఒక్క నాయకుడు అంబేడ్కర్. దళితుల పట్ల కాంగ్రెస్ వైఖరిని నిలదీసిన నాయకుడు ఆయన. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే గాంధీజీ ఎదుట అంబేడ్కర్ తన వాణిని బలంగా వినిపించారు. 1931 ఆగస్టు 14న మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని మణిభవన్‌లో గాంధీజీతో అంబేడ్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘నాపైన, కాంగ్రెస్‌పైన మీకు వేరే అభిప్రాయాలు ఉన్నట్లు విన్నాను. స్కూలు చదివే రోజుల నుంచి నేను అంటరానితనాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తున్నాను. కాంగ్రెస్ వారికి నచ్చజెప్పి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా. ఈ సమస్య మతపరమైనదని కాంగ్రెస్ తోసివేస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు. అయినా నేను దీనికి ప్రాధాన్యమిస్తున్నా. ఈ విషయమై కాంగ్రెస్ రూ.20 లక్షలు ఖర్చుపెట్టింది. మీలాంటి వారు ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది’ అన్నారు గాంధీ. ‘నేను పుట్టక ముందు నుంచే మీరు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉండి ఉండవచ్చు. అయితే, కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించింది తప్ప పరిష్కారానికి ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌లో నిజాయితీ లేదు. నిజంగా అన్ని లక్షల రూపాయల సొమ్ము ఖర్చు చేసి ఉంటే అదంతా వృథా అయిందనే చెప్పవచ్చు. ఇక రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది దళితులకు ఉపకరిస్తుందని మేమనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని గాంధీజీని ప్రశ్నించారు అంబేడ్కర్. ‘హిందువులలో భాగమైన దళితులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశంగా నేను భావిస్తున్నాను’ అని బదులిచ్చారు గాంధీ. అంతే... అంబేడ్కర్ వెంటనే వెళ్లడానికి లేచారు. ‘మీరు స్పష్టంగా మీ అభిప్రాయాలు వెల్లడించినందుకు కృతజ్ఞతలు’ అంటూ సెలవు తీసుకున్నారు. అప్పటి వరకు దేశ రాజకీయాల్లో మకుటంలేని మహారాజులా వెలుగుతున్న గాంధీజీని మొట్టమొదటి భేటీలోనే ముఖాముఖి ఎదిరించిన నాయకుడు అంబేడ్కర్ ఒక్కరే. ఆ తర్వాత కూడా గాంధీజికి గొప్ప ప్రత్యర్థిగా నిలిచారు. -
స్వాతంత్య్ర జ్వాల...
జలియన్‌వాలా బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు తక్షణ ప్రేరణ... జలియన్‌వాలా బాగ్ దురంతం. ఈ ఘోర ఘటన తర్వాతే గాంధీజీ సహాయ నిరాకరణ మొదలైంది. నిరాకరణ నిరసన అయ్యింది. నిరసన సత్యాగ్రహం అయింది. సత్యాగ్రహం ఆయుధం అయ్యింది. ఆ ఆయుధమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ‘అన్ని యుద్ధాలనూ అంతం చేయడానికి చేస్తున్న యుద్ధం’ అంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో నినాదం ఇచ్చిన ఇంగ్లండ్, ఆ తరువాత భారతీయుల మీద మాత్రం తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అందుకు నిలువెత్తు నిదర్శనమే జలియన్‌వాలా బాగ్ దురంతం (ఏప్రిల్ 13, 1919). గ్రేట్‌వార్ ముగిసిన కొన్ని నెలలకే ఈ ఘోరాన్ని ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో నమోదు చేసింది. రెండువేల మంది దేశభక్తుల రక్తంతో తడిసిన నేల అని జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం మీద రాసి ఉంటుంది. పిలుపు అందుకుంది పంజాబీలే! జలియన్‌వాలా బాగ్ నెత్తుటి కాండకు ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్ చరిత్ర దగ్గరకు నడవాలి. నాటి భారత రాజకీయ, స్వాతంత్య్రో ద్యమ సన్నివేశాలను, మనోభావాలను శోధించాలి. ఆ యుద్ధంలో సిక్కులు చూపించిన తెగువను జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ప్రపంచ సంగ్రామంలో 13 లక్షల మంది భార త సైనికులు పాల్గొన్నారు. మొత్తం 74,000 మంది చనిపోయారు. మిగిలిన భారత భూభాగాల కంటే పంజాబ్.. బ్రిటిష్ జాతికి మరింత సేవ చేసిందనే చెప్పాలి. యుద్ధం ఆరంభించే సమయానికి (1914) భారత వలస సైన్యంలో సిక్కుల సంఖ్య దాదాపు లక్ష. ‘యుద్ధంలో చేరి వీరత్వం ప్రదర్శించ’మంటూ ఇంగ్లండ్ ప్రభుత్వంలో వార్ కార్యదర్శి లార్డ్ కిష్నర్ ఇచ్చిన పిలుపునకు గాఢంగా స్పందించిన వారు పంజాబీలే. కిష్నర్ ప్రకటన తరువాత పంజాబీ సైనికుల సంఖ్య 3,80,000కు చేరుకుంది. అంతేకాదు, రెండుకోట్లు యుద్ధ నిధి ఈ ప్రాంతం నుంచి వెళ్లింది. పది కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించిన వార్ బాండ్లను తీసుకున్నది కూడా పంజాబీలే. కానీ యుద్ధంలో వీరు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ‘‘... రోజూ వేలమంది మనుషులు చనిపోతున్నారు... చూడబోతే యుద్ధం ముగిసే సరికి రెండు వైపులా ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు శాంతి నెలకొనకుండా ఉంటుందా?’’ అంటూ ఇషేర్సింగ్ (59వ సిఖ్ రైఫిల్స్ దళ సభ్యుడు) పంజాబ్‌లోని తన మిత్రుడికి రాసిన లేఖ (మే 1, 1915) లోని ఈ మాటలు ఆ వేదనకు ఒక నిదర్శనం. భారతదేశం మొత్తం మీద ప్రతి 150 మందికి ఒకరు యుద్ధానికి వెళితే, ప్రతి 28 మంది పంజాబీలకూ 1 సిపాయి వంతున ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. గాంధీజీపై అనిబిసెంట్ ఆగ్రహం! ఆ ఘోర యుద్ధంలో వలస భారత సైనికులను ఉపయోగించుకోవడం మీద ఆనాటి స్వాతంత్య్రోద్యమ నేతలలో ఏకాభిప్రాయం లేదు. చెప్పాలంటే గట్టి వ్యతిరేకతే ఉంది. యుద్ధం చేస్తున్న ఇంగ్లండ్ అవసరాలను తీరుస్తానంటూ ముందుకొచ్చిన గాంధీజీ సైతం విమర్శలపాలు కావలసి వచ్చింది. ఊరికి 20 మంది బలశాలురైన యువకులు చేరాలంటూ గుజరాత్ ప్రాంతమంతా గాంధీజీ పాదయాత్ర చేశారు. మొత్తానికి నలభై మంది మాత్రం చేరారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకో వలసిందిగా సర్దార్ పటేల్‌ను గాంధీజీ కోరినా ఆయన నిరాకరించడం విశేషం. అహింసా సిద్ధాంతం వదిలి గాంధీజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనిబిసెంట్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. గాంధీజీని ఆమె ‘రిక్రూటింగ్ సార్జెంట్’ అని ఎద్దేవా చేశారు. అయినా గాంధీజీకి ఒక ఆశ. ఆ యుద్ధంలో బ్రిటన్‌కు సహకరిస్తే, భారతీయుల ‘స్వరాజ్యం’, ‘స్వయం పాలన’ కోరికలకు కదలిక వస్తుందని అనుకున్నారు. కానీ యుద్ధంతో సతమత మవుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవాలన్నది చాలామంది తీవ్ర జాతీయవాదుల ఆశయం. అందులో గదర్ పార్టీ ప్రధానమైనది. ఈ పార్టీలో ఎక్కువ మంది పంజాబ్, బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే (తెలుగు ప్రాంతం నుంచి దర్శి చెంచయ్య వెళ్లి ఈ పార్టీలో పనిచేశారు). 1857 తరహాలో 1915 ఫిబ్రవరిలో ఒక తిరుగుబాటు తేవాలన్న యోచన కూడా బలీయంగా ఉంది. ఇలాంటి విస్తృత పథకానికి వ్యూహం పన్నినవారు అమెరికా, జర్మనీ దేశాలలో ఉండి భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్నవారే. ఇందుకు 1914 నుంచి 1917 వరకు చాలా కృషి జరిగింది. కానీ గదర్ పార్టీలోకి గూఢచారులు చొచ్చుకుపోవడం వల్ల రహస్యాలు బయటకు పొక్కి పథకం విఫలమైంది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం -1915 ఈ పరిణామాల ఫలితమే. దీనికి కొనసాగింపు సెడిషన్ కమిటీ 1918. సిడ్నీ రౌలట్ (న్యాయమూర్తి) దీని అధ్యక్షుడు. జర్మన్, బొల్షివిక్-భారత తీవ్ర జాతీయవాదుల మధ్య సంబంధాలను వెలికి తీయడం కూడా ఈ కమిటీ విధులలో ఒకటి. అలా వచ్చింది రౌలట్ చట్టం. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమే జలియన్‌వాలాబాగ్ దురంతం. బాగ్ ఘటనకు బీజం ఇక్కడే! ఒక పక్క అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తూనే, మరోపక్క గ్రేట్‌వార్‌లో బ్రిటిష్ వారికి సాయం చేయాలని గాంధీజీ యోచించారు. సరిగ్గా ఈ అంశం మీదే ఉద్యమకారులు రెండు వర్గాలయ్యారు. అహింసా పథానికీ, భూగోళాన్ని రక్తంతో తడుపుతున్న మొదటి ప్రపంచ యుద్ధానికి చేయూతనివ్వడానికీ పొంతన లేదన్నదే తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం. అయినా గాంధీజీ అహింసాయుత పంథాలోనే ఎక్కువ మంది కాంగ్రెస్‌వాదులు నడిచారు. పంజాబ్ ప్రముఖులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ గాంధీజీ అహింసా ప్రబోధాలను విశ్వసించినవారే. ఈ ఇద్దరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 10, 1919న అరెస్టు చేసి, రహస్య ప్రదేశంలో ఉంచింది. గాంధీజీ అహింసను ప్రజలకు తెలియచేసే క్రమంలో... అరెస్టయిన వీరి విడుదల కోసం హింసాత్మక ఉద్యమం మొదలైంది. మైఖేల్ ఓడ్వయ్యర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. అమృత్సర్ మిలిటరీ కమాండర్ - బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్. సత్యపాల్, కిచ్లూ అరెస్టయిన రోజునే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (పంజాబ్) నివాసం ఎదుట ఆందోళన జరిగింది. కాల్పులు జరిగాయి. ముగ్గురు బ్యాంక్ అధికారులను కార్యాలయాల్లోనే జనం హత్య చేశారు. ఏప్రిల్ 11న మార్సెల్లా షేర్వుడ్ అనే మహిళా మిషనరీని సైకిల్ మీద నుంచి పడేసి చంపారు. ఈ పరిణామాల తరువాత సత్యపాల్, కిచ్లూలను విడుదల చేసి, సైనిక శాసనం విధించారు. అప్పుడే, అంటే ఏప్రిల్ 13న సిక్కుల పండుగ ైవె శాఖి వచ్చింది. సైనిక శాసనం గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల సిక్కులు ఏటా అక్కడ జరిగే ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ఉత్సవం తరువాతే సభ జరుగుతుందని గూఢచారుల ద్వారా జనరల్ డయ్యర్‌కు సమాచారం అందింది. డయ్యర్‌కు పార్లమెంట్ ప్రశంస! నిజానికి బాగ్‌లో కాల్పులు జరిపే ఉద్దేశం డయ్యర్‌కు లేదని నిక్ లాయిడ్ (ది అమృత్సర్ మేసకర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ వన్ ఫేట్ఫుల్ డే) అనే చరిత్రకారుడు అంటాడు. 90 మంది బలగం (బలూచీ, గూర్ఖా దళాలు)తో నగరంలో సైనిక శాసనం అమలును పర్యవేక్షిస్తున్నాడు డయ్యర్. ఆరేడు ఎకరాల బాగ్‌లో జరుగుతున్న సభ దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ 15 వేల నుంచి 25 వేల వరకు అక్కడ జనం ఉండడం గమనించి, వెంటనే కాల్పుల నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘట్టం రక్తదాహానికీ ప్రబల నిదర్శనం. అమానవీయతకు, వలసవాదానికీ మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిన రక్తరేఖ. ఈ దురంతానికి పాల్పడిన డయ్యర్‌ను నాటి బ్రిటిష్ పార్లమెంట్ శ్లాఘించడమే విచిత్రం. టాగూర్ తిరిగి ఇచ్చేశారు! జలియన్‌వాలా బాగ్ కాల్పులు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘోర ఉదంతం. చరిత్ర మీద కనిపించే దీని జాడే అందుకు నిదర్శనం. కాల్పుల సమాచారం తెలియగానే రవీంద్రనాథ్ టాగూర్ తన సర్ బిరుదును త్యజించారు (మే 22న గానీ ఘటన సంగతి బెంగాల్ చేరలేదు, గాంధీజీకి జూన్‌లో ఈ సంగతి తెలిసింది). జనరల్ డయ్యర్‌ను శిక్షించాలని బ్రిటిష్ ప్రముఖుడు విన్స్టన్ చర్చిల్ ప్రతినిధుల సభలో (జూలై 8, 1920న) కోరడం విశేషం. అమృత్సర్ అమానుషానికి బాధ్యునిగా ప్రసిద్ధికెక్కిన ఓడ్వయ్యర్‌ను మార్చి 13, 1940న లండన్ నగరంలో ఉన్న క్యాక్స్టన్ హాలులో రెండు దశాబ్దాల తరువాత ఉధమ్‌సింగ్ కాల్చి చంపాడు. పసితనంలో చూసిన ఆ బీభత్సం అతడిని ఈ హత్యకు పురికొల్పింది. తరువాత ఇంగ్లండ్ దమననీతి ఎలాంటిదో చూడండంటూ జర్మన్ అనుకూల దేశాలు తరువాత జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశాయి. కొసమెరుపు: 1961, 1983 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించారు. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ఘటించి వెనుదిరిగారు. అక్టోబర్ 13, 1997న మళ్లీ భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి వచ్చారు. డయ్యర్ కుమారుడు చెప్పిన దానిని బట్టి ఫిలిప్ ఈ సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న సంస్మరణ ఫలకం మీద అంకెను చూసి ఇంతమంది మరణించలేదని నాకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించాడు. బ్రిటిష్‌రాణి ‘మన గతం ఇబ్బందికరమైనది....’ అని కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. ఫిబ్రవరి, 2013లో నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించాడు. మృతులకు నివాళి ఘటించాడు. ఈ ఘోర దురంతం మీద బ్రిటిష్ నేతల నుంచి సాంత్వన వాక్యాలు వస్తాయని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. - డా॥గోపరాజు నారాయణరావు -
గాంధీజీ మీద ఒట్టు..
తాగినా, అమ్మినా జరిమానా తప్పదు జగదేవ్‌పూర్ (మెదక్) : ఇకపై మద్యం తాగం, విక్రయించం.. ఎవరైనా గ్రామంలో అమ్మినా, తాగినా జరిమానా కట్టాల్సిందే.. అంటూ గ్రామస్తులంతా కలసి గాంధీజీ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆదర్శానికి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్ వేదికయింది. బస్వాపూర్ గ్రామంలో కొన్నేళ్లుగా నాలుగు బెల్టుషాపులు నడుస్తున్నాయి. దీంతో గ్రామస్తులు చాలామంది మద్యానికి బానిసలై ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు. కొట్లాటలు, వాదులాటలు సర్వసాధారణంగా మారాయి. ఇది గ్రహించిన కొందరు యువకులు నడుం బిగించారు. సారా మహమ్మారిని ఊరి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సభ్యులు, పెద్దలు, మహిళ సంఘాల సభ్యులకు నచ్చజెప్పారు. వారి సహకారంతో గ్రామంలో దండోరా వేయించి శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందరి సమక్షంలో మహిళలు, గ్రామ పెద్దలు బెల్టుషాపులు నిర్వహించరాదని తీర్మానం చేసుకున్నారు. ఆ మేరకు మహాత్ముని విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తే పది వేల జరిమాన తప్పదని హెచ్చరించారు. తీర్మానం ప్రతిని జగదేవ్‌పూర్ పోలీసులకు కూడా అందించారు. -
'మహాత్మ' టైటిల్ పై మళ్లీ వివాదం!
అహ్మదాబాద్: భారత జాతిపిత గాంధీని ఉద్దేశించి నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తొలిసారిగా 'మహాత్మ' అని సంబోధించారన్నది మనందరికీ తెలిసిన విషయం. దేశవ్యాప్తంగా ఉన్న పాఠ్యపుస్తకాల్లోనూ ఇదే ఉంటుంది. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం గాంధీకి 'మహాత్మ' బిరుదుని ఇచ్చింది టాగోర్ కాదు.. సౌరాష్ట్రలోని జెత్పూర్ పట్టణానికి చెందిన ఓ గుర్తు తెలియని విలేకరి అని పేర్కొంటున్నది. రాజ్‌కోట్ రెవెన్యూ డిపార్ట్మెంటులో పోస్టుల భర్తీ కోసం జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో గాంధీకి 'మహాత్మ' బిరుదు ఎవరు ఇచ్చారన్న ప్రశ్నకు సంబంధించిన వివాదం గుజరాత్ హైకోర్టు ముందుకు వచ్చింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగానే.. ఆయనను జెత్‌పూర్‌కు చెందిన ఓ విలేకరి 'మహాత్మ' అని సంబోధిస్తూ లేఖ రాశారని, ఈ విషయాన్ని గాంధేయవాది నారాయణ్ దేశాయ్ తన పుస్తకంలో వెల్లడించారని పంచాయతీ శిక్షణ సమితి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఆ జర్నలిస్టు పేరు తెలియదని వెల్లడించింది. గాంధీకి 'మహాత్మ' అన్న బిరుదు టాగోర్ ఇచ్చారని మొదటి కీలో సమాధానంగా పేర్కొని.. ఫైనల్ 'కీ'లో గుర్తుతెలియని జర్నలిస్టు అని సమాధానంగా పేర్కొనడాన్ని తప్పబడుతూ.. ఈ పరీక్షకు హాజరైన సంధ్య మారు అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం మూడు ప్రశ్నలకు సంబంధించి మొదటి 'కీ'లో సరైన సమాధానాలు ఇచ్చి.. ఫైనల్ కీలో దానిని మార్చారని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. -
ప్రాసంగికత కోల్పోని ప్రసంగం
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి 1915లో తిరిగొచ్చిన మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీకి 1916 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించాలని ఆహ్వానం అందింది.. పలు సంస్థానాధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 1916 ఫిబ్రవరి 6 సాయం త్రం గాంధీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ భాషలను పక్కనబెట్టి ఇంగ్లిష్ భాషకు నాటి పాలకులు ఇస్తున్న ప్రాధాన్యం, స్వయంపాలన, పరిశుభ్రతపై అవగా హనా లేమి, అరాచకవాదుల లక్ష్య రహిత పోరాటం (అరా చకవాదులను ఖండిస్తూ గాంధీ చేసిన ప్రసంగాన్ని అనీబి సెంట్ అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది) సంపన్నుల సంపద ప్రదర్శనలు, ధనిక-పేద మధ్య అంతరాలు వంటి అంశాలపై గాంధీ ప్రసంగంలోని అంశాలు వందేళ్ల తర్వాత కూడా తమ ప్రాసంగికతను కోల్పోకపోవడమే విషాదం. గాంధీ ప్రసంగ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లో... ఈ పవిత్ర నగరంలో ఈ గొప్ప కళాశాల నీడలో నిల బడి ఈ సాయంత్రం నాది కాని విదేశీ భాషలో నా దేశ వాసులను ఉద్దేశించి ప్రసంగించడం కంటే మించిన అవ మానకరమైన విషయం ఇంకొకటిలేదు. మన భాష మనకు ప్రతిబింబం. ఉత్తమమైన ఆలోచనను మన భాష వ్యక్తం చేయలేదని మీరు నాకు చెప్పినట్లయితే, అతి త్వరలోనే మనం ఉనికిని కోల్పోవడం ఖాయం. ఇంగ్లిష్ భాష ద్వారానే జ్ఞానం పొందుతున్న ప్రతి యువతీయువకులూ ఆరేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని కొందరు పూనా ప్రొఫెసర్లు నాతో చెప్పారు. మన స్కూళ్లు, కాలేజీలలోని విద్యార్థులకూ, మనకు కూడా దీన్ని వర్తింపజేస్తే జాతి ఎన్ని వేల సంవత్సరాలను నష్టపోతూ వచ్చిందో సులభంగా అర్థమవుతుంది. భారతీయులకు చొరవ, ప్రేరణ లేవని ఆరోపిస్తున్నారు. నిజమే మరి. విదేశీ భాషను నేర్చుకోవ డంలోనే జీవితంలోని విలువైన సంవత్సరాలను మనం వెచ్చిస్తున్నప్పుడు మనకు ఇక చొరవ ఎక్కడుంటుంది? గత 50 ఏళ్ల కాలంలో దేశభాషల్లోనే విద్య నే ర్చుకోగలిగినట్ల యితే, మనం నేడు స్వేచ్ఛా భారత్‌లో ఉండేవాళ్లం. నిన్నటి సాయంత్రం నేను కాశీ విశ్వనాథుని ఆలయం సందర్శించాను. ఆలయ వీధుల్లో నడుస్తుంటే కొన్ని ఆలో చనలు నన్ను వెంటాడాయి. పైనుంచి ఒక కొత్త వ్యక్తి ఈ ఆలయంలోకి ఊడిపడి, హిందువులుగా మనం ఎలాంటి వారిమని పరిశీలించినట్లయితే, మనల్ని ఖండించి తీరు తాడు. ఈ గొప్ప ఆలయం మన గుణశీలాలకు ప్రతిబింబం కాదా? మన పవిత్ర ఆలయం ఇంత మురికిగా ఉండటం సరైందేనా? ఆలయవీధులు ఎంతో ఇరుగ్గాను, క్రమరహి తంగాను ఉన్నాయి. చివరకు మన ఆలయాలు కూడా కాస్తంత విశాలంగాను, కాస్త పరిశుద్ధంగాను లేకపోతే మనం కోరుకుంటున్న స్వయం పాలనకు అర్థం ఏమిటి? రైలు ప్రయాణంలో మూడో తరగతి ప్రయాణికుల కష్టాన్ని గమనించాను. కాని వారి కష్టాలకు రైల్వే యం త్రాంగాన్ని తప్పుపట్టకూడదు. మనకు పరిశుభ్రతకు సం బంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలీవు. బోగీల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటాం. ఫలితం బోగీలో భయంకరమైన మురికి. స్వయం పాలన కావాలంటే ఇలాంటి పరిస్థితులను ముందుగా మెరుగుపర్చాలి. నిన్నటి సాయంత్రం సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు దేశ దారిద్య్రం గురించి మాట్లాడారు. ఇతర వక్తలూ దీనిపై నొక్కి చెప్పారు. కానీ వైస్రాయ్ గారు తొలి రోజు ప్రారంభోత్సవం నిర్వహించిన సభామంట పంలో మనం చూసిందేమిటి? ఆపాద మస్తకం ధరించిన నగలతో కళ్లు మిరిమిట్లు గొలిపే స్థాయి ప్రదర్శన. మీరు ధరించిన ఈ నగలన్నింటినీ తీసివేసి భారత్‌లోని మీ దేశవాసులకోసం దాన్ని ధర్మనిధిగా ఉంచనంతకాలం భారత్‌కు విముక్తి లేదు. బ్రిటిష్ ఇండియాలో కానీ, మన సంస్థానా లలో కాని ఉన్న గొప్ప గొప్ప రాజ మందిరాలను చూసిన వెంటనే నాకు అసూయ కలుగుతుంటుంది. ఓహో.. ఈ డబ్బంతా వ్యవసాయ దారులనుంచే వచ్చింది కదా? జనాభాలో 75 శాతంపైగా వ్యవసా యదారులున్నారు. వారి శ్రమ ఫలితాలను మొత్తంగా మనమే తీసుకున్నా లేక తీసుకోవడానికి ఇతరులను అను మతించినా.. మనలో స్వయంపాలన స్ఫూర్తి కొరవడినట్లే. మన విముక్తి రైతుల ద్వారానే వస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, ధనిక భూస్వాములు దాన్ని సాధించలేరు. నేటి భారత్ తన అసహనంలోంచి అరాచకవాదుల సైన్యాన్ని తయారు చేస్తోందని మనం మర్చిపోవద్దు. నేను కూడా అరాచకవాదినే. కాని నాది మరొక రకం. నేను వారిని కలసిన పక్షంలో భారత్‌లో వారి అరాచకవాదానికి తావు లేదని చెబుతాను. దేశంపట్ల తన ప్రేమకు గాను నేను ఆరాచకవాదిని గౌరవిస్తాను. దేశం కోసం ప్రాణ తర్పణ చేసేందుకు సిద్ధపడే అతడి ధీరత్వాన్ని గౌరవిస్తాను. కాని నాదొక ప్రశ్న. హత్య చేయడం గౌరవప్రదమైనదేనా? హంతకుడి కత్తి గౌరవప్రదమైన మృత్యువుకు ముందు షరతుగా ఉంటుందా? ఆంగ్లేయులు భారత్‌నుంచి వైదొల గడం, వారిని పారదోలడం భారత్ విముక్తికి అవసరం అని నేను గ్రహించినట్లయితే, వారు వెళ్లిపోవలిసిందేనని చెప్ప డానికి, ఆ విశ్వాసానికి మద్దతుగా చావడానికైనా నేను సిద్ధ పడతాను వీరమరణం అంటే ఇదే. రహస్య పథకాలు సృష్టించి బాంబులు విసిరేవారు బయటకు రావడానికి భయపడుతున్నారు. పట్టుబడినప్పుడు తమ లక్ష్య రహిత సాధనకు పరిహారాన్ని అనుభవిస్తున్నారు. మనం ఇలా చేయకపోతే, కొంతమంది బాంబులు విసరకపోతే, బ్రిటిష్ పాలన నుంచి వేరుపడే ఉద్యమానికి సంబంధించి మనం ఏమీ సాధించలేమని కొందరు నాతో చెప్పి ఉన్నారు. (ఇక్కడ అనీబిసెంట్, గాంధీ ప్రసంగాన్ని అడ్డుకుని ‘దయ చేసి ఆపండి’ అన్నారు). నేను చెబుతున్నది అవసరమే అని భావిస్తున్నా. ప్రసంగాన్ని ఆపివేయాలని చెబితే దానికి నేను కట్టుబడతాను. (సభా చైర్మన్ వైపు తిరిగి) నా ఈ ప్రసంగం ద్వారా నేను దేశానికి, చక్రవర్తికి సేవ చేయడం లేదని మీరు భావిస్తున్నట్లయితే నేను తప్పక ఆపివేస్తాను. (ఇక్కడ శ్రోతలు ‘మాట్లాడండి’ అంటూ అరిచారు). (చైర్మన్: ‘దయచేసి మీ లక్ష్యాన్ని వివరించండి’ అన్నారు). నేను... (మరోసారి అంతరాయం కలిగింది) మిత్రులారా, ఈ అంతరాయం పట్ల ఆగ్రహించకండి. నన్ను మాట్లాడటం ఆపివేయమని అనీబిసెంట్ అంటున్నారంటే ఆమె భారత్‌ను ప్రేమిస్తున్నారు మరి. యువతముందు నేను తప్పుగా మాట్లాడుతున్నానని ఆమె భావిస్తున్నారు. కాని ఇప్పుడు సైతం.. మరో వైపునుంచి వస్తున్న ఈ అనుమాన పూరిత వాతావరణాన్ని భారత్‌నుంచి ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాను. మన లక్ష్యసాధనకు పరస్పర ప్రేమ, విశ్వాసం ప్రాతిపదికన ఒక సామ్రాజ్యాన్ని కలిగి ఉండాలి. ....స్వయంపాలన చేపట్టాలంటే దాన్ని మనం సాధిం చవలసిందే. దాన్ని మనకు ఎవరూ మంజూరు చేయరు. స్వతంత్రం అనేది ఒక పార్టీ ఇస్తే వచ్చేది కాదు. బోయెర్ యుద్ధం నుంచి మీరు పాఠం నే ర్చుకోండి. కొన్నేళ్ల క్రితం ఆ సామ్రాజ్యానికి శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడు స్నేహితు లుగా మారారు. (ఈ సమయంలో ప్రసంగానికి అంతరా యం కలిగింది. వేదిక నుంచి కొందరు వెళ్లిపోసాగారు. దీంతో గాంధీ ప్రసంగం అర్ధంతరంగా నిలిచిపోయింది. (భారత్ తిరిగొచ్చాక ఎంకే గాంధీ 1916 ఫిబ్రవరి 6న చేసిన తొలి ప్రసంగానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా) - ప్రత్యూష -
వీరప్పన్ మహాత్ముడైతే... గాంధీజీ ఏంటి?
గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఆపాలంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కేసు పెట్టారు. ‘‘లంచగొండి ప్రభుత్వం, అవినీతిమయమైన అటవీ శాఖ నుంచి అడవిని కాపాడటానికి తన జీవితాన్నే మా ఆయన ధారపోశాడు. చాలా మంది తమిళులు అతన్ని దైవంలా భావిస్తారు. అలాంటి వ్యక్తిని ఓ చెడ్డవాడిగా చిత్రీకరించడం చాలా దారుణం’’ అని ముత్తులక్ష్మి పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘ఏ తల్లికైనా తన బిడ్డ మంచివాడిగానే కనిపిస్తాడు. ప్రతి భార్య తన భర్త మంచివాడే అనుకుంటుంది. అందులో తప్పులేదు. నా ప్రశ్నేంటంటే ఒసామా బిన్ లాడెన్, వీరప్పన్ మహాత్ములైతే... మరి గాంధీజీ ఏంటి?’’ అని తనదైన శైలిలో ముత్తులక్ష్మి వ్యాఖ్యలకు రాంగోపాల్‌వర్మ స్పందించారు. -
మహాత్ముని స్ఫూర్తి
అహింసా పోరాటంతో జాతికి పథనిర్దేశం చేసిన మహాత్ముడు గాంధీజీ. శతాబ్దాల దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తం చేసిన స్వాతంత్య్ర సమర సేనాని ఆయన. ఆసేతు హిమాచలం యావత్ భారతదేశం ఆయనను జాతిపితగా ఆరాధించింది. ఆయన స్ఫూర్తి భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఖండాంతరాలను కదిలించిన ఆయన వ్యక్తిత్వం ఎందరెందరో మహనీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి కొందరు మహనీయులు చెప్పిన మాటలను మననం చేసుకుందాం. గాంధీజీ గురించి అభిప్రాయమా..? మంచిది. ఎవరినైనా హిమాలయాల గురించి అభిప్రాయం కోరండి. - జార్జి బెర్నార్డ్ షా, ఇంగ్లిష్ రచయిత ఇలాంటి ఒక మనిషి ఈ భూమ్మీద రక్తమాంసాలతో నడయాడాడని రానున్న తరాలు ఊహించనే ఊహించలేవు. - అల్బర్ట్ ఐన్‌స్టీన్, ‘నోబెల్’గ్రహీత, విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సామాజిక సమస్యలను హింసాత్మక పద్ధతులతో కాకుండా అహింసతో పరిష్కరించుకోవచ్చని ప్రపంచానికి నిరూపించిన మహాత్ముడు ఆయన. చరిత్రలో మరే నాయకుడూ సాధించని ఘనత ఇది. భారతదేశానికి ఆయన ప్రవక్త కంటే ఎక్కువే. ఆయన యుగపురుషుడు. - మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, అమెరికన్ నల్లజాతి హక్కుల నేత దిక్కులేని భారతీయులకు దిక్కుగా మారాడు. వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు.. వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు.. లక్షలాది భారతీయులను తన రక్తమాంసాలుగా మార్చుకున్నాడు.. సత్యాన్ని సత్యంతో నిద్రలేపాడు! - రవీంద్రనాథ్ టాగూర్, ‘నోబెల్’ గ్రహీత, కవీంద్రుడు అజ్ఞానం, వ్యాధులు, నిరుద్యోగం, పేదరికం, హింస అనే శత్రువులపైనే గాంధీజీ పోరాటం సాగించారు. జాతివివక్షపై పోరాటంలో ఆయన నేర్పిన పాఠాలే మాకు మార్గదర్శకాలు. - నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మహాత్మాగాంధీపై నాకు గొప్ప గౌరవాభిమానాలు ఉన్నాయి. మానవ స్వభావంపై గాఢమైన అవగాహన గల మహనీయుడు ఆయన. ఆయన జీవితం నన్నెంతగానో ప్రభావితం చేసింది. - దలైలామా, టిబెటన్ల మత గురువు -
విన్‌సల్ట్
అవమానం... దారుణాతి దారుణ మానసిక గాయం. ఎంతటి అరివీర భయంకరులకైనా, ఘన విజ్ఞాన సుసంపన్నులకైనా కాలం కలసిరాని సందర్భాలలో అవమానాలు అనివార్యంగా ఎదురవుతుంటాయి. కించపడ్డ వాళ్లు కొంచెమైపోరు గానీ, అవమానం ఎదురైనప్పుడు ఆ భారాన్ని భరించడం సాంత్వన వచనాలు పలికినంత తేలికేమీ కాదు. మానావమానాలకు ఒకేరీతిలో స్పందించే లక్షణాన్ని స్థితప్రజ్ఞ అంటారు. ఇలాంటి స్థితప్రజ్ఞత యోగిపుంగవులు ఏ కొందరికో తప్ప సామాన్య మానవులకు సాధ్యం కాదు. సమ్మానాలకు పొంగిపోవడం, అవమానాలకు కుంగిపోవడం మానవ సహజ లక్షణం. ఎంతటి వారికైనా జీవితమంతా రాజపూజ్యంగానే గడిచిపోదు. అప్పుడప్పుడు అనుకోని అవమానాలూ ఎదురవుతుంటాయి. తమకు ఎదురైన అవమానాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ప్రతిస్పందిస్తారు. కొందరు మౌనంగా తమలో తామే కుమిలిపోతూ, మానసికంగా కుంగిపోతారు. ఇంకొందరు తమను అవమానించిన వారిపై పగ పెంచుకుని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. చాలా కొద్దిమంది మాత్రమే అవమానాలను సవాలుగా స్వీకరించి, జీవితంలో తమను తాము నిరూపించుకుంటారు. చరిత్రలో ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటిలో మచ్చుకు కొన్ని... 1893 మే... దక్షిణాఫ్రికా ట్రైన్‌లోని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రిటోరియా వెళుతున్నారు గాంధీజీ. కాసేపటికి అదే బోగీలోకి ఎక్కిన ఒక తెల్లదొర గాంధీజీని చూసి అసహనంతో మొహం చిట్లించాడు. ‘ఛీ... నల్లవాడివి నువ్వు ఫస్ట్‌క్లాస్ బోగీలోకి ఎక్కడమేంటి? వెంటనే దిగేసి జనరల్ బోగీలోకి వెళ్లు’ అంటూ ఈసడించుకున్నాడు. ‘ఫస్ట్‌క్లాస్ టికెట్ కొన్నాకే ఈ బోగీలోకి ఎక్కాను. నేనెందుకు దిగాలి?’.. స్థిరంగా ప్రశ్నించారు గాంధీజీ. ‘మీలాంటి నల్లవాళ్లకు మా తెల్లదొరలతో కలసి ప్రయాణించే అర్హత లేదు... దిగు’ అంటూ గాంధీజీ లగేజీని విసిరేసి, ఆయననూ తోసేశాడు ఆ తెల్లదొర. ఒకవైపు అవమానభారం, మరోవైపు వణికించే చలి... రాత్రంతా అలానే గడిపారు గాంధీజీ. ఆ అవమానం ఆయనలో ఆలోచన రేపింది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం పోరాడేందుకు ప్రేరణనిచ్చింది. అదే స్ఫూర్తితో భారతదేశానికి తిరిగి వచ్చాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరశంఖాన్ని పూరించేలా చేసింది. జరిగిన అవమానానికి తనలో తానే కుమిలిపోయినా, లేకుంటే తనను ఫస్ట్‌క్లాస్ బోగీలోంచి తోసేసిన తెల్లదొరపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నా గాంధీజీ మహాత్ముడయ్యేవాడు కాదు. పీటర్మెరిట్స్బర్గ్ నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహమూ వెలిసేది కాదు. అవమానాన్ని సవాలుగా తీసుకుని, జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం వల్లనే ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నాం. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ నల్లవాళ్ల పట్ల జరుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా పోరాడాడు. చరిత్రలోని ఉదాహరణలు సరే, ఇటీవలి ఉదంతాలను పరిశీలిస్తే, శాంతా బయోటెక్ ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తుంది. 1990వ దశకం... జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా వరప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సదస్సులో వ్యాక్సిన్లకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. సదస్సుకు హాజరైన వారిలో ఒక జాత్యహంకారి ‘యూ ఇండియన్స్ ఆర్ ది బెగ్గర్స్... ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడమే మీకు తెలుసు’ అంటూ అవమానించాడు. వరప్రసాద్‌రెడ్డి దీనిని వ్యక్తిగత అవమానంగా భావించలేదు. తన దేశానికి, తన జాతికి జరిగిన అవమానంగా భావించారు. నిమ్మళంగా ఆత్మావలోకనం చేసుకున్నారు. ఈ అవమానానికి మాటలతో కాదు, చేతలతో బదులివ్వాలని కృతనిశ్చయానికి వచ్చారు. డబ్ల్యూహెచ్‌వోలో జరిగిన అవమానానికి సమాధానంగా శాంతా బయోటెక్‌ను స్థాపించారు. వ్యాక్సిన్ల తయారీలో తమదే రాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల సరసన భారత్‌ను సగర్వంగా నిలబెట్టారు. అవమానం పొందిన చోటే అతి తక్కువ ధరలకు వ్యాక్సిన్లను ఇతర దేశాలకూ సరఫరా చేసి, ‘డోనర్’గా ఘనత సాధించారు. అందుకే.. ‘అవమానాన్ని ఆత్మపరిశీలనకు సాధనంగా ఉపయోగించుకుంటే విజయం సాధించగలం. అయితే, ఎంతో పరిణతి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. విజయం నుంచి విజయానికి అవకాశాలు తక్కువ. అపజయం నుంచి విజయానికి ఉన్నవన్నీ అవకాశాలే. అందువల్ల అవమానం నుంచి గెలుపు సాధించాలంటే చాలా సంయమనం అవసరం’ అంటారాయన. పరాభవ పురాణం... పురాణాలలోనూ పరాభవాల ఉదంతాలు తక్కువేమీ కాదు. త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగానికొస్తే... నిండుసభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి దురహంకారం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. సినిమాలకు ముడిసరుకు... చాలా మాస్ మసాలా సినిమాలకు అవమానమే ముడి సరుకు. నిరుపేద హీరోను డబ్బున్న విలన్ అవమానిస్తాడు. కసితో రగిలిపోయిన హీరో, క్లైమాక్స్‌లో ఆ విలన్ భరతం పడతాడు. ఆత్మగౌరవానికి మారుపేరులాంటి హీరోయిన్ని విలన్ పరాభవిస్తాడు... తోకతొక్కిన తాచులా పగబట్టిన ఆమె విలన్ అంతు చూస్తుంది... ఒక్కోసారి సింగిల్‌గానే... కొన్నిసార్లు హీరో సహకారంతో... ఉదాహరణకు ‘ప్రతిఘటన’ సినిమాలో హీరోయిన్ను నడిబజారులో వలువలూడదీసి అవమానిస్తాడు విలన్. ఆమె తనలో తానే కుమిలిపోకుండా, నిండుసభలోనే విలన్‌ను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది. విజయ సోపానాలు అవమానాలను సహించడం కష్టమే అయినా, స్థిమితం కోల్పోకుండా స్పందిస్తే అవి మన పురోగతికి పనికొస్తాయి. మనలోని శక్తియుక్తులను వెలికితీసేవి, మన కర్తవ్యాన్ని గుర్తుచేసేవి, మనల్ని కార్యోన్ముఖులను చేసేవి చాలా సందర్భాల్లో అవమానాలే. అవమానాలను ఓటమిగా భావించి, కుంగిపోకుండా, సవాలుగా స్వీకరించి అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడితే, అవే మన విజయ సోపానాలవుతాయి. - సరస్వతి రమ -
ఆ ఇద్దరు బక్కోళ్ల కృషి వల్లే..!
- నాడు దేశానికి స్వాతంత్య్రం.. నేడు తెలంగాణ సాకారం: కవిత నారాయణపేట: నాడు బ్రిటిష్ పాలకుల పాలనను అంతమొందించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది బక్కాయనే (గాంధీజీ). అలాగే, ఆంధ్రపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బక్కాయనే (కేసీఆర్) అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ 14 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అటుకులు తింటూ, ఉద్యమాలు చేస్తూ.. పోరాటాలను కొనసాగించి యూపీఏ సర్కార్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. -
పట్టువిడుపుల్లేని ప్రవక్త
సంక్షిప్తంగా : బిపిన్ చంద్ర పాల్ (నేడు జయంతి) గాంధీజీతో విభేదించడం అన్న మాట వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించడంగా కాక, ఆ సిద్ధాంతాలలోని సామరస్యక సుతిమెత్తని లక్షణాన్ని అంగీకరించలేకపోవడంగా ఎవరైనా అర్థంచేసుకోవాలి. అలాగే ఆయనను విభేదించిన వారిలోని స్వతంత్రభావాలను తొందరపడి ‘అతివాదం’ అనే వర్గీకరణలోకి చేర్చేముందు అది పూర్తిస్థాయి అతివాదమా లేక ఉమ్మడి లక్ష్యం వైపు సాగుతున్న వైయక్తిక మార్గమా అని జాగ్రత్తగా ఆలోచించాలి. బిపిన్ చంద్ర పాల్ గాంధీజీతో విభేదించారు. గాంధీజీకి దూరం అయిన కొద్దిమంది ముక్కుసూటి ఉక్కుమనుషుల్లో పాల్ కూడా ఒకరు. విమర్శించవలసిన సందర్భంలో మృదువుగా మాట్లాడడం లేదా మౌనం వహించడం ఉద్యమస్ఫూర్తిగా విఘాతంగా పరిణమిస్తుందని పాల్ నమ్మారు. అయితే ఆయన సాగించిన జాతీయోద్యమ పోరాటం గాంధీజీ లక్ష్యాలకు భిన్నమైనది మాత్రం కాదు. ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు. అందుకే ఆయన ‘ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్ భాగస్వామ్యం నిక్కచ్చిగా ఉండేది. సుప్రసిద్ధ తాత్విక చింతనాపరుడు శ్రీ అరబిందో ఆయన్ని మహాశక్తివంతులైన జాతీయవాద ప్రవక్తలలో ఒకరిగా అభివర్ణించారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో 1905 నుండి 1918 వరకు బ్రిటిష్ ఇండియాలో జాతీయవాద త్రయంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన లాల్ బాల్ పాల్ లలో ఒకరే బిపిన్ చంద్ర పాల్. ఆయన స్థాపించిన జాతీయోద్యమ ఆంగ్ల వార్తాపత్రిక ‘బందే మాతరం’ ఆయన్ని ఆర్నెల్ల పాటు జైల్లో ఉంచింది. అందులో అరబిందో రాసిన ఒక వ్యాసానికి సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందుకు బ్రిటిష్ పాలకులు పాల్‌కు విధించిన శిక్ష అది. బిపిన్ చంద్ర పాల్ 1858 నవంబర్ 7న హబీగంజ్‌లోని (ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ప్రాంతం) సంపన్న హిందూ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. కలకత్తాలోని చర్చి మిషన్ సొసైటీ కాలేజీలో చదివారు. అక్కడే కొన్నాళ్లు అధ్యాపకునిగా పనిచేశారు. రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’లో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఒక వితంతువును వివాహమాడారు. ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్ పాల్ ఈయన కుమారుడే. -
ఆ దేవుడు కోరుకునేదీ అదేనని నా నమ్మకం!
మండలి బుద్ధప్రసాద్... మానవతామూర్తి, స్నేహశీలి, అజాతశత్రువు, నిరాడంబరతకు ప్రతిరూపం... ఒక వ్యక్తిలో ఇన్ని విశేషాలు రూపుదిద్దుకోవడానికి కారణం? ‘గాంధీజీని పలుమార్లు చదవడమే’ అంటారాయన! గాంధీజీని చదివి, ‘గాంధీక్షేత్రం’ పత్రిక నడిపిన అనుభవంతో గాంధేయవాదిగా మారిన ఆయన మనోగత వీక్షణం ‘సాక్షి’ పాఠకుల కోసం... అంతర్వీక్షణం: మండలి బుద్ధప్రసాద్ ♦ నిరాడంబరతకు స్ఫూర్తి... మొదట గాంధీజీ, తర్వాత మా నాన్న వెంకట కృష్ణారావు. నిరాడంబరత మనిషిని అవినీతికి దూరంగా ఉంచుతుంది. ఆర్థిక స్థాయికి మించిన జీవనశైలికి అలవాటు పడినప్పుడు అవినీతికి పాల్పడడమే సులువైన మార్గంగా అనిపిస్తుంది. ♦ ఆడంబరంగా జరిగే వేడుకలకు హాజరవుతున్నప్పుడు... అక్కడి దుబారా చూస్తే బాధేస్తుంది. ఒక పెళ్లిలో అయ్యే వృథా ఖర్చుతో ఎంతోమందిని చదివించవచ్చు. ♦ విమర్శలను తీసుకొనే విషయంలో... సద్విమర్శను స్వీకరిస్తాను. ఆరోపణ కోసమే విమర్శిస్తే బాధేస్తుంది. ♦ మీలో మీకు నచ్చే లక్షణం... నేను ఎవరినీ విమర్శించను. ఎప్పుడైనా అంశాన్ని, సిద్ధాంతపరంగా విమర్శిస్తాను తప్ప వ్యక్తితో విభేదించను. అయితే అది నచ్చే లక్షణం అని చెప్పలేను. అది నా అలవాటు! ♦ ఎదుటి వ్యక్తిని చూసే కోణం... రాజకీయాల్లో చాలామంది పరిచయమవుతుంటారు. ఎవరినీ సునిశితంగా పరిశీలించను. అందరినీ నమ్మాలనే తత్వం నాది. అలాగే నమ్ముతాను కూడా. ♦ దూరంగా ఉండాలనుకొనే వ్యక్తులు... పితూరీలు చెప్పేవారంటే నాకిష్టం ఉండదు. నాకు కోపం వచ్చేది కూడా అప్పుడే. నా ప్రత్యర్థి గురించి పితూరీలు మోసుకొచ్చినా సరే... సమర్థించను. ♦ తప్పనిసరిగా పాటించే సిద్ధాంతం... స్వదేశీ వస్తువులను మాత్రమే వాడటాన్ని చాలాకాలం పాటించాను. ఇప్పుడు విదేశీ కంపెనీల ఉత్పత్తులను వాడక తప్పడం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి మాత్రం వెళ్లను. ♦ పూలదండలు వేయించుకున్నప్పుడు కలిగే భావన... ఆ డబ్బుతో ఏదైనా పుస్తకాన్ని కొని బహూకరించమని చాలాసార్లు చెప్పి చూశాను. చివరికి పుస్తకావిష్కరణ సభల్లో కూడా పూలదండలు వేస్తుంటారు. ♦ మీ బలం, బలహీనత? బలం ఏమిటో తెలియదు, బలహీనత మాత్రం క్షణికావేశంతో కేకలెయ్యడం. ♦ దేవుణ్ణి కోరుకునేది... మంచిబుద్ధిని ప్రసాదించమని కోరుకుంటా. సాటి మనిషికి సేవ చేస్తే దేవుడు మెచ్చు కుంటాడు. ఆ దేవుడు కోరుకునేదీ అదేననీ, కేవలం పూజలు చేసి, మొక్కడాన్ని ఇష్టపడడనీ నా నమ్మకం. ♦ కృష్ణాజిల్లా పులిగడ్డ - గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం అత్యంత సంతోషాన్నిచ్చింది. అది మా నాన్న కోరిక. చనిపోయే ముందు కూడా దాని గురించే అడిగారు. ఆ వంతెన కోసం చివరకు పెద్దయెత్తున ప్రజాపోరాటం చేయాల్సి వచ్చింది. ♦ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించినట్లే అనిపిస్తోంది! ఆ పేరు వెనక ఉన్న కథ... నేను 1956 మే 26వ తేదీన పుట్టాను. బుద్ధజయంతి సందర్భంగా పుట్టానని ఆ పేరు పెట్టారు. ♦ బుద్ధుడు, బౌద్ధం పట్ల అభిప్రాయం... బౌద్ధధర్మం చాలా ఇష్టం. దలైలామాను కలిశాను కూడా. ♦ ఇష్టమైన వ్యక్తులు... మదర్ థెరిస్సా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ). వీరినీ కలిశాను. ♦ తెలుగు భాష కోసం ఉద్యమించారు. తెలుగు గురించి ఉన్న కోరికలు... తెలుగుకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావాలి. ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించాను. మన తెలుగు ఫాంట్స్‌ని తీసుకుని, ఆంగ్లంలో ఉన్న విషయం తెలుగులోకి అనువాదం చేయడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ♦ ఆచరణలో గాంధేయవాదం... ఒకప్పుడు పూర్తిగా ఆచరించేవాడిని. మద్యం సేవించే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఇప్పుడు సమాజంలో ఎక్కువ శాతం వారే. మాట్లాడకపోతే కుదరదు. దాంతో గాంధీజీని తరచూ ప్రస్తావించే అలవాటును తగ్గించుకున్నాను. ♦ అత్యంత బాధ కలిగిన సందర్భం... తెలుగు జాతి రెండుగా విడిపోవడం. రాష్ట్రాలు రెండైనా తెలుగు వాళ్లంతా మానసికంగా కలిసి ఉండాలని, సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న జాతిగా నిలవాలనేది నా కోరిక. ♦ ప్రజాస్వామ్య భారతంలో గమనించిన మార్పు! సామాన్యులు చట్టం చేసే అవకాశానికి దూరమవుతున్నారు. సామాన్య ఉపాధ్యాయుడైన మా నాన్న మంత్రయ్యారు. ఇప్పుడలా లేదు. దురదృష్టం ఏంటంటే... ప్రజలు కూడా ధనవంతుడు పోటీలో ఉంటే బావుణ్ణనుకుంటున్నారు. ఇక సేవ చేస్తానని ముందుకు వచ్చే వారిని ఆదరించేదెవరు?! - వాకా మంజులారెడ్డి -
డాటర్ ఆఫ్ కైలాష్ సత్యార్థి
కైలాష్ సత్యార్థిని నోబెల్ శాంతి బహుమతి వరించడం... యావత్ భారతదేశానికి సంతోషకరమైన విషయం. ఆయనతో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేని వారికి కూడా, ఆయన సేవాకార్యక్రమాలను గురించి, ఆయన సామాజిక నిబద్ధత గురించి వివరంగా తెలుసు. అలాంటి వారందరికీ నోబెల్ వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి కైలాష్ సత్యార్థి కూతురు అస్మిత పరిస్థితి ఏమిటి? నాన్నకు నోబెల్ బహుమతి ప్రకటించారు... అనే శుభవార్త తెలియగానే ఆమె ఎలా స్పందించారు? ‘‘ఆ వార్త తెలియగానే ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆయన చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ పెరిగాను. వాటిలో భాగం పంచుకున్నాను’’ అన్నారు అస్మిత. నాన్నతో సంతోషం పంచుకోవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు అస్మిత. తాను ఊహించినట్లుగా... ఏమీ కనిపించలేదు ఆయన. ఎప్పటిలాగే ఉన్నారు. ‘‘నాకంటే ముందు గాంధీజీకి రావాల్సింది’’ అన్నారు ఆయన, నోబెల్ బహుమతిని ప్రస్తావిస్తూ. గాంధేయవాది అయిన కైలాష్ మాటల్లో ఎక్కడా గర్వపు నీడ కనిపించలేదు. ఆ కళ్లు ఎప్పటిలాగే ‘‘చేయాల్సింది చాలా ఉంది’’ అని చెబుతున్నట్లుగానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బి) స్టూడెంట్ అయిన అస్మిత సత్యార్థి సామాజిక మార్పులో వ్యాపారం ఎంత కీలకమో చెబుతారు. నాన్న తన రోల్‌మోడల్. ఆయన ఆదర్శ భావాలతో లోతుగా ప్రభావితమయ్యారు అస్మిత. ‘‘ఎన్నో కార్యక్రమాలలో నాన్న చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రభావం సహజంగానే నా మీద ఉంది’’ అంటారు అస్మిత. ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేసినా అస్మిత మంచి కథక్ నృత్యకారిణి కూడా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నృత్యప్రదర్శన ఇచ్చారు. విశేషమేమిటంటే, పది సంవత్సరాల వయసులోనే ‘యుఎస్ కాంగ్రెస్’లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది అస్మిత. మళ్లీ నోబెల్ దగ్గరికి వద్దాం... నోబెల్ శాంతి బహుమతితో కైలాష్ సత్యార్థి బాధ్యత రెట్టింపు అయింది అనేదానితో అస్మిత ఏకీభవిస్తున్నారు. ‘‘నాన్న చేస్తున్న పనులను చూసి గర్వించడమే కాదు... ఆయన అడుగు జాడల్లో నడవడం కూడా ఇప్పుడు నా భుజస్కంధాలపై ఉన్న బాధ్యత’’ అంటున్నారు అస్మిత. లైక్ ఫాదర్ లైక్ డాటర్! -
జయకేమో పదివేల చీరలు, మరీ గాంధీజీకి...
హైదరాబాద్ : నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన మనసులో ఉన్న అనుమానాలను మరోసారి ట్విట్టర్లో పెట్టారు. గాంధీజీ బతికి ఉంటే ఎవరిని సపోర్ట్ చేసేవారు. అలా అయితే నరేంద్ర మోడీ గెలిచేవాడా, గాంధీజీ ఏమో తక్కువ బట్టలు ధరిస్తే...జయలలితకేమో పదివేల చీరలా అంటూ ఆయన ట్విట్ చేశారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్విట్స్ కొన్ని..... * నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడా? దేశం గాంధీజీకి స్వాతంత్ర్యం ఇచ్చిందా? * ఇద్దరు నేతల గురించి కంపేర్ చేసుకుంటే.... గాంధీజీకి ఆల్మోస్ట్ నో క్లోత్స్... అదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మాత్రం పదివేల చీరలు. * ఒకవేళ గాంధీజీ గనుక బతికుంటే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ తరపునా లేక బీజేపీ తరపున? * గాంధీజీ కనుక సోనియా గాంధీ, లేదా రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసివుంటే నరేంద్ర మోడీ గెలిచేవారా? * గాంధీజీ ఆశయాలను పదిమంది నాయకులు అయినా అనుసరించి ఉంటే దేశం అభివృద్ధిలో ఎక్కడో ఉండేది. -
తరమెళ్లిపోయింది
గాంధీజీ హత్య జరిగినప్పుడు దేశమంతా కుప్పకూలి ఏడుస్తోంది. కాని చాలా నగరాల్లో పట్టణాల్లో కొన్ని గుంపులు లడ్డూలు పంచుకుని పండగ చేసుకున్నాయి. అలాంటి పట్నాల్లో విజయవాడ ఒకటి. అప్పుడో యువ హీరో పాతికమందినేసుకుని కర్రసాము చేస్తూ లడ్డూల్నీ మనుషుల్నీ చచ్చేట్టు కొట్టి కకావికలై పరుగులు పెట్టేట్టు చేశాడనీ పేరు చండ్ర రాజేశ్వరరావనీ చిన్నప్పుడు విన్నప్పుడు ఎవరీ రాబిన్‌హుడ్ బతుకులో ఎప్పుడేనా ఎక్కడేనా చూడగలమా అనిపించేది. తర్వాత సభల్లో ప్రదర్శనల్లో ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్టూ కమ్ రాకెట్టుని దూరంగా ఆరాధనతో చూశాం. 1970 నుంచి మూడు దశాబ్దాలు ఆయన చంకలో బిడ్డల్లా తిరిగాం. ఆయన అచ్చు రైతులా విరగబడి అమాయకంగా నవ్వడం, తీక్షణమైన చూపుల్తో ఆగ్రహించడం, పార్టీకి కష్టమొచ్చినపుడు గ్రేట్వాల్లా చేతులు చాచి అడ్డం పడటం అన్నిటికీ సాక్షులం. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా జీవిత కథ వచ్చింది. ఆయన స్వగ్రామం మంగళాపురానికి చెందిన డాక్టర్ పూర్ణచంద్రరావు రాశారు. ఆ గ్రామానికి చండ్ర రాజేశ్వరరావు పూర్వీకులు రావడం దగ్గర నుండి విలువైన వివరాలున్నాయి. విద్యార్థి గాయకుడిగా, పార్టీ నిర్మాతగా, రాష్ట్రం నుండి జాతీయ అంతర్జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరును చారిత్రక నేపథ్యంతో చూపడం రచయిత చేసిన గొప్ప కృషి. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన సంవత్సరంలో పుట్టిన ఆయన రష్యాలో అక్టోబర్ విప్లవంతో స్ఫూర్తిపొంది, భారత స్వాతంత్ర పోరాటంలో దూకి, తర్వాత పార్టీని స్థాపించి విస్తరించిన తీరును వరుసగా చెప్తుందీ పుస్తకం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో గెరిల్లా యుద్ధ శిక్షణలో ఆయన పాత్ర వివరంగా ఉంది. మాస్కో వెళ్లి స్టాలిన్‌ని కలిసి వచ్చాక ఆయన చావుకి ఎదురెళ్లి అడవుల్లో గెరిల్లాలను కలిసే దృశ్యాలు ఇన్స్పైరింగ్గా ఉంటాయి. రెండవ భాగమంతా ఆయన పర్యటనలూ ప్రసంగాలూ ప్రకటనలతో నింపడం వల్ల వ్యక్తిగా ఆయనకు సంబంధించి హ్యూమన్ యాంగిల్ మరింతగా తెలిసే అవకాశం తగ్గింది. చరిత్రలో పుట్టి పెరిగి చరిత్ర సృష్టించిన నిండు మనిషి గాథ ఇది. చివరికి పుస్తకాలూ రెండు మూడు జతల పంచెలూ లాల్చీలు తప్ప పైసా మిగుల్చుకోకుండా చనిపోయిన చండ్ర గురించి చదువుతుంటే ఆదర్శం, త్యాగాల తరం అంతరించిందా అనిపిస్తుంది. కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు- రచన: కిలారు పూర్ణ చంద్రరావు వెల: రూ.350 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు - మోహన్ గమనిక: మీ రచనలు, సమీక్ష కొరకు రెండు కాపీలు, ఈ పేజీపై అభిప్రాయాలు అందవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. -
పండిట్, పటేల్ వేర్వేరు
భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేం ద్ర మోడీ ఇటీవల ఒక వివా దాన్ని రెచ్చగొట్టాడు. నెహ్రూ (నవంబర్ 14, 1889- మే 27, 1964) కాకుండా సర్దార్ వల్ల భాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875- డిసెంబర్ 15, 1950) మన మొదటి ప్రధాని అయి ఉంటే దేశం నేడు ఇలా ఉండేది కాదు, అద్భుతంగా ఉండేదన్నాడు. అద్భుతం కాదు, అల్ల కల్లోలంగా ఉండేదేమోనన్నది సెక్యులరిస్టుల అభిప్రా యం. 2014 ఎన్నికల్లో నెగ్గి, మోడీని ఢిల్లీ పీఠం ఎక్కించా లన్నది బీజేపీ వ్యూహం. అదే జరిగితే అంతకంటే దౌర్భా గ్యం మరొకటి ఉండదు. భారతీయులు గాంధీజీని జాతిపితగాను, నెహ్రూజీని నవభారత నిర్మాతగానూ చూస్తారు. గాంధీ, నెహ్రూలు లేని భారత్‌ను ఊహించుకోలేం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి ‘క్విట్’ చేయించిన ఘనత గాంధీజీకి దక్కింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఒక ఉజ్వలమైన పాత్ర పోషించారు. నెహ్రూ లౌకిక, ప్రజాస్వా మ్య భావనకు ప్రతీకగా నిలిచాడు. బూర్జువా రాజ్యాంగమే అయినా అది చారిత్రకంగా ఒక గొప్ప ముందడుగుగా, ఒక మంచి రాజ్యాంగాన్ని రచింపజేశాడు. కాంగ్రెసేతర మేథోసంపన్నులను అనేక మందిని రాజ్యాంగ రచనలో భాగస్వాములను చేశాడు. భారతదేశంలో గొప్ప మేధావి, దళిత వర్గానికి చెందిన అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి సారథిని చేశాడు. హిందూ మహాసభ అధ్య క్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీని కూడా ఈ రచనా వ్యాసంగం లో భాగస్వామిని చేశాడు. 1948లో గాంధీజీ హత్యానం తరం హిందూ మతోన్మాదాన్ని నిరసిస్తూ శ్యాంప్రసాద్ హిందూ మహాసభకు రాజీనామా చేశాడు. ఆరోగ్యకర స్పర్థ నెహ్రూ కూడా గాంధీజీతో విభేదించాడు. 1922లో చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణో ద్యమాన్ని ఆపేశాడు. దీనితో ఖిన్నులైన మోతీలాల్ లాంటి నేతలెందరో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి స్వరాజ్య పార్టీని స్థాపించుకున్నారు. గాంధీజీ నిర్ణయంతో విభేదించినప్ప టికీ నెహ్రూ గాంధీజీని అంటి పెట్టుకునే ఉన్నారు. కాం గ్రెస్ అధ్యక్ష స్థానానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య, సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన పోటీ జరిగినప్పుడు గాంధీజీ సీతారామయ్యకు మద్దతివ్వగా, నెహ్రూ బోసుకు మద్దతిచ్చాడు. సీతారామయ్య ఓటమితో ఖంగుతిన్న గాం ధీజీ బోసు ఏర్పరచిన వర్కింగ్ కమిటీని బహిష్కరిం చాడు. ఈ ఉదంతంలో గాంధీజీతో నెహ్రూ విభేదించాడు. బోసు కాంగ్రెస్‌ను వీడి ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించగా, నెహ్రూ కాంగ్రెస్‌లోనే కొనసాగాడు. గాంధీజీ కాంగ్రెస్ లోని మితవాద నాయకుల పట్ల అభిమానం ప్రకటిస్తే, కాంగ్రెస్‌లోని అతివాదులు, బయట ఉన్న అతివాదులు నెహ్రూ పట్ల గౌరవం ప్రకటించారు. భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వం ద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు. నెహ్రూ గొప్ప దార్శనికుడు. గొప్ప భావుకుడు. సోవియెట్ అభిమాని. ప్రపంచంలో, ముఖ్యంగా ఆఫ్రికాలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు నెహ్రూయే మద్ద తు ప్రకటించాడు. పీఎల్‌ఓను గుర్తించి ఆదరించాడు. సూయజ్ కాలువను జాతీయం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు నాజర్‌కు మద్దతు పలికాడు. స్పెయిన్ రిపబ్లికన్ పార్టీ పట్ల సౌహార్ద్రతను ప్రకటించడమే కాకుండా, అంతర్యుద్ధం కొనసాగుతూ ఉండగా స్పెయిన్ సిటీ బార్సిలోనా కెళ్లి రిప బ్లికన్ల మధ్య నిలిచాడు. తన భార్య కమల జబ్బు పడి స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు నెహ్రూ వెళ్లారు. ఇటలీ ఫాసిస్టు నియంత ముస్సోలినీ ఆహ్వానించినా నెహ్రూ తిరస్కరిం చాడు. సామ్రాజ్య కూటమి ఆటలు సాగకుండా అలీన విధానాన్ని రూపొందించడంలో మేటి పాత్ర వహించాడు. నవభారత నిర్మాత భారత పునర్నిర్మాణంలో నెహ్రూ కీలకపాత్ర పోషించాడు. సోవియెట్ అండతో, సోవియెట్ అనుభవంతో పారిశ్రామి కాభివృద్ధికి కీలకమైన భారీ పరిశ్రమల స్థాపనకు పూనుకు న్నాడు. వ్యవసాయరంగ ఉద్దీపనగా కీలకమైన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల స్థాపనకు పూనుకొని ప్రాజెక్టులే ఆధు నిక దేవాలయాలన్న భావనకు శ్రీకారం చుట్టారు. భారతీ యుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అనేక సంస్థలను నెహ్రూ స్థాపించాడు. నెహ్రూకు బదులు పటేలు ప్రధాని అయి ఉంటే మన దేశం కూడా పాకి స్థాన్ లాగా హిందూత్వ దేశంగా పతనమై ఉండేది. నాడు ముస్లింలీగ్ మతతత్వ పార్టీ కాగా, నేడు బీజేపీ మతతత్వ పార్టీగా ఉంది. సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమై భారత్ ఒక బలమైన దేశంగా రూపొందించడంలో పటేల్ పాత్రను విస్మరించలేం. కానీ నెహ్రూ తోడ్పాటుతోనే ఇదంతా జరిగింది. నైజాం నవా బును లొంగదీసు కోవడానికి జరిగిన పోలీసు చర్య మంచిదే గానీ, ఆ తర్వా త కమ్యూనిస్టులపై సాగించిన మారణకాండకు పటేలే బాధ్యుడన్న వాస్తవాన్ని విస్మరించలేం. ఈ సంస్థానాధీశుడు ముస్లిం కావటంవల్ల బీజేపీ సైనిక చర్యను బలపరుస్తున్నదేగానీ, సంస్థానాధీశుడు హిందువు అయినట్లయితే బీజేపీ వైఖరి ఇలా ఉండేదా? సెక్యులర్ జాతీయవాది అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర రెండవ కూర్పులో కొన్ని నగ్నసత్యాలను బయటపెట్టాడు. గాంధీ జీ చేపట్టిన చరిత్రాత్మక నిరాహారదీక్ష తర్వాత జనవరి 20వ తేదీన బిర్లా భవనం నుంచి సాయంకాలపు ప్రార్ధనా స్థలానికి గాంధీజీని మోసుకెళ్లారు. 79 ఏళ్ల గాంధీజీ ఈ దీక్షతో అంతగా బలహీనపడ్డాడు. ప్రార్థనా స్థలానికి కొంత దూరంలో ఒక బాంబుపేలింది. అది వేసిన వాడు పం జాబ్ కాందిశీకుడు మదన్‌లాల్. అతడు దొరికిపోయాడు. గాంధీజీని హత్య చేయాలన్న పెద్ద కుట్రలో భాగంగా ఇది జరిగింది. హోంమంత్రిగా ఉన్న పటేల్ కుట్రను దర్యాప్తు చేసి ఉంటే ఆ తర్వాత పదిరోజులకు గాంధీజీ హత్య జరి గేది కాదని ఆజాద్ రాశాడు. 1937లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ ఏడు రాష్ట్రాల్లో గెలిచి మంత్రి వర్గాలను స్థాపించింది. ఆ వరసలో బొంబాయిలో కాంగ్రెస్ గెలిస్తే, ముఖ్య మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న సమస్య వస్తే అందుకు తగిన వ్యక్తి నారి మన్‌గా ఆజాద్ భావించారు. కానీ పటేల్ జోక్యంతో బీజే ఖేర్‌ను ముఖ్య మంత్రిగా చేశారు. నారిమన్ పార్సీ కాబట్టి అతన్ని తోసిపుచ్చి హిందువైన ఖేర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో పటేల్ పక్షపాతాన్ని చూపించాడని ఆజాద్ ఆరోపణ. ఒకటి నిజం. దేశాభిమానంలో నాటి మన పార్టీలు వేటికీ తీసిపోవు. కానీ నెహ్రూకు బదులు పటేల్ ప్రధాని అయి ఉన్నట్లయితే సెక్యులరిజం మను గడ వేరుగా ఉండేది. చరిత్ర తెలియకనే... నెహ్రూ సెక్యులరిస్టు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాది మాత్రమే కాదు, భారతదేశంలో సోషలిజాన్ని కాంక్షించాడు. నెహ్రూ జాతీయ చరిత్ర మాత్రమే కాదు. ప్రపంచ చరిత్ర కూడా రాశాడు. చరిత్ర చీకటి కోణాలను అర్ధం చేసు కోవడానికి మార్క్సిజం ఇచ్చిన వెలుగు తనకు తోడ్పడిందని నెహ్రూ రాసుకు న్నాడు. పుట్టి పెరిగిన వాతావరణం వల్ల తాము నిఖార్సయిన సోషలిస్టులం కాలేకపోయానని తన పరిమితుల్ని అంగీకరించాడు. సోవియెట్ ప్రయోగం విఫలమైనా, సోషలిజందే అంతిమ విజయమని రాశాడు. తన గ్రంథం ముగిం పులో లెనిన్‌ను ఉటం కించాడు. ఎన్ని ఉన్నా నెహ్రూను పటేల్‌తో పోల్చడం అవి వేకం. నెహ్రూ, పటేళ్ల మధ్య హస్తి మశకమంత తేడా ఉంది. ఆధునిక భారతదేశ చరిత్ర తెలియని అజ్ఞానులు మాత్రమే ఆ ఇద్దరి మధ్య పోలిక తెస్తారు. వీరు చరిత్రను అధ్యయనం చేయడం తక్షణావసరం. - ఎన్.శివరామిరెడ్డి మాజీ శాసన సభ్యులు -
న్యూ రిలీజెస్: గాంధీ మునుపటి జీవితం
Gandhi Before India తెల్లవాళ్లను తరిమికొట్టడానికి గాంధీజీ సాగించిన సుదీర్ఘపోరాటం గురించి వేలకొద్దీ పుటలూ వందలకొద్దీ పుస్తకాలూ దొరుకుతాయి. లోగుట్టూ, దాపరికమూ లేని ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన సిద్ధాంతంతో విభేదించినవారు ఉన్నారుగాని ఆయన జీవన ధోరణిని ఆయన సచ్చీలతనీ వేలెత్తి చూపడానికి సాహసించరు. అయితే రవి అస్తమించని ఒక సామ్రాజ్యాన్ని ఉత్త చేతులతో పెళ్లగించాలనే గాంధీజీ సంకల్పానికి మూలమెక్కడ? అది ఎక్కడ రూపం దిద్దుకుంది? ఆ దృష్టి, ఉక్కు మనస్తత్వం ఎక్కడ అబ్బాయి? అవన్నీ లండన్‌లో చదువుకున్నప్పుడు, రెండు దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికాలో బారిస్టర్‌గా ఉన్నప్పుడు గాంధీజీ అలవర్చుకున్నారని అంటారు రామచంద్రగుహ. మేధావిగా, భిన్నమైన ఆలోచనాపరుడిగా గుర్తింపు పొందిన రామచంద్రగుహ అనేక పాత డాక్యుమెంట్లు, విదేశాల్లో లభిస్తున్న లేఖలు ఆధారంగా ‘గాంధీ బిఫోర్ ఇండియా’ పేరుతో గాంధీజీ బయోగ్రఫీ రాశారు. గాంధీజీ లండన్, దక్షిణాఫ్రికాలో ఉండటం వల్లే ఆయనకు సామ్రాజ్యవాదం, జాత్యహంకారంల విశ్వరూపం అర్థైమైంది. ఈ రెంటి శృంఖలాలతో బందీ అయిన భారతదేశాన్ని ఎలాగైనా చెర నుంచి విముక్తి చేయాలని ఇక్కడకు వచ్చే సమయానికి దృఢ సంకల్పంతో ఉన్నారని రచయిత అభిప్రాయ పడతారు. కొత్తతరాలు గాంధీని ఆచరించాలని కోరుకోవడం అత్యాశ. దేశం బాగు కోసం ఆలోచిస్తారా? అనేది అనుమానమే. కాని తమ సంస్కారాన్ని కాస్తయినా సరిదిద్దుకోవడానికి ఇలాంటి రచనలే కదా దిక్కు. పెంగ్విన్ ప్రచురణ; 688 పేజీలు; వెల: రూ. 899 సాహిత్య డైరీ... దాశరథి కవితా సమాలోచన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలంగాణ వారసత్వాన్ని శ్లాఘించిన మహాకవి దాశరథి కవితా సమాలోచన నవంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్ తెలుగు యూని వర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. కవులు, రచయితలు, విమర్శకులు ఎందరో పాల్గొని దాశరథి కవితా విశిష్టత గురించి పత్రాలు సమర్పిస్తారు. అందరికీ ఇదే ఆహ్వానం. వివరాలకు జలంధర్ రెడ్డి: 98482 92715 సాహిత్యం పేజీకి రచనలు అందవలసిన చిరునామా ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, సాక్షి టవర్స్, హైదరాబాద్- 500034 -
మహనీయుల ఆశయసాధనకు కృషి
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగంచేసిన మహనీయుల ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ.. అన్ని మతాలప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి ప్రశాంత జీవనం గడుపుతున్నారని అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు నేటికీ అన్నివర్గాల ప్రజలకు సమానంగా దక్కడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోని పేదప్రజల అభ్యున్నతికి పాలకవర్గాలు నిజాయితీగా పనిచేయాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఇందిరమ్మ పథకం పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తుచేశారు. అన్ని రంగాలకు ఆర్థిక వనరులు కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారని కొనియాడారు. పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించి వాటిని బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ, యువజన విభాగాల జిల్లా కన్వీనర్లు సయ్యద్ సిరాజుద్దీన్, ఆర్.రవిప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భీమయ్యగౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు పులిజాల రవికిరణ్, నాయకులు హైదర్ అలీ, రాశెద్‌ఖాన్, సర్దార్, ముజాహిద్, అనంతయ్య, నాగరాజు, ఆర్టీసీ జహంగీర్, యూసుఫ్ ఖలీల్, బోయపల్లి జహంగీర్ హుస్సేన్, అంజాద్, ప్రదీప్, కురుమూర్తి, సతీష్‌గౌడ్, ప్రవీణ్, రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.