మరపురాని బాపు గురుతులు | gandhi birth anniversary today | Sakshi
Sakshi News home page

మరపురాని బాపు గురుతులు

Oct 1 2016 10:12 PM | Updated on Sep 4 2017 3:48 PM

మరపురాని బాపు గురుతులు

మరపురాని బాపు గురుతులు

అహింస, శాంతి, సత్యాలకు ప్రతిరూపం మహాత్మాగాంధీ. గాంధీ స్ఫూర్తితో ఎంతో మంది జిల్లావాసులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు.

సందర్భం : నేడు గాంధీ జయంతి
అనంతపురం కల్చరల్‌ : అహింస, శాంతి, సత్యాలకు ప్రతిరూపం మహాత్మాగాంధీ. గాంధీ స్ఫూర్తితో ఎంతో మంది జిల్లావాసులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారతమాతను దాస్యశంఖలాల నుంచి విముక్తి చేయడానికి గాంధీ దేశమంతటా పర్యటిస్తూ అనంతపురం జిల్లాకు వచ్చారు. కల్లూరు సుబ్బారావులాంటి వ్యక్తుల సహకారంతో హిందూపురం, గుత్తి, తాడిపత్రి, పెద్దవడుగూరు లాంటి ప్రాంతాలు సందర్శించారు. మహాత్ముడి వెంట నడిచిన ఎంతోమంది జిల్లావాసులు నేటికీ ఆయన ఆశయాలు పాటిస్తున్నారు. నాటి గురుతులను ఇప్పటికీ మరువలేకపోతున్నారు.

గాంధీజీ అంటే మా తండ్రికి ప్రాణం
మేము చిన్నగా ఉన్నప్పుడు గాంధీజీ జిల్లాకు వచ్చారు. మా నాన్న మేడా రామయ్య, చిన్నాన్న మేడా సుబ్బయ్య మహాత్మాగాంధీకి జిల్లాలో తోడుగా ఉన్నారు. గాంధీజీ ఆశయాలంటే వారికి పంచ ప్రాణాలుగా ఉండేవి. నేను గుంటూరులో చదువుకునే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మా సహచరుడుగా ఉండేవాడు. గాంధేయవాదాన్ని అతిగా ఇష్టపడే రోశయ్య ప్రభావం మాపై చాలా ఉంది. ఇప్పటికీ గాంధీజీ జయంతి, వర్ధంతులను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నాం.
 – మేడా సుబ్రమణ్యం, ఇన్‌కమ్‌టాక్స్‌ కన్సల్టెంట్, అనంతపురం
 
గాంధీకట్టకు మహర్దశ!
తాడిపత్రి టౌన్‌ : స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు మహత్మగాంధీకి తాడిపత్రి పట్టణంతో విడదీయలేని అనుబంధం ఉంది. 1942లో సత్యాగ్రహ ఉద్యమం బలోపేతం చేసేందుకు గాంధీ  తాడిపత్రికి రైలులో వచ్చారు. పట్టణంలోని మెయిన్‌ బజారు, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.  ఆయనకు గుర్తుగా కట్టను నిర్మించారు. ప్రస్తుతం ఆ కట్ట గాంధీకట్టగా పిలవబడుతోంది. మునిసిపల్‌ అధికారులు గాంధీ కట్ట వద్ద పార్కు ఏర్పాటు చేసి  పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
–––––––––––––––––
అడిగుప్ప.. శాంతి బాట!
గుమ్మఘట్ట : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాలు కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలంలోని అడిగుప్ప గ్రామస్తులు. దశాబ్దకాలంగా ఈ గ్రామంలో ఎవరూ మద్యం జోలికి వెళ్లడం లేదు. ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ అందరూ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తున్నారు. నిరక్షరాస్యత అధికంగానే ఉన్నా, తరతరాలుగా ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లను ఆచరిస్తూ హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో పయనిస్తున్నారు. పూర్వం ఇతర ప్రాంతాలకు చెందిన వారు గ్రామస్తులకు మధ్యం, కోడి మాంసం ఎరగాచూపి లోబరుచుకునేందుకు యత్నించగా, స్థానికంగా ఉన్న పాళేగాడు మద్యం ముట్టకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు గురికాకూడదని అప్పట్లో ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి వారు ఆ ప్రతిజ్ఞను శిరోధార్యంగా భావించి అనుసరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement