గాంధీజీ మీద ఒట్టు..
గాంధీజీ మీద ఒట్టు..
Published Sat, Apr 9 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
తాగినా, అమ్మినా జరిమానా తప్పదు
జగదేవ్‌పూర్ (మెదక్) : ఇకపై మద్యం తాగం, విక్రయించం.. ఎవరైనా గ్రామంలో అమ్మినా, తాగినా జరిమానా కట్టాల్సిందే.. అంటూ గ్రామస్తులంతా కలసి గాంధీజీ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆదర్శానికి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్ వేదికయింది. బస్వాపూర్ గ్రామంలో కొన్నేళ్లుగా నాలుగు బెల్టుషాపులు నడుస్తున్నాయి. దీంతో గ్రామస్తులు చాలామంది మద్యానికి బానిసలై ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు. కొట్లాటలు, వాదులాటలు సర్వసాధారణంగా మారాయి. ఇది గ్రహించిన కొందరు యువకులు నడుం బిగించారు. సారా మహమ్మారిని ఊరి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గ్రామ పంచాయతీ సభ్యులు, పెద్దలు, మహిళ సంఘాల సభ్యులకు నచ్చజెప్పారు. వారి సహకారంతో గ్రామంలో దండోరా వేయించి శనివారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందరి సమక్షంలో మహిళలు, గ్రామ పెద్దలు బెల్టుషాపులు నిర్వహించరాదని తీర్మానం చేసుకున్నారు. ఆ మేరకు మహాత్ముని విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తే పది వేల జరిమాన తప్పదని హెచ్చరించారు. తీర్మానం ప్రతిని జగదేవ్‌పూర్ పోలీసులకు కూడా అందించారు.
Advertisement
Advertisement