ఈ దేశపటం.. పటేల్‌ ఆత్మ | sardar vallabhbhai patel special story | Sakshi
Sakshi News home page

ఈ దేశపటం.. పటేల్‌ ఆత్మ

Published Sun, Nov 11 2018 12:35 AM | Last Updated on Sun, Nov 11 2018 12:35 AM

sardar vallabhbhai patel special story - Sakshi

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అకుంఠిత దీక్షతో సంస్థానాలను విలీనం చేసిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ను (అక్టోబర్‌ 31, 1875–డిసెంబర్‌ 16, 1950)  ‘ఇండియన్‌ బిస్మార్క్‌’గా పిలవడం మొదలయింది. అలాగే సర్దార్‌ను కూడా ఉక్కుమనిషి అనే పిలవడం పరిపాటి. పటేల్‌ గొప్ప భూమిపుత్రుడు. గుజరాత్‌లోని నాదియాడ్‌లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి జవేర్భాయ్‌ పటేల్, మొదట ఝాన్సీ సంస్థానంలో సైనికుడు. తరువాత రైతు. తల్లి లాడ్‌బాయ్‌. దైవభక్తురాలు. వల్లభ్‌భాయ్‌ తన తండ్రితో కలసి పొలంలో దిగి పని చేసినవారు. చిత్రం ఏమిటంటే ఆయన తన 22వ ఏట మెట్రిక్‌ ఉత్తీర్ణులయ్యారు. మరో పదేళ్లకు 1910లో ఇంగ్లండ్‌ వెళ్లారు. పటేల్‌ టెంపుల్‌ టౌన్‌లో బారెట్‌లాలో చేరారు. అదే సంవత్సరం ఇన్నర్‌ టెంపుల్‌ ఇన్‌లో బారెట్‌లాలో చేరారు మరొక భారతీయుడు. ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ. కానీ వయసులో ఇద్దరికీ ఎంతో తేడా. పటేల్‌ పెట్లాండ్, నాదియాడ్, బోర్సాద్‌ల నుంచి వస్తే, నెహ్రూ హేరో, కేంబ్రిడ్జ్‌లలో చదివి ఇన్నర్‌ టెంపుల్‌ వెళ్లారు. పటేల్‌ 26 మాసాల కోర్సును 20 మాసాలలోనే పూర్తి చేశారు. అన్ని పరీక్షలు ఒకేసారి ఉత్తీర్ణుడైనందుకు ఇచ్చే 50 పౌండ్ల బహుమానం కూడా అందుకున్నారు. 1913లో భారత్‌కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో బొంబాయి బారిస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. తను బొంబాయి ప్రెసిడెన్సీ వాడే అయినా బొంబాయిని ఆయన ఎంచుకోలేదు. తన స్వస్థలం గుజరాత్‌లోనే అహమ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. గోధ్రా, బోర్సాద్‌లలో కూడా పనిచేశారు. 1916కే చాలా ఖరీదైన న్యాయవాదిగా అవతరించారు. 

గాంధీజీకి కుడిభుజం అనదగిన పటేల్‌ తొలి రోజులలో ఆయన సిద్ధాంతాల పట్ల ఎలాంటి మక్కువ చూపలేదు. 1915లో గాంధీజీ అహమ్మదాబాద్‌ వచ్చారు. కొచ్రాబ్‌లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. చాలామంది యువ లాయర్లతో పాటు, ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉండేవారు. అహింస, గాంధీజీ చెప్పే జీవన విధానం ఇవన్నీ పటేల్‌ను అప్పుడు ఆకర్షించలేకపోయాయి. కానీ ఒక మిత్రుని సలహా మేరకు మొత్తానికి గాంధీని చూడడానికి వెళ్లారు పటేల్‌. అంత సాన్నిహిత్యం అనుభవించినా కూడా పటేల్‌ వెంటనే గాంధీని అనుసరించలేదు. 1916లో గుజరాత్‌ సభ, అంటే జాతీయ కాంగ్రెస్‌ గుజరాత్‌ శాఖ– బాంబే ప్రెసిడెన్సీ కాంగ్రెస్‌ సభలు నిర్వహించింది. అతివాదులు, మితవాదులు చాలాకాలం తరువాత ఆ వేదిక మీద పక్కపక్కనే ఆసీనులయ్యారు. గుజరాత్‌కు చెందినవానిగా మహమ్మద్‌ అలీ జిన్నా ఆ సభలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలు కూడా పటేల్‌ను కదిలించలేదు. చరిత్రాత్మకం అని అంతా చెబుతున్న లక్నో సమావేశాలకు కూడా పటేల్‌ వెళ్లారు. నచ్చలేదు. ఆఖరికి 1917లో ఆ శుభ ముహూర్తం వచ్చింది. గుజరాత్‌ సభ మరోసారి ప్రెసిడెన్సీ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఇంగ్లిష్‌లో కాకుండా, మాతృభాషలో అంటే గుజరాతీలో ఉపన్యసించవలసిందిగా గాంధీజీ వక్తలను కోరారు. జిన్నాకు ఇంగ్లిష్‌ తప్ప తన మాతృభాష గుజరాతీ కూడా రాదు. విఠల్‌భాయ్‌ పటేల్‌ (సర్దార్‌ అన్నగారు) గుజరాతీలో తడబడుతూ మాట్లాడారు. ఇదే తొలిసారిగా గాంధీగారి పట్ల పటేల్‌కు గౌరవ భావాన్ని కలిగించింది. అంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం కాదు, ఆయన పోరాట పంథా కాదు... గుజరాతీ మీద, మాతృభాషల మీద గాంధీజీ ప్రకటించిన గౌరవమర్యాదలే పటేల్‌ను కదిలించాయి. మరి ఆయన గొప్ప భూమిపుత్రుడు కాదా! పటేల్‌ ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు కూడా భారతీయులను ఏమన్నా అంటే సహించేవారు కాదు. 

స్వరాజ్య ఉద్యమం అనేక పాయలతో సాగింది. అందులో రైతాంగ పోరాటాలు కూడా భాగమే. గాంధీ తొలిదశలో రైతాంగ ఉద్యమాలే నడిపారు. తరువాత పూర్తి స్థాయి రాజకీయోద్యమం వైపు మొగ్గారు. పటేల్‌ ప్రయాణం కూడా అలా సాగిందే. ఇది కూడా గాంధీ పట్ల పటేల్‌ గౌరవాన్ని పెంచింది. ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ ఘడియలు గర్వించదగినవా? అంతకు ముందు దాదాపు సంవత్సరం పాటు భారతభూమి నెత్తురుతో తడియని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. ముస్లింలీగ్‌ ఆవేశం ముందు గాంధీజీ అహింస కకావికలైంది. దేశంగా రెండుగా చీలిపోవడం అతి పెద్ద విషాదం. ముస్లింలీగ్‌ రక్తదాహం ఫలితమే అది. అహింసాయు పంథాలో స్వరాజ్యం సాధించిన దేశమన్న కీర్తి కిరణం మాటున ఈ రక్తపాతం అప్పటికి కనుమరుగైంది. కానీ తరువాత తెలిసింది– అధికార మార్పిడి సమయంలో మరే ఇతర దేశంలోను ఇంతటి రక్తపాతం జరగలేదన్న వాస్తవం. అప్పటిదాకా ఉక్కుపాదంతో భారతదేశాన్ని తమ అధీనంలో ఉంచుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం ఇంతటి హింసను, రక్తపాతాన్ని, దోపిడీని, లూటీని, మానభంగాలను మౌన ప్రేక్షకునిగా వీక్షించింది. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో భారత తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్‌ పటేల్‌ హోంశాఖను నిర్వహిస్తున్నారు. నెహ్రూ ప్రధాని. పైగా ప్రధాని పదవికి నెహ్రూ కంటే పటేల్‌ పట్లే పార్టీలో ఎక్కువ మొగ్గు ఉండేది. గాంధీ మాటను బట్టి పటేల్‌ ప్రధాని పదవి పోటీ నుంచి వెనక్కు తగ్గారు. నిరాశ పడలేదు. పైగా స్వతంత్ర భారతం పట్ల తనకున్న బాధ్యతను భవిష్యత్‌ తరాలు కూడా గుర్తుంచుకునేటంత గొప్పగా నిర్వర్తించారు. ఆ కర్తవ్యమే – సంస్థానాల విలీనం.

 ఆనాడు దేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇవి ఈ దేశంలో అంతర్భాగాలైనప్పటికీ పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది మౌంట్‌బాటన్‌ విభజన ప్రణాళిక. అది కూడా ఎలాంటి స్వాతంత్య్రం? ఇటు భారత్‌లో విలీనమయ్యే స్వేచ్ఛ, అటు పాకిస్తాన్‌లో చేరే వెసులుబాటు కూడా 1947, జూన్‌ 3 నాటి ఆ విభజన ప్రణాళిక కట్టబెట్టింది. సాంస్కృతిక ఏకత్వంతో పాటు రాజకీయ ఏకత్వం కూడా సాధించాలనీ, పాలనాపరంగా ఒకే ఛత్రం కింద దేశం ఉండాలన్న స్వరాజ్య సమరయోధుల ఆశలకి భంగపాటు కలిగించే నిర్ణయమది. నిజంగానే స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తిని కాపాడడానికి స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన తొలి కార్యక్రమం సంస్థానాల విలీనం. ఆ పని పటేల్‌ చేశారు. విలీనాల చరిత్రను గుర్తు చేసుకునే సమయంలో పటేల్‌తో పాటే మరో మహోన్నత వ్యక్తిని కూడా తలుచుకోవాలి. ఆయన వీపీ మేనన్‌. 
1947లో జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో పటేల్‌ హోంమంత్రి, ఉపప్రధాని. వీటితో పాటు సంస్థానాల విలీనం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతికి వచ్చింది. గాంధీ, నెహ్రూల అభిమతం కూడా ఇదే. ఆఖరి ఆంగ్ల వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ కూడా కొంచెం సహకరించాడు. తాత్కాలిక ప్రభుత్వమే ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.  మౌంట్‌బాటన్‌ రాజ్యాంగ వ్యవహారాల కార్యదర్శి వాప్పాళ పంగుణ్ణి మేనన్‌ (వీపీ మేనన్‌)ను పటేల్‌ ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ ఇద్దరూ కలసి 99 శాతం సంస్థానాల విలీనం పనిని పూర్తి చేశారు. మిగిలిన ఒకటి కశ్మీర్‌. ఆ పనిని నెహ్రూ తీసుకున్నారు. ఇప్పుడు భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ అంటే కశ్మీర్‌ సమస్యే. వీపీ మేనన్‌ దూరదృష్టి, పటేల్‌ జాతీయ దృక్పథం ఆ ఇద్దరిని 1947 జూలై నుంచే సంస్థానాల విలీనం కృషిని ఆగమేఘాల  మీద ఆరంభించేటట్టు చేశాయి. సంస్థానాలకు స్వేచ్ఛను ఇవ్వడంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికే ఉంది.  ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛనిస్తే దేశ ఏకత్వం ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే, దేశంలో 48 శాతం భూభాగం సంస్థానాల కిందే ఉంది. 28 శాతం జనాభా వాటిలో ఉండేది.
 
ఇన్ని సంస్థానాలకు స్వేచ్ఛ కొనసాగి ఉంటే ఏం జరిగేదో చెప్పనక్కరలేదు. నిజానికి సంస్థానాధీశులలో అ«ధికులు బ్రిటిష్‌ జాతికీ, ప్రభుత్వానికీ కూడా తొత్తులే. వారిలో  కొందరి వైఖరి అప్పుడే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారత్‌ ఉనికికే ప్రమాదకరంగా పరిణిమిస్తున్న సంకే తాలు కూడా వెలువడడం మొదలయింది. హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాఘడ్‌ సంస్థానాలు పాకిస్తాన్‌లో కలవడానికి సిద్ధమయినాయి.  
సంస్థానాల విలీనం కోసం పటేల్‌ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. వాటిని మూడు వ్యూహాలుగా అమలు చేయించారాయన. మొదటిగా  రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాలను వదులుకోవలసందని సంస్థానాధీశులను కోరారు. ఈ మూడు వదులుకుంటే సంస్థాలన్నీ భారత రాజ్యాంగం పరిధికి లోబడినట్టే. కాబట్టి అది రాజకీయ ఐక్యతలో తొలి మెట్టు కాగలదని పటేల్‌ భావించారు. తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వంతో గతంలో సంస్థానాలు చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు. దీనితో సంస్థానాలకు ఉన్న కొన్ని అధికారాలు రద్దయిపోతాయి. మూడోది అంతిమ అస్త్రం. యూనియనైజేషన్, డెమాక్రటైజేషన్‌ పేరుతో సంస్థానాలను విలీనం చేయడమే. కొందరిని భరణాలు ఎరవేసి లొంగదీసుకున్నారు. తిరువాన్కూర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, జునాగఢ్, భోపాల్, కశ్మీర్‌ సంస్థానాధీశులు మొదట మొండికేసినా తరువాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. గ్వాలియర్, బరోడా, పటియాలా వంటి సంస్థానాలు పటేల్‌ పిలుపునకు వెంటనే స్పందించి విలీనానికి అంగీకరించాయి. నయానో భయానో ఇంకొందరిని లొంగదీశారు. 1947 ఆగస్టు 15వ తేదీకే చాలా సంస్థానాలను పటేల్‌ భారత్‌ యూనియన్‌లోకి తెచ్చారు. అంటే రెండు నెలల వ్యవధిలోనే. మధ్య భారతంలోని పిప్లోడా సంస్థానాధీశుడు కూడా మొదట బెట్టు చేసి 1948 మార్చిలో భారత యూనియన్‌లో విలీనం చేశాడు. జునాగఢ్‌లో ప్రజలు తిరుగుబాటు చేశారు. తరువాత ప్లెబిసైట్‌ ద్వారా సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు.  హైదరాబాద్‌ సంస్థానం మీద పోలీసు చర్య అవసరమైంది. ఇది సెప్టెంబర్‌ 17, 1948న భారత్‌లో విలీనమైంది. కశ్మీర్‌ ఉదంతం వీటికి భిన్నమైంది. పాకిస్తాన్‌ సైనికులు చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో భారత్‌లో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థానం పాలకుడు హరిసింగ్‌ ప్రకటించారు. సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు ఇష్టమే లేదు. 

వీటితో పాటు లక్షద్వీప్‌ను స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్‌ నౌకాదళం చేసిన యత్నాన్ని కూడా పటేల్‌ మన నౌకాదళాన్ని పంపించి భగ్నం చేశారు. దేశ సరిహద్దు విషయంలో కూడా పటేల్‌కు ఉన్న దృష్టి విశేషమైనది. వాస్తవికమైనది. దేశ సార్వభౌమాధికారం సరిహద్దులను, భూభాగాన్ని రక్షించుకోవడం ద్వారా వ్యక్తం కావాలి. పటేల్‌ అదే చేశారు.  భారత్, చైనా సంబంధాల గురించి పరిశోధించిన జాన్‌ డబ్లు్య గార్వెర్, ‘‘భారత్‌ పరిస్థితిని పటిష్టం చేయడానికి వాస్తవికమైన అంచనాలతో పటేల్‌ ఎన్నో సలహాలు ఇచ్చారు. సరిహద్దులలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. భారత సైన్యం సామర్థ్యం పెంచాలన్నారు. ఈశాన్య ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయవలసిన అవసరం గురించి చెప్పారు’’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌ వివాదాన్ని నెహ్రూ ఐక్య రాజ్యసమితికి తీసుకువెళ్లడం పటేల్‌కు సమ్మతం కాదని రాసినది కూడా గార్వెరే. పటేల్‌ అంటే ఈ దేశ పటానికి పరిపూర్ణతను, సంపూర్ణ రూపాన్ని సాధించిన రాజనీతిజ్ఞుడు. ఈ దేశం అంతర్యుద్ధాలకు చిరునామాగా మారిపోకుండా కాపాడినవారు పటేల్‌. భారతదేశ పటంలో ఐక్యమైన రాష్ట్రాలతో పాటు, వాటి వెనుక ఒక అంతస్సూత్రంలా పటేల్‌ ఆత్మ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. 
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement