కోట్ల మందికి దారి చూపిన ఆ ‘వెలుగు’ ఇదే.. | Only one who fought against Gandhi | Sakshi
Sakshi News home page

కోట్ల మందికి దారి చూపిన ఆ ‘వెలుగు’ ఇదే..

Published Fri, Apr 15 2016 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

కోట్ల మందికి దారి చూపిన ఆ ‘వెలుగు’ ఇదే..

కోట్ల మందికి దారి చూపిన ఆ ‘వెలుగు’ ఇదే..

అంబేడ్కర్ జీవితం బడుగుల సేవకే అంకితం
 
 అది మహారాష్ట్రలోని మహద్ గ్రామం! ఆ గ్రామంలో ‘చౌదర్’ అని.. ఓ పెద్ద చెరువు. ‘పెద్దవాళ్ల’ చెరువు. దళితులు ఆ నీళ్లు తాగడానికి లేదు. కనీసం తాకడానికి లేదు. ముట్టుకుంటే చెరువు మైల పడిపోతుందట! ఈ అస్పృశ్యతను ధిక్కరిస్తూ యువ కెరటం కదిలింది. దళితులను తన వెంట రమ్మంది. అంతా చెరువు దగ్గరికి చేరారు. ఆ యువకుడు చెరువులోకి దిగాడు. దోసెడు నీళ్లతో గొంతు తడుపుకున్నాడు. ఆ దృశ్యం అగ్రవర్ణ దురహంకారాన్ని దగ్ధం చేసింది. నిమ్న వర్గాల హృదయాలను పులకింపజేసింది. ఆ యువ కెరటమే అంబేడ్కర్! నాటి నుంచి నేటి వరకు బడుగుల ఆరాధ్యుడిగా, జాతిని మేల్కొలిపిన వైతాళికుడిగా, రాజ్యాంగ నిర్మాతగా జేజేలు అందుకుంటూనే ఉన్నాడు. గురువారం ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని దేశం యావత్తూ ఘనంగా నివాళులర్పించింది. సంఘంలో దురాచారాలు రూపుమాపి, దళితుల అవమానాలకు చరమగీతం పాడిన ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాల సమాహారమిదీ..
 - సాక్షి, హైదరాబాద్
 
  జననం

 మధ్యప్రదేశ్‌లోని ‘మాహు’లో అంబేడ్కర్ 1891లో జన్మించారు. తండ్రి రాంజీ. తల్లి భీమాబాయి. 14 మంది సంతానం. అంబేడ్కర్ ఆఖరివాడు. అంబేడ్కర్ అన్నది ఇంటి పేరు. భీంరావు అసలు పేరు. ఓ టీచర్ అతడి మీద వాత్సల్యంతో ఇంటిపేరునే అసలు పేరుగా మార్చాడు. అలా భీంరావు.. అంబేడ్కర్‌గా ప్రసిద్ధులయ్యారు. మహద్, మాహు.. ఇలా అంబేడ్కర్‌ని ‘మహద్’నీయుడినీ, ‘మాహా’నీయుడిని చేశాయి. అంబేడ్కర్ వల్ల ఈ రెండు ప్రాంతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

 చదువు కోసం యుద్ధమే..
 పెరిగి పెద్దయ్యాక గుక్కెడు నీళ్ల కోసం పోరాడిన అంబేడ్కర్.. బాల్యంలోనూ చదువు కోసం పోరాడారు! అసలు స్కూల్లో చేరడమే పెద్ద యుద్ధం అయింది. ఆ తర్వాత మెట్రిక్ వరకు రావడం ఇంచుమించు మహాభారత యుద్ధం లాంటి మహాదళిత యుద్ధం!! ఎంతమందిని ఎదుర్కొన్నాడో, ఎన్ని గడ్డు పరిస్థితుల్ని దాటుకుని వచ్చాడో! టీచర్లు, సాటి విద్యార్థులు అంతా.. అంటరానివాడికి చదువెందుకని ఈసడించినవారే. కానీ కొందరు దయామయుల చేయూతతో చదువు కొనసాగించి, 1907లో మెట్రిక్ పాస్ అయ్యారు అంబేడ్కర్. తర్వాత ఎల్ఫిన్‌స్టన్ ఉన్నత పాఠశాలలో చదివారు. అందుకు బరోడా మహారాజు ఆర్థిక సహాయం చేశారు. 1912లో అంబేడ్కర్‌కు బి.ఎ.పట్టా చేతికొచ్చింది.

 రమాబాయితో వివాహం
 మెట్రిక్ అయిన కొద్దిరోజులకే అంబేడ్కర్ వివాహం జరిగింది. వధువు రమాబాయి. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేళ్లు. పై చదువుల కోసం అంబేడ్కర్ అమెరికా వెళ్లే నాటికే రామాబాయి గర్భవతి. మొదటి సంతానం రమేశ్. తర్వాత గంగాధర్, యశ్వంత్. తర్వాత కూతురు.

మొత్తం ఐదుగురు పిల్లల్లో యశ్వంత్ తప్ప మిగతా అంతా చిన్నప్పుడే చనిపోయారు. ఆఖరి పిల్లాడు రాజరత్న. ఆ సమయంలో రమాదేవిని నిర్వేదం అలుముకుంది. అంబేడ్కరే ధైర్యం చెప్పారు. అమెకు అన్ని విధాలా అండగా ఉన్నారు.

 కొలంబియాలో డాక్టరేట్
 అంబేడ్కర్ జీవితంలోని పెద్ద మలుపు.. కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం. 1913లో 22 ఏళ్ల వయసులో.. బరోడా మహారాజు సాయాజీరావ్ గైక్వాడ్ ఉదారంగా ఇచ్చిన ఉపకారవేతనంతో అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో చదివేందుకు వెళ్లారు అంబేడ్కర్. అక్కడి అమెరిన్ జీవితం ఆయన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ‘నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా- ఎ హిస్టారికల్ అండ్ ఎనలిటికల్ స్టడీ’  అనే అంశంపై అంబేడ్కర్ సమర్పించిన సిద్థాంత పత్రానికి కొలంబియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఇండియా వచ్చాక 1917లో బరోడా చేరారు అంబేడ్కర్. అక్కడికి రావడానికి ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో లా కోర్సులో పేరు నమోదు చేసుకున్నారు. బరోడా నుంచి తిరిగి లండన్ వెళ్లి 1921లో పట్టభద్రులయ్యారు. రెండేళ్ల తర్వాత బారిష్టరు వృత్తి చేపట్టారు.
 
 దళితుల కోసం అలుపెరుగని పోరు..
 ఓటు హక్కు కమిటీలో పనిచేసిన అంబేడ్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం అలుపెరుగని పోరాటం సాగించారు.  ఓటు హక్కు కమిటీ 1932 మే 1న తన పరిశీలనను పూర్తి చేసింది. అస్పృశ్య కులాలను మాత్రమే దళిత కులాలుగా (షెడ్యూల్డ్ కులాలు) పరిగణించాలంటూ తీర్మానించిం ది. కమిటీ నివేదికపై బ్రిటిష్ ప్రధాని వైఖరి ఎలా ఉంటుందోననే ఆందోళనతో 1932 మే 26న అంబేడ్కర్ లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్‌లోని ఉన్నతాధికారులను, మంత్రులను కలుసుకుని, వారికి ఒక నివేదిక సమర్పించారు. అంబేడ్కర్ కృషి ఫలితంగా 1932 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటన మేరకు దళితులకు రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేక స్థానాలు లభించాయి. దళితులకు తమ ప్రత్యేక ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఒక ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక ఓటు వేసే హక్కు కూడా దక్కింది. అప్పటికే జైలులో ఉన్న గాంధీజీ ఈ విషయం తెలియగానే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

 గాంధీజీపై సానుభూతి గల కాంగ్రెస్ నాయకులంతా అంబేడ్కర్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ప్రైమరీ ఎన్నికల గురించి, ప్రత్యేక స్థానాల కాలపరిమితి గురించి పేచీలు పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రైమరీ ఎన్నికలు తీసివేయవచ్చని, ప్రత్యేక స్థానాలపై మాత్రం పదిహేనేళ్ల తర్వాత దళితుల్లో అభిప్రాయ సేకరణ జరపాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. దీంతో హిందూ నాయకులు గగ్గోలెత్తిపోయారు. మరోవైపు గాంధీజీ ఆరోగ్యం క్షీణించసాగింది. ఎటూ తోచని స్థితిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రస్తావన లేకుండానే పూనా ఒప్పందంపై సంతకాలకు అంబేడ్కర్ అంగీకరించారు. దళితులకు కాంగ్రెస్, గాంధీజీ చేసిన ఈ అన్యాయంపై ఆయన తన గ్రంథంలో విపులంగానే రాశారు.
 
 అనారోగ్యం... సతీ వియోగం
 దళితుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగకుండా పనిచేస్తూ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు అంబేడ్కర్. అధిక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. కంటిచూపు బాగా  క్షీణించడంతో కళ్లద్దాలు మార్చాల్సి వచ్చింది. విశ్రాంతి అనివార్యం కావడంతో వైద్యుల సలహాపై బోర్డీలో కొన్నాళ్లు, మహాబలేశ్వర్‌లో కొన్నాళ్లు ఏకాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. బోర్డీలో ఉన్నప్పుడు తనను కలవడానికి ఎవర్నీ రానిచ్చేవారు కాదు. సముద్ర తీరం పక్కన ఉండే ఆ ప్రదేశం అంబేడ్కర్‌కు చాలా నచ్చింది. సముద్రంలో ఆయన రోజూ ఈత కొడుతుండేవారు. మహాబలేశ్వర్‌లో ఉన్నప్పుడు సన్నిహిత మిత్రులను కలుసుకునేవారు. విశ్రాంతి అనంతరం రెట్టించిన ఉత్సాహంతో బాంబే తిరిగి వచ్చారు. వెంటనే రాజ్యాంగం ముసాయిదా ప్రతి తయారీలో నిమగ్నమయ్యారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అంబేడ్కర్ భార్య రమాబాయి 1935 మే 27న కన్నుమూశారు.
 
 ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన
  అంబేడ్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 1937 ఎన్నికల్లో పెద్ద ప్రభావాన్నే చూపింది. మొత్తం 17 మంది అభ్యర్థులను బరిలో నిలపగా, 15 మంది గెలుపొందారు. 1937 జూలై 19న కాంగ్రెస్ అధికార స్వీకారం చేసింది. బాంబే అసెంబ్లీలో అంబేడ్కర్, జమ్నాదాస్.. వీరిద్దరే ప్రతిపక్షాలలో ఉద్ధండులుగా ఉండేవారు. ఆ తర్వాత అంబేడ్కర్ అఖిల భారత నిమ్న జాతుల సమాఖ్య పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ 1952 ఎన్నికల్లో పోటీ చేసి, 34 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిలిపి రెండు స్థానాలను దక్కించుకుంది. ఆ రెండింటిలో ఒకటి మహారాష్ట్రలోని షోలాపూర్ కాగా, రెండోది తెలంగాణలోని కరీంనగర్. ఆ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓడిపోయారు. అయితే కరీంనగర్ నుంచి ఎం.ఆర్.కృష్ణ గెలుపొందారు. వివిధ రాష్ట్రాల్లోని 215 శాసనసభా స్థానాలకు పోటీ చేయగా, 12 మంది గెలిచారు. వారిలో ఐదుగురు హైదరాబాద్ రాష్ట్రం నుంచి, ఇద్దరు మద్రాసు ప్రావిన్స్ (ఆంధ్ర ప్రాంతం ఇందులోనే ఉండేది) నుంచి గెలుపొందారు. హైదరాబాద్ అసెంబ్లీకి గెలిచిన వారిలో జె.ఎం.రాజమణిదేవి (సిరిసిల్ల), బి.ఎం.చందర్‌రావు (మహబూబాబాద్), బుట్టి రాజారాం (జగిత్యాల), ఆంధ్ర ప్రాంతంలోని అమలాపురం నుంచి బొజ్జా అప్పలస్వామి ఉన్నారు. ఆ తర్వాత అంబేడ్కర్ ఆ పార్టీని మూసేసి, అణగారిన వర్గాల కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు.
 
 హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం
 హైదరాబాద్ రాష్ట్రంతో అంబేద్కర్‌కు మంచి అను బంధం ఉంది. ఆయన తరచుగా హైదరాబాద్ వస్తుండేవారు. సమావేశాలలో పాల్గొనేవారు. సి కింద్రాబాద్‌లోని ‘షెడ్యూల్డ్ కేస్ట్ ఫెడరేషన్’ హైదరాబాద్‌లోని ‘హైదరాబాద్ స్టేట్ డిప్రెస్స్‌డ్ క్లాసెస్ అసోసియేషన్’ల ఆహ్వానం మేరకు 1944 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చారు అంబేద్కర్. ఆయన్ను చూడడానికి, ఆయన మాటలు విన డానికి జనం వెల్లువెత్తారు. హైదరాబాద్‌కు వస్తే ప్రముఖరాజకీయ నాయకుడు జె.హెచ్.ఇ. సుబ్బ య్య ఇంట్లో బస చేసేవారు. కేంద్రమంత్రివర్గం నుంచి రాజీనామ చేసిన తరువాత వారం రోజుల పాటు సుబ్బయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు అంబేద్కర్. ఉస్మానియా యూనివర్శిటీ పరిసరాల్లోని పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని ఆయన బాగా ఇష్టపడేవారు. హైదరాబాద్ సంస్థానంలో తొలిసారిగా దళితుల సభ జరిపించారు అంబేద్కర్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.

 ‘రాజులకు రాజు వచ్చుచున్నాడు’
 ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌కు లెక్కలేనంత మంది అభిమానులు ఉండేవాళ్లు. ఎంతో మంది దళిత విద్యార్థులకు ఆయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చాలామంది అభిమానులు  అంబేద్కర్‌కు ఉత్తరాలు రాస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని అసంఖ్యాక అభిమానులు ఆయన్ను ఎలాగైనా ఇక్కడికి రప్పించాలని బలంగా అనుకున్నారు. ఈ పనిని దళిత సంక్షేమం కోసం కృషి చేస్తున్న నందనారు హరికి అప్పగించారు.  హరి విన్నపం ప్రకారం 1944లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు అంబేద్కర్. మొదట అనకాపల్లి వచ్చారు. నగరంలో పండగ వాతావరణం కనిపించింది. ఎటు చూసినా అంబేద్కర్ గురించి చర్చలు. వైశ్యసంఘం వారు 50 వేల రూపాయల విరాళాలు సేకరించి అంబేద్కర్‌కు  ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశారు.

‘రాజులకు రాజు, మహారాజు-మాలరాజు వచ్చుచున్నాడు. చూచుటకు రండి’ అట్టల మీద రాసిన ఇలాంటి వాక్యాలు అన్ని వీధుల్లోనూ కనిపించాయి. స్టేషన్ నుంచి అంబేద్కర్‌ను తీసుకువెళ్లడానికి 24 ఎడ్లు కట్టిన పూలరథం  ఏర్పాటయింది. అయితే ఈ రథంలో రావడానికి అంబేద్కర్ నిరాకరించారు. కారులోనే  ట్రావెలర్స్ బంగళాకు చేరుకున్నారు. సాయంత్రం మునిసిపల్  స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. సభ పూర్తయిన తరువాత హరిజన వాడలను సందర్శించారు. అనకాపల్లి తరువాత విశాఖపట్టణం, పాలకొల్లులలో జరిగిన సభలలో ప్రసంగించారు అంబేద్కర్. విశాఖపట్నం నుంచి రైల్లో వెళుతున్నప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన జనంతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడేవి. కాకినాడ, గుడివాడ, రామచంద్రాపురం, కొవ్వలి, ఏలురు పట్టణాలకు వెళ్లి అక్కడ జరిగిన సభలలో ప్రసగించారు. రాజమండ్రిలో అంబేద్కర్ ఘనస్వాగతం లభించింది. అంబేద్కర్‌ను  చూడాలనే ఉత్సాహం మాత్రమే కాదు,  ఆయన ఏంమాట్లాడతారు అనే ఆసక్తి కూడా సభకు వచ్చేవారిలో ఉండేది. ఆయన ప్రసంగాల గురించి జనం ఆసక్తిగా చర్చించుకునేవారు.
 
 రాజ్యాంగ పరిషత్తులో తొలి అడుగు
  స్వతంత్ర భారతదేశాన్ని అసమానతలులేని, వివక్షకు తావులేని సన్మార్గంలో పయనింపజేసేది రాజ్యాంగం. తన జాతి జనుల కోసం అంబేడ్కర్ ఆ రాజ్యాంగ పరిషత్తులో స్థానం సంపాదించాలనుకున్నారు. 1946 మే 6న బ్రిటన్ విడుదల చేసిన రాజపత్రం ప్రకారం స్వతంత్ర భారత దేశం రాజ్యాంగ ఏర్పాటుకు సంబంధించిన వివిధ విషయాల పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. 1946 జూలై, అగస్టులలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యాంగ పరిషత్తుకి సభ్యులను ఎన్నుకుంటారు. అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి రాకుండా కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ బెంగాల్‌కు చెందిన నిమ్న జాతుల నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ అంబేడ్కర్‌ని బెంగాల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నాయకునిగా అక్కడి ముస్లిం లీగ్ నాయకులతో మాట్లాడి బెంగాల్ అసెంబ్లీ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు వెళ్లేలా చేశారు.

 రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడిగా...
 రాజ్యాంగ రచనా సంఘం 1947 ఆగస్టు 29న ఏర్పాటైంది. దానికి అంబేడ్కర్‌ని అధ్యక్షునిగా నియమించారు. అంబేడ్కర్  అత్యంత దీక్షగా ఐదు నెలల్లో రాజ్యాంగం ముసాయిదా ప్రతిని తయారు చేసారు. 114 రోజులలో దాన్ని అసెంబ్లీ చేత ఆమోదింపజేశారు. కెనడా రాజ్యాంగం రచనకూ, చర్చకూ, ఆమోదానికీ కలిపి రెండు సంవత్సరాల నాలుగు నెలలు పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగానికి పట్టింది అతి తక్కువ సమయం. కేవలం ఐదు నెలలే. దీన్నిబట్టి అంబేడ్కర్ కార్యదీక్ష, అసాధారణ ప్రతిభ స్పష్టం అవుతోంది. 1948 నవంబర్ 29న రాజ్యాంగంలోని 11వ ఆర్టికల్‌లో చెప్పిన అస్పృశ్యతా నిర్మూలన విధానాన్ని సభ్యుల హర్షాతిరేకాల మధ్య ఆమోదించుకున్నారు. 1949 నవంబరు 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
 
 పదవికి రాజీనామా.. ప్రతిపక్ష నేతగా సభలోకి

 రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేడ్కర్ మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే దేశంలోని స్త్రీల విముక్తికి, ఆర్థిక హక్కుకి సంబంధించిన అంశం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా తయారు చేసేందుకు భారత ప్రభుత్వం 1941లో బి.ఎన్.రావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ హిందూ కోడ్ బిల్లుని రూపొందించింది. అసమానతలకు తావులేని సమాజాన్ని కాంక్షించిన అంబేడ్కర్ స్త్రీపురుష సమానత్వ సాధనకు అనేక మార్గాలన్వేషించాడు.

సంఘంలో స్త్రీల ప్రాధాన్యతను కీలకంగా భావించి ఈ బిల్లుని తయారు చేసి 1950 నవంబర్‌లో 32 పేజీల ప్రతిని పార్లమెంటు సభ్యులందరికీ పంపారు అంబేడ్కర్.  అంబేడ్కర్ చేతిలో రూపుదిద్దుకున్నఈ బిల్లు సమాజ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తుందని హిందూ సంస్థలు మండిపడ్డాయి. కానీ నెహ్రూ ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించారు. సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ ఈ బిల్లుని వ్యతిరేకించారు. బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది కానీ ఆమోదం పొందలేదు. ఇందుకు నిరసనగా 1951 సెప్టెంబర్ 27న విసుగుచెందిన అంబేడ్కర్ న్యాయశాఖా మంత్రి పదవికి అంబేడ్కర్  రాజీనామా చేసారు. మరునాడే ప్రతిపక్ష నాయకునిగా సభలోనికి అడుగుపెట్టారు. ప్రతిపక్ష నాయకునిగా కూడా విశేష కృషి చేయగలరని అంబేడ్కర్‌పై విశ్వాసాన్ని ప్రకటించారంతా. అంబేడ్కర్ మరింత స్వేచ్ఛగా ప్రసంగాలు మొదలు పెట్టారు.
 
 బుద్ధం శరణం గచ్ఛామి..
 మానసికంగా ఎంత శ్రమకైనా అంబేడ్కర్ వెనుదీయలేదు. కానీ దేహం మాత్రం అనుకూలంగా లేదు. అపెండిసైటిస్, రక్తపోటుతో బాధపడ్డారు. 1954 ప్రాంతంలో కాళ్లలో నరాల బలహీనత వచ్చింది. ఎనిమిదేళ్ల ముందునుంచే మధుమేహం ఉంది. నిల్చోవడం కష్టమైంది. పడక కుర్చీలో కూర్చుని, ఎదురుగా ఉన్న బల్ల మీది దిండ్లపైన కాళ్లు చాపుకుని కూర్చునేవారు. ఇట్లాంటి స్థితిలో కూడా ‘ద రిడిల్స్ ఇన్ హిందూయిజం’ పుస్తకం ప్రారంభించారు. ‘హిందూమతంలో పుట్టినా, హిందువుగా మాత్రం చావను’ అన్న అంబేడ్కర్‌ను బౌద్ధం ఆకర్షించింది. 1955 నుంచి  అంబేడ్కర్ అనారోగ్యం మరింత దిగజారుతూ వచ్చింది. అయినా బౌద్ధంపై పుస్తకం రాయడం మొదలుపెట్టారు. ‘ద బుద్ధా అండ్ హిస్ గాస్పెల్’ పేరుతో అది అచ్చయింది.  ‘బుద్ధా అండ్ హిజ్ దమ్మా’ పేరుతో మరొక పుస్తకం ప్రారంభించారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో బుద్ధ జయంతిన అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. భగవాన్ బుద్ధునికీ జై, బాబాసాహెబ్ కీ జై అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్, సవితాదేవి దంపతులతోపాటు ఆ రోజు సుమారు మూడు లక్షల మంది బౌద్ధదీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నేనీనాడు తిరిగి జన్మించాను’ అంటూ అంబేడ్కర్ ఉద్వేగంగా ప్రసంగించారు.
 
 మహానిర్యాణం
 ఒకరోజు జ్వరం వచ్చిన తోటమాలిని పరామర్శించి తిరిగివస్తూ, ‘మృత్యువంటే అతడు భయపడుతున్నాడు, కానీ నాకేం భయం లేదు, ఏ క్షణాన్నైనా రానీ’ అని కార్యదర్శి రత్తూతో అంబేడ్కర్ అన్నారు. కానీ మృత్యువు ఆయన చెంతే ఉంది. 1956 డిసెంబర్ 4న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సమావేశానికి అంబేడ్కర్ హాజరయ్యారు.  తెల్లారి జైన నాయకులు వస్తే వారితో మాట్లాడారు. అనంతరం, అలసటగా ఉండటంతో తలకు రత్తూ నూనెతో మాలిష్ చేస్తుండగా సోఫా మీద తాళం వేస్తూ మంద్ర స్వరంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ పాడుకున్నారు. తర్వాత కొద్దిగా అన్నం తిని తన పర్సనల్ లైబ్రరీలోని కొన్ని పుస్తకాలను పడకగదిలో పెట్టించుకున్నారు. ‘చల్ కబీరా భవసాగర్ డేరా’ కబీరు గీతం పాడుతూ పడక గదికి చేరుకున్నారు. డిసెంబర్ 6న ఉదయం 6:30కు చూసినప్పుడు నిద్రిస్తున్నారనే అనుకున్నారు సవితాదేవి. కానీ ఆయన దేహం అప్పటికే భవసాగరాన్ని దాటేసింది. ఆ వార్త లక్షలాది జనాన్ని శోకసంద్రంలో ముంచేసింది.


 గాంధీని ఎదిరించిన ఒకే ఒక్కడు
 జాతీయోద్యమం సాగుతున్న కాలంలో గాంధీజీని ఎదిరించిన ఒకే ఒక్క నాయకుడు అంబేడ్కర్. దళితుల పట్ల కాంగ్రెస్ వైఖరిని నిలదీసిన నాయకుడు ఆయన. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే గాంధీజీ ఎదుట అంబేడ్కర్ తన వాణిని బలంగా వినిపించారు. 1931 ఆగస్టు 14న మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని మణిభవన్‌లో గాంధీజీతో అంబేడ్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘నాపైన, కాంగ్రెస్‌పైన మీకు వేరే అభిప్రాయాలు ఉన్నట్లు విన్నాను. స్కూలు చదివే రోజుల నుంచి నేను అంటరానితనాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తున్నాను. కాంగ్రెస్ వారికి నచ్చజెప్పి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా.

ఈ సమస్య మతపరమైనదని కాంగ్రెస్ తోసివేస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు. అయినా నేను దీనికి ప్రాధాన్యమిస్తున్నా. ఈ విషయమై కాంగ్రెస్ రూ.20 లక్షలు ఖర్చుపెట్టింది. మీలాంటి వారు ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది’ అన్నారు గాంధీ. ‘నేను పుట్టక ముందు నుంచే మీరు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉండి ఉండవచ్చు. అయితే, కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించింది తప్ప పరిష్కారానికి ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌లో నిజాయితీ లేదు. నిజంగా అన్ని లక్షల రూపాయల సొమ్ము ఖర్చు చేసి ఉంటే అదంతా వృథా అయిందనే చెప్పవచ్చు.

ఇక రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది దళితులకు ఉపకరిస్తుందని మేమనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని గాంధీజీని ప్రశ్నించారు అంబేడ్కర్. ‘హిందువులలో భాగమైన దళితులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్యా సదృశంగా నేను భావిస్తున్నాను’ అని బదులిచ్చారు గాంధీ. అంతే... అంబేడ్కర్ వెంటనే వెళ్లడానికి లేచారు. ‘మీరు స్పష్టంగా మీ అభిప్రాయాలు వెల్లడించినందుకు కృతజ్ఞతలు’ అంటూ సెలవు తీసుకున్నారు. అప్పటి వరకు దేశ రాజకీయాల్లో మకుటంలేని మహారాజులా వెలుగుతున్న గాంధీజీని మొట్టమొదటి భేటీలోనే ముఖాముఖి ఎదిరించిన నాయకుడు అంబేడ్కర్ ఒక్కరే. ఆ తర్వాత కూడా గాంధీజికి గొప్ప ప్రత్యర్థిగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement