నా వ్యాఖ్యలను వక్రీకరించారు
కాంగ్రెస్‌పై అమిత్ షా ధ్వజం
ఆ పార్టీ ఫక్తు అంబేడ్కర్ వ్యతిరేకి
ఆ వాస్తవాలను సభలోనే నిరూపించాం
ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు
అంబేడ్కర్‌ను కలలోనైనా అవమానించను.. ఆయన సిద్ధాంతాలనే ప్రచారం చేస్తున్నాం
న్యూఢిల్లీ: అంబేడ్కర్‌పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేడ్కర్ వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేం లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానమూ లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది.
ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తోంది. వాటిపై ఆందోళనలకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాజ్యసభలో అంబేడ్కర్ గురించి తాను మాట్లాడినదాంట్లో ఎలాంటి సందిగ్ధతా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కలలో సైతం అవమానపరచని పార్టీ నుంచి, సిద్ధాంతం నుంచి వచ్చాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసింది.
రిజర్వేషన్లను బలోపేతం చేసేందుకు కృషి చేసింది’’ అన్నారు. ‘‘కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణీయం. నాపై ఆ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అన్ని అవకాశాలూ పరిశీలిస్తామన్నారు. అంబేడ్కర్‌పై తాను చేసిన పూర్తి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని కోరారు.
నెహ్రూ కుటుంబం అంబేడ్కర్ వ్యతిరేకి
కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. తద్వారా అయోమయం సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కృత్రిమ మేధ సాయంతో తన వ్యాఖ్యలను, మోదీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయతి్నంచిందని ఆరోపించారు.
‘అంబేడ్కర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన చరిత్ర తొలి ప్రధాని
నెహ్రూది. నెహ్రూ కుటుంబంలో నాలుగు తరాల నేతలూ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆయనకు భారతరత్నను వీలైనంతగా ఆలస్యం చేసింది కాంగ్రెసే. కనీసం ఇప్పుడైనా ఆ పార్టీ అంబేడ్కర్ గురించి మాట్లాడుతుండడం ఆనందం కలిగిస్తోంది. అయితే అంబేడ్కర్‌కు ఇన్నాళ్లూ వాళ్లు ఏమాత్రం గౌరవం ఇవ్వని విషయం కూడా చెబితే బాగుంటుంది’’ అన్నారు. చీలిక దిశగా పయనిస్తున్న విపక్ష ఇండియా కూటమికి తిరిగి ఒక్కటయ్యే అవకాశాన్ని మీ వ్యాఖ్యలు కల్పించాయా అని ప్రశ్నించగా తప్పుడు పునాదులపై ఒక్కతాటిపైకి రావడం వారికి అలవాటేనని అమిత్ షా అన్నారు. ‘‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా వారు వరుసగా తీర్పులిస్తున్నారు. అందుకే ఓసారి ఈవీఎంలపై, మరోసారి ఇంకో అంశంపై ఆరోపణలు తదితరాలతో ప్రజలను అయోమయపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు.
బాక్సు ఖర్గే సంతోషిస్తానంటే తప్పుకుంటా
తాను రాజీనామా చేయాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ హాస్యాస్పదమని అమిత్ షా అన్నారు. ‘‘నా రాజీనామా ఖర్గేకు సంతోషం కలిగిస్తుందంటే అలాగే చేస్తా. కానీ నేను పదవి నుంచి తప్పుకున్నా ఖర్గే సమస్యలు తీరవు. ఆయన కనీసం మరో 15 ఏళ్లపాటు అక్కడే (ప్రతిపక్షంలోనే) ఉంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అంబేడ్కర్ మాదిరిగానే ఖర్గే కూడా దళితుడే. కనీసం ఆయనైనా ఈ బురదజల్లుడు కార్యక్రమంలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండేది. రాహుల్‌గాంధీ ఒత్తిళ్లకు తలొగ్గి నాపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment