
గాంధీ విగ్రహానికి ప్రముఖుల నివాళి
డల్లాస్:
అమెరికాలోని టెక్సాస్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) చైర్మన్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంవైస్ ఛాన్సలర్ వీ. దుర్గాభవాని, నంది అవార్డు గ్రహీత కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని గాంధీజీ విగ్రహాన్ని సందర్శించారు.
టెక్సాస్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎంజీఎంఎన్‌టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, విగ్రహాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ కృషిని మర్చిపోలేమని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గాంధీజీపై ఓ పాటను కూడా పాడారు.
అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసిన ప్రసాద్ తోటకూరను దుర్గాభవాని అభినందించారు. ప్రపంచ నలుమూల నుంచి అమెరికాకు వచ్చేవారు గాంధీజీ విగ్రహాన్ని సందర్శిచి, స్ఫూర్తిని పొందుతున్నారని ఆమె అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రసాద్ తోటకూర రూ. 8 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. శాంతికోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం సంతోషకరమని కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ అన్నారు.