breaking news
Dr. Prasad Thotakura
-
గాంధీ విగ్రహానికి ప్రముఖుల నివాళి
డల్లాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) చైర్మన్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంవైస్ ఛాన్సలర్ వీ. దుర్గాభవాని, నంది అవార్డు గ్రహీత కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని గాంధీజీ విగ్రహాన్ని సందర్శించారు. టెక్సాస్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎంజీఎంఎన్టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, విగ్రహాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ కృషిని మర్చిపోలేమని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గాంధీజీపై ఓ పాటను కూడా పాడారు. అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసిన ప్రసాద్ తోటకూరను దుర్గాభవాని అభినందించారు. ప్రపంచ నలుమూల నుంచి అమెరికాకు వచ్చేవారు గాంధీజీ విగ్రహాన్ని సందర్శిచి, స్ఫూర్తిని పొందుతున్నారని ఆమె అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రసాద్ తోటకూర రూ. 8 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. శాంతికోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం సంతోషకరమని కూచిపూడి డాన్సర్ కేవీ సత్యనారాయణ అన్నారు. -
రాజా కృష్ణమూర్తికి ఇండో అమెరికన్ల మద్ధతు
భారత సంతతికి చెందిన అమెరికన్లు డల్లాస్‌లోని డాక్టర్ ప్రసాద్ తోటకూర నివాసంలో సమావేశమయ్యారు. ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి నవంబర్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలిస్తే ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నిధులు సమకూర్చుకునేందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూర తన నివాసంలో కొందరు కీలక నేతలతో సమావేశమయ్యారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా మారడానికి రాజా కృష్ణమూర్తికి వేదిక సిద్ధంగా ఉందని ఈవెంట్ నిర్వాహకులు ప్రసాద్ తోటకూర అన్నారు. సామాన్య ప్రజల కష్టాలు ఆయనకు తెలుసునని, అమెరికా చరిత్రలోనే ఆయన అత్యుత్తమ రిప్రజెంటేటివ్ కానున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డెమొక్రాటిక్ జాతీయ సదస్సులో ప్రైమరీ ఎన్నికల్లో గెలవడంతో పార్టీలో ఉన్నత వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. దలీప్ సింగ్, బాబీ జిందాల్, అమి బెరా తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన నాల్గవ వ్యక్తి కానున్నారని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన ఎంవిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ... రాజా కృష్ణమూర్తి స్వస్థలం న్యూఢిల్లీ ఆయన చిన్నతనంలోనే కుటుంబంతో పాటు న్యూయార్క్ వచ్చారని తెలిపారు. ఇండో అమెరికన్ సభ్యులకు ఆయన ఓ రోల్ మోడల్ అని, ఆయన విద్యారంగం కోసం విశేషకృషి చేశారని కొనియాడారు. 2004లో అమెరికా సెనేట్ ఎన్నికల కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ విభాగంలో డైరెక్టర్‌గా సేవలు అందించారని పేర్కొన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రుల త్యాగాలే కారణమని, వారికి తాను రుణపడి ఉంటానని రాజా కృష్ణమూర్తి అన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువలు, సాంప్రదాయంపై ఉన్న గౌరవం తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని, అయితే ఇండో అమెరికన్లు ఈ రంగంలోకి రావడం లేదని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న ఇండో అమెరికన్లు విద్యారంగం, మెడిసిన్ , వ్యాపారం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఇతర రంగాలలో రాణిస్తున్నారని, రాజకీయాల్లో కూడా మనం రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసాద్ తోటకూర, పాల్ పాండియన్, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్ సహా తనకు మద్ధతు తెలిపేందుకు వచ్చిన అందరకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నేతల కంటే అధికంగా నిధులు సమకూర్చుకోవడంతోనే రాజా కృష్ణమూర్తి దాదాపు విజయం సాధించినట్లే అని సీసీ థియోఫిన్ అన్నారు. చికాగో మిత్రులంతా త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటును రాజాకు వేయాలని పిలుపునిచ్చారు. సాయి సతీష్, ప్రశాంతి, ఇతర ముఖ్య సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్ తోటకూర, శ్రీదర్ తుమ్మల, ఎంవిఎల్ ప్రసాద్, సీసీ థియోఫిన్, పాల్ పాండియన్, సాయి సతీష్, డార్టర్ ప్రశాంతి గణేశా, స్వరూప తోటకూర, క్రిత్తిక గణేశా, మురళీ వెన్నం, అమృత్ కృపలాణి, మహేష్.జి, ఆర్ చేబ్రోలు, ఫాతిమా, తాయిబ్ కుంద్రావాలా, తన్వీర్, బెనజీర్ అర్ఫీ, అబిద్ అబేది, విజయ అండ్ లక్ష్మణ్ ఉప్పల, డాక్టర్ ఎస్ గుప్తా, మహేశ్ శెట్టి, డాక్టర్ సీఆర్ రావు శ్రీకాంత్.పి, పరిమళ, దినేష్, సింధు, చెన్నకేశవులు మొక్కపాటి, షిజు అబ్రహం, రాఘవేంద్ర కులకర్ణి, అరవింద్ ముప్పిడి, మోహన్ చంద్రన్, మురుగనాథన్.పి, శ్రీనివాస్ కాసు, డాక్టర్ యోగి చిమాటా, డాక్టర్ ధ్రువ్ బాలకొండి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.