
మహాత్ముని స్ఫూర్తి
అహింసా పోరాటంతో జాతికి పథనిర్దేశం చేసిన మహాత్ముడు గాంధీజీ. శతాబ్దాల దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తం చేసిన స్వాతంత్య్ర సమర సేనాని ఆయన. ఆసేతు హిమాచలం యావత్ భారతదేశం ఆయనను జాతిపితగా ఆరాధించింది. ఆయన స్ఫూర్తి భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఖండాంతరాలను కదిలించిన ఆయన వ్యక్తిత్వం ఎందరెందరో మహనీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి కొందరు మహనీయులు చెప్పిన మాటలను మననం చేసుకుందాం.
గాంధీజీ గురించి అభిప్రాయమా..? మంచిది. ఎవరినైనా హిమాలయాల గురించి అభిప్రాయం కోరండి.
- జార్జి బెర్నార్డ్ షా, ఇంగ్లిష్ రచయిత
ఇలాంటి ఒక మనిషి ఈ భూమ్మీద రక్తమాంసాలతో నడయాడాడని రానున్న తరాలు ఊహించనే ఊహించలేవు.
- అల్బర్ట్ ఐన్‌స్టీన్, ‘నోబెల్’గ్రహీత, విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
సామాజిక సమస్యలను హింసాత్మక పద్ధతులతో కాకుండా అహింసతో పరిష్కరించుకోవచ్చని ప్రపంచానికి నిరూపించిన మహాత్ముడు ఆయన. చరిత్రలో మరే నాయకుడూ సాధించని ఘనత ఇది. భారతదేశానికి ఆయన ప్రవక్త కంటే ఎక్కువే. ఆయన యుగపురుషుడు.
- మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, అమెరికన్ నల్లజాతి హక్కుల నేత
దిక్కులేని భారతీయులకు దిక్కుగా మారాడు. వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడాడు.. వాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు.. లక్షలాది భారతీయులను తన రక్తమాంసాలుగా మార్చుకున్నాడు.. సత్యాన్ని సత్యంతో నిద్రలేపాడు!
- రవీంద్రనాథ్ టాగూర్, ‘నోబెల్’ గ్రహీత, కవీంద్రుడు
అజ్ఞానం, వ్యాధులు, నిరుద్యోగం, పేదరికం, హింస అనే శత్రువులపైనే గాంధీజీ పోరాటం సాగించారు. జాతివివక్షపై పోరాటంలో ఆయన నేర్పిన పాఠాలే మాకు మార్గదర్శకాలు.
- నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
మహాత్మాగాంధీపై నాకు గొప్ప గౌరవాభిమానాలు ఉన్నాయి. మానవ స్వభావంపై గాఢమైన అవగాహన గల మహనీయుడు ఆయన. ఆయన జీవితం నన్నెంతగానో ప్రభావితం చేసింది.
- దలైలామా, టిబెటన్ల మత గురువు