ఓట్ల గురించి జాతిపిత.. రాజ్యాంగ నిర్మాతతో మాట్లాడితే.. | - | Sakshi
Sakshi News home page

ఓట్ల గురించి జాతిపిత.. రాజ్యాంగ నిర్మాతతో మాట్లాడితే..

Published Mon, Nov 20 2023 1:32 AM | Last Updated on Mon, Nov 20 2023 1:19 PM

- - Sakshi

సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు సాంచాలు నడుపుతూ బట్ట నేస్తున్నారు. వీధికుక్కలు చలికి ముడుచుకు పడుకున్నాయి. ఒక్కసారిగా చరచరమంటూ గర్జించిన మేఘానికి దిక్కులు దద్ధరిల్లడంతో జాతిపిత మహాత్మాగాంధీ ఉలిక్కిపడి లేచారు. గాంధీచౌక్‌లో నలుదిక్కులూ తేరిపార చూశారు. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం ముందుకెళ్లినా.. బాపూజీ కర్ర పట్టుకుని అంబేడ్కర్‌ విగ్రహం వైపు కదిలారు. మెడనిండా పూలదండలతో చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ఆదమరిచి నిద్రపోతున్న అంబేడ్కర్‌ను పిలిచారు. చిన్నపాటి పిలుపునకే దిగ్గున లేచిన అంబేడ్కర్‌.. ఇంత రాత్రి వేళ వచ్చిన గాంధీజీతో మాట కలిపారు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది.

 గాంధీజీ : ఏం లేదు నాయనా. పొద్దాంత మైకుల మోత. డప్పుసప్పుళ్లు.. నినాదాలతో నే నుండే గాంధీచౌక్‌ దద్దరిల్లుతోంది. వాళ్ల లొల్లి వశపడడం లేదు. ఎప్పటిలాగే పడుకున్న కానీ పొద్దాంత జరుగుతున్న లొల్లి గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు. ఉరుములతో మెల్కువ వచ్చి.. ఇటు వైపు వచ్చిన. నీకేం ఇబ్బంది లేదు కదా.

అంబేడ్కర్‌ : అయ్యో అదేం మాట బాపు. నాకేం ఇబ్బంది లేదు. కానీ నా పరిస్థితి కూడా అంతే. మీరు ఇప్పటి దాకా చెప్పిన పాట్లన్నీ నాకూ తప్ప డం లేదు. కామారెడ్డి–కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాల రద్దీతో మరిన్ని కష్టాలు పడుతున్న. నా కంటే మీరే నయం.

గాంధీజీ : అవునా.. నాయన. శాంతియుత మార్గంలో నేను సాధించి పెట్టిన స్వాతంత్య్రం.. నువ్వు ప్రసాదించిన రాజ్యాంగం చూస్తే.. నా మనసు కలికలి అవుతుంది. నేటితరం నేతలు.. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం పరిధిలోనే తెలంగాణ సాధించామని, నీ గురించి ఎవరూ యాది చేయరేం. ఎవరికీ వారే తెలంగాణ తె చ్చింది మేమే అంటే.. మేమే.. అంటూ అందరూ వాళ్ల డబ్బానే కొట్టుకుంటున్నారు. రాజ్యాంగం రాసిన నీ గురించి ఎవరూ మాట్లాడడం లేదు.

అంబేడ్కర్‌: అవును బాపు.. వాళ్లు యాదిచేస్తే ఎంత చేయకుంటే ఎంత. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మేలు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాబద్ధంగా వచ్చింది. అయినా గిప్పుడు గా ముచ్చట్లు ఎందుకు బాపు. ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్‌.

గాంధీజీ : అవునవును. మొన్న ఓ నాయకుడు నామినేషన్‌ వేసేందుకు ఎంత మందితో ఊరేగింపు తీశారో తెలుసా? డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగుచేసి నామినేషన్‌ వేశారు. ప్రజాసేవ ఇప్పుడు ఎంతో ఖరీదైపోయిందో చూశావా.. ప్రజలకు సేవ చేసేందుకు ఇంత ఆరాటమా?!

అంబేడ్కర్‌ : అంతెందుకు మహాత్మా. ఎన్నికల ప్రచారానికి జనానికి డబ్బులిచ్చి సమీకరించడం, ఊరేగింపులు తీయడ.. పూలదండలతో నిన్ను, నన్ను ముంచెత్తడం నచ్చడం లేదు. చూసే జనానికి నచ్చడం లేదు. నేటి తరం నేతలు నామినేషన్‌ టైమ్‌లోనే డామినేషన్‌ చూపించడం.. గెలిచిన తరువాత జనానికి కనిపించకుండా పోవడం పరిపాటే కదా.

గాంధీజీ: అయ్యో అసలు సంగతి నీకు తెలియదు. ఎన్నికల సమయంలో చాటుమాటుగా మద్యం పంపిణీ చేస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఓట్లు పొందుతున్నారు. మహిళా సంఘాలకు నేరుగా డబ్బులివ్వడం, ఓట్లు మాకే వేయమని ప్రలోభాలకు గురిచేయడం మామూలైపోయింది.

అంబేడ్కర్‌ : అవి కూడా నాకు తెలుసు మహాత్మా. అన్నీ తెలిసి ఈ కుళ్లును చూడలేక.. మీరు కళ్లు మూసుకున్నారు. నేను చూస్తూ కుమిలిపోతున్నాను. మీరు బోధించిన శాంతిమార్గాన్ని ఇప్పుడేలా మర్చారో చూశారా..?

గాంధీజీ : నాయనా.. భీమ్‌రావు.. ఇవన్నీ నాకు తెలియనివి కావు. మీరు దేశవిదేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి హారతి పట్టారు. సచ్చీలురకే పట్టం కట్టేలా రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనల్ని రూపొందించారు. ఇంత చేస్తే ఏం లాభం. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మనం ఎవరిని ఉద్ధరించేందుకు వాటిని రూపొందించామో వారిలో చైతన్యం వచ్చేంత వరకు ఎవరూ ఏమి చేయలేరు.

అంబేడ్కర్‌: అది కాదు మహాత్మా..! ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ పదవిలోకి రాగానే ఆ సొమ్మును వడ్డీతో సహా వందరేట్లు సంపాదించడం.. ఇదంతా ప్రజాసేవ కోసమే అంటే ఎవరైనా నమ్ముతారా..! పార్టీ టిక్కెట్‌ రాకుంటే వెంటనే మరో పార్టీలోకి దూకడం పరిపాటిగా మారింది.

గాంధీజీ : నాయన నువ్వు, నేను ఎంత బాధపడినా లాభం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. చైతన్యం రావాలి. ఎవరూ మంచివారు.. ఎవరు స్వార్థపరులో గుర్తించే సోయి రావాలి. డబ్బుల కోసమో.. కులపోడు అనో ఓటు వేస్తే ఐదేళ్లు బానిసలుగా బతకాల్సిందే. ఎవరి మాటలు వినకుండా.. ఓటును అమ్ముకోకుండా.. నిబద్ధతతో మంచివారికి పట్టం కట్టే రోజులు రావాలి. అప్పుడే సుపరిపాలన సాధ్యం.

అంబేడ్కర్‌ : నిజమే.. మనం ఎన్ని చెబితే ఏమిటి.. ఎన్నికల తీరు చూస్తే సామాన్యులు.. నిస్వార్థపరులు పోటీ చేయగలరా..? పోటీచేసినా తట్టుకోగలరా? నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు దాటొద్దు. కానీ డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారో చూశారా బాపూ! అందరూ ప్రజాసేవ చేస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తున్నారు. మందు పోస్తున్నారు. వాస్తవాలు ఏమిటో అందరికీ తెలిసినా ఓట్లు అమ్ముకుంటూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఓటర్లు మారితేనే మంచి పాలకులు వస్తారు.. వారి బతుకులు మారుతాయి. సరే కాని ఇగ తెల్లారిపోయింది. అదిగో.. వేములవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మొదటి బస్సు రానే వచ్చింది. అటు మున్సిపల్‌ సిబ్బంది చీపుర్లతో వస్తున్నారు... ఇక నేను వెళ్తాను.. అంటూ... గాంధీజీ పెద్ద పెద్ద అడుగులేస్తూ వడివడిగా గాంధీచౌక్‌లోని దిమ్మైపెకి చేరిపోయారు. అంబేడ్కర్‌ సైతం కళ్లద్దాలను సర్దుకుని ఎప్పటిలాగే రాజ్యాంగాన్ని పట్టుకుని నిలబడ్డారు.

అంతలోనే తెల్లారిపోయింది. యథావిధిగా సిరిసిల్ల జనసందడిగా మారింది. మైకుల ప్రచార మోత మళ్లీ మొదలైంది. నినాదాల జోరు తగ్గలేదు. ఆర్భాటపు ప్రచారాలు మరింత పెరిగాయి. ఇదంతా చూస్తున్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లు ఎప్పటిలాగే మనసులోని బాధను అర్ధరాత్రి వేళ ఒకరినొకరు కలుసుకుని చెప్పుకుంటూ గుండెల్లో భారాన్ని దించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement