ఇందుకూరుపేట: మనిషి మనిషిగా జీవించడమే గాంధేయతత్వమని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గాంధీజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. తొలుత ఆశ్రమంలోని గాంధీజీ విగ్రహానికి పూల మాలవేససి నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బాపూజీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.
ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడతుతూ.. ప్రతి ఒక్కరూ గాంధీజీ చెప్పిన సత్యం, అహింస మార్గాలను పాటిస్తే చాలునన్నారు. ఈ తరం వారు గాంధీజీ సిద్ధాంతాలను పాటించట్లేదని, వీరిని చూస్తే మహాత్ముడు బాధపడేవారన్నారు. మహా గాయకుడు జేసుదాసు గాత్రం లేకపోతే గురువాయూర్‌లో సుప్రభాతం లేదని.. కానీ అదే ఆలయంలో ఆయనకు ప్రవేశం లేదన్నారు. దేవుడు అందరి వాడని.. మధ్యలో ఈ నిబంధనలు ఏంటని ప్రశ్నించారు. ఓ తెలుగు అనువాద చిత్రంలోని గాంధీజీ పాత్రకు తన స్వరం అందించానని.. అది జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టమన్నారు. జాతిపిత ప్రారంభించిన ఈ ఆశ్రమాన్ని దేవాలయంగా చూసుకోవాలని బాలసుబ్రహ్మణ్యం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment