సందర్భం
తెలుగు జాతి గర్వించదగిన గాన గంధర్వునిగా, బహుముఖ కళాపారీణునిగా బాలును ఎరగని వాళ్ళుండరు. ఆయన నేపథ్య గాయకునిగా, అద్వితీయునిగా రాణించిన కాలంలో సాటి గాయకుల కెవరికీ అవకాశాలు రాకుండా చేస్తున్నారని కొందరు అసూయాపరులు ఆరోపణలు చేసినా, ‘పాడుతా తీయగా’ కార్యక్రమ వీక్షకులను బాలు వ్యక్తిత్వం, హృదయ సంస్కారం ముగ్ధుల్ని చేశాయి. ఆయన అంతరంగం స్నేహ పారిజాతమని ఆ పరిమళాల్ని శ్వాసించి పరవశించిన ఆత్మీయ మిత్రులకు మాత్రమే తెలుసు.
మాంగల్య బంధం కంటే స్నేహబంధం పటిష్టమైనదనీ, అది ఎప్పటికీ ఇగిరిపోని గంధం అనీ బాలు అభిప్రాయపడేవారు. స్నేహం చేసేముందు అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ, స్నేహం కుదిరిన తర్వాత మిత్రునిలో లోపాలు బయటపడినా వాటిని సరిదిద్దాలి కాని ఏకంగా ఆ బంధాన్ని తెంచుకోకూడదనీ బాలు స్నేహ ధర్మానికి భాష్యం చెప్పేవారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్నేహాన్ని ఒక పవిత్రబంధంగా, పారాయణ గ్రంథంగా పాటించిన మనస్వి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.
బాలు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లనూ, చిన్న నాటి నేస్తాలనూ మర్చిపోలేదు. అందుకు ఆయన కృతజ్ఞతా పూర్వకంగా చేయి అందించిన బీవీ మురళి, ఎమ్ విఠల్‌రావు, వై కామేశ్వరరావు, శ్యామ్, డా‘‘ వై.దివాకర్ వంటి సహచరులు ప్రత్యక్ష సాక్షులు. 1964లో మద్రాసు ఆంధ్రా క్లబ్‌లో జరిగిన లలిత సంగీతం పాటల పోటీలో పాల్గొనడానికి బాలు ఇష్టపడకపోయినా... చెప్పకుండా ప్రవేశ రుసుము చెల్లించి బాలుకి ప్రథమ బహుమతి రావడానికీ, కోదండపాణి వంటి వారి దృష్టిలో పడటానికీ కారకుడు; 1966 డిసెంబరు 15వ తేదీన ‘విజయా గార్డెన్స్’లో తన మొట్టమొదటి సినిమా పాట రికార్డింగ్‌కు సైకిలు మీద తోడుగా వచ్చి ప్రోత్సహించిన తన రూమ్మేట్ బీవీ మురళిని కోదండపాణి ఆడియో లాబ్‌లో ఆడియో అసిస్టెంట్‌గా నియమించడమే కాకుండా ఎన్నో వేదికల మీద అతని సహాయాన్ని గుర్తు చేసుకునేవారు.
రంగస్థలం మీద సహ నటులైన శ్యామ్‌ను స్టూడియో మేనేజర్ గానూ, వై. కామేశ్వరరావును ‘పాడతా తీయగా’లో అసిస్టెంట్ గానూ, కొన్ని చిత్రాలలో నటుడి గానూ అవకాశాలు కల్పించి వారి ఉపాధికి తోడ్పడ్డారు. విఠల్‌ను పీఏగా పెట్టుకోవడమే కాకుండా తన ఇంటికి దగ్గర్లో అతనికో ఇల్లు కట్టించడంతో పాటు అనేక విధాలుగా ఆదుకున్నారు.
‘ఈటీవీ’ వారి వార్షికోత్సవ సంగీత కార్యక్రమంలో తను మెచ్చిన రాంప్రసాద్‌ను ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి పరిశోధకునిగా చివరి వరకు కొనసాగించారు.
బాలు స్నేహ ప్రీతి బాల్యమిత్రులకే పరిమితం కాలేదు. స్టూడియో నిర్మాణానికి సహకరించిన ప్రాణమిత్రుడు బిల్డర్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా జూన్ 1వ తేదీన చనిపోతే ఆనాటి నుంచి బాలు తన పుట్టినరోజును (జూన్ 4వ తేదీ) అట్టహాసంగా జరుపుకోవడం మానేశారు. ఎమ్వీఎల్, వై. కామేశ్వరరావు వంటి ఆప్తమిత్రుల అవసాన దశలలో వారిని బతికించడానికి హాస్పిటల్స్‌కు సంబంధించిన మొత్తం ఖర్చులను భరించారు. ఎమ్వీఎల్ చనిపోయిన తరువాత కూడా అతని స్నేహ బృందాన్నీ, నూజివీడునూ మర్చిపోకుండా అనేక స్మారక కార్యక్రమాలకు హాజరయిన స్నేహశీలి, ఆత్మ బంధువు బాలు.
1990లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా పరిచయమైన ఈ వ్యాసకర్త సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ను అయాచితంగా, ఐచ్ఛికంగా స్పాన్సర్ చేసి ప్రచురించడమే కాకుండా దానికి విస్తృత ప్రాచుర్యాన్ని కలిగించారు బాలు. స్వల్ప పరిచయం స్నేహంగా మారడానికీ, ఈ వ్యాసకర్తకు సినీగేయ సాహిత్య పరిశోధకునిగా గుర్తింపు రావడానికీ బాలు సహృదయతే కారణం. నంది పురస్కారాల నందుకున్న వ్యాసకర్త రెండు సిద్ధాంత గ్రంథాలనూ స్పాన్సర్ చేసిన బాలు స్నేహ వాత్సల్యాన్ని ఈ రచయిత మర్చిపోలేడు. వెన్నెలకంటి ప్రతిభను గుర్తించి అతనిని సినీరంగంలో ప్రోత్సహించడం, డా‘‘ పీఎస్ గోపాలకృష్ణ రచనలు ‘మన ఘంటసాల’, తన జీవిత చరిత్ర ‘జీవన గానాలు’కు బాసటగా నిలవడం బాలు ఉత్తమాభిరుచికి నిదర్శనాలు.
1993 ఫిబ్రవరిలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లక్షలు వెచ్చించి మద్రాసు చిత్ర పరిశ్రమలోని తన మిత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించి సత్కరించడం బాలు మైత్రీ యానంలో ఓ మైలురాయి.
బాలుది బాలుడి మనస్తత్వం. ఆ విషయాన్ని ఘంటసాల విగ్రహావిష్కరణ సభలో అతని కన్నీళ్లు రుజువు చేశాయి. బాలు సంగీత సత్కార వేదికల మీద ఎన్నో సార్లు తన అంతిమ క్షణాల గురించి ప్రస్తావించేవారు. తనను నూరేళ్ల వరకు మృత్యువు సమీపించదనీ, మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలనీ, అప్పుడు కూడా తన మిత్రులు, అభిమానులు తనతో ఉండాలని కోరుకుంటున్నాననీ అనేవారు. పసి మనస్సును తలపించే ఆ మహోన్నత మూర్తి పుట్టినరోజున ఆయన ఆత్మకు అంజలి ఘటిద్దాం. అంతటి మహనీయుని సమకాలికులుగా పుట్టినందుకు, ఆయన స్నేహ సంపదను పంచుకున్నందుకు జన్మ ధన్యమైందని గర్విద్దాం.
డా‘‘ పైడిపాల
వ్యాసకర్త సినీగేయ పరిశోధకులు ‘ 99891 06162
(నేడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి)
Comments
Please login to add a commentAdd a comment