ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సింగర్ అవ్వాలని అనుకోలేదు. కానీ గాయకుడిగా మారాక పాటనే ప్రాణంగా ప్రేమించాడు. నటన, నిర్మాణం, డబ్బింగ్ ఇలా ఎన్నింటిలోనూ రంగ ప్రవేశం చేశారు.. కానీ పాటల పల్లకితోనే చివరి వరకూ ప్రయాణం చేశారు. చావు అంచున ఉన్న చివరి క్షణాల్లోనూ పాడుతూ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవాలన్నది ఆయన చివరి కోరిక. మరి ఆయన పాడిన మొదటి పాట, ఆఖరు పాట ఏంటో తెలుసుకుందాం. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం ద్వారా ఎస్పీ బాలుకు తొలిసారి వెండితెరపై ఓ పాట పాడే అవకాశం లభించింది. (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’)
1966లో విడుదలైన ఈ సినిమాకు ఎస్‌పి కోదండపాణి సంగీతం అందించారు. నటుడు, నిర్మాత పద్మనాభం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో గాయని పి.సుశీలతో కలిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆలపించారు. చివరగా.. గత ఏడాది వచ్చిన 'పలాస 1978' సినిమాలో 'ఓ సొగసరి' అనే పాటను పలాస బేబీతో కలిసి పాడారు. లక్ష్మి భూపాల రాసిన ఈ పాటకు రఘు కుంచె సంగీతం అందించారు. బాలు తన కెరీర్‌లో 16 భాషల్లో 40 వేల పై చిలుకు పాటలు పాడి, అత్యధిక పాటలు పాడిన సింగర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. (చదవండి: పాట కోసమే ఆయన పుట్టారు..)
Comments
Please login to add a commentAdd a comment