
డాటర్ ఆఫ్ కైలాష్ సత్యార్థి
కైలాష్ సత్యార్థిని నోబెల్ శాంతి బహుమతి వరించడం... యావత్ భారతదేశానికి సంతోషకరమైన విషయం. ఆయనతో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేని వారికి కూడా, ఆయన సేవాకార్యక్రమాలను గురించి, ఆయన సామాజిక నిబద్ధత గురించి వివరంగా తెలుసు. అలాంటి వారందరికీ నోబెల్ వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
మరి కైలాష్ సత్యార్థి కూతురు అస్మిత పరిస్థితి ఏమిటి?
నాన్నకు నోబెల్ బహుమతి ప్రకటించారు... అనే శుభవార్త తెలియగానే ఆమె ఎలా స్పందించారు?
‘‘ఆ వార్త తెలియగానే ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆయన చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ పెరిగాను. వాటిలో భాగం పంచుకున్నాను’’ అన్నారు అస్మిత.
నాన్నతో సంతోషం పంచుకోవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు అస్మిత. తాను ఊహించినట్లుగా... ఏమీ కనిపించలేదు ఆయన. ఎప్పటిలాగే ఉన్నారు.
‘‘నాకంటే ముందు గాంధీజీకి రావాల్సింది’’ అన్నారు ఆయన, నోబెల్ బహుమతిని ప్రస్తావిస్తూ. గాంధేయవాది అయిన కైలాష్ మాటల్లో ఎక్కడా గర్వపు నీడ కనిపించలేదు. ఆ కళ్లు ఎప్పటిలాగే ‘‘చేయాల్సింది చాలా ఉంది’’ అని చెబుతున్నట్లుగానే ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్‌బి) స్టూడెంట్ అయిన అస్మిత సత్యార్థి సామాజిక మార్పులో వ్యాపారం ఎంత కీలకమో చెబుతారు.
నాన్న తన రోల్‌మోడల్. ఆయన ఆదర్శ భావాలతో లోతుగా ప్రభావితమయ్యారు అస్మిత.
‘‘ఎన్నో కార్యక్రమాలలో నాన్న చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రభావం సహజంగానే నా మీద ఉంది’’ అంటారు అస్మిత.
ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేసినా అస్మిత మంచి కథక్ నృత్యకారిణి కూడా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నృత్యప్రదర్శన ఇచ్చారు. విశేషమేమిటంటే, పది సంవత్సరాల వయసులోనే ‘యుఎస్ కాంగ్రెస్’లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది అస్మిత.
మళ్లీ నోబెల్ దగ్గరికి వద్దాం... నోబెల్ శాంతి బహుమతితో కైలాష్ సత్యార్థి బాధ్యత రెట్టింపు అయింది అనేదానితో అస్మిత ఏకీభవిస్తున్నారు.
‘‘నాన్న చేస్తున్న పనులను చూసి గర్వించడమే కాదు... ఆయన అడుగు జాడల్లో నడవడం కూడా ఇప్పుడు నా భుజస్కంధాలపై ఉన్న బాధ్యత’’ అంటున్నారు అస్మిత.
లైక్ ఫాదర్ లైక్ డాటర్!