మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగంచేసిన మహనీయుల ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ.. అన్ని మతాలప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి ప్రశాంత జీవనం గడుపుతున్నారని అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు నేటికీ అన్నివర్గాల ప్రజలకు సమానంగా దక్కడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోని పేదప్రజల అభ్యున్నతికి పాలకవర్గాలు నిజాయితీగా పనిచేయాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఇందిరమ్మ పథకం పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తుచేశారు. అన్ని రంగాలకు ఆర్థిక వనరులు కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారని కొనియాడారు. పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించి వాటిని బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
కార్యక్రమంలో పార్టీ మైనార్టీ, యువజన విభాగాల జిల్లా కన్వీనర్లు సయ్యద్ సిరాజుద్దీన్, ఆర్.రవిప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భీమయ్యగౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు పులిజాల రవికిరణ్, నాయకులు హైదర్ అలీ, రాశెద్‌ఖాన్, సర్దార్, ముజాహిద్, అనంతయ్య, నాగరాజు, ఆర్టీసీ జహంగీర్, యూసుఫ్ ఖలీల్, బోయపల్లి జహంగీర్ హుస్సేన్, అంజాద్, ప్రదీప్, కురుమూర్తి, సతీష్‌గౌడ్, ప్రవీణ్, రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.