స్వాతంత్య్ర జ్వాల... | Jallianwala Bagh Story | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర జ్వాల...

Published Sat, Apr 9 2016 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

స్వాతంత్య్ర జ్వాల...

స్వాతంత్య్ర జ్వాల...

జలియన్‌వాలా
బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు తక్షణ ప్రేరణ... జలియన్‌వాలా బాగ్ దురంతం.
ఈ ఘోర ఘటన తర్వాతే గాంధీజీ సహాయ నిరాకరణ మొదలైంది.
నిరాకరణ నిరసన అయ్యింది.
నిరసన సత్యాగ్రహం అయింది. సత్యాగ్రహం ఆయుధం అయ్యింది.
ఆ ఆయుధమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది.


‘అన్ని యుద్ధాలనూ అంతం చేయడానికి చేస్తున్న యుద్ధం’ అంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో నినాదం ఇచ్చిన ఇంగ్లండ్, ఆ తరువాత భారతీయుల మీద మాత్రం తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అందుకు నిలువెత్తు నిదర్శనమే జలియన్‌వాలా బాగ్ దురంతం (ఏప్రిల్ 13, 1919). గ్రేట్‌వార్ ముగిసిన కొన్ని నెలలకే ఈ ఘోరాన్ని ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో నమోదు చేసింది. రెండువేల మంది దేశభక్తుల రక్తంతో తడిసిన నేల అని జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం మీద రాసి ఉంటుంది.

పిలుపు అందుకుంది పంజాబీలే!
జలియన్‌వాలా బాగ్ నెత్తుటి కాండకు ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్ చరిత్ర దగ్గరకు నడవాలి. నాటి భారత రాజకీయ, స్వాతంత్య్రో ద్యమ సన్నివేశాలను, మనోభావాలను శోధించాలి. ఆ యుద్ధంలో సిక్కులు చూపించిన తెగువను జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ప్రపంచ సంగ్రామంలో 13 లక్షల మంది భార త సైనికులు పాల్గొన్నారు. మొత్తం 74,000 మంది చనిపోయారు. మిగిలిన భారత భూభాగాల కంటే పంజాబ్.. బ్రిటిష్ జాతికి మరింత సేవ చేసిందనే చెప్పాలి.

యుద్ధం ఆరంభించే సమయానికి (1914) భారత వలస సైన్యంలో సిక్కుల సంఖ్య దాదాపు లక్ష. ‘యుద్ధంలో చేరి వీరత్వం ప్రదర్శించ’మంటూ  ఇంగ్లండ్ ప్రభుత్వంలో వార్ కార్యదర్శి లార్డ్ కిష్నర్ ఇచ్చిన పిలుపునకు గాఢంగా స్పందించిన వారు పంజాబీలే. కిష్నర్ ప్రకటన తరువాత  పంజాబీ సైనికుల సంఖ్య  3,80,000కు చేరుకుంది. అంతేకాదు, రెండుకోట్లు యుద్ధ నిధి ఈ ప్రాంతం నుంచి వెళ్లింది. పది కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించిన వార్ బాండ్లను తీసుకున్నది కూడా పంజాబీలే. కానీ యుద్ధంలో వీరు అనుభవించిన వేదన వర్ణనాతీతం.
 
‘‘... రోజూ వేలమంది మనుషులు చనిపోతున్నారు... చూడబోతే యుద్ధం ముగిసే సరికి రెండు వైపులా ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు శాంతి నెలకొనకుండా ఉంటుందా?’’ అంటూ ఇషేర్‌సింగ్ (59వ సిఖ్ రైఫిల్స్ దళ సభ్యుడు) పంజాబ్‌లోని తన మిత్రుడికి రాసిన లేఖ (మే 1, 1915) లోని ఈ మాటలు ఆ వేదనకు ఒక నిదర్శనం. భారతదేశం మొత్తం మీద ప్రతి 150 మందికి ఒకరు యుద్ధానికి వెళితే, ప్రతి 28 మంది పంజాబీలకూ 1 సిపాయి వంతున ప్రపంచ యుద్ధంలో పోరాడాడు.
 
గాంధీజీపై అనిబిసెంట్ ఆగ్రహం!
ఆ ఘోర యుద్ధంలో వలస భారత సైనికులను ఉపయోగించుకోవడం మీద ఆనాటి స్వాతంత్య్రోద్యమ నేతలలో ఏకాభిప్రాయం లేదు. చెప్పాలంటే గట్టి వ్యతిరేకతే ఉంది. యుద్ధం చేస్తున్న ఇంగ్లండ్ అవసరాలను తీరుస్తానంటూ ముందుకొచ్చిన గాంధీజీ సైతం విమర్శలపాలు కావలసి వచ్చింది. ఊరికి 20 మంది బలశాలురైన యువకులు చేరాలంటూ గుజరాత్ ప్రాంతమంతా గాంధీజీ పాదయాత్ర చేశారు. మొత్తానికి నలభై మంది మాత్రం చేరారు.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకో వలసిందిగా సర్దార్ పటేల్‌ను గాంధీజీ కోరినా ఆయన నిరాకరించడం విశేషం. అహింసా సిద్ధాంతం వదిలి గాంధీజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనిబిసెంట్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. గాంధీజీని ఆమె ‘రిక్రూటింగ్ సార్జెంట్’ అని ఎద్దేవా చేశారు. అయినా గాంధీజీకి ఒక ఆశ. ఆ యుద్ధంలో బ్రిటన్‌కు సహకరిస్తే, భారతీయుల  ‘స్వరాజ్యం’, ‘స్వయం పాలన’ కోరికలకు కదలిక వస్తుందని అనుకున్నారు. కానీ యుద్ధంతో సతమత మవుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవాలన్నది చాలామంది తీవ్ర జాతీయవాదుల ఆశయం. అందులో గదర్ పార్టీ ప్రధానమైనది.

ఈ పార్టీలో ఎక్కువ మంది పంజాబ్, బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే (తెలుగు ప్రాంతం నుంచి దర్శి చెంచయ్య వెళ్లి ఈ పార్టీలో పనిచేశారు). 1857 తరహాలో 1915 ఫిబ్రవరిలో ఒక తిరుగుబాటు తేవాలన్న యోచన కూడా బలీయంగా ఉంది. ఇలాంటి విస్తృత పథకానికి వ్యూహం పన్నినవారు అమెరికా, జర్మనీ దేశాలలో ఉండి భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్నవారే. ఇందుకు 1914 నుంచి 1917 వరకు చాలా కృషి జరిగింది. కానీ గదర్ పార్టీలోకి గూఢచారులు చొచ్చుకుపోవడం వల్ల రహస్యాలు బయటకు పొక్కి పథకం విఫలమైంది.

డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం -1915 ఈ పరిణామాల ఫలితమే. దీనికి కొనసాగింపు సెడిషన్ కమిటీ 1918. సిడ్నీ రౌలట్ (న్యాయమూర్తి) దీని అధ్యక్షుడు. జర్మన్, బొల్షివిక్-భారత తీవ్ర జాతీయవాదుల మధ్య సంబంధాలను వెలికి తీయడం కూడా ఈ కమిటీ విధులలో ఒకటి. అలా వచ్చింది రౌలట్ చట్టం. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమే జలియన్‌వాలాబాగ్ దురంతం.
 
బాగ్ ఘటనకు బీజం ఇక్కడే!
ఒక పక్క అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తూనే, మరోపక్క గ్రేట్‌వార్‌లో బ్రిటిష్ వారికి సాయం చేయాలని గాంధీజీ యోచించారు. సరిగ్గా ఈ అంశం మీదే ఉద్యమకారులు రెండు వర్గాలయ్యారు. అహింసా పథానికీ, భూగోళాన్ని రక్తంతో తడుపుతున్న మొదటి ప్రపంచ యుద్ధానికి చేయూతనివ్వడానికీ  పొంతన లేదన్నదే తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం. అయినా గాంధీజీ అహింసాయుత పంథాలోనే ఎక్కువ మంది కాంగ్రెస్‌వాదులు నడిచారు.

పంజాబ్ ప్రముఖులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ గాంధీజీ అహింసా ప్రబోధాలను విశ్వసించినవారే. ఈ ఇద్దరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 10, 1919న అరెస్టు చేసి, రహస్య ప్రదేశంలో ఉంచింది. గాంధీజీ అహింసను ప్రజలకు తెలియచేసే క్రమంలో... అరెస్టయిన వీరి విడుదల కోసం  హింసాత్మక ఉద్యమం మొదలైంది. మైఖేల్ ఓడ్వయ్యర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్.

అమృత్‌సర్ మిలిటరీ కమాండర్ - బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్. సత్యపాల్, కిచ్లూ అరెస్టయిన రోజునే అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ (పంజాబ్) నివాసం ఎదుట ఆందోళన జరిగింది. కాల్పులు జరిగాయి. ముగ్గురు బ్యాంక్ అధికారులను కార్యాలయాల్లోనే జనం హత్య చేశారు. ఏప్రిల్ 11న మార్సెల్లా షేర్‌వుడ్ అనే మహిళా మిషనరీని సైకిల్ మీద నుంచి పడేసి చంపారు.
 
ఈ పరిణామాల తరువాత సత్యపాల్, కిచ్లూలను విడుదల చేసి, సైనిక శాసనం విధించారు. అప్పుడే, అంటే ఏప్రిల్ 13న సిక్కుల పండుగ ైవె శాఖి వచ్చింది. సైనిక శాసనం గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల సిక్కులు ఏటా అక్కడ జరిగే ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ఉత్సవం తరువాతే సభ జరుగుతుందని గూఢచారుల ద్వారా జనరల్ డయ్యర్‌కు సమాచారం అందింది.
 
డయ్యర్‌కు పార్లమెంట్ ప్రశంస!
నిజానికి బాగ్‌లో కాల్పులు జరిపే ఉద్దేశం డయ్యర్‌కు లేదని నిక్ లాయిడ్ (ది అమృత్‌సర్ మేసకర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ వన్ ఫేట్‌ఫుల్ డే) అనే చరిత్రకారుడు అంటాడు. 90 మంది బలగం (బలూచీ, గూర్ఖా దళాలు)తో  నగరంలో సైనిక శాసనం అమలును పర్యవేక్షిస్తున్నాడు డయ్యర్. ఆరేడు ఎకరాల బాగ్‌లో జరుగుతున్న సభ దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ 15 వేల నుంచి 25 వేల వరకు అక్కడ జనం ఉండడం గమనించి, వెంటనే కాల్పుల నిర్ణయం తీసుకున్నాడు.
 
ఈ ఘట్టం రక్తదాహానికీ ప్రబల నిదర్శనం. అమానవీయతకు, వలసవాదానికీ మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిన రక్తరేఖ. ఈ దురంతానికి పాల్పడిన డయ్యర్‌ను నాటి బ్రిటిష్ పార్లమెంట్ శ్లాఘించడమే విచిత్రం.
 
టాగూర్ తిరిగి ఇచ్చేశారు!
జలియన్‌వాలా బాగ్ కాల్పులు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘోర ఉదంతం. చరిత్ర మీద కనిపించే దీని జాడే అందుకు నిదర్శనం. కాల్పుల సమాచారం తెలియగానే రవీంద్రనాథ్ టాగూర్ తన సర్ బిరుదును త్యజించారు (మే 22న గానీ ఘటన సంగతి బెంగాల్ చేరలేదు, గాంధీజీకి జూన్‌లో ఈ సంగతి తెలిసింది). జనరల్ డయ్యర్‌ను శిక్షించాలని బ్రిటిష్ ప్రముఖుడు విన్‌స్టన్ చర్చిల్ ప్రతినిధుల సభలో (జూలై 8, 1920న) కోరడం విశేషం.

అమృత్‌సర్ అమానుషానికి బాధ్యునిగా ప్రసిద్ధికెక్కిన ఓడ్వయ్యర్‌ను మార్చి 13, 1940న లండన్ నగరంలో ఉన్న క్యాక్స్‌టన్ హాలులో రెండు దశాబ్దాల తరువాత ఉధమ్‌సింగ్ కాల్చి చంపాడు. పసితనంలో చూసిన ఆ బీభత్సం అతడిని ఈ హత్యకు పురికొల్పింది. తరువాత ఇంగ్లండ్ దమననీతి ఎలాంటిదో చూడండంటూ జర్మన్ అనుకూల దేశాలు తరువాత జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశాయి.
 కొసమెరుపు: 1961, 1983 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించారు.

అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ఘటించి వెనుదిరిగారు. అక్టోబర్ 13, 1997న మళ్లీ భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి వచ్చారు. డయ్యర్ కుమారుడు చెప్పిన దానిని బట్టి ఫిలిప్ ఈ సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న సంస్మరణ ఫలకం మీద అంకెను చూసి ఇంతమంది మరణించలేదని నాకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించాడు.

బ్రిటిష్‌రాణి ‘మన గతం ఇబ్బందికరమైనది....’ అని కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. ఫిబ్రవరి, 2013లో నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించాడు. మృతులకు నివాళి ఘటించాడు. ఈ ఘోర దురంతం మీద బ్రిటిష్ నేతల నుంచి సాంత్వన వాక్యాలు వస్తాయని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది.
 - డా॥గోపరాజు నారాయణరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement