jallianwala bagh
-
ఆదివాసీల ‘జలియన్‌వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సావాన్‌లో ఏం జరిగింది?
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని ప్రజలంతా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కన్నారు. అటు జలియన్‌వాలాబాగ్ ఉదంతం, ఇటు విభజన వేదన లాంటివన్నీ మరచిపోయి ముందుకు సాగాలనే తపన నాటి ప్రజల్లో అణువణువునా ఉండేది. అయితే స్వాతంత్య్రం వచ్చిన 138 రోజులకు దేశంలోని ఆదివాసీలు ‘జలియన్‌వాలాబాగ్’ లాంటి మరో దారుణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒరిస్సా పోలీసులు నిరాయుధులైన గిరిజనులను చుట్టుముట్టి, స్టెన్ గన్లతో వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 2000 మంది మృతి చెందారు. ఈ దారుణం 1948, జనవరి ఒకటిన చోటుచేసుకుంది. ఖర్సావాన్ ప్రాంతం జంషెడ్పూర్(జార్ఖండ్) నుండి కేవలం 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత సెరైకెలా, ఖర్సావాన్‌లను ఒరిస్సాలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఒడియా మాట్లాడే వారు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రెండు ప్రాంతాలలో ఉంటున్న గిరిజనులు తమను బీహార్లోనే ఉంచాలని కోరారు. నాటి రోజుల్లో జైపాల్ సింగ్ ముండా అనే గిరిజన నేత పిలుపు మేరకు నిరసనలు చేపట్టేందుకు దాదాపు 50 వేల మంది గిరిజనులు ఖర్సావాన్‌కు తరలివచ్చారు. ఒరిస్సా ప్రభుత్వం ఈ ఆందోళనను అణచివేయాలని భావించింది. ఒరిస్సా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖర్సావాన్‌ను కంటోన్మెంట్‌గా మార్చారు. సైనిక బలగాలను మోహరించారు. అయితే ఏవో కారణాలతో జైపాల్ సింగ్.. ఖర్సావాన్ చేరుకోలేకపోయాడు. దీంతో 50 వేల మంది గిరిజనులు ఈ విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం ఖర్సావాన్ మైదానంలో తిరిగి సమావేశమయ్యారు. కొందరు గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఒరిస్సా మిలటరీ సైనికులు గిరిజనులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణం అనంతరం కేవలం 35 మంది గిరిజనుల మరణాన్ని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కోల్‌కతా నుండి ప్రచురితమయ్యే స్టేట్స్‌మన్ అనే ఆంగ్ల వార్తాపత్రిక 1948 జనవరి 3న ఆందోళనల్లో 35 మంది గిరిజనులు మరణించిన వార్తను ప్రచురించింది. కాగా మాజీ ఎంపీ మహారాజా పీకే దేవ్ రాసిన ‘మెమోయిర్ ఆఫ్ ఎ బైగోన్ ఎరా’ పుస్తకంలో నాటి ఆందోళనలో రెండు వేలమంది గిరిజనులు హత్యకు గురయ్యారని రాశారు. నాటి కాల్పుల్లో వేలాది మంది ఆదివాసీలు మృతి చెందారని అప్పటి నేతలు కూడా ప్రకటించారు. ఒరిస్సా మిలటరీ సైనికులు సాగించిన ఈ దురాగతానికి సంబంధించిన చాలా పత్రాలు అందుబాటులో లేవు. అయితే ఈ ఘటనపై పలు కమిటీలు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. విచారణ కూడా జరిగింది. కానీ ఈ ఫలితాలు ఏమిటో నేటికీ వెల్లడికాలేదు. ‘జలియన్ వాలాబాగ్’ దారుణం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన ఘటన. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు వచ్చిన వారిపై జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెయ్యి మందికి పైగా మరణించగా, రెండువేల మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: యుద్ధ నేరం అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం చేస్తుంది? -
జనరల్ డయ్యర్‌ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్‌వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్‌ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్‌ను క్షమించారు. ‘డయ్యర్‌ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్‌కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్‌పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్‌వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్‌వాలాబాగ్‌లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్‌కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్‌ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం
కొరాపుట్(భువనేశ్వర్): అది 1942 ఆగస్టు 24వ తేదీ. భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన జలియన్ వాలా బాగ్ దురంతం వంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బ్రిటీష్ సైనికుల కాల్పులకు 19 మంది స్వాతంత్య్ర సమరయోధులు అశువులు బాశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున అమరులయ్యారు. నాటి రోజుల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు దక్షిణ ఒడిశాకు చేరడంతో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని దండకారణ్యంలో మన్యంవీరుల్లో కదలిక వచ్చింది. నందాహండి, తెంతులకుంటి, జొరిగాం, డాబుగాం, పపడాహండి సమితుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు జరిగాయి. 1942 ఆగస్టు 14న స్థానిక సమరయెధుడు మాధవ ప్రధాని భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఈ సభ నబరంగ్‌పూర్ సమీపంలోని చికిలి వద్ద జరగాల్సి ఉంది. సుమారు 200 మంది ప్రజలు గూమిగూడారు అని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిలి నది ఒడ్డుకు ఎవరూ చేరకుండా వంతెన కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్వాతంత్య్ర సమరయెధుడు సోను మజ్జి నేతృత్వంలో ఉద్యమకారులు జఠాబల్ వంతెన కూల్చివేశారు. ఆగస్టు 24వ తేదీన సుమారు 500 మంది ఉద్యమకారులు పపడాహండి వద్ద టురి నదిపై ఉన్న వంతెన కూల్చి వేయడానికి బయల్దేరారు. వీరికి మాధవ ప్రధానితో ఉన్న 200 మంది ఉద్యమకారులు జత కలిశారు. దీంతో వీరిని నిలువరించేందుకు జయపురం, నబరంగ్పూర్ల నుంచి రిజర్వ్ పోలీసు బలగాలు టురి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వంతెనకు ఒకవైపు పోలీసులు మరోవైపు ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు వంతెనపైకి రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నదిలో రక్తం ప్రవహించిన వేళ పోలీసుల కాల్పులకు అక్కడికక్కడే 11 మంది స్వాతంత్య్ర సమరయోధులు కనుమూశారు. మరో 7గురు నబరంగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయారు. పదుల సంఖ్యలో నదిలో పడి గల్లంతయ్యారు. అనేక మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. 140 మంది అరెస్టై జైలు పాలయ్యారు. ఫలితంగా టురి నది రక్తంతో పారినట్లు నాటి ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం గల్లంతైన వారి కోసం గాలించినా లాభం లేకపోయింది. 1980 ఆగస్టు 24న అదే చోట అప్పటి రాష్ట్ర మంత్రి, స్వాతంత్య్ర సమరయెధుడు రాధాకృష్ట విశ్వాస్ రాయ్, స్థానిక ఎమ్మెల్యే హబిబుల్లాఖాన్లు సాయుధ స్థూపం కోసం శంకుస్థాపన చేశారు. 1984 మే 23న అప్పటి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ పాండే ఈ స్థూపాన్ని ప్రారంభించారు. స్థూపం మీద చనిపోయిన 19 మంది ఉద్యమకారుల పేర్లు లిఖించారు. నాటి నుండి నేటి వరకు అగస్టు 24న ఉద్యమకారుల కుటుంబాలను అక్కడ సత్కరిస్తున్నారు. వారి ఆచారాలకు అనుగుణంగా టురి నదిలో పిండ ప్రధానం చేస్తున్నారు. అనంతరం 2011లో డాబుగాం ఎమ్మెల్యే భుజబల్ మజ్జి తన కోటా నిధులతో అక్కడ స్మారక మందిరం నిర్మించారు. ప్రభుత్వం 24 మంది స్వాతంత్య్ర సమరయెధుల విగ్రహాలు, 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బుధవారం జరగనున్న కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. -
ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది: దీప్తి నావల్
‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్‌సర్‌లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది. దీప్తి నావల్‌కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్‌ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్‌తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. 70 ఏళ్ల వయసులో... దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్‌సర్‌లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్‌సర్‌తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి. ఇంటి పేరు మార్పు దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్‌సర్‌లోని హాల్ బజార్లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం. దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్‌కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్. 20 ఏళ్ల కృషి దీప్తి నావల్ పర్ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్‌గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్‌ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది. జపాన్‌లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్‌గా పని చేస్తూ రాజ్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్‌ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే. -
విదురాశ్వత్థ
జలియన్‌వాలాబాగ్ వంటి మారణకాండే ఒకటి దక్షిణ భారతదేశంలోనూ జరిగింది. అది కూడా ఏప్రిల్ నెలలోనే. కర్ణాటక, చిక్‌బళ్లాపూర్ జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని విదురాశ్వత్థ అనే గ్రామం అందుకు ప్రత్యక్ష సాక్షి. ‘జలియన్‌వాలా బాగ్’ అనేది ఏడెకరాల విస్తీర్ణంలోని ఒక తోట. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వర్ణాలయ ప్రాంగణానికి దగ్గర్లో ఆ తోట ఉండేది. ఇప్పటికీ ఉంది కానీ, జలియన్‌వాలా బాగ్ అనగానే ఆనాటి తోట గుర్తుకు రాదు. ఆ ప్రదేశంలో జరిగిన ఊచకోత, రక్తపాతం.. ప్రతి భారతీయునికీ స్ఫురణకు వస్తాయి. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఆదేశాలపై బ్రిటన్ సైనికులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో 379 మంది భారతీయులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎంతోమంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఏకబిగిన 10 నిముషాల పాటు జరిగిన 1650 రౌండ్ల కాల్పులలో అనధికారికంగా వెయ్యి మందికి పైగానే మరణించారు. రెండు వేలమందికి పైగా గాయపడ్డారు. పంజాబీలకు ముఖ్యమైన ‘వైశాఖీ’ పండుగ ఆ రోజు. వేడుకలకు, విహారానికి వచ్చి ఆరోజు సాయంత్రం వరకు తోటలో ఉన్న వారిపై సూర్యాస్తమయానికి ఆరు నిముషాల ముందు హటాత్తుగా తూటాల వర్షం కురిసింది. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు పెడుతున్న జాతీయోద్యమకారులు వైశాఖి వేడుకల్లో కలిసిపోయి ఉన్నారని అనుమానించిన బ్రిటష్ సైన్యం జరిపిన కాల్పులు అవి. ఆ దురంతానికి నూరేళ్లు కావస్తున్న సందర్భంలో 2019లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే అలా జరిగి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనూ ఇలాంటి మారణకాండే ఒకటి జరిగింది. అది కూడా ఏప్రిల్ నెలలోనే. కర్ణాటక, చిక్‌బళ్లాపూర్ జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని విదురాశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న జాతీయ కాంగ్రెస్ నేతల నాయకత్వంలో కొంతమంది స్థానికులు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ జెండాను ఎగరేసేందుకు గ్రామ కూడలికి చేరుకున్నారు. బ్రిటిష్ పాలన ఉండగా భారతీయ జెండాను ఎగరేయడం అంటే తిరుగుబాటుకు అది పరాకాష్ట. ప్రభుత్వం సమ్మతించలేదు. గ్రామస్థులు జెండా ఎగరేయడానికే నిశ్చయించుకున్నారు. వారిని చెదరగొట్టడం కోసం సైనికులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 35 మంది గ్రామస్థులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. దాంతో విదురాశ్వత్థ గ్రామం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. విషయం తెలుసుకున్న గాంధీజీ మొదట సర్దార్‌పటేల్‌ను, ఆచార్య కృపలానీని విదురాశ్వత్థకు పంపారు. తర్వాత తనే స్వయంగా వెళ్లారు. 1939లో మీర్జా–పటేల్ ఒప్పందం కుదరడానికి దారితీసింది ఈ మారణకాండే. అప్పటి మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్‌కు, భారత రాజనీతిజ్ఞులు పటేల్‌కు మధ్య జరిగిన ఆ ఒప్పందం ఫలితంగా మైసూర్ రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడింది.హింసాఘటన–అహింసా ప్రతిఘటనల పోలికలతో దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్గా విదురాశ్వత్థ వాడుకలోకి వచ్చింది. విదురాశ్వత్థలో బ్రిటిష్ సైనికుల కాల్పులకు అమాయకపు పౌరులు మరణించిన చోట 1971లో భారత ప్రభుత్వం ఒక స్మారక చిహ్నాన్ని కట్టించింది. ఊళ్లో ఉండే అశ్వథ వృక్షం వల్ల ఊరికి ఆ పేరు వచ్చింది. భారతంలోని ఒక ఇతిహాసాన్ని బట్టి దృతరాష్ట్రుని కొలువులో ఉండే విదరురు ఆ వృక్షాన్ని నాటాడని అంటారు. అందుకే ఆ గ్రామానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. భారతంలో ఎలా ఉన్నా.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తిరుగుబాటు స్ఫూర్తికి ఈ గ్రామం ఒక చిహ్నంలా నిలిచిపోయింది. వృక్షం మాత్రం 2001లో కూలిపోయింది. (చదవండి: తొలి భారతీయుడు! అమిత సత్యవాది) -
‘అర్ధనగ్న చిత్రాల ప్రదర్శన సిగ్గుచేటు’
అమృత్సర్: బ్రిటిష్ పాలకులు అమలు చేసిన పైశాచిక విధానాల చరిత్రను నేటి తరం తెలుసుకునే విధంగా జలియన్‌వాలాబాగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే పునరుద్దరించిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రాలు అజంతా ఎల్లోరా గుహలలో చిత్రీకరించిన చిత్రాల మాదిరిగానే ఉంటాయని చెబుతారు. కానీ ఫోటోగ్యాలరీలో ప్రదర్శించిన రెండు అర్ధనగ్న మహిళల చిత్రాలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఈ విషయంపై అంతర్జాతీయ సర్వ్‌కాంబోజ్ సమాజ్ అధ్యక్షుడు బాబీ కంబోజ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర యోధులు, సిక్కు గురువుల చిత్రాలు, కలిగి ఉన్న గ్యాలరీలో సెమీ న్యూడ్ మహిళల చిత్రాన్ని అధికారులు ప్రదర్శించడం సిగ్గుచేటు. అయితే, జలియన్ వాలాబాగ్ భారతీయుల తీర్థయాత్ర కేంద్రం కంటే తక్కువ కాదు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి గౌరవం ఇవ్వడానికి ప్రతిరోజూ వందలాది మంది పాఠశాల పిల్లలు, కుటుంబాలతో సహా సందర్శిస్తారు. ఇలాంటిచోట ఫొటో గ్యాలరీలో అర్ధనగ్న మహిళల చిత్రాల్ని అధికారులు ప్రదర్శించారని మాకు తెలియగానే సిగ్గుచేటుగా భావించాం’ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. షాహీద్ ఉధమ్ సింగ్ విగ్రహం ముందు టికెట్లు ఇచ్చే కిటికీ ఏర్పాటు చేయడం ద్వారా అమరవీరులను, గురువులను ట్రస్ట్ అవమానించినట్లు అంతర్జాతీయ సర్వ్ కాంబోజ్ సమాజ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో, జలియన్ వాలా బాగ్ వద్ద పునరుద్ధరణ పనులు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ఈ స్మారకాన్ని సందర్శించడానికి జూలై 31 నుంచి తిరిగి ప్రజలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో నిర్మాణ పనులకు రూ. 20కోట్ల రూపాయలను కేటాయించింది. రాజ్యసభ ఎంపీ, జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ స్వైత్ మాలిక్ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 13,1919న జలియన్ వాలాబాగ్‌లో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటీష్ ఇండియా సైన్యం వందల మంది భారత పౌరుల ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : ఎయిమ్స్‌కు గ్రీన్ సిగ్నల్) -
స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్ చతుర్వేది ఇకలేరు
సాక్షి, బనశంకరి: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్‌వాలాబాగ్ హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూశారు. బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గాంధేయవాదిగా, సమరయోధునిగా, దేశంలో ఎక్కువకాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన వయసు 123 ఏళ్లుగా చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు హత్యకు గురైన 1919 జలియన్ వాలాబాగ్ హత్యాకాండ సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. జలియన్ వాలాబాగ్ నరమేధం లో అమరులైన వారికి గాంధీజీ ఆదేశాల మేరకు చతుర్వేది వేదోక్తంగా అంతిమసంస్కారాలు నిర్వహించారు. మహాత్మాగాంధీకి స్టెనోగ్రాఫర్‌గా చతుర్వేది పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన 13 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బెంగళూరులో జననం 1897లో రామనవమి రోజున బెంగళూరులో జన్మించిన సుధాకర్ చతుర్వేది 11 ఏళ్ల వయసులోనే ఉత్తరభారతంలో ప్రసిద్ధి చెందిన కాంగడి గురుకులంలో చేరి వేదాలను అధ్యయనం చేశారు. 25 ఏళ్ల పాటు వేదభ్యాసం చేసి 4 వేదాల్లోనూ ఆయన పట్టు సాధించడంతో సార్వదేశికా ఆర్యా ప్రతినిధి సభ నుంచి చతుర్వేది అనే బిరుదును అందుకు న్నారు. కన్నడ, సంస్కృత, ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్వాతంత్య్ర సంగ్రామం, గాంధీ తత్వాల గురించి అనేక పుస్తకాలు రాశారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక బాలున్ని దత్తత తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చామరాజపేటలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి. -
జస్టిన్ వెల్బీ సందేశం
మన దేశంలో పర్యటించిన కేంటర్‌బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌వాలాబాగ్ అమరుల స్మారకస్థలిని బుధవారం సందర్శించి సరిగ్గా వందేళ్లక్రితం తమ దేశం నుంచి వచ్చిన పాలకులు సాగించిన మారణకాండకు తీవ్ర విచారం వ్యక్తం చేసిన తీరు మెచ్చ దగ్గది. జనరల్ డయ్యర్ ఆదేశాలమేరకు 1919 ఏప్రిల్‌లో సాగిన ఆ మారణకాండ వేయిమంది పౌరులను బలితీసుకుంది. మరిన్ని వేలమందిని గాయాలపాలు చేసింది. జస్టిన్ వెల్బీ బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి కాదు. కానీ బ్రిటన్‌లో 1,400 ఏళ్లక్రితం స్థాపితమై కోట్లాదిమంది భక్తగణం ఉన్న ప్రభావవంతమైన చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. ఆయన విచారం వ్యక్తం చేయడం మాత్రమే కాదు... అమరుల స్మారకచిహ్నం ముందు సాష్టాంగపడి నివాళులర్పించారు. తన దేశస్తులు పాలకులుగా ఉండి సాగించిన ఈ దుర్మార్గానికి ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు. వ్యక్తులైనా, సంస్థలైనా, దేశాలైనా తమ వల్ల జరిగిన ఉదంతంపై పశ్చాత్తాప పడినప్పుడు, మనోవేద నకు లోనైనప్పుడు క్షమాపణ చెప్పడం ఉంటుంది. కానీ జలియన్‌వాలాబాగ్‌ను ఇంతక్రితం సంద ర్శించిన బ్రిటన్ గత ప్రధానులు థెరిస్సా మే, డేవిడ్ కామెరాన్‌లు ఆనాటి ఉదంతం ఒక విషాద కరమైన ఘటనగా చెప్పి తప్పుకున్నారు. వారికన్నా ముందు 1997లో వచ్చిన బ్రిటన్ రాణి ఆ ఘట నను ‘దుఃఖం కలిగించేద’ని అభివర్ణించి ఊరుకున్నారు. చరిత్రను తిరగరాయలేమని కూడా చెప్పు కొచ్చారు. జలియన్‌వాలాబాగ్ దుర్మార్గాన్ని కేవలం ఒక ఉదంతంగా చూడకూడదు. బ్రిటిష్ వలసపాల కులు అంతకు కొన్ని దశాబ్దాల ముందునుంచీ ఈ దేశ వనరులను ఎడాపెడా దోచుకుంటూ, ప్రతి ఘటించినవారిని అనేకరూపాల్లో అణిచేసిన తీరుకు ప్రతీక. దేశంలో తమ దోపిడీపై పెరుగుతున్న ఆగ్రహావేశాలను శాశ్వతంగా అణిచేయాలంటే, తమ దుర్మార్గ పాలనను శాశ్వతం చేసుకోవాలంటే ప్రజలను తీవ్ర భయాందోళనల్లో ఉంచాలని వారు సంకల్పించారు. ఈ దేశాన్నే చెరసాలగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమకు సహకారం అందిస్తే స్వయంపాలనకు వీలిచ్చే అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత ద్రోహం చేసిన బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు బయల్దేరాయి. తమకు స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదనేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాన్ని అణచడానికి రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే జనరల్ డయ్యర్ ఈ అమానుషానికి పథక రచన చేశాడు. పర్వదినం సందర్భంగా సమీప గ్రామీణ ప్రాంతాలనుంచి వేలాదిమంది తమ తమ కుటుంబాలతో స్వర్ణాలయాన్ని సందర్శించుకుని జలియన్‌వాలాబాగ్‌లో సేదతీరుతారని అతనికి తెలియంది కాదు. అక్కడికొచ్చినవారు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నవారు కాదని కూడా తెలుసు. అయినా తన దుర్మార్గానికి వారినే సమిధలుగా ఎంచుకున్నాడు. ఆ ప్రాంగణాన్ని చుట్టు ముట్టిన వందలాదిమంది సైనికులతో మెషీన్గన్లతో గుళ్లవర్షం కురిపించాడు. నెలల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ ఎందరో ఈ దురంతంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుషం గురించి తెలుసుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అంతక్రితం నాలుగేళ్లనాడు బ్రిటన్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్‌హుడ్‌ను వెనక్కి ఇచ్చేశారు. ఈ దుర్మార్గ ఘటనకు వందేళ్లు నిండినా ఇప్పటికీ బ్రిటన్ పాలకులకు క్షమాపణ చెప్పాలని తోచకపోవడం, దాని బదులు వేరే మాటలతో పొద్దుపుచ్చడం వారి అహంకారాన్ని తెలియ జేస్తుంది. ఆ దేశమూ, ఇతర పాశ్చాత్య దేశాలూ ఐక్యరాజ్యసమితి ద్వారా రెండో ప్రపంచ యుద్ధం నాటి అమానుషాలకు బాధ్యులంటూ జర్మనీ, జపాన్ తదితర దేశాల సైనిక జనరళ్లపై, ఇతర సైనికులపై విచారణలు జరిపించారు. అందులో అనేకమందికి మరణశిక్షలు విధించారు. జపాన్ సైన్యం సాగించిన దుర్మార్గాల గురించి విచారించడానికి ఏర్పాటైన మిలిటరీ ట్రిబ్యునల్‌లో ఉన్న ఏకైక భారతీయ న్యాయమూర్తి జస్టిస్ రాధాబినోద్ పాల్ ఇలా శిక్షలు విధిస్తున్న తీరుపై అసమ్మతి తీర్పు వెలువరించారు. జపాన్‌పై దాడులకు దిగి, వారిని రెచ్చగొట్టి, దాడులకు పురిగొల్పిన అమె రికా ప్రభుత్వానికి ఈ అమానుష కృత్యాల్లో భాగం ఉండదా అని ప్రశ్నించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పౌర ప్రాంతాలపై బాంబులు ప్రయోగించి లక్షలమంది చనిపోవడానికి కారకులైన పాశ్చాత్య దేశాల దారుణాలపై విచారణ జరిపించకపోతే సమన్యాయం ఎక్కడున్నట్టని ఆయన నిల దీశారు. ఆయన వేసిన ప్రశ్న జలియన్‌వాలాబాగ్ దురంతానికి కూడా వర్తిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ నేరస్తులుగా తేల్చి అనేకమందిపై మరణశిక్షలు అమలు చేయడంలో, ఎందరినో ఖైదు చేయ డంలో పాలుపంచుకున్న దేశానికి జలియన్‌వాలాబాగ్ దుర్మార్గంలో తన తప్పు ఈనాటికీ తెలియక పోవడం దాని కపటత్వానికి చిహ్నం. వలస దేశాల్లో బ్రిటిష్ పాలకులు సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. నిజానికి వీటిన్నిటికీ క్షమాపణలు సరిపోవు. వారు అలా చెప్పినంతమాత్రాన జరిగిన వన్నీ సమసిపోవు. కానీ కారకులైనవారిలో పరివర్తన వచ్చిందని, వారు భవిష్యత్తులో తోటి మను షులపై ఇలాంటి ఘోరాలకు, కిరాతకాలకు పాల్పడరని మానవాళి భరోసాతో ఉండటానికి అవ కాశం ఏర్పడుతుంది. అన్నిటికీ మించి తాను నిజంగా ‘నాగరిక’మయ్యానని ప్రపంచానికి ధైర్యంగా చాటిచెప్పుకోవడానికి బ్రిటన్‌కు వీలవుతుంది. కానీ రెండువందల ఏళ్లు ఈ దేశ వనరుల్ని కొల్లగొట్టి, ఇక్కడివారి ఉసురుతీసి ఉన్నతంగా ఎదిగిన బ్రిటన్ ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి విలవిల్లాడు తోంది. ఇప్పుడు జస్టిన్ వెల్బీ జలియన్‌వాలాబాగ్‌లో ప్రదర్శించిన మానవీయతను చూశాకైనా అక్కడి పాలకులకు జ్ఞానోదయం కావాలి. ఆధ్యాత్మికవేత్తలు కేవలం ప్రవచనాలతో సరిపెట్టుకోరు. తమ ఆచరణ ద్వారా సందేశమిస్తారు. దాన్ని అందుకోవడం ఇప్పుడు బ్రిటన్ పాలకుల బాధ్యత. -
జలియన్‌వాలా బాగ్‌కు వందేళ్లు
అమృత్సర్/న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ నరమేధంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకున్నారు. వెంకయ్య నాయుడు జలియన్‌వాలా బాగ్ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే సిక్కు గురువులు పాడిన శ్లోకాలను ఆలకించారు. ఈ నరమేధం జ్ఞాపకార్థం వెంకయ్య నాయుడు స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం ఎంత విలువైనదో జలియన్‌వాలా బాగ్ దురంతం మనందరికీ గుర్తు చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ నివాళులు జలియన్‌వాలా బాగ్ దురంతంలో అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ పోరాట వీరులు దేశం కోసం పనిచేయడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ ఘటనలో అమరులైన వారికి భారత్ నివాళులర్పిస్తోంది. వారి విలువైన ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. దేశం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి వారు స్ఫూర్తిగా నిలిచారు’అని మోదీ ట్వీట్ చేశారు. స్మారకం వద్ద రాహుల్ నివాళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జలియన్‌వాలాబాగ్ స్మారకం వద్ద నివాళులర్పించారు. రాహుల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అంజలి ఘటించారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ‘స్వాతంత్య్రపు విలువ ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రాణత్యాగం చేసిన నాటి పోరాట వీరులకు అభివాదం చేస్తున్నాం’అని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. -
‘జలియన్‌వాలాబాగ్ అవమానకరం’
లండన్: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం బ్రిటిష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. పలువురు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేసినట్లుగా ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఈ నెల 13న జలియన్‌వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చలో ఆమె మాట్లాడారు. ‘ఆనాటి ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నాం. అయినా నేడు భారత్–బ్రిటన్ సంబంధాలు సంతృప్తికరం. బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం’ అని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. -
ఇంటి పేరు స్వేచ్ఛ
రాణీ లక్ష్మీబాయి నడిచిన నేల ఝాన్సీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ఆ అడవి. ఊర్చాహా అడవులంటారు. ఆ అడవి గుండా సతార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. 1920 దశకం నాటి మాట... ఆ నది ఒడ్డునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం దగ్గరగానే ఒక కుటీరం నిర్మించుకుని ఉండేవాడాయన. పేరు హరిశంకర్ బ్రహ్మచారి. ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఆ అడవులకు దగ్గరగా ఉన్న గ్రామం ధిమార్‌పురా, దాని చుట్టుపక్కల ఉన్న పల్లెలలోని పిల్లలకు ఆయన చదువు చెప్పేవాడు. కానీ వారెవరికీ తెలియకుండా మరొక పని కూడా చేసేవారు. కొండలలో తుపాకీ పేల్చడం నేర్చుకునేవాడాయన. అలాగే జబువా ప్రాంతంలో ఉన్న భిల్లుల దగ్గర విలువిద్య కూడా నేర్చుకునేవారు. ధిమార్‌పురా పేరును స్వాతంత్య్రం వచ్చిన తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆజాద్పురా అని మార్చింది. ఆ హరిశంకర్ బ్రహ్మచారి జ్ఞాపకార్థమే ఆ ఊరి పేరు అలా మార్చారు. ఆయన ఎవరో కాదు, భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో మహోన్నతంగా కనిపించే చంద్రశేఖర్ ఆజాద్. జలియన్‌వాలా బాగ్ దురంతం ఆనాటి పలువురు యువకులని ‘రక్తానికి రక్తం’ అన్న సిద్ధాంతం గురించి ఆలోచించేటట్టు చేసింది. మూడేళ్ల తరువాత జరిగిన మరొక పరిణామం కూడా ఎందరో భారతీయ యువకులను అదే ఆలోచన వైపు అనూహ్యంగా నెట్టివేసింది. గాంధీజీ 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరా ఉదంతంతో ఆయనే హఠాత్తుగా నిలిపివేశారు. శాంతియుతంగా ఉద్యమం నిర్వహించగలిగినంత మానసిక సంస్కారం భారతీయులకు లేదని ప్రకటించి, చౌరీచౌరాలో మరణించిన పోలీసుల ఆత్మశాంతి కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ వైఖరే నాటి యువతరాన్ని కొత్త పుంతలు తొక్కేటట్టు చేసింది. జలియన్‌వాలాబాగ్ ఉదంతం గురించి విన్న తరువాత విప్లవోద్యమం వైపు ఆకర్షితుడైన చంద్రశేఖర్ ఆజాద్, మొదట్లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దృఢంగా ఆకాంక్షించారు. కానీ అ విప్లవ విధాత జీవితంలో అదొక చిన్న ఘట్టం. చిన్న దశ. నిజం చెప్పాలంటే ఆజాద్ అంతరంగమే ఒక విప్లవజ్వాల. బ్రిటిష్ జాతి మీద ద్వేషంతో ఆయన హృదయం దహించుకుపోతూ ఉండేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తన పదిహేనవ ఏటనే తీవ్రవాదం వైపు మొగ్గారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభంలో అందుకు అనుకూలంగా కొన్ని ఊరేగింపులు జరిగాయి. వారణాసిలో జరిగిన అలాంటి ప్రదర్శనలో పాల్గొన్న ఆజాద్‌ను పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెడితే న్యాయాధీశుడు అడిగాడు, ‘నీ పేరు?’ అని. మీసాలు కూడా సరిగా లేని ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి బహుశా ఆ నాయ్యా«ధీశుడు అదిరిపడి ఉండాలి. ఆ సమాధానమే– ‘నా పేరు స్వేచ్ఛ’ (ఆజాద్). నీ తండ్రి పేరేమిటి అంటే, ‘స్వాతంత్య్రం’ అన్నాడు. న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అప్పటి నుంచి ఆజాద్ ఆయన ఇంటిపేరయింది. ‘నీ రక్తం సలసల మరగకపోతే నీ నరాలలో ప్రవహిస్తున్నది నీరే అనుకోవాలి...’ అని ఆనాటి పరిస్థితిని చూసి ఆజాద్ భావించారు. జలియన్‌వాలాబాగ్ దురంతం గురించి తెలిసిన తరువాత రక్తం మండక తప్పదు కూడా. చంద్రశేఖర్ (తివారీ) ఆజాద్ (జూలై 23, 1906– ఫిబ్రవరి 27, 1931) ప్రస్తుత మధ్య ప్రదేశ్‌లోని భవ్రాలో పుట్టారు. వారి స్వస్థలం ఉత్తర పరగణాలలోని (ఉత్తరప్రదేశ్) బదర్కా గ్రామం. తండ్రి పండిట్ సీతారామ్ తివారీ, తల్లి జగరాణీదేవి. తల్లి పట్టుదల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ సంస్కృత విద్య కోసం కాశీ విద్యాపీఠంలో చేరేందుకు వారణాసి వెళ్లారు. సంస్కృత విద్య వారి ఇంటి సంప్రదాయం. ఆయన మొదట హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంస్థను 1924లో రామ్‌ప్రసాద్ బిస్మిల్, యోగేశ్చంద్ర ఛటర్జీ, శచీంద్రనాథ్ సన్యాల్, శచీంద్రనాథ్ బక్షీ, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలీ బెంగాల్‌లోని బోలాచాంగ్ అనే గ్రామంలో ఆరంభించారు. ప్రణవేశ్ ఛటర్జీ అనే ఉద్యమకారుడి సాయంతో ఆజాద్ రామ్‌ప్రసాద్‌ను కలుసుకుని, హెచ్ఆర్ఏలో సభ్యుడయ్యారు. భారతదేశంలోని ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్య గణతంత్ర దేశంగా నిర్మించడం ఈ సంస్థ ఆశయం. ఈ ఆశయ సాధనలో మొదటి మెట్టు బ్రిటిష్ పాలనను నిర్మూలించడమే. ఇందుకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మారు.అందుకు అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతావని సోషలిస్టు దేశంగా ఉండాలని వారు ఆనాడే స్వప్నించడం ఒక అద్భుతం. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వీరికి ప్రేరణ అని ఒక వాదన ఉంది. అలాగే హెచ్ఆర్ఏ ఆనాడు బెంగాల్లో ఎంతో తీవ్రంగా పనిచేసిన తీవ్ర జాతీయ వాద రహస్య సంస్థ అనుశీలన సమితికి అనుబంధ సంస్థే. గదర్ పార్టీ తరువాత బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన సంస్థలలో ఇది కూడా ఒకటి. సహాయ నిరాకరణోద్యమాన్ని రద్దు చేస్తూ గాంధీజీ తీసుకున్న నిర్ణయం ఒక శరాఘాతం కాగా, ఆయన అహింస చాలామంది యువకులకు నిరుత్సాహం కలిగించింది. అలాంటి ఒక సందిగ్ధ దశలో జనించినదే హెచ్ఆర్ఏ. బ్రిటిష్‌జాతి వంటి ఒక నిరంకుశ సమూహం నుంచి స్వాతంత్య్రం పొందాలంటే అహింసా పథంలో సాగితే ఎంతమాత్రం సాధ్యంకాదని నమ్మినవారంతా తీవ్రవాద కార్యకలాపాలను ఆశ్రయించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవడం ఒక్కటే వారికి కావాలి. బ్రిటిష్ జాతి నుంచి భారతదేశాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విముక్తం చేయడం వారి ఆశయం. అది సాయుధ పోరుతోనే సాధ్యమని కూడా వారు నమ్మారు. పైగా నాటి ప్రపంచంలో చాలాచోట్ల ర్యాడికల్ ఉద్యమాలు కూడా వీరికి ప్రేరణ ఇచ్చాయి. తన ఉద్యమానికి ఆయుధాలు సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల కోసం హెచ్ఆర్ఏ చేసిన ఒక ప్రయత్నం చరిత్రలో నిలిచిపోయింది. అదే కకోరి రైలు దోపిడీ. దీనినే కకోరి కుట్ర కేసుగా చెబుతారు. ఆగస్టు 9, 1925న ఈ ఘటన జరిగింది. షాజహాన్‌పూర్ నుంచి లక్నో వచ్చే ఎనిమిదో నెంబర్ డౌన్ రైలులో రూ. 8,000 తీసుకువెళుతున్న సంగతి వీరికి తెలిసింది. ఈ డబ్బును లూటీ చేయడానికి పథకం పన్నారు. ఈ పథకాన్ని రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, శచీంద్ర బక్షీ, కేశబ్ చక్రవర్తి, మన్మథ్‌నాథ్ గుప్తా, మురారీలాల్ (అసలు పేరు మురళీలాల్ ఖన్నా), ముకుందీలాల్ (ముకుందీలాల్ గుప్తా), భన్వరీలాల్ అమలు చేశారు. ఆ రైలు లక్నోకు సమీపంలోని కకోరీ చేరగానే చైన్ లాగి, గార్డును బెదిరించి అతడి కేబిన్‌లో ఉన్న డబ్బును తీసుకుని వారు అదృశ్యమయ్యారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయాడు. దీనితో లూటీ, హత్య కింద కేసు నమోదు చేసి, బ్రిటిష్ ప్రభుత్వం అక్షరాలా హెచ్ఆర్ఏ సభ్యుల కోసం పరమ క్రూరంగా వేట సాగించింది. కకోరి కేసులో దేశమంతా వెతికి మొత్తం నలభయ్ మందిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిలో పదిహేను మందిని వదిలి పెట్టారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్ఫఖుల్లాఖాన్లకు న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. కొందరికి అండమాన్ ప్రవాసం విధించారు. ఇంకొందరకి యావజ్జీవం విధించారు. కానీ ఆజాద్‌తో పాటు ఇంకొందరు దొరకలేదు. ఆ తరువాత హెచ్ఆర్ఏ చెల్లాచెదరయిపోయింది. అప్పుడే ఆజాద్ ఆ సంస్థనే హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో పునరుద్ధరించారు. ఎన్నో కష్టాలు, అనేక ప్రయత్నాల తరువాత ఆజాద్ కాన్పూరును తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. 1928 నాటికి ఇది సాధ్యమైంది. అక్కడ ఉండగానే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటివారు ఆయన మార్గదర్శకత్వంలో నడిచారు. దీని తరువాత సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లాలా లజపతిరాయ్ మీద లాఠీని ప్రయోగించమని ఆదేశించిన స్కాట్‌ను హత్య చేయాలని హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయించింది. భగత్‌సింగ్ తదితరులతో కలసి ఆజాద్ కూడా పాల్గొన్నారు. లాహోర్‌లో అతడిని హత్య చేయదలచుకుని స్కాట్ ఉన్నాడని భావించిన వాహనం మీద బాంబు విసిరారు. కానీ అందులో స్కాట్ లేడు. కానీ సాండర్స్ అనే మరొక పోలీసు అధికారి ఉన్నాడు. అతడు చనిపోయాడు. అంతకు ముందే వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలును పేల్చివేయడానికి కూడా ఆజాద్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది. 1931 ఫిబ్రవరిలో ఆజాద్ సీతాపూర్ కారాగారానికి వెళ్లారు. కకోరి కుట్ర కేసులో ఉన్నవారితో పాటు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను విడిపించడం గురించి గణేశ్‌శంకర్ విద్యార్థితో మాట్లాడడానికి వెళ్లారాయన.గణేశ్‌శంకర్ ఒక సలహా ఇచ్చారు. త్వరలోనే జరగబోయే గాంధీ–ఇర్విన్ చర్చలలో ఈ అంశం గురించి గాంధీ ద్వారా ఒత్తిడి తేవాలి. ఆ విషయం పండిట్ నెహ్రూ ద్వారా గాంధీకి చెప్పించాలి. ఇది గణేశ్ శంకర్ సలహా.ఆ మేరకే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం అలహాబాద్ వెళ్లి ఆనందభవన్లో నెహ్రూను ఆజాద్ కలుసుకున్నారు. ఆజాద్ ప్రతిపాదనను నెహ్రూ అంగీకరించలేదు. అంతేకాదు, ఆనందభవన్ నుంచి వెంటనే వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు. ఉగ్రుడైన ఆజాద్ అల్ఫ్రెడ్ పార్క్‌కు సైకిల్ మీద వచ్చారు. ఒక చెట్టు కింద తన సహచరులలో ఒకడైన సుఖదేవ్రాజ్తో (భగత్‌సింగ్‌తో కలసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేసిన సుఖదేవ్ కాదు) చర్చిస్తున్నారు. ఆజాద్ అక్కడ ఉన్న సంగతి పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. మొదట పోలీస్ సూపరింటెండెంట్ బిశ్వేశ్వర్సింగ్, ఎస్ఎస్పి (సీఐడీ) నాట్ బోవర్ పార్కులోకి చొరబడ్డారు. ఆజాద్ కేసి తర్జని చూపుతూ బిశ్వేశ్వర్కి ఏదో చెబుతుండగానే ఆజాద్ గమనించారు. తన జేబులోని రివాల్వర్ తీసి కాల్చారు. సరిగ్గా గుండు వెళ్లి బోవర్ కుడి మణికట్టులో దిగింది. దీనితో బిశ్వేశ్వర్ తిట్లు లంఘించుకున్నాడు. దీనితో అతడి నోటి కేసి గురి పెట్టి మళ్లీ కాల్చాడు ఆజాద్. అతడి పళ్లు పగిలిపోయాయి. అయితే అంతలోనే అక్కడికి బలగాలు చేరుకుని చుట్టూ మోహరించడం కనిపించింది. కాల్పులు మొదలయ్యాయి. ఒక గుండు వచ్చి ఆజాద్ తొడలో దిగిపోయింది. కదలడం సాధ్యంకానంత గాయం. వెంటనే సుఖదేవ్రాజ్ను తప్పించుకోమని చెప్పి, అతడు తప్పించుకున్న సంగతి రూఢి అయిన తరువాత రివాల్వర్ కణతకు పెట్టుకుని కాల్చుకున్నాడాయన. తూటాలతో పోరాడతాం కానీ పోలీసులకు పట్టుబడే ప్రశ్నే లేదంటూ ఉద్యమకారునిగా జీవితం ఆరంభించిన నాడే ప్రతిజ్ఞ చేసిన ఆజాద్ అదే విధంగా పోలీసులు తనను సమీపిస్తుండగానే బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛను ఇంటి పేరు చేసుకోగలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు మరే దేశ చరిత్రలో అయినా కనిపిస్తాడా? - డా. గోపరాజు నారాయణరావు -
రైల్లో పొగతాగొద్దన్నందుకు గర్భిణీని చంపేశాడు!
షాజహాన్‌పూర్: రైలులో తోటి ప్రయాణికుడు పొగతాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుంది. పంజాబ్– బిహార్ జలియన్ వాలా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బిహార్‌కు చెందిన చినత్ దేవి(45) అనే గర్భిణీ తన కుటుంబంతో కలిసి ఛత్ పూజల్లో పాల్గొనేందుకు సొంతూరుకు వెళ్తున్నారు. వారితోపాటు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న సోనూ యాదవ్ పొగతాగుతుండటంతో చినత్ దేవి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఉన్న సోనూ చినత్ దేవి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను షాజహాన్పూర్లో రైలు ఆపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
హింసతో పరిష్కారం దొరకదు
న్యూఢిల్లీ: క్రూరత్వం, హింస ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని.. జలియన్ వాలాబాగ్ దారుణమే దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎప్పటికీ అహింస, శాంతి ద్వారానే విజయం సాధించవచ్చన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఇచ్చిన ఈ సందేశాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. మాసాంతపు రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘హింస, క్రూరత్వం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేం. శాంతి, అహింస, త్యాగం, బలిదానాలదే తుది విజయం’ అని మోదీ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర చాలా సుదీర్ఘమైనదని.. ఇందులో లెక్కించలేనన్ని త్యాగాలు, బలిదానాలున్నాయని గుర్తుచేశారు. ‘2019లో జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతాయి. 1919, ఏప్రిల్ 13 నాటి ఆ చీకటి రోజును ఎవరు మరిచిపోగలరు. ఈ ఘటన యావత్ మానవజాతినే క్షోభకు గురిచేసింది. అధికార పరిధిని అపహాస్యం చేస్తూ.. క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులు దాటి అమాయకులు, నిరాయుధులైన ప్రజలపై పాశవికంగా కాల్పులు జరిపి చంపారు. వందేళ్ల నాటి ఈ ఘటన మనకు ఎన్నో నేర్పింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నానక్, కబీర్ దాస్‌ల స్ఫూర్తితో.. వచ్చే ఏడాది గురు నానక్ 550వ జయంతి (ప్రకాశ్ పర్వ్) జరుపుకోబోతున్నామని మోదీ తెలిపారు. ‘భారతీయులంతా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ప్రకాశ్ పర్వ్‌ను ప్రేరణా పర్వ్ (స్ఫూర్తిదాయకంగా) మార్చుకునేందుకు మీరు సలహాలు, సూచనలు చేయండి. ఈ కార్యక్రమాన్ని మనమంతా కలిసి గొప్పగా జరుపుకుందాం’ అని ప్రధాని అన్నారు. గురు నానక్, కబీర్ దాస్‌ల బోధనలను గుర్తుచేస్తూ.. కుల వివక్ష తొలగిపోవాలని, మానవత్వం వికసించాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 52 ఏళ్లకే దేశం కోసం బలిదానమయ్యారన్నారు. తొలి వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా దేశం కోసం ముఖర్జీ చేసిన పనులను, ఆయన ఆలోచనలను మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లో రాష్ట్రాలు భేష్ భారతదేశంలో సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ అమలుతీరే మంచి నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడి వ్యవస్థ ‘నిజాయితీ పండుగ’ జరుపుకుంటోందన్నారు. ‘సరికొత్త పన్ను వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా దీని అమలుకు ముందుకొచ్చాయి. భిన్న పార్టీలు, భిన్న అవసరాలున్న రాష్ట్రాలు కానీ అవన్నీ పక్కనపెట్టి అందరికీ న్యాయం జరగాలని నిర్ణయించాయి. ఒకే దేశం–ఒకే పన్ను అనే ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు కావడంలో రాష్ట్రాల పాత్ర అభినందనీయం’ అని మోదీ పేర్కొన్నారు. రషీద్ ఖాన్‌కు మోదీ ప్రశంసలు అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్, భారత వైమానిక దళ స్కై డైవర్లపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఐపీఎల్లో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ మంచి ప్రదర్శన కనబరిచారు. రషీద్‌ను ప్రశంసిస్తూ అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ చేసిన ట్వీట్ నాకింకా గుర్తుంది. ఇటీవల భారత్–అఫ్గాన్ మధ్య టెస్టు మ్యాచ్ అనంతరం.. ట్రోపీని అందుకునేందుకు అఫ్గాన్ జట్టును భారత్ ఆహ్వానించడం ఓ మంచి వాతావరణాన్ని సూచిస్తోంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలనూ మోదీ గుర్తుచేశారు. ‘15వేల అడుగుల ఎత్తులో గాల్లో.. భారత వైమానిక దళ స్కై డైవర్లు చేసిన యోగా ప్రదర్శన అద్భుతం’ అని ప్రశంసించారు. -
జాతి గుండెపై మానని గాయం..
భారత దేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన ‘జలియన్ వాలాబాగ్’ మారణకాండ. బ్రిటీష్‌వారి దురహంకారానికి వెయ్యిమందికి పైగా భారతీయులు బలయ్యారు. దేశంలో ఆంగ్లేయుల పాలన ఎన్ని ఆకృత్యాలతో కూడి ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుందాం.. ఎక్కడ, ఎలా.. ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున ఉత్తర భారత దేశంలోని అమృత్సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో ఈ ఘటన జరిగింది. ఆరోజు సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ. ఈ సందర్భంగా దాదాపు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఇలా వేల మంది ఒకేచోట సమావేశమై శాంతియుతంగా ప్రసంగిస్తుండగానే అనూహ్యంగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కాల్పులు.. ఈ సమావేశం గురించి సమాచారం అందుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకుల్లోని తూటాలు అన్నీ అయిపోయేంత వరకు ఈ కాల్పులు కొనసాగాయి. చివరకు మందుగుండు అయిపోవడంతో సైన్యం కాల్పులు ఆగిపోయాయి. ఎటూ వెళ్లలేక.. ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. బుల్లెట్ల దాడినుంచి రక్షించుకునేందుకు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తోటలోని గేట్లవైపు వెళ్లి బయటపడదామని చూశారు. కానీ గేట్లు మూసి ఉండడం, తెరిచి ఉన్న ద్వారాల దగ్గర నిలబడి సైన్యం కాల్పులు జరపడంతో వారంతా తూటాలకు బలయ్యారు. మరోవైపు బయటికి వెళ్లేందుకు దారిలేక, లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోలేక కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. దీనివల్ల కూడా కొందరు మరణించారు. ఇలా ఓ వైపు తూటాలకు కొంతమంది, మరోవైపు బావిలోదూకడం వల్ల, తొక్కిసలాట వల్ల మరికొందరు మరణించారు. అప్పటివరకు శాంతియుతంగా సాగిన సమావేశం రక్తసిక్తమైంది. వెయ్యి మందికిపైగా మృతి.. ఈ కాల్పుల్లో 379 మంది మాత్రమే మరణించినట్లు బ్రిటిష్ అధికారులు తేల్చారు. వారి అంచనా ప్రకారం 1,100 మంది గాయపడ్డారు. అయితే అసలు అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దాదాపు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. వేల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వారిలో ఆరువారాల చిన్నారి కూడా ఉండడం మరో విచారకర అంశం. కానీ ఈ వాస్తవాల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను తక్కువగా చూపి ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. డయ్యర్ కారణంగానే.. ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్. ఆయన దురహంకారపూరిత నిర్ణయం మూలంగానే ఈ మారణకాండ చోటుచేసుకుంది. సమావేశమైన ప్రజల్ని అణచి వేయడానికి అక్కడికి చేరుకున్న డయ్యర్ కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సమావేశం శాంతియుతంగా జరుగుతోందని, వారంతా నిరాయుధులని తెలిసినా అమాయకులపై కాల్పులు జరపమని ఆదేశించి డయ్యర్ ఈ మారణహోమానికి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. ఈ ఘటనపై డయ్యర్ స్పందిస్తూ తాను ఈ సమావేశాన్ని ఆపేందుకే వెళ్లానని, అయితే అంతమందిని అదుపులో పెట్టడం కష్టం కాబట్టి కాల్పులకు ఆదేశించానని వ్యాఖ్యానించాడు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అందని సాయం.. కాల్పుల్లో వందలాది మంది మరణించడంతోపాటు, వేలాది మంది గాయపడ్డప్పటికీ వారికి వెంటనే ఎలాంటి వైద్య సాయం అందలేదు. కాల్పులు జరిపిన అనంతరం డయ్యర్, అతడి సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డయ్యర్ ప్రయత్నించలేదు. దీనిపై డయ్యర్ మాట్లాడుతూ వారికి వైద్య సేవలు అందించడం తన కర్తవ్యం కాదు కాబట్టి ఆ పని చేయలేదని చెప్పాడు. డయ్యర్ చర్యను కొందరు బ్రిటిష్ పాలకులు సమర్ధించారు. కానీ ఈ చర్యను ఖండిస్తూ బ్రిటీష్ పార్లమెంటు తీర్మానం చేసింది. విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యపై విచారణ సాగుతుండగానే డయ్యర్ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. స్మారక చిహ్నం ఏర్పాటు.. వందలాది మంది మృతికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్వాతంత్య్ర ఉద్యమం మరింత విస్తృతమయ్యేందుకు ఈ ఘటన దోహదపడింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఇదేరోజు స్థూపంవద్దే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు జలియన్ వాలాబాగ్ మృతులకు నివాళులర్పిస్తారు. -
స్వాతంత్య్ర జ్వాల...
జలియన్‌వాలా బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు తక్షణ ప్రేరణ... జలియన్‌వాలా బాగ్ దురంతం. ఈ ఘోర ఘటన తర్వాతే గాంధీజీ సహాయ నిరాకరణ మొదలైంది. నిరాకరణ నిరసన అయ్యింది. నిరసన సత్యాగ్రహం అయింది. సత్యాగ్రహం ఆయుధం అయ్యింది. ఆ ఆయుధమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ‘అన్ని యుద్ధాలనూ అంతం చేయడానికి చేస్తున్న యుద్ధం’ అంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో నినాదం ఇచ్చిన ఇంగ్లండ్, ఆ తరువాత భారతీయుల మీద మాత్రం తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అందుకు నిలువెత్తు నిదర్శనమే జలియన్‌వాలా బాగ్ దురంతం (ఏప్రిల్ 13, 1919). గ్రేట్‌వార్ ముగిసిన కొన్ని నెలలకే ఈ ఘోరాన్ని ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో నమోదు చేసింది. రెండువేల మంది దేశభక్తుల రక్తంతో తడిసిన నేల అని జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం మీద రాసి ఉంటుంది. పిలుపు అందుకుంది పంజాబీలే! జలియన్‌వాలా బాగ్ నెత్తుటి కాండకు ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్ చరిత్ర దగ్గరకు నడవాలి. నాటి భారత రాజకీయ, స్వాతంత్య్రో ద్యమ సన్నివేశాలను, మనోభావాలను శోధించాలి. ఆ యుద్ధంలో సిక్కులు చూపించిన తెగువను జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ప్రపంచ సంగ్రామంలో 13 లక్షల మంది భార త సైనికులు పాల్గొన్నారు. మొత్తం 74,000 మంది చనిపోయారు. మిగిలిన భారత భూభాగాల కంటే పంజాబ్.. బ్రిటిష్ జాతికి మరింత సేవ చేసిందనే చెప్పాలి. యుద్ధం ఆరంభించే సమయానికి (1914) భారత వలస సైన్యంలో సిక్కుల సంఖ్య దాదాపు లక్ష. ‘యుద్ధంలో చేరి వీరత్వం ప్రదర్శించ’మంటూ ఇంగ్లండ్ ప్రభుత్వంలో వార్ కార్యదర్శి లార్డ్ కిష్నర్ ఇచ్చిన పిలుపునకు గాఢంగా స్పందించిన వారు పంజాబీలే. కిష్నర్ ప్రకటన తరువాత పంజాబీ సైనికుల సంఖ్య 3,80,000కు చేరుకుంది. అంతేకాదు, రెండుకోట్లు యుద్ధ నిధి ఈ ప్రాంతం నుంచి వెళ్లింది. పది కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించిన వార్ బాండ్లను తీసుకున్నది కూడా పంజాబీలే. కానీ యుద్ధంలో వీరు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ‘‘... రోజూ వేలమంది మనుషులు చనిపోతున్నారు... చూడబోతే యుద్ధం ముగిసే సరికి రెండు వైపులా ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు శాంతి నెలకొనకుండా ఉంటుందా?’’ అంటూ ఇషేర్సింగ్ (59వ సిఖ్ రైఫిల్స్ దళ సభ్యుడు) పంజాబ్‌లోని తన మిత్రుడికి రాసిన లేఖ (మే 1, 1915) లోని ఈ మాటలు ఆ వేదనకు ఒక నిదర్శనం. భారతదేశం మొత్తం మీద ప్రతి 150 మందికి ఒకరు యుద్ధానికి వెళితే, ప్రతి 28 మంది పంజాబీలకూ 1 సిపాయి వంతున ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. గాంధీజీపై అనిబిసెంట్ ఆగ్రహం! ఆ ఘోర యుద్ధంలో వలస భారత సైనికులను ఉపయోగించుకోవడం మీద ఆనాటి స్వాతంత్య్రోద్యమ నేతలలో ఏకాభిప్రాయం లేదు. చెప్పాలంటే గట్టి వ్యతిరేకతే ఉంది. యుద్ధం చేస్తున్న ఇంగ్లండ్ అవసరాలను తీరుస్తానంటూ ముందుకొచ్చిన గాంధీజీ సైతం విమర్శలపాలు కావలసి వచ్చింది. ఊరికి 20 మంది బలశాలురైన యువకులు చేరాలంటూ గుజరాత్ ప్రాంతమంతా గాంధీజీ పాదయాత్ర చేశారు. మొత్తానికి నలభై మంది మాత్రం చేరారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకో వలసిందిగా సర్దార్ పటేల్‌ను గాంధీజీ కోరినా ఆయన నిరాకరించడం విశేషం. అహింసా సిద్ధాంతం వదిలి గాంధీజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనిబిసెంట్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. గాంధీజీని ఆమె ‘రిక్రూటింగ్ సార్జెంట్’ అని ఎద్దేవా చేశారు. అయినా గాంధీజీకి ఒక ఆశ. ఆ యుద్ధంలో బ్రిటన్‌కు సహకరిస్తే, భారతీయుల ‘స్వరాజ్యం’, ‘స్వయం పాలన’ కోరికలకు కదలిక వస్తుందని అనుకున్నారు. కానీ యుద్ధంతో సతమత మవుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవాలన్నది చాలామంది తీవ్ర జాతీయవాదుల ఆశయం. అందులో గదర్ పార్టీ ప్రధానమైనది. ఈ పార్టీలో ఎక్కువ మంది పంజాబ్, బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే (తెలుగు ప్రాంతం నుంచి దర్శి చెంచయ్య వెళ్లి ఈ పార్టీలో పనిచేశారు). 1857 తరహాలో 1915 ఫిబ్రవరిలో ఒక తిరుగుబాటు తేవాలన్న యోచన కూడా బలీయంగా ఉంది. ఇలాంటి విస్తృత పథకానికి వ్యూహం పన్నినవారు అమెరికా, జర్మనీ దేశాలలో ఉండి భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్నవారే. ఇందుకు 1914 నుంచి 1917 వరకు చాలా కృషి జరిగింది. కానీ గదర్ పార్టీలోకి గూఢచారులు చొచ్చుకుపోవడం వల్ల రహస్యాలు బయటకు పొక్కి పథకం విఫలమైంది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం -1915 ఈ పరిణామాల ఫలితమే. దీనికి కొనసాగింపు సెడిషన్ కమిటీ 1918. సిడ్నీ రౌలట్ (న్యాయమూర్తి) దీని అధ్యక్షుడు. జర్మన్, బొల్షివిక్-భారత తీవ్ర జాతీయవాదుల మధ్య సంబంధాలను వెలికి తీయడం కూడా ఈ కమిటీ విధులలో ఒకటి. అలా వచ్చింది రౌలట్ చట్టం. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమే జలియన్‌వాలాబాగ్ దురంతం. బాగ్ ఘటనకు బీజం ఇక్కడే! ఒక పక్క అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తూనే, మరోపక్క గ్రేట్‌వార్‌లో బ్రిటిష్ వారికి సాయం చేయాలని గాంధీజీ యోచించారు. సరిగ్గా ఈ అంశం మీదే ఉద్యమకారులు రెండు వర్గాలయ్యారు. అహింసా పథానికీ, భూగోళాన్ని రక్తంతో తడుపుతున్న మొదటి ప్రపంచ యుద్ధానికి చేయూతనివ్వడానికీ పొంతన లేదన్నదే తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం. అయినా గాంధీజీ అహింసాయుత పంథాలోనే ఎక్కువ మంది కాంగ్రెస్‌వాదులు నడిచారు. పంజాబ్ ప్రముఖులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ గాంధీజీ అహింసా ప్రబోధాలను విశ్వసించినవారే. ఈ ఇద్దరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 10, 1919న అరెస్టు చేసి, రహస్య ప్రదేశంలో ఉంచింది. గాంధీజీ అహింసను ప్రజలకు తెలియచేసే క్రమంలో... అరెస్టయిన వీరి విడుదల కోసం హింసాత్మక ఉద్యమం మొదలైంది. మైఖేల్ ఓడ్వయ్యర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. అమృత్సర్ మిలిటరీ కమాండర్ - బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్. సత్యపాల్, కిచ్లూ అరెస్టయిన రోజునే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (పంజాబ్) నివాసం ఎదుట ఆందోళన జరిగింది. కాల్పులు జరిగాయి. ముగ్గురు బ్యాంక్ అధికారులను కార్యాలయాల్లోనే జనం హత్య చేశారు. ఏప్రిల్ 11న మార్సెల్లా షేర్వుడ్ అనే మహిళా మిషనరీని సైకిల్ మీద నుంచి పడేసి చంపారు. ఈ పరిణామాల తరువాత సత్యపాల్, కిచ్లూలను విడుదల చేసి, సైనిక శాసనం విధించారు. అప్పుడే, అంటే ఏప్రిల్ 13న సిక్కుల పండుగ ైవె శాఖి వచ్చింది. సైనిక శాసనం గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల సిక్కులు ఏటా అక్కడ జరిగే ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ఉత్సవం తరువాతే సభ జరుగుతుందని గూఢచారుల ద్వారా జనరల్ డయ్యర్‌కు సమాచారం అందింది. డయ్యర్‌కు పార్లమెంట్ ప్రశంస! నిజానికి బాగ్‌లో కాల్పులు జరిపే ఉద్దేశం డయ్యర్‌కు లేదని నిక్ లాయిడ్ (ది అమృత్సర్ మేసకర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ వన్ ఫేట్ఫుల్ డే) అనే చరిత్రకారుడు అంటాడు. 90 మంది బలగం (బలూచీ, గూర్ఖా దళాలు)తో నగరంలో సైనిక శాసనం అమలును పర్యవేక్షిస్తున్నాడు డయ్యర్. ఆరేడు ఎకరాల బాగ్‌లో జరుగుతున్న సభ దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ 15 వేల నుంచి 25 వేల వరకు అక్కడ జనం ఉండడం గమనించి, వెంటనే కాల్పుల నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘట్టం రక్తదాహానికీ ప్రబల నిదర్శనం. అమానవీయతకు, వలసవాదానికీ మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిన రక్తరేఖ. ఈ దురంతానికి పాల్పడిన డయ్యర్‌ను నాటి బ్రిటిష్ పార్లమెంట్ శ్లాఘించడమే విచిత్రం. టాగూర్ తిరిగి ఇచ్చేశారు! జలియన్‌వాలా బాగ్ కాల్పులు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘోర ఉదంతం. చరిత్ర మీద కనిపించే దీని జాడే అందుకు నిదర్శనం. కాల్పుల సమాచారం తెలియగానే రవీంద్రనాథ్ టాగూర్ తన సర్ బిరుదును త్యజించారు (మే 22న గానీ ఘటన సంగతి బెంగాల్ చేరలేదు, గాంధీజీకి జూన్‌లో ఈ సంగతి తెలిసింది). జనరల్ డయ్యర్‌ను శిక్షించాలని బ్రిటిష్ ప్రముఖుడు విన్స్టన్ చర్చిల్ ప్రతినిధుల సభలో (జూలై 8, 1920న) కోరడం విశేషం. అమృత్సర్ అమానుషానికి బాధ్యునిగా ప్రసిద్ధికెక్కిన ఓడ్వయ్యర్‌ను మార్చి 13, 1940న లండన్ నగరంలో ఉన్న క్యాక్స్టన్ హాలులో రెండు దశాబ్దాల తరువాత ఉధమ్‌సింగ్ కాల్చి చంపాడు. పసితనంలో చూసిన ఆ బీభత్సం అతడిని ఈ హత్యకు పురికొల్పింది. తరువాత ఇంగ్లండ్ దమననీతి ఎలాంటిదో చూడండంటూ జర్మన్ అనుకూల దేశాలు తరువాత జలియన్‌వాలా బాగ్ దురంతం గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశాయి. కొసమెరుపు: 1961, 1983 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించారు. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ఘటించి వెనుదిరిగారు. అక్టోబర్ 13, 1997న మళ్లీ భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి వచ్చారు. డయ్యర్ కుమారుడు చెప్పిన దానిని బట్టి ఫిలిప్ ఈ సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న సంస్మరణ ఫలకం మీద అంకెను చూసి ఇంతమంది మరణించలేదని నాకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించాడు. బ్రిటిష్‌రాణి ‘మన గతం ఇబ్బందికరమైనది....’ అని కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. ఫిబ్రవరి, 2013లో నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించాడు. మృతులకు నివాళి ఘటించాడు. ఈ ఘోర దురంతం మీద బ్రిటిష్ నేతల నుంచి సాంత్వన వాక్యాలు వస్తాయని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. - డా॥గోపరాజు నారాయణరావు -
మానని గాయం ఇంద్రవెల్లి మారణహోమం
సందర్భం చరిత్ర పుటల్లో చేరిన మా నని ఆదివాసుల గాయం ఇంద్రవెల్లి. ఈ దేశ మూల వాసులపై నాగరిక సమా జం అమలు చేస్తున్న వివ క్షకు, అణచివేతకు అది పర్యాయపదం. ఆదిలాబా ద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981, ఏప్రిల్ 20న జరి గిన మారణహోమం జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ను తలపించిన ఊచకోత. గోండ్వానా పరిధిలోని ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలకులపై రాంజీగోండ్ తిరుగుబాటు (1858-60), ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు (1938-40) అనంతరం ఆంత్రో పాలజిస్టు ప్రొ॥హైమండార్ఫ్ అధ్యయన ఫలితాలు అమలుకు నోచు కోకుండానే జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటన ఆనాటి మానవతావాదుల్ని కలచివేసింది. ఆదిలాబాద్‌లో కోలాం, పర్ఫాన్, తోటి, కో య, నాయక్ పోడ్ గిరిజనులు నివసిస్తున్నారు. ఇది మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో మార్వాడీలు, లంబాడీలతో పాటు కోస్తా నుంచి వలస వాదులు ప్రవేశించారు. ఆదివాసీలకు చెం దిన భూఆక్రమణలు, అటవీ వనరుల దోపిడీ, వర్తకవ్యాపారుల మోసాలు పెరి గాయి. వీటిని నిరసించడానికి ‘గిరిజన రైతు కూలీ సంఘం’ 1981, ఏప్రిల్ 20న ప్రథమ మహాసభను ఇంద్రవెల్లిలో నిర్వ హించడానికి సన్నాహం చేసింది. తమ పోడు భూములపై హక్కులు, పండిన పం టలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సం తలో అటవీ ఉత్పత్తుల కొనుగోలులో సేట్లు చేసే తూనికల మోసాన్ని అరికట్టా లనే డిమాండ్లతో గిరిజన గూడేలలో తుడుం మోగిం చారు. ఇంద్రవెల్లిలో ఆ రోజు సోమవారం అంగడి కావడంవల్ల అధిక సంఖ్యలో గిరిజనులు హాజరవు తారని భావించిన పోలీసులు ఒకరోజు ముందే 144వ సెక్షన్ విధించారు. పరిసర ప్రాంతాల్లో సభకు వ్యతిరేక ప్రచారం చేశారు. ఇదంతా తెలియని ఆదివాసులు ఉదయం 7 గంటల నుంచి భారీ సంఖ్యలో ఇంద్రవెల్లికి చేరుకు న్నారు. ఆయా మార్గాలలో కొందరిని లాఠీలతో కొట్టడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటివి చేశారు. సభ ప్రారంభానికి ముందే హెచ్చరికలు లే కుండా పోలీసులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ అమానుష ఘటనలో 13 మంది ఆదివాసీలు మరణించగా, 9 మం ది గాయపడ్డట్లు నాటి కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించింది. కాని వాస్తవంగా కాల్పుల్లో 60 మంది మరణించగా, మరో 80 దాకా తీవ్రంగా గాయపడినట్లు పత్రి కలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనలో క్షత గాత్రులైన వారిలో బతికి ఉన్న ఇద్దరు మాత్రం కాలా నికి ఎదురీదుతున్నారు. ఆదిలాబాద్ అడవి బిడ్డలపై ఇంద్రవెల్లి రేపిన గాయానికి 34 ఏళ్లు. అల్లూరి ‘మన్యం పోరాటం’ (1922-24), కొమురంభీం ‘జోడేఘాట్ తిరుగు బాటు’ (1938-40), ‘శ్రీకాకుళ రైతాంగ పోరాటం’ (1968-70), తొలి ‘తెలంగాణ ఉద్యమం’ (1969), జగిత్యాల కార్మికుల ‘జైత్రయాత్ర’ (1978) ఉద్య మాలు ఇంద్రవెల్లికి వారసత్వంగా నిలిచాయి. ఇంద్రవెల్లి ఘటన జరిగిన 34 ఏళ్ల తరువాత కూడా ఈ దేశంలో మూలవాసులు పౌరసమాజం లో అంతర్భాగం కాలేకపోతున్నారు. నాడు ఇంద్ర వెల్లి, నిర్మల్, జోడేఘాట్‌తో ఆదివాసుల జీవన సం స్కృతిపై దాడి జరిగితే, వాకపల్లి, భల్లూగూడ వంటి గ్రామాల్లో ఆత్మగౌరవ దాడులు జరగడం అమా నుషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం, ఫీసా చట్టాలను తుంగలో తొక్కుతూ ఆదివాసీ జీవన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నల్లమలలో చెంచు లను, కవ్వాల్‌లో గోండులను, బయ్యారం, కంతన పల్లిలో కోయలను ప్రకృతి ఒడి నుంచి నిర్వాసితు లను చేసే యత్నాలు సాగుతున్నాయి. ఆదివాసుల అభివృద్ధికి అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఇతర కులాలకు పంచుతూ పాలకులు రాజ్యాంగ విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఆదివాసులు తమ రక్షణకు ‘మనుగడ కోసం పోరాటం’ చేసే దుస్థితి నుంచి తప్పించి ‘జల్-జంగల్-జమీన్’పై పూర్తి స్వేచ్ఛాధికారాలు కల్పిస్తే తెలంగాణ అమరుల త్యాగాలకు మనం అర్పించే ఘన నివాళి అవుతుంది. (ఇంద్రవెల్లి కాల్పులకు ఏప్రిల్ 20 నాటికి 34 ఏళ్లు) (వ్యాసకర్త మొబైల్: 9951430476) గుమ్మడి లక్ష్మీనారాయణ -
జలియన్‌వాలాబాగ్
ఉద్యమనాయకులు సత్యపాల్, డా. సైఫుద్దీన్‌ల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ అమృత్సర్(పంజాబ్)లోని జలియన్‌వాలాబాగ్‌లో వందలాదిమంది దేశభక్తులు సమావేశమయ్యారు. ఎలాంటి కవ్వింపు చర్యల్లో లేవు. ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు. అయినప్పటికీ బ్రిటిష్ వాడికి కోపం వచ్చింది. ఒంటిని రాక్షసత్వం ఆవహించింది. జనరల్ డయ్యర్ ఆదేశాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేశభక్తులపై పదినిమిషాల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిగాయి. 370 మంది చనిపోయారని, 1200 మంది గాయపడ్డారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. 1000 మందికిపైగా మరణించారు. మాటలకందని ఈ విషాదం చరిత్ర పుటలపై తడి ఆరని నెత్తుటి చుక్కై మెరుస్తూనే ఉంది.