జస్టిన్‌ వెల్బీ సందేశం | Sakshi Editorial On Justin Welby Visits Jallianwala Bagh | Sakshi
Sakshi News home page

జస్టిన్‌ వెల్బీ సందేశం

Published Fri, Sep 13 2019 12:54 AM | Last Updated on Fri, Sep 13 2019 12:54 AM

Sakshi Editorial On Justin Welby Visits Jallianwala Bagh

మన దేశంలో పర్యటించిన కేంటర్‌బరీ ఆర్చిబిషప్‌ జస్టిన్‌ వెల్బీ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌వాలాబాగ్‌ అమరుల స్మారకస్థలిని బుధవారం సందర్శించి సరిగ్గా వందేళ్లక్రితం తమ దేశం నుంచి వచ్చిన పాలకులు సాగించిన మారణకాండకు తీవ్ర విచారం వ్యక్తం చేసిన తీరు మెచ్చ దగ్గది. జనరల్‌ డయ్యర్‌ ఆదేశాలమేరకు 1919 ఏప్రిల్‌లో సాగిన ఆ మారణకాండ వేయిమంది పౌరులను బలితీసుకుంది. మరిన్ని వేలమందిని గాయాలపాలు చేసింది. జస్టిన్‌ వెల్బీ బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి కాదు. కానీ బ్రిటన్‌లో 1,400 ఏళ్లక్రితం స్థాపితమై కోట్లాదిమంది భక్తగణం ఉన్న ప్రభావవంతమైన చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. ఆయన విచారం వ్యక్తం చేయడం మాత్రమే కాదు... అమరుల స్మారకచిహ్నం ముందు సాష్టాంగపడి నివాళులర్పించారు. తన దేశస్తులు పాలకులుగా ఉండి సాగించిన ఈ దుర్మార్గానికి ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు. వ్యక్తులైనా, సంస్థలైనా, దేశాలైనా తమ వల్ల జరిగిన ఉదంతంపై పశ్చాత్తాప పడినప్పుడు, మనోవేద నకు లోనైనప్పుడు క్షమాపణ చెప్పడం ఉంటుంది. కానీ జలియన్‌వాలాబాగ్‌ను ఇంతక్రితం సంద ర్శించిన బ్రిటన్‌ గత ప్రధానులు థెరిస్సా మే, డేవిడ్‌ కామెరాన్‌లు ఆనాటి ఉదంతం ఒక విషాద కరమైన ఘటనగా చెప్పి తప్పుకున్నారు. వారికన్నా ముందు 1997లో వచ్చిన బ్రిటన్‌ రాణి ఆ ఘట నను ‘దుఃఖం కలిగించేద’ని అభివర్ణించి ఊరుకున్నారు. చరిత్రను తిరగరాయలేమని కూడా చెప్పు కొచ్చారు. 



జలియన్‌వాలాబాగ్‌ దుర్మార్గాన్ని కేవలం ఒక ఉదంతంగా చూడకూడదు. బ్రిటిష్‌ వలసపాల కులు అంతకు కొన్ని దశాబ్దాల ముందునుంచీ ఈ దేశ వనరులను ఎడాపెడా దోచుకుంటూ, ప్రతి ఘటించినవారిని అనేకరూపాల్లో అణిచేసిన తీరుకు ప్రతీక. దేశంలో తమ దోపిడీపై పెరుగుతున్న ఆగ్రహావేశాలను శాశ్వతంగా అణిచేయాలంటే, తమ దుర్మార్గ పాలనను శాశ్వతం చేసుకోవాలంటే ప్రజలను తీవ్ర భయాందోళనల్లో ఉంచాలని వారు సంకల్పించారు. ఈ దేశాన్నే చెరసాలగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమకు సహకారం అందిస్తే స్వయంపాలనకు వీలిచ్చే అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత ద్రోహం చేసిన బ్రిటిష్‌ పాలకులపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు బయల్దేరాయి. తమకు స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదనేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాన్ని అణచడానికి రౌలట్‌ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే జనరల్‌ డయ్యర్‌ ఈ అమానుషానికి పథక రచన చేశాడు. పర్వదినం సందర్భంగా సమీప గ్రామీణ ప్రాంతాలనుంచి వేలాదిమంది తమ తమ కుటుంబాలతో స్వర్ణాలయాన్ని సందర్శించుకుని జలియన్‌వాలాబాగ్‌లో సేదతీరుతారని అతనికి తెలియంది కాదు. అక్కడికొచ్చినవారు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నవారు కాదని కూడా తెలుసు. అయినా తన దుర్మార్గానికి వారినే సమిధలుగా ఎంచుకున్నాడు. ఆ ప్రాంగణాన్ని చుట్టు ముట్టిన వందలాదిమంది సైనికులతో మెషీన్‌గన్‌లతో గుళ్లవర్షం కురిపించాడు. నెలల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ ఎందరో ఈ దురంతంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుషం గురించి తెలుసుకున్న విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ అంతక్రితం నాలుగేళ్లనాడు బ్రిటన్‌ ప్రభుత్వం తనకిచ్చిన నైట్‌హుడ్‌ను వెనక్కి ఇచ్చేశారు. 

ఈ దుర్మార్గ ఘటనకు వందేళ్లు నిండినా ఇప్పటికీ బ్రిటన్‌ పాలకులకు క్షమాపణ చెప్పాలని తోచకపోవడం, దాని బదులు వేరే మాటలతో పొద్దుపుచ్చడం వారి అహంకారాన్ని తెలియ జేస్తుంది. ఆ దేశమూ, ఇతర పాశ్చాత్య దేశాలూ ఐక్యరాజ్యసమితి ద్వారా రెండో ప్రపంచ యుద్ధం నాటి అమానుషాలకు బాధ్యులంటూ జర్మనీ, జపాన్‌ తదితర దేశాల సైనిక జనరళ్లపై, ఇతర సైనికులపై విచారణలు జరిపించారు. అందులో అనేకమందికి మరణశిక్షలు విధించారు. జపాన్‌ సైన్యం సాగించిన దుర్మార్గాల గురించి విచారించడానికి ఏర్పాటైన మిలిటరీ ట్రిబ్యునల్‌లో ఉన్న ఏకైక భారతీయ న్యాయమూర్తి జస్టిస్‌ రాధాబినోద్‌ పాల్‌ ఇలా శిక్షలు విధిస్తున్న తీరుపై అసమ్మతి తీర్పు వెలువరించారు. జపాన్‌పై దాడులకు దిగి, వారిని రెచ్చగొట్టి, దాడులకు పురిగొల్పిన అమె రికా ప్రభుత్వానికి ఈ అమానుష కృత్యాల్లో భాగం ఉండదా అని ప్రశ్నించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పౌర ప్రాంతాలపై బాంబులు ప్రయోగించి లక్షలమంది చనిపోవడానికి కారకులైన పాశ్చాత్య దేశాల దారుణాలపై విచారణ జరిపించకపోతే సమన్యాయం ఎక్కడున్నట్టని ఆయన నిల దీశారు. ఆయన వేసిన ప్రశ్న జలియన్‌వాలాబాగ్‌ దురంతానికి కూడా వర్తిస్తుంది.

రెండో ప్రపంచ యుద్ధ నేరస్తులుగా తేల్చి అనేకమందిపై మరణశిక్షలు అమలు చేయడంలో, ఎందరినో ఖైదు చేయ డంలో పాలుపంచుకున్న దేశానికి జలియన్‌వాలాబాగ్‌ దుర్మార్గంలో తన తప్పు ఈనాటికీ తెలియక పోవడం దాని కపటత్వానికి చిహ్నం. వలస దేశాల్లో బ్రిటిష్‌ పాలకులు సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. నిజానికి వీటిన్నిటికీ క్షమాపణలు సరిపోవు. వారు అలా చెప్పినంతమాత్రాన జరిగిన వన్నీ సమసిపోవు. కానీ కారకులైనవారిలో పరివర్తన వచ్చిందని, వారు భవిష్యత్తులో తోటి మను షులపై ఇలాంటి ఘోరాలకు, కిరాతకాలకు పాల్పడరని మానవాళి భరోసాతో ఉండటానికి అవ కాశం ఏర్పడుతుంది. అన్నిటికీ మించి తాను నిజంగా ‘నాగరిక’మయ్యానని ప్రపంచానికి ధైర్యంగా చాటిచెప్పుకోవడానికి బ్రిటన్‌కు వీలవుతుంది. కానీ రెండువందల ఏళ్లు ఈ దేశ వనరుల్ని కొల్లగొట్టి, ఇక్కడివారి ఉసురుతీసి ఉన్నతంగా ఎదిగిన బ్రిటన్‌ ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి విలవిల్లాడు తోంది. ఇప్పుడు జస్టిన్‌ వెల్బీ జలియన్‌వాలాబాగ్‌లో ప్రదర్శించిన మానవీయతను చూశాకైనా అక్కడి పాలకులకు జ్ఞానోదయం కావాలి. ఆధ్యాత్మికవేత్తలు కేవలం ప్రవచనాలతో సరిపెట్టుకోరు. తమ ఆచరణ ద్వారా సందేశమిస్తారు. దాన్ని అందుకోవడం ఇప్పుడు బ్రిటన్‌ పాలకుల బాధ్యత. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement