archbishop
-
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
కార్డినల్‌గా పూల ఆంథోనీ
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు. -
జస్టిన్ వెల్బీ సందేశం
మన దేశంలో పర్యటించిన కేంటర్‌బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌వాలాబాగ్ అమరుల స్మారకస్థలిని బుధవారం సందర్శించి సరిగ్గా వందేళ్లక్రితం తమ దేశం నుంచి వచ్చిన పాలకులు సాగించిన మారణకాండకు తీవ్ర విచారం వ్యక్తం చేసిన తీరు మెచ్చ దగ్గది. జనరల్ డయ్యర్ ఆదేశాలమేరకు 1919 ఏప్రిల్‌లో సాగిన ఆ మారణకాండ వేయిమంది పౌరులను బలితీసుకుంది. మరిన్ని వేలమందిని గాయాలపాలు చేసింది. జస్టిన్ వెల్బీ బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి కాదు. కానీ బ్రిటన్‌లో 1,400 ఏళ్లక్రితం స్థాపితమై కోట్లాదిమంది భక్తగణం ఉన్న ప్రభావవంతమైన చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. ఆయన విచారం వ్యక్తం చేయడం మాత్రమే కాదు... అమరుల స్మారకచిహ్నం ముందు సాష్టాంగపడి నివాళులర్పించారు. తన దేశస్తులు పాలకులుగా ఉండి సాగించిన ఈ దుర్మార్గానికి ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు. వ్యక్తులైనా, సంస్థలైనా, దేశాలైనా తమ వల్ల జరిగిన ఉదంతంపై పశ్చాత్తాప పడినప్పుడు, మనోవేద నకు లోనైనప్పుడు క్షమాపణ చెప్పడం ఉంటుంది. కానీ జలియన్‌వాలాబాగ్‌ను ఇంతక్రితం సంద ర్శించిన బ్రిటన్ గత ప్రధానులు థెరిస్సా మే, డేవిడ్ కామెరాన్‌లు ఆనాటి ఉదంతం ఒక విషాద కరమైన ఘటనగా చెప్పి తప్పుకున్నారు. వారికన్నా ముందు 1997లో వచ్చిన బ్రిటన్ రాణి ఆ ఘట నను ‘దుఃఖం కలిగించేద’ని అభివర్ణించి ఊరుకున్నారు. చరిత్రను తిరగరాయలేమని కూడా చెప్పు కొచ్చారు. జలియన్‌వాలాబాగ్ దుర్మార్గాన్ని కేవలం ఒక ఉదంతంగా చూడకూడదు. బ్రిటిష్ వలసపాల కులు అంతకు కొన్ని దశాబ్దాల ముందునుంచీ ఈ దేశ వనరులను ఎడాపెడా దోచుకుంటూ, ప్రతి ఘటించినవారిని అనేకరూపాల్లో అణిచేసిన తీరుకు ప్రతీక. దేశంలో తమ దోపిడీపై పెరుగుతున్న ఆగ్రహావేశాలను శాశ్వతంగా అణిచేయాలంటే, తమ దుర్మార్గ పాలనను శాశ్వతం చేసుకోవాలంటే ప్రజలను తీవ్ర భయాందోళనల్లో ఉంచాలని వారు సంకల్పించారు. ఈ దేశాన్నే చెరసాలగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమకు సహకారం అందిస్తే స్వయంపాలనకు వీలిచ్చే అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత ద్రోహం చేసిన బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు బయల్దేరాయి. తమకు స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదనేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాన్ని అణచడానికి రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే జనరల్ డయ్యర్ ఈ అమానుషానికి పథక రచన చేశాడు. పర్వదినం సందర్భంగా సమీప గ్రామీణ ప్రాంతాలనుంచి వేలాదిమంది తమ తమ కుటుంబాలతో స్వర్ణాలయాన్ని సందర్శించుకుని జలియన్‌వాలాబాగ్‌లో సేదతీరుతారని అతనికి తెలియంది కాదు. అక్కడికొచ్చినవారు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నవారు కాదని కూడా తెలుసు. అయినా తన దుర్మార్గానికి వారినే సమిధలుగా ఎంచుకున్నాడు. ఆ ప్రాంగణాన్ని చుట్టు ముట్టిన వందలాదిమంది సైనికులతో మెషీన్గన్లతో గుళ్లవర్షం కురిపించాడు. నెలల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ ఎందరో ఈ దురంతంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుషం గురించి తెలుసుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అంతక్రితం నాలుగేళ్లనాడు బ్రిటన్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్‌హుడ్‌ను వెనక్కి ఇచ్చేశారు. ఈ దుర్మార్గ ఘటనకు వందేళ్లు నిండినా ఇప్పటికీ బ్రిటన్ పాలకులకు క్షమాపణ చెప్పాలని తోచకపోవడం, దాని బదులు వేరే మాటలతో పొద్దుపుచ్చడం వారి అహంకారాన్ని తెలియ జేస్తుంది. ఆ దేశమూ, ఇతర పాశ్చాత్య దేశాలూ ఐక్యరాజ్యసమితి ద్వారా రెండో ప్రపంచ యుద్ధం నాటి అమానుషాలకు బాధ్యులంటూ జర్మనీ, జపాన్ తదితర దేశాల సైనిక జనరళ్లపై, ఇతర సైనికులపై విచారణలు జరిపించారు. అందులో అనేకమందికి మరణశిక్షలు విధించారు. జపాన్ సైన్యం సాగించిన దుర్మార్గాల గురించి విచారించడానికి ఏర్పాటైన మిలిటరీ ట్రిబ్యునల్‌లో ఉన్న ఏకైక భారతీయ న్యాయమూర్తి జస్టిస్ రాధాబినోద్ పాల్ ఇలా శిక్షలు విధిస్తున్న తీరుపై అసమ్మతి తీర్పు వెలువరించారు. జపాన్‌పై దాడులకు దిగి, వారిని రెచ్చగొట్టి, దాడులకు పురిగొల్పిన అమె రికా ప్రభుత్వానికి ఈ అమానుష కృత్యాల్లో భాగం ఉండదా అని ప్రశ్నించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పౌర ప్రాంతాలపై బాంబులు ప్రయోగించి లక్షలమంది చనిపోవడానికి కారకులైన పాశ్చాత్య దేశాల దారుణాలపై విచారణ జరిపించకపోతే సమన్యాయం ఎక్కడున్నట్టని ఆయన నిల దీశారు. ఆయన వేసిన ప్రశ్న జలియన్‌వాలాబాగ్ దురంతానికి కూడా వర్తిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ నేరస్తులుగా తేల్చి అనేకమందిపై మరణశిక్షలు అమలు చేయడంలో, ఎందరినో ఖైదు చేయ డంలో పాలుపంచుకున్న దేశానికి జలియన్‌వాలాబాగ్ దుర్మార్గంలో తన తప్పు ఈనాటికీ తెలియక పోవడం దాని కపటత్వానికి చిహ్నం. వలస దేశాల్లో బ్రిటిష్ పాలకులు సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. నిజానికి వీటిన్నిటికీ క్షమాపణలు సరిపోవు. వారు అలా చెప్పినంతమాత్రాన జరిగిన వన్నీ సమసిపోవు. కానీ కారకులైనవారిలో పరివర్తన వచ్చిందని, వారు భవిష్యత్తులో తోటి మను షులపై ఇలాంటి ఘోరాలకు, కిరాతకాలకు పాల్పడరని మానవాళి భరోసాతో ఉండటానికి అవ కాశం ఏర్పడుతుంది. అన్నిటికీ మించి తాను నిజంగా ‘నాగరిక’మయ్యానని ప్రపంచానికి ధైర్యంగా చాటిచెప్పుకోవడానికి బ్రిటన్‌కు వీలవుతుంది. కానీ రెండువందల ఏళ్లు ఈ దేశ వనరుల్ని కొల్లగొట్టి, ఇక్కడివారి ఉసురుతీసి ఉన్నతంగా ఎదిగిన బ్రిటన్ ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి విలవిల్లాడు తోంది. ఇప్పుడు జస్టిన్ వెల్బీ జలియన్‌వాలాబాగ్‌లో ప్రదర్శించిన మానవీయతను చూశాకైనా అక్కడి పాలకులకు జ్ఞానోదయం కావాలి. ఆధ్యాత్మికవేత్తలు కేవలం ప్రవచనాలతో సరిపెట్టుకోరు. తమ ఆచరణ ద్వారా సందేశమిస్తారు. దాన్ని అందుకోవడం ఇప్పుడు బ్రిటన్ పాలకుల బాధ్యత. -
ఆర్చ్‌బిషప్ లేఖ.. రాజకీయ దుమారం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘దేశం కోసం’ ప్రార్థించాలంటూ క్రైస్తవ మతబోధకులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని చర్చిలను ఉద్దేశించి ఈ నెల 8న ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో రాసిన ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది. ‘కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం తప్పు. సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయమని మీరు చెప్పవచ్చు. కానీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓటు వేయకూడదని చెప్తూ మీకు మీరే కుహనా లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష చూపడం లేదని, ఈ నేపథ్యంలో అందరూ ప్రగతిశీల సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ‘దేశం కోసం’ ప్రార్థనా ప్రచారం చేయాలని, ప్రతివారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనల సందర్భంగా తప్పకుండా లేఖలో పేర్కొన్న ప్రార్థనను చదివి వినించాలని ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో తన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రాజకీయ కల్లోల వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోంది’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో హుందాతనంతో కూడిన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మన రాజకీయ నాయకుల్లో స్వచ్ఛమైన దేశభక్తి జ్వాల ఎగిసిపడేలా చూడాలని ప్రభువును కోరుతూ ప్రార్థన చేయాలని లేఖలో సూచించారు. అయితే, ఈ లేఖలో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని, ఎన్నికలకు ముందు ఇలా లేఖ రాయడం ఆనవాయితీగా వస్తుందని ఆర్చ్‌బిషప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
మైనర్ బాలికపై మత గురువు అత్యాచారం
బెంగళూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మైనర్ బాలికపై మత గురువు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామనగర జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమపుర గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె (15) ఇటీవల తొమ్మిదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. వేసవి సెలవుల సందర్బంగా రెండు నెలల క్రితం రామనగరలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ అనారోగ్యానికి గురైన బాలికను చికిత్స కోసమని సమీపంలోని ప్రార్థన మందిరానికి తీసుకెళ్లారు. అక్కడి మౌల్వి.. సయ్యద్ ముజీర్ వీరి మూఢ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, బాలికకు దయ్యం పట్టిందని, వదిలిస్తానని నమ్మించాడు. ప్రార్థనా మందిరంలోకి ఆమెను ఒంటరిగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సున్నితమైన చోట ఇనుప కడ్డీతో గుచ్చి పైశాచికంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించి, బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అతని వికృత చేష్టలకు భయపడిన బాలిక జరిగిన దారుణాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న బాలిక ఈ నెల 4న తీవ్ర అస్వస్థతకు లోనైంది. వెంటనే ఆమెను మండ్య జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు విషయాన్ని పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు చేరవేశారు. పరారీలో ఉన్న నిందితున్ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. సున్నితమైన చోట ఇనుప కడ్డీని చొప్పించడం వల్ల బాలిక తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు.