న్యూఢిల్లీ: క్రూరత్వం, హింస ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని.. జలియన్ వాలాబాగ్ దారుణమే దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎప్పటికీ అహింస, శాంతి ద్వారానే విజయం సాధించవచ్చన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఇచ్చిన ఈ సందేశాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. మాసాంతపు రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘హింస, క్రూరత్వం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేం. శాంతి, అహింస, త్యాగం, బలిదానాలదే తుది విజయం’ అని మోదీ పేర్కొన్నారు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర చాలా సుదీర్ఘమైనదని.. ఇందులో లెక్కించలేనన్ని త్యాగాలు, బలిదానాలున్నాయని గుర్తుచేశారు. ‘2019లో జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతాయి. 1919, ఏప్రిల్ 13 నాటి ఆ చీకటి రోజును ఎవరు మరిచిపోగలరు. ఈ ఘటన యావత్ మానవజాతినే క్షోభకు గురిచేసింది. అధికార పరిధిని అపహాస్యం చేస్తూ.. క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులు దాటి అమాయకులు, నిరాయుధులైన ప్రజలపై పాశవికంగా కాల్పులు జరిపి చంపారు. వందేళ్ల నాటి ఈ ఘటన మనకు ఎన్నో నేర్పింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
నానక్, కబీర్ దాస్‌ల స్ఫూర్తితో..
వచ్చే ఏడాది గురు నానక్ 550వ జయంతి (ప్రకాశ్ పర్వ్) జరుపుకోబోతున్నామని మోదీ తెలిపారు. ‘భారతీయులంతా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ప్రకాశ్ పర్వ్‌ను ప్రేరణా పర్వ్ (స్ఫూర్తిదాయకంగా) మార్చుకునేందుకు మీరు సలహాలు, సూచనలు చేయండి. ఈ కార్యక్రమాన్ని మనమంతా కలిసి గొప్పగా జరుపుకుందాం’ అని ప్రధాని అన్నారు. గురు నానక్, కబీర్ దాస్‌ల బోధనలను గుర్తుచేస్తూ.. కుల వివక్ష తొలగిపోవాలని, మానవత్వం వికసించాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 52 ఏళ్లకే దేశం కోసం బలిదానమయ్యారన్నారు. తొలి వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా దేశం కోసం ముఖర్జీ చేసిన పనులను, ఆయన ఆలోచనలను మోదీ పేర్కొన్నారు.
జీఎస్టీ అమల్లో రాష్ట్రాలు భేష్
భారతదేశంలో సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ అమలుతీరే మంచి నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడి వ్యవస్థ ‘నిజాయితీ పండుగ’ జరుపుకుంటోందన్నారు. ‘సరికొత్త పన్ను వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా దీని అమలుకు ముందుకొచ్చాయి. భిన్న పార్టీలు, భిన్న అవసరాలున్న రాష్ట్రాలు కానీ అవన్నీ పక్కనపెట్టి అందరికీ న్యాయం జరగాలని నిర్ణయించాయి. ఒకే దేశం–ఒకే పన్ను అనే ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు కావడంలో రాష్ట్రాల పాత్ర అభినందనీయం’ అని మోదీ పేర్కొన్నారు.
రషీద్ ఖాన్‌కు మోదీ ప్రశంసలు
అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్, భారత వైమానిక దళ స్కై డైవర్లపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఐపీఎల్‌లో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ మంచి ప్రదర్శన కనబరిచారు. రషీద్‌ను ప్రశంసిస్తూ అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ చేసిన ట్వీట్ నాకింకా గుర్తుంది. ఇటీవల భారత్–అఫ్గాన్ మధ్య టెస్టు మ్యాచ్ అనంతరం.. ట్రోపీని అందుకునేందుకు అఫ్గాన్ జట్టును భారత్ ఆహ్వానించడం ఓ మంచి వాతావరణాన్ని సూచిస్తోంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలనూ మోదీ గుర్తుచేశారు. ‘15వేల అడుగుల ఎత్తులో గాల్లో.. భారత వైమానిక దళ స్కై డైవర్లు చేసిన యోగా ప్రదర్శన అద్భుతం’ అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment