Nonviolence
-
అహింసాయుతంగా పోరాడండి
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసను నిత్య జీవితంలో అంతర్భాగంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందన్నారు. ‘ప్రజలే దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ‘దేశాభివృద్ధికి అంతర్గత భద్రత ఎంతో కీలకం. దేశ అంతర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది’ అని చెప్పారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్ ఎంతో తక్కువకాలంలోనే ఘన విజయం సాధించింది. సబ్సిడీపై వంటగ్యాస్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలను ప్రజలు తమవిగా చేసుకోవడం ద్వారా అవి విజయవంతమయ్యాయి’ అని అన్నారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అలంకారప్రాయంగా కాకుండా, ఆచరణాత్మకంగా ఉండాలని భావిస్తే మనం ఏం చేయాలి? ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను తప్పకుండా అనుసరించాలనేదే నా అభిప్రాయం’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. -
తప్పయిపోయింది స్వామీజీ..!
ఆయన ఒక స్వామీజీ. నీతి, నిజాయితీ, ఓర్పు, సత్యవాక్పాలన, అహింసల విశిష్టతలను, వాటిని పాటించడం వల్ల సమాజానికి కలిగే మంచిని చక్కగా వివరిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఓ ఆకతాయికి కొంటె బుద్ధి పుట్టింది. భక్తి ఉన్నవాడిలా నటిస్తూ, స్వామీజీ దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. చిరునవ్వుతో ఏమిటన్నట్టు చూశారు స్వామీజీ. ‘‘స్వామీ, నాదో సందేహం. దయచేసి తీరుస్తారా?’’ అనడిగాడు. ‘‘చెప్పు నాయనా’’ అన్నారు స్వామీజీ చల్లగా. ‘‘ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు కదా, వారి పేర్లు చెబుతారా’’ అన్నాడు. స్వామీజీకి అతని ఉద్దేశ్యం అర్థమైనా కోపం తెచ్చుకోలేదు. ‘‘అలాగే నాయనా! తప్పకుండా చెబుతాను. అయితే ఒక నిబంధన. నేను ఏకబిగిన చెప్పుకుని పోతూ ఉంటాను.నువ్వు నిద్రాహారాలను వదిలేసి మరీ స్వయంగా రాసుకోవాలి. పూర్తయిన తర్వాత తిరిగి నాకు చదివి వినిపించాలి.సిద్ధమేనా మరి?’’అనడిగారు స్వామీజీ. అతనికి దిమ్మ తిరిగినట్లయింది. ‘ఇంటి దగ్గర తన తాత, నాయనమ్మ రామకోటి, శివకోటి కొన్ని ఏళ్లుగా రాస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కోటి నామాలకే అంత సమయం పడితే, మూడు కోట్ల నామాలను పూర్తి చేసేసరికి నేను ముసలివాడిని కావడం ఖాయం. ఆయన్నేదో ఇరుకున పెట్టాలనుకుంటే చివరకు నేనే ఇరుక్కుపోయేలా ఉన్నానే, తప్పయిపోయింది.’ అనుకున్నాడు. వెంటనే చెంపలు వేసుకుంటూ, ‘క్షమించండి స్వామీ, కొంటెతనం కొద్దీ అలా అడిగాను. మీరు ముక్కోటి నామాలనూ చెప్పినా, రాసుకునేంత ఓపిక గానీ, ఆసక్తి గానీ లేవు నాకు’’ అన్నాడు. స్వామీజీ చిరునవ్వుతో ‘‘నాయనా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను అనేక అంశలుగా భావించి వివిధ నామాలతో, రూపాలతో పూజిస్తుంటారు. నిజానికి ముక్కోటి దేవతలు అని మాట వరసకుఅనేదేకానీ, నిజంగా మూడుకోట్ల మంది దేవతలున్నారని కాదు. నువ్వు నిజంగా తెలుసుకునేందుకు అడిగి ఉంటే నువ్వు పెరుగుతావని సంతోషించేవాడిని. కానీ నన్నేదో ఇబ్బంది పెట్టాలనుకుని అడిగావు. ఇంకొకరిని తక్కువ చేయడానికి నీ తెలివితేటలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అర్థమైందా?’’ అన్నారు. అర్థమైందన్నట్లుగా మరోసారి లెంపలు వేసుకుంటూ, ఈసారి భక్తితో మనస్ఫూర్తిగా స్వామీజీకి నమస్కరించాడు. డి.వి.ఆర్. -
మనలో మననంలో
ఔను! గాంధీ ఉన్నాడు.చరిత్ర పుటల్లో ఎక్కడో చిక్కుకుపోయి లేడు.మనలో ఉన్నాడు, మననంలో ఉన్నాడు.ప్రతి విప్లవాత్మక ఆలోచనలోనూ మహాత్ముడు ఉన్నాడు.ప్రపంచంలో భారతావనికి ఉన్న కీర్తి ప్రతిష్ఠల్లో ఇప్పటికీ ఉన్నాడు.హింసను అహింసతో ఎదుర్కొన్న శౌర్యంలో ఉన్నాడు.మరి ఈ మహాత్ముడు రేపటి తరంలోనూ ఉండాలి.తరతరానికీ ఇంకా ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. కత్తితో ఛేదించనిది కరుణతో సాధించాలి అనే అహింసా సూత్రాన్ని ఆచరణాత్మకంగా పాటించిన తొలి జాతీయ నాయకుడు ఆయన. అసలు పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అయినా, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అహింసామార్గంలో పోరాటం సాగించి, మహాత్మాగాంధీగా ప్రసిద్ధుడయ్యాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని కూడగట్టి, ఏకతాటిపై నడిపించి, దేశ స్వాతంత్య్ర సముపార్జనలో కీలక పాత్ర పోషించి జాతిపితగా చరిత్రకెక్కాడు. గాంధీ మార్గం తర్వాతి కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో నల్లజాతి వారి హక్కుల కోసం పౌరహక్కుల ఉద్యమాన్ని సాగించిన మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించిన నెల్సన్ మండేలా వంటి వారు గాంధీ స్ఫూర్తితోనే తమ ఉద్యమాలు సాగించారు. సమాజంలో హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో అహింసను బోధించిన మహాత్ముని ఒకసారి మననం చేసుకోవడం అవసరం. రేపటి తరాలకు వెలుగు బాటలు చూపగల మహాత్ముని మాటలు మీ కోసం... ►నా జీవితమే నా సందేశం. ►పొరపాట్లు లేని స్వేచ్ఛే లేకుంటే ఆ స్వేచ్ఛకు అర్థమే లేదు. ►ప్రపంచంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నారో మీరే ఆ మార్పుగా మారండి. ►సత్యం ఒక్కటే, దాని మార్గాలే అనేకం. ►అందరూ కంటికి కన్ను అనే సూత్రం పాటిస్తే, ప్రపంచమే గుడ్డిదైపోతుంది. ►సత్యాన్ని పలకాల్సిన సందర్భంలో, దానికి అనుగుణంగా ముందుకు కదలాల్సిన సందర్భంలో మౌనం పాటించడం పిరికితనమే అవుతుంది. ►మనంతట మనమే ఇవ్వకుంటే ఎవరూ మన ఆత్మగౌరవాన్ని తీసుకుపోలేరు. ►సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్నే వణికించగలరు. ►నా బుద్ధి మేరకు ఒక గొర్రె ప్రాణం ఒక మనిషి ప్రాణం కంటే తక్కువ విలువైనదేమీ కాదు. ► ఏ పని చేసినా ఆ పనిని ప్రేమతో చేయండి. లేకుంటే, ఆ పనిని చేయనే చేయవద్దు. ► వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలను విరిచేయవచ్చు, చివరకు వాళ్లు నన్ను చంపేయవచ్చు. వాళ్లు నా శవాన్ని పొందవచ్చు తప్ప నా లొంగుబాటును కాదు. ► నా అనుమతి లేకుండా ఇతరులెవ్వరూ నన్ను గాయపరచలేరు. ►‘శాంతిమార్గం’ అంటూ ఏదీ ఉండదు. ‘శాంతి’ మాత్రమే ఏకైక మార్గం. ►మన చర్యల పర్యవసానాల నుంచి పారిపోవాలనుకోవడం పొరపాటు మాత్రమే కాదు, అనైతికం కూడా. ►అహింస దృఢమనస్కుల ఆయు«ధం. ►మీ ప్రత్యర్థి ఎప్పుడు మీకు తారసపడినా, అతడిని ప్రేమతోనే జయించండి. ►నిర్భీకతే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. పిరికితనం నైతికతకు అవరోధం. ►న్యాయమైన ప్రయోజనాన్ని సత్యం ఏనాడూ దెబ్బతీయదు. ►బలహీనులు ఇతరులను క్షమించలేరు. క్షమాగుణం బలవంతులకు మాత్రమే సాధ్యమైన సుగుణం. ►మీరు భయాన్ని నిరాకరిస్తే, ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ ఉండదు. ►నిజాయితీతో కూడిన అభిప్రాయభేదాలు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సంకేతాలు. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, జీవం అక్కడే ఉంటుంది. ►కొండంత ప్రబోధం కంటే ఇసుమంత ఓరిమి చాలా విలువైనది. ►బలం అనేది శారీరక సామర్థ్యం నుంచి వచ్చేది కాదు, చెక్కుచెదరని సంకల్పం నుంచి వచ్చేది. ►నాకే గనుక హాస్యస్ఫూర్తి లేకుంటే, ఏనాడో నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ►పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి. ►మీరు ఈ రోజు చేసే చర్యలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ►పిరికివాళ్లు ప్రేమను ప్రదర్శించలేరు, అది ధైర్యవంతుల లక్షణం. ►ఈ భూమి ప్రతి మనిషి అవసరాలు తీర్చడానికి తగినంత ఇస్తుంది. కానీ, ప్రతి మనిషి లోభానికి తగినంత కాదు. ►ప్రార్థన అనేది ఉదయానికి తాళం చెవిలాంటిది, రాత్రికి గడియలాంటిది. ►ఏ రోజు ప్రేమకు గల శక్తి అధికారంపై గల ప్రేమను జయిస్తుందో ఆ రోజే ప్రపంచశాంతి సిద్ధిస్తుంది. ►మితభాషి అయిన మనిషి అనాలోచితంగా ఏదీ మాట్లాడడు. ►కర్మ మాత్రమే మనిషి నియంత్రణలో ఉంటుంది కానీ, దాని ఫలితం కాదు. ►సత్యాన్ని మించిన దైవం లేదు. ►పేదరికం అత్యంత దారుణమైన హింసారూపం. ►మూసి ఉన్న పిడికిలితో కరచాలనం చేయలేం. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, దైవం అక్కడే ఉంటుంది. ►నీ పొరుగువానిలో దేవుడిని కనుగొనలేనప్పుడు, దేవుని గురించిన నీ అన్వేషణ వ్యర్థం. ►వినయంతో చేయని సేవ స్వార్థమూ, అహంభావమే అవుతుంది. ►మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. అవి: నిన్న, రేపు. ►భయమే శత్రువు. మనం దానిని ద్వేషం అనుకుంటాం. నిజానికది భయమే! ►ప్రవర్తన అద్దంలాంటిది. అందులో మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలం. ►వ్యక్తుల మధ్య దృఢంగా గల ప్రేమ పునాదులపైనే దేశాల మధ్య శాంతి ఆధారపడి ఉండాలి. ►క్రోధం, అసహనం సరైన అవగాహనకు జంట శత్రువులు. ►భగవంతునికి మతం లేదు. ►మనిషి తన ఆలోచనలకు తానే ప్రతిరూపం. మీరు మీ ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతారు. ►ఎలాంటి కష్టం లేకుండా సిసలైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు. ►భౌతిక అనుబంధం కంటే ఆధ్యాత్మిక అనుబంధం గొప్పది. ఆధ్యాత్మికత లేని జీవితం ఆత్మ లేని శరీరంలాంటిది. ►మనం ఇతరులకు ఎంత సత్వరంగా న్యాయం చేయగలిగితే మనమూ అంతే సత్వరంగా న్యాయాన్ని పొందగలం. ►భగవంతుడు మనతో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉంటాడు. మనకే ►ఆ మాటలను ఎలా వినాలో తెలియదు. ►150 దేశాల తపాలా బిళ్లలపై గాంధీ బొమ్మ మనదేశంలో తపాలా బిళ్లల మీద, కరెన్సీ నోట్ల మీద, నాణేల మీద మహాత్మాగాంధీ బొమ్మ ఉండటం విడ్డూరం కాదు గానీ, ఏకంగా 150 దేశాలు మహాత్ముని బొమ్మతో తపాలా బిళ్లలు ముద్రించడం మాత్రం నిజంగా విశేషం. మహాత్మాగాంధీకి ప్రపంచవ్యాప్తంగా గల ఆదరణకు ఇదొక నిదర్శనం. దాదాపు రెండు దశాబ్దాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌వారి నుంచి విముక్తి కోసం గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు. తమ దేశానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన గాంధీజీ బొమ్మతో బ్రిటన్ కూడా తపాలా బిళ్లలు ముద్రించడం మరింత విశేషం. బ్రిటిష్ రాచ కుటుంబీకుల బొమ్మలు తప్ప ఇతరుల బొమ్మలతో తపాలా బిళ్లలు, కరెన్సీ ముద్రించని బ్రిటన్‌లో గాంధీజీకి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు లభించింది. అలహాబాద్‌కు చెందిన పప్పుదినుసుల వ్యాపారి అనిల్ రస్తోగికి స్టాంపుల సేకరణ హాబీ. ఆయన ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ బొమ్మతో ముద్రితమైన 800 స్టాంపులను సేకరించి, తపాలాశాఖ ద్వారా సత్కారాన్ని పొందారు. రస్తోగీ సేకరణలో గాంధీజీ బొమ్మతో భూటాన్ ముద్రించిన ప్లాస్టిక్ స్టాంపు, ‘లీడర్ ఆఫ్ ట్వెంటీయత్ సెంచురీ’ పేరిట మైక్రోనేసియా ముద్రించిన అరుదైన స్టాంపులు కూడా ఉండటం విశేషం. దక్షిణాఫ్రికా, మాల్టా, సమోవా వంటి కొన్ని దేశాలు గాంధీజీ బొమ్మతో నాణేలు కూడా ముద్రించాయి. ప్రపంచ దేశాల్లో గాంధీజీ గాంధీజీ పుట్టి పెరిగిన భారత్‌లోను, ఉన్నత చదువులు చదువుకున్న ఇంగ్లండ్‌లోను, న్యాయవాదిగా పనిచేసిన దక్షిణాఫ్రికాలోను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో గాంధీజీ విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... ►భారత్‌కు ఇంకా స్వాతంత్య్రం రాకముందే అమెరికాలో స్థిరపడిన జర్మన్ కళాకారుడు ఫ్రిట్జ్ ఈషెన్బర్గ్ 1942లో ‘గాంధీ, ది గ్రేట్ సోల్’ పేరిట కలపపై చెక్కిన శిల్పం అమెరికాలో ఇప్పటికీ నిలిచి ఉంది. ►ఫ్రెడ్డా బ్రిలియంట్ అనే శిల్పి రూపొందించిన గాంధీజీ శిల్పాన్ని 1968లో లండన్‌లో నెలకొల్పారు. అప్పటి బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ దానిని ఆవిష్కరించారు. ► భారత దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో డెన్మార్క్‌కు బహూకరించిన గాంధీజీ విగ్రహాన్ని డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నడిబొడ్డున నెలకొల్పారు. ►న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్ పార్కులో 1986 అక్టోబర్ 2న గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. భారతీయ శిల్పి కాంతిలాల్ పటేల్ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో 1993 సంవత్సరంలో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. మొదటి తరగతి బోగీలో ప్రయాణిస్తున్న గాంధీని ఇదే చోట బలవంతంగా రైలు నుంచి తోసేసిన సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నెలకొల్పిన ఈ విగ్రహాన్ని నోబెల్ బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా క్రైస్తవ మతబోధకుడు డెస్మండ్ టుటు ఆవిష్కరించారు.ఇవి మాత్రమే కాదు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, స్మారక కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో మరే నాయకుని పేరిటా ఇన్ని స్మారక చిహ్నాలు లేవు. అహింసామార్గంలో ఆయన సాగించిన పోరాటానికి ప్రపంచ దేశాలు పలికిన నీరాజనాలు ఈ స్మారక చిహ్నాలు. -
అహింసే గొప్ప ధర్మం
పూర్వం సారనాథ్‌ని రిషిపట్టణం అనేవారు. అక్కడ సువిశాలమైన మృగదావనం ఉంది. ఆ వనంలో జింకలు జీవిస్తూ ఉండేవి. ఆ జింకలకు ఒక రాజు ఉన్నాడు. అతని పేరు బోధిసత్వుడు. ఈ మృగదావన ప్రాంతం కాశీరాజైన బ్రహ్మదత్తుని ఏలుబడిలో ఉంది. బ్రహ్మదత్తుడు ప్రతిరోజూ ఈ వనానికి వచ్చి జింకల్ని వేటాడేవాడు. చనిపోయినవి చనిపోగా, మిగిలిన జింకలు భయంతో పొదల్లో దూరి బిక్కుబిక్కుమంటూ బతికేవి. కొన్ని భయంతో ప్రాణాలు విడిచేవి. ఒకనాడు అవన్నీ తమ జింకలరాజు సమక్షంలో సమావేశమై ‘‘కాశీరాజు బాణాలకు చచ్చేవారి కంటే, భయంతో చచ్చేవారే ఎక్కువ. కాబట్టి మనం ఇకనుండి రోజుకు వంతులవారీగా ఒక్కోజింక చొప్పున రాజుగారి వంటశాలకు వెళ్దాం’’ అని తీర్మానించుకున్నాయి. తమ తీర్మానాన్ని, జింకల రాజు బోధిసత్త్వుని ద్వారా కాశీరాజుకి చేరవేశాయి. ఆ ఒప్పందానికి కాశీరాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి తమ తమ వంతు ప్రకారం ఒక్కో జింక కాశీ రాజు వంటశాలకు పోసాగింది. ఒకరోజున నిండు గర్భిణిగా ఉన్న ఒక తల్లి జింక వంతువచ్చింది. అది జింకల రాజు దగ్గరికి వచ్చి ‘‘రాజా! నేను నేడోరేపో ప్రసవిస్తాను. ఈ రోజుకి నాకు బదులుగా మరొకర్ని పంపండి. నేను తర్వాత వారి వంతు వచ్చినప్పుడు వెళ్తాను. నా బిడ్డలు కూడా వారి వారి వంతు వచ్చినప్పుడు వారూ వెళ్తారు. ఇప్పుడు నాతోపాటు నా బిడ్డల ప్రాణాలు పోతాయి. నాకు న్యాయం చేయండి’’ అని ప్రాధేయపడింది. తల్లిజింక ఆవేదన విన్న బోధిసత్త్వుడు, జింకలన్నిటినీ సమావేశపరిచి విషయం చెప్పాడు. ఆమె స్థానంలో పోడానికి ఏ ఒక్కజింకా అంగీకరించలేదు. సమావేశానంతరం తల్లి జింకను ఓదార్చి పంపిన జింకలరాజు బోధిసత్త్వుడు ఆమె స్థానంలో ఆయనే స్వయంగా కాశీరాజు వంటశాలకు వెళ్లి, తనను వధించమని చెప్పాడు. జింకలరాజే స్వయంగా రావడంతో, వంటవాళ్లు వధించకుండా ఈ విషయం కాశీరాజుకు విన్నవించారు. కాశీరాజు తన భవనం దిగి వంటశాలకు వచ్చి– ‘‘మృగరాజా! తమరు పాలకులు. మీరు ఇలా రావడం తగదు. అయినా, మీ ప్రజల్ని పంపాలిగానీ, మీరెందుకు వచ్చారు?’’అని ప్రశ్నించాడు. జింకలరాజు విషయం చెప్ప– ‘‘రాజా! రాజు అంటే రక్షకుడు. భక్షకుడు కాదు. నా ప్రజల్లో ఒకరికి ఇబ్బంది వచ్చింది. వారిని రక్షించడం న్యాయం కాబట్టి వారి స్థానంలో నేనే వచ్చాను. ధర్మరక్షణ అంటే ఇదే. మీరేం బాధపడకండి. నన్ను చంపుకుని తినండి’’ అని బలిపీఠం ఎక్కాడు. జింకలరాజు మాటలకు కాశీరాజుకి కనువిప్పు కలిగింది. కన్నీరు పెట్టుకుని – ‘‘రాజు ప్రజల్ని ఎలా చూడాలో ‘నాలుగు కాళ్ల జంతువు’గా పుట్టినప్పటికీ నీకు తెలిసింది. మనిషిగా పుట్టిన నాకు తెలియలేదు. నన్ను క్షమించండి’’ ఇక మీ సారనాథ్‌లోని మృగదావనంలో వేటకు రాను. ఇదే నా అభయం. ఇక మీరు సంతోషంగా వెళ్లవచ్చు’’ అన్నాడు. అయినా, జింకలరాజు అక్కడినుండి కదలక పోవడంతో ఏమిటని అడిగాడు కాశీరాజు. ‘‘నాకు అన్ని జీవులూ సమానమే, జీవహింస ఎక్కడ జరిగినా నాకు అది మనస్కరించదు రాజా!’’ అన్నాడు. కాశీరాజు ఇక తాను జీవహింస చేయనని వాగ్దానం చేశాడు. జింకలరాజు సంతృప్తితో వెళ్లిపోయాడు. ‘దుర్మార్గులైన వ్యక్తిని చంపడం కాదు, అతనిలో ఉన్న దుర్మార్గాన్ని చంపాలి’ అనే బుద్ధ ప్రబోధానికి తగిన స్థలపురాణం ఈ సారనాథ్ కథ. (బుద్ధుడు సారనాథ్‌లో తొలి ప్రబోధం చెప్పినది ఆషాఢ పున్నమినాడు. ఈ నెల 27న ఆషాఢపున్నమి సందర్భంగా) – డా. బొర్రా గోవర్ధన్ -
హింసతో పరిష్కారం దొరకదు
న్యూఢిల్లీ: క్రూరత్వం, హింస ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని.. జలియన్ వాలాబాగ్ దారుణమే దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎప్పటికీ అహింస, శాంతి ద్వారానే విజయం సాధించవచ్చన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఇచ్చిన ఈ సందేశాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. మాసాంతపు రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘హింస, క్రూరత్వం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేం. శాంతి, అహింస, త్యాగం, బలిదానాలదే తుది విజయం’ అని మోదీ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర చాలా సుదీర్ఘమైనదని.. ఇందులో లెక్కించలేనన్ని త్యాగాలు, బలిదానాలున్నాయని గుర్తుచేశారు. ‘2019లో జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతాయి. 1919, ఏప్రిల్ 13 నాటి ఆ చీకటి రోజును ఎవరు మరిచిపోగలరు. ఈ ఘటన యావత్ మానవజాతినే క్షోభకు గురిచేసింది. అధికార పరిధిని అపహాస్యం చేస్తూ.. క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులు దాటి అమాయకులు, నిరాయుధులైన ప్రజలపై పాశవికంగా కాల్పులు జరిపి చంపారు. వందేళ్ల నాటి ఈ ఘటన మనకు ఎన్నో నేర్పింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నానక్, కబీర్ దాస్‌ల స్ఫూర్తితో.. వచ్చే ఏడాది గురు నానక్ 550వ జయంతి (ప్రకాశ్ పర్వ్) జరుపుకోబోతున్నామని మోదీ తెలిపారు. ‘భారతీయులంతా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ప్రకాశ్ పర్వ్‌ను ప్రేరణా పర్వ్ (స్ఫూర్తిదాయకంగా) మార్చుకునేందుకు మీరు సలహాలు, సూచనలు చేయండి. ఈ కార్యక్రమాన్ని మనమంతా కలిసి గొప్పగా జరుపుకుందాం’ అని ప్రధాని అన్నారు. గురు నానక్, కబీర్ దాస్‌ల బోధనలను గుర్తుచేస్తూ.. కుల వివక్ష తొలగిపోవాలని, మానవత్వం వికసించాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 52 ఏళ్లకే దేశం కోసం బలిదానమయ్యారన్నారు. తొలి వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా దేశం కోసం ముఖర్జీ చేసిన పనులను, ఆయన ఆలోచనలను మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లో రాష్ట్రాలు భేష్ భారతదేశంలో సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ అమలుతీరే మంచి నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడి వ్యవస్థ ‘నిజాయితీ పండుగ’ జరుపుకుంటోందన్నారు. ‘సరికొత్త పన్ను వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా దీని అమలుకు ముందుకొచ్చాయి. భిన్న పార్టీలు, భిన్న అవసరాలున్న రాష్ట్రాలు కానీ అవన్నీ పక్కనపెట్టి అందరికీ న్యాయం జరగాలని నిర్ణయించాయి. ఒకే దేశం–ఒకే పన్ను అనే ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు కావడంలో రాష్ట్రాల పాత్ర అభినందనీయం’ అని మోదీ పేర్కొన్నారు. రషీద్ ఖాన్‌కు మోదీ ప్రశంసలు అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్, భారత వైమానిక దళ స్కై డైవర్లపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఐపీఎల్లో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ మంచి ప్రదర్శన కనబరిచారు. రషీద్‌ను ప్రశంసిస్తూ అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ చేసిన ట్వీట్ నాకింకా గుర్తుంది. ఇటీవల భారత్–అఫ్గాన్ మధ్య టెస్టు మ్యాచ్ అనంతరం.. ట్రోపీని అందుకునేందుకు అఫ్గాన్ జట్టును భారత్ ఆహ్వానించడం ఓ మంచి వాతావరణాన్ని సూచిస్తోంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలనూ మోదీ గుర్తుచేశారు. ‘15వేల అడుగుల ఎత్తులో గాల్లో.. భారత వైమానిక దళ స్కై డైవర్లు చేసిన యోగా ప్రదర్శన అద్భుతం’ అని ప్రశంసించారు. -
మొలకెత్తడం సత్యం గుణం
‘విశ్వజనీనమైన న్యాయం ఒకటి ఉంటుంది. అదే అహింస’ అంటుంది జైనం. జినులు జీవితాన్ని మధించి వడపోసి చెప్పిన సారం అది. అత్యున్నత విలువలతో కూడిన జీవితాన్ని జీవించినప్పుడే మనిషికి కైవల్యం సిద్ధిస్తుంది. అంత ఉత్కృష్టంగా జీవించడం అంటే.. పొరుగు వారికి ఏ మాత్రం అసౌకర్యం కలిగించని రీతిలో మసులుకోవడం. ‘ఈ చరాచర జగత్తులో చరించే ప్రతి ప్రాణినీ కాపాడాలి, పొరపాటున కూడా హాని కలిగించరాదు’ అని చెప్పిన జీవన విధానం.. జైనం. దానిని ఆచరించి ప్రాచుర్యంలోకి తెచ్చారు జైనసిద్ధులు. పురాతత్వ పరిశోధన శాఖ, చారిత్రక అధ్యయనకారుల బృందం ఇటీవల పరిశోధన జరిగినప్పుడు ఈ జీవిత సత్యం వెలుగు చూసింది! వరంగల్‌లోని భద్రకాళి చెరువులో నుంచి బయట పడిన వినాయకుడు ఆ వెలుగుకు ప్రతీక అయ్యాడు. బండ రాయిలోని వినాయకుడు కమలంలో ఆసీనుడై ఉన్నాడు! సాధారణంగా ఒక చేతిలో ఉండ్రాళ్లు పట్టుకుని మరో చేతిని అభయమిస్తున్నట్లు కనిపించే రూపం కాదది. హిందూ, బౌద్ధ, జైన మతాలు తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు పోటీ పడుతున్న కాలంలో రూపుదిద్దుకున్న విగ్రహం! (విగ్రహంలో వినాయకుడి చేతులు ఉన్న తీరును బట్టి అది జైనమత ఆనవాళ్లతో కూడిన విగ్రహం అని అధ్యయనకారుల బృందం తీర్మానించింది). మనిషి జీవితం ‘అహింస’ అనే శిఖరాగ్రానికి చేరడానికి, చేరాలని చెప్పడానికి జరిగిన హింసలో స్థానభ్రంశం చెందిన జైన విగ్రహం అది! విశ్వజనీనమైన న్యాయ సాధనలో శతాబ్దాలపాటు జలగర్భంలో కూరుకుపోయి ఇప్పుడు బయటపడిన సత్యం అది. సత్యం గుణమే అంత. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏనాటికైనా అది మొలకెత్తుతుంది. – మంజీర -
అహింసా పరమోధర్మః
ఆత్మీయం ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిలోను అహింస సర్వోత్తమమైన ధర్మం. హింసను మించిన పాపం లేదు. కరుణను మించిన పుణ్యం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస అంటే మరో జీవిని చంపడం లేదా గాయపరచడం ఒక్కటే కాదు... ఒకరికి అయిష్టమైన పనులను వారితో బలవంతంగా చేయించడం కూడా హింస కిందికే వస్తుంది. అలాగే ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడటం కూడా హింసే. ఎవరికీ, ఎప్పుడూ ఏ రకమైన బాధని కలిగించకుండా ఉండగలగటమే అహింస. త్రికరణశుద్ధిగా అహింసను పాటించేవారి దగ్గర ప్రతి ఒక్కరు శత్రుత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉంటారని యోగసూత్రం చెబుతోంది. అంటే అహింసాచరణుల సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండటమే కాదు – పులి, జింక కూడా కలసిమెలసి ఉంటాయి వారి ఆశ్రమంలో. యోగాంగాలలో ఒకటి అహింస. ఆయుధాలను వదిలేయడమే అహింస అనుకోవచ్చు. కానీ, అహింసే ఒక పదునైన ఆయుధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గాంధీజీ ఆ విషయాన్ని రుజువు చేశారు. కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ, అహింసను ఆయుధంగా స్వీకరించడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం అవసరమని గాంధీ మహాత్ముడు చెబుతాడు. -
కేంద్రంలో టీఆర్ఎస్ చేరుతుందనేది ఊహాగానమే: జగదీశ్వరెడ్డి
-
గాంధీ, మండేలాల తర్వాత కేసీఆర్ ఒక్కడే..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే లేదని.. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత అహింసా మార్గంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒక్కరేనని పేర్కొన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని మంత్రి అన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఉద్యమం కేసీఆర్ చేశారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.