అహింసా పరమోధర్మః
ఆత్మీయం
ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిలోను అహింస సర్వోత్తమమైన ధర్మం. హింసను మించిన పాపం లేదు. కరుణను మించిన పుణ్యం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస అంటే మరో జీవిని చంపడం లేదా గాయపరచడం ఒక్కటే కాదు... ఒకరికి అయిష్టమైన పనులను వారితో బలవంతంగా చేయించడం కూడా హింస కిందికే వస్తుంది. అలాగే ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడటం కూడా హింసే. ఎవరికీ, ఎప్పుడూ ఏ రకమైన బాధని కలిగించకుండా ఉండగలగటమే అహింస.
త్రికరణశుద్ధిగా అహింసను పాటించేవారి దగ్గర ప్రతి ఒక్కరు శత్రుత్వాన్ని వదిలి ప్రశాంతంగా ఉంటారని యోగసూత్రం చెబుతోంది. అంటే అహింసాచరణుల సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండటమే కాదు – పులి, జింక కూడా కలసిమెలసి ఉంటాయి వారి ఆశ్రమంలో. యోగాంగాలలో ఒకటి అహింస. ఆయుధాలను వదిలేయడమే అహింస అనుకోవచ్చు. కానీ, అహింసే ఒక పదునైన ఆయుధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గాంధీజీ ఆ విషయాన్ని రుజువు చేశారు. కత్తిపట్టి యుద్ధం చేయడానికి ఎంతో ధైర్యం అవసరం. కానీ, అహింసను ఆయుధంగా స్వీకరించడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం అవసరమని గాంధీ మహాత్ముడు చెబుతాడు.