
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసను నిత్య జీవితంలో అంతర్భాగంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందన్నారు.
‘ప్రజలే దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ‘దేశాభివృద్ధికి అంతర్గత భద్రత ఎంతో కీలకం. దేశ అంతర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది’ అని చెప్పారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్ ఎంతో తక్కువకాలంలోనే ఘన విజయం సాధించింది. సబ్సిడీపై వంటగ్యాస్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలను ప్రజలు తమవిగా చేసుకోవడం ద్వారా అవి విజయవంతమయ్యాయి’ అని అన్నారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అలంకారప్రాయంగా కాకుండా, ఆచరణాత్మకంగా ఉండాలని భావిస్తే మనం ఏం చేయాలి? ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను తప్పకుండా అనుసరించాలనేదే నా అభిప్రాయం’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు.