‘విశ్వజనీనమైన న్యాయం ఒకటి ఉంటుంది. అదే అహింస’ అంటుంది జైనం. జినులు జీవితాన్ని మధించి వడపోసి చెప్పిన సారం అది. అత్యున్నత విలువలతో కూడిన జీవితాన్ని జీవించినప్పుడే మనిషికి కైవల్యం సిద్ధిస్తుంది. అంత ఉత్కృష్టంగా జీవించడం అంటే.. పొరుగు వారికి ఏ మాత్రం అసౌకర్యం కలిగించని రీతిలో మసులుకోవడం. ‘ఈ చరాచర జగత్తులో చరించే ప్రతి ప్రాణినీ కాపాడాలి, పొరపాటున కూడా హాని కలిగించరాదు’ అని చెప్పిన జీవన విధానం.. జైనం. దానిని ఆచరించి ప్రాచుర్యంలోకి తెచ్చారు జైనసిద్ధులు.
పురాతత్వ పరిశోధన శాఖ, చారిత్రక అధ్యయనకారుల బృందం ఇటీవల పరిశోధన జరిగినప్పుడు ఈ జీవిత సత్యం వెలుగు చూసింది! వరంగల్‌లోని భద్రకాళి చెరువులో నుంచి బయట పడిన వినాయకుడు ఆ వెలుగుకు ప్రతీక అయ్యాడు. బండ రాయిలోని వినాయకుడు కమలంలో ఆసీనుడై ఉన్నాడు! సాధారణంగా ఒక చేతిలో ఉండ్రాళ్లు పట్టుకుని మరో చేతిని అభయమిస్తున్నట్లు కనిపించే రూపం కాదది. హిందూ, బౌద్ధ, జైన మతాలు తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు పోటీ పడుతున్న కాలంలో రూపుదిద్దుకున్న విగ్రహం! (విగ్రహంలో వినాయకుడి చేతులు ఉన్న తీరును బట్టి అది జైనమత ఆనవాళ్లతో కూడిన విగ్రహం అని అధ్యయనకారుల బృందం తీర్మానించింది). మనిషి జీవితం ‘అహింస’ అనే శిఖరాగ్రానికి చేరడానికి, చేరాలని చెప్పడానికి జరిగిన హింసలో స్థానభ్రంశం చెందిన జైన విగ్రహం అది! విశ్వజనీనమైన న్యాయ సాధనలో శతాబ్దాలపాటు జలగర్భంలో కూరుకుపోయి ఇప్పుడు బయటపడిన సత్యం అది. సత్యం గుణమే అంత. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏనాటికైనా అది మొలకెత్తుతుంది.
– మంజీర
మొలకెత్తడం సత్యం గుణం
Published Sat, May 5 2018 12:13 AM | Last Updated on Sat, May 5 2018 12:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment