పూర్వం సారనాథ్‌ని రిషిపట్టణం అనేవారు. అక్కడ సువిశాలమైన మృగదావనం ఉంది. ఆ వనంలో జింకలు జీవిస్తూ ఉండేవి. ఆ జింకలకు ఒక రాజు ఉన్నాడు. అతని పేరు బోధిసత్వుడు. ఈ మృగదావన ప్రాంతం కాశీరాజైన బ్రహ్మదత్తుని ఏలుబడిలో ఉంది. బ్రహ్మదత్తుడు ప్రతిరోజూ ఈ వనానికి వచ్చి జింకల్ని వేటాడేవాడు. చనిపోయినవి చనిపోగా, మిగిలిన జింకలు భయంతో పొదల్లో దూరి బిక్కుబిక్కుమంటూ బతికేవి. కొన్ని భయంతో ప్రాణాలు విడిచేవి. ఒకనాడు అవన్నీ తమ జింకలరాజు సమక్షంలో సమావేశమై ‘‘కాశీరాజు బాణాలకు చచ్చేవారి కంటే, భయంతో చచ్చేవారే ఎక్కువ. కాబట్టి మనం ఇకనుండి రోజుకు వంతులవారీగా ఒక్కోజింక చొప్పున రాజుగారి వంటశాలకు వెళ్దాం’’ అని తీర్మానించుకున్నాయి.
తమ తీర్మానాన్ని, జింకల రాజు బోధిసత్త్వుని ద్వారా కాశీరాజుకి చేరవేశాయి. ఆ ఒప్పందానికి కాశీరాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి తమ తమ వంతు ప్రకారం ఒక్కో జింక కాశీ రాజు వంటశాలకు పోసాగింది. ఒకరోజున నిండు గర్భిణిగా ఉన్న ఒక తల్లి జింక వంతువచ్చింది. అది జింకల రాజు దగ్గరికి వచ్చి ‘‘రాజా! నేను నేడోరేపో ప్రసవిస్తాను. ఈ రోజుకి నాకు బదులుగా మరొకర్ని పంపండి. నేను తర్వాత వారి వంతు వచ్చినప్పుడు వెళ్తాను. నా బిడ్డలు కూడా వారి వారి వంతు వచ్చినప్పుడు వారూ వెళ్తారు. ఇప్పుడు నాతోపాటు నా బిడ్డల ప్రాణాలు పోతాయి. నాకు న్యాయం చేయండి’’ అని ప్రాధేయపడింది.
తల్లిజింక ఆవేదన విన్న బోధిసత్త్వుడు, జింకలన్నిటినీ సమావేశపరిచి విషయం చెప్పాడు. ఆమె స్థానంలో పోడానికి ఏ ఒక్కజింకా అంగీకరించలేదు. సమావేశానంతరం తల్లి జింకను ఓదార్చి పంపిన జింకలరాజు బోధిసత్త్వుడు ఆమె స్థానంలో ఆయనే స్వయంగా కాశీరాజు వంటశాలకు వెళ్లి, తనను వధించమని చెప్పాడు. జింకలరాజే స్వయంగా రావడంతో, వంటవాళ్లు వధించకుండా ఈ విషయం కాశీరాజుకు విన్నవించారు. కాశీరాజు తన భవనం దిగి వంటశాలకు వచ్చి– ‘‘మృగరాజా! తమరు పాలకులు. మీరు ఇలా రావడం తగదు. అయినా, మీ ప్రజల్ని పంపాలిగానీ, మీరెందుకు వచ్చారు?’’అని ప్రశ్నించాడు.
జింకలరాజు విషయం చెప్ప– ‘‘రాజా! రాజు అంటే రక్షకుడు. భక్షకుడు కాదు. నా ప్రజల్లో ఒకరికి ఇబ్బంది వచ్చింది. వారిని రక్షించడం న్యాయం కాబట్టి వారి స్థానంలో నేనే వచ్చాను. ధర్మరక్షణ అంటే ఇదే. మీరేం బాధపడకండి. నన్ను చంపుకుని తినండి’’ అని బలిపీఠం ఎక్కాడు. జింకలరాజు మాటలకు కాశీరాజుకి కనువిప్పు కలిగింది. కన్నీరు పెట్టుకుని – ‘‘రాజు ప్రజల్ని ఎలా చూడాలో ‘నాలుగు కాళ్ల జంతువు’గా పుట్టినప్పటికీ నీకు తెలిసింది. మనిషిగా పుట్టిన నాకు తెలియలేదు. నన్ను క్షమించండి’’ ఇక మీ సారనాథ్‌లోని మృగదావనంలో వేటకు రాను. ఇదే నా అభయం. ఇక మీరు సంతోషంగా వెళ్లవచ్చు’’ అన్నాడు.
అయినా, జింకలరాజు అక్కడినుండి కదలక పోవడంతో ఏమిటని అడిగాడు కాశీరాజు. ‘‘నాకు అన్ని జీవులూ సమానమే, జీవహింస ఎక్కడ జరిగినా నాకు అది మనస్కరించదు రాజా!’’ అన్నాడు. కాశీరాజు ఇక తాను జీవహింస చేయనని వాగ్దానం చేశాడు. జింకలరాజు సంతృప్తితో వెళ్లిపోయాడు. ‘దుర్మార్గులైన వ్యక్తిని చంపడం కాదు, అతనిలో ఉన్న దుర్మార్గాన్ని చంపాలి’ అనే బుద్ధ ప్రబోధానికి తగిన స్థలపురాణం ఈ సారనాథ్ కథ. (బుద్ధుడు సారనాథ్‌లో తొలి ప్రబోధం చెప్పినది ఆషాఢ పున్నమినాడు. ఈ నెల 27న ఆషాఢపున్నమి సందర్భంగా)
– డా. బొర్రా గోవర్ధన్
అహింసే గొప్ప ధర్మం
Published Sun, Jul 22 2018 1:07 AM | Last Updated on Sun, Jul 22 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment