అది గంగానదీ తీరం. లోతు తక్కువ ప్రదేశం. నది మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నదీ తీరంలో గట్టు వెంట గొర్రెల మంద మేస్తోంది. ఆ మందను చూసింది ఒక తోడేలు. మందలో చివరిలో మందకు కొద్దిదూరంలో ఒంటరిగా మేస్తోంది ఒక పొట్టేలు. తోడేలు చూపు దాని మీద పడింది. ‘ఈ బలిసిన పొట్టేలు అయితే రెండు రోజులకు సరిపోతుంది’ అనుకుంది.
మాటు కాచి, పొంచి పొంచి దాని దగ్గరకు వచ్చింది. ఎండుటాకుల ధ్వనిని బట్టి ఏదో తనవైపు వస్తున్నట్లు గుర్తించింది పొట్టేలు. తల పైకెత్తి చూసింది. తన మీదికి దూకి వస్తున్న తోడేలు కనిపించేసరికి నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీదికి పరుగుతీసింది. అలా రెండు మూడు తిన్నెలు దాటి తీరాన్నుండి దూరంగా పోయాయి రెండూ.
అంతలో వరదనీరు ఉరకలేస్తూ ఉరవడిగా వచ్చిపడుతోంది. పొట్టేలు ప్రాణ భయంతో ఇసుక దిబ్బ మీదినుండి నది నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలు మాత్రం దిబ్బమీదే నిలబడిపోయి, పొట్టేలు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వరద నీరు హెచ్చింది. మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు మునిగిపోసాగాయి. తోడేలు పొట్టేలు మీదినుంచి చూపు తిప్పుకునేసరికే అది నిలబడ్డ దిబ్బ చాలా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఆ దిబ్బమీది కొద్ది ఎత్తైన ప్రదేశం మాత్రమే మిగిలింది. తోడేలు ఆ ఎత్తు ప్రదేశానికి చేరింది. ఆ వరద అలా రెండురోజులు ఉంది. వేటాడటం అటుంచి, కనీసం ఒడ్డుకు చేరే మార్గం కనిపించలేదు.
అది తనలో తనే ‘ఈ ప్రమాదాన్నుండి బయట పడతానో లేదో, ఇప్పటిదాకా ఎంతో హింస చేశాను. ఎన్నో జీవుల్ని చంపాను. ఆ కర్మ ఫలం నాకు మంచిని చేకూర్చదు. కాబట్టి బతికినన్ని రోజులు ఇక అహింసను, మైత్రిని, మంచితనాన్ని పాటించాలి’ అనుకుంది. ఆ దిబ్బమీదికి చేరి, కూర్చొని ధ్యానం చేయసాగింది. కొంత సమయం గడిచింది. ఎక్కడో సన్నగా మేక అరుపు దాని చెవులబడింది. తపస్సు భగ్నం అయ్యింది.
మెల్లగా కళ్లు తెరిచింది. అటూ ఇటూ చూసింది. వరద కొద్దిగా తగ్గింది. తాను ఉన్న ఇసుక దిబ్బ ఇంకొద్దిగా బైట పడింది. దాని మీదకు చేరి అరుస్తూ ఉన్న మేకపిల్ల కనిపించింది. తోడేలు మెల్లగా లేచి మేక పిల్లకేసి వంగి వంగి నడవసాగింది. దాదాపు దగ్గరగా పోయి ఒక్క ఉదుటున దూకింది. కానీ.. గురి తప్పి నీటిలో పడడంతో శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని అటు చూసిన మేకపిల్లప్రాణభయంతో నది నీటిలోకి ఎగిరి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలుకు మరలా నిరాశ.‘లేదు. మరలా నేను నా మనస్సును కుదుట పరచుకోవాలి. హింసను విడనాడాలి. అహింసతో జీవించాలి. తపస్సు చేసి, చేసినపాప ఫలాన్ని రూపు మాపుకోవాలి’ అనుకుంది.
బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు శాంతంతో, అహింసతో, జీవ కారుణ్యాన్నీ, ధర్మాన్నీ ఆచరించడం కాదు. కోపం రావడానికి కారణాలు ఉన్నప్పుడూ, హింస చేసే అవకాశం వచ్చినప్పుడూ తప్పు చేసే పరిస్థితులు కలిగినప్పుడు అవి చేయకుండా ఉండటమే గొప్పతనం. అలా ఉంచగలిగిందే ధ్యానం. అలా మన చిత్తాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా మార్గం మనస్సును అలా దృఢంగా మలుస్తుంది’’అని చెప్పాడు. స్థిర చిత్తం అంటే అదే మరి!
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment