మౌనేన కలహం నాస్తి అంటారు. నిజమే! అసలు మాట్లాడక పోతే తగాదాలు ఏమి వస్తాయి? అభిప్రాయ భేదాలు ఏముంటాయి? కాబట్టి మౌనం పాటించాలంటారు కొందరు. కానీ, భావాల్ని వాక్కు రూపంలో చెప్పగలది మానవులు ఒక్కరే. మనుషులకున్న ఈ ఒక్క అవకాశాన్నీ ఉపయోగించుకోకపోతే ఎలా? మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు. చెడు మాట్లాడకపోవడమే అంటాడు బుద్ధుడు. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, పరుషంగా మాట్లాడటం, వక్రంగా మాట్లాడడం, పెడర్థాలతో మాట్లాడ్డం, లొడలొడ వాగడం, అసత్యాల్ని పలకడం ఇవన్నీ లేకుండా పలికే ఏ వచనమైనా మధుర వచనమే.
మనిషి మధురంగా సంభాషించాలి. తన మాటల ద్వారా, ప్రబోధాల ద్వారా మంచిని పెంచాలి అనే బుద్ధ ప్రబోధంలో ఎందరో భిక్షువులు ధ్యానం చేస్తూ, ధ్యానానంతరం ధర్మాన్ని ప్రబోధాల రూపంలో ప్రచారం చేస్తూ ఉండేవారు. తమకు భిక్ష వేసిన గృహస్థులకు ఇంటిల్లిపాదినీ కూర్చోబెట్టి వారికి ధర్మప్రబోధం చేసేవారు. ఆశీర్వచనాలు పలికేవారు. ఇది చూసిన కొందరు మౌన సన్యాసులు– ‘‘చూశారా! బౌద్ధ భిక్షువులు మౌనం పాటించరు. భిక్ష స్వీకరించి మౌనంగా తిరిగి రారు.
ఇది వారి వాచాలత్వమే! వారెలా మౌనులవుతారు? ఎలా సాధుజనులు కాగలరు?’’ అని విమర్శించేవారు. ఈ విషయాన్ని కొందరు భిక్షువులు బుద్ధునికి చెప్పగా– ‘‘భిక్షువులారా! మౌనం అంటే నోరు మూసుకుని కూర్చోవడం కాదు. ఎవరైతే మౌనాన్ని పాటిస్తారో వారు నిజానికి దుర్బలురు. తమ జ్ఞానాన్ని, తమ సాధనని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడని స్వార్థపరులు. మౌనాన్ని పాటించేవాడే వాడే ముని కాదు. త్రికరణ శుద్ధిగా ఎవరు చెడుపనులు చేయరో వారే మౌని’’ అని చెప్పాడు. మాటలకంటె మనస్సు, ఆలోచనలు, ఆచ రణలే ముఖ్యం అని వారికి అర్థమైంది.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment