తన మార్గం తప్పి, తన నైపుణ్యాన్ని, తెలివితేటల్ని మరో దారిలోకి మళ్లించిన ఒక భిక్షువుకి బుద్ధుడు సరైన ప్రబోధం చేసి, సరైన దారిలోకి తెచ్చిన ఘటన ఇది. ధనియుడు మంచి నేర్పరి. మట్టితో అందమైన కుండలు మలచగల నిపుణులు. అతను బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. ధర్మసాధన కోసం ధ్యానాన్ని అభ్యసించడం కోసం ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లాడు. ధ్యానసాధన సాగిస్తున్నాడు.
ఒకరోజున అతను తన కుటీరంలో లేని సమయంలో, సమీప గ్రామంలోని ప్రజలు ఒక శవాన్ని ఆ ప్రాంతానికి తెచ్చారు. వర్షం పడటం వల్ల వారికి ఎండుకట్టెలు కనిపించక ధనియుని పర్ణశాలను పీకి, శవాన్ని తగులబెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ధనియుడు వచ్చి, ‘గడ్డిపాక’ ఉంది కాబట్టి ఇలా చేశారు. అదే రాతి కట్టడం ఉంటే చేయలేరు కదా!’ అనుకొని, మట్టితో ఇటుకరాళ్లు మలిచి, వాటితో గంట ఆకారంలో గట్టి నివాసాన్ని నిర్మించుకున్నాడు. దీనికోసం ఏడు నెలలు వెచ్చించాడు.
ఈ విషయం తెలిసి, బుద్ధుడు అక్కడికి వచ్చి– ‘‘ధనియా! నీ కుటీర నిర్మాణం చాలా బాగుంది. గట్టిది. అందమైనది. విలువైనది. కానీ నీవు దీనికోసం అంతకంటే విలువైన సమయాన్ని వెచ్చించి, ధ్యానసాధన పోగొట్టుకున్నావు. ధ్యానం, జ్ఞానం ఈ కుటీరం కంటే అందమైనవి. గట్టివి. ఉపయోగకరమైనవి. నీలో నైపుణ్యాన్ని ఇలా వృథా చేసుకున్నావు. మనం జ్ఞానసాధనలోనే సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రజల దుఃఖాన్ని నిరోధించే పనిలోనే నిరంతరం ఉండాలి.
మనం తల దాచుకోవడానికి ఇలాంటి అధునాతన నిర్మాణాలు అవసరం లేదు. సమయానికి మించిన సంపద లేదు. జ్ఞానానికి మించిన గొప్ప నివాసం లేదు. నీ నైపుణ్యాన్ని జ్ఞానశోధనకోసం, జ్ఞాన సాధన కోసం ఉపయోగించు’’ అని చెప్పాడు. తాను భిక్షువుగా రాణించాలంటే జ్ఞానసాధనే ముఖ్యం అని తెలుసుకున్న ధనియుడు, ఆనాటినుండి ధ్యానసాధనలో, జ్ఞానసముపార్జనలో మేటిగా నిలిచాడు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment