PM Modi Assures Ukraine President Zelenskyy To 'Resolve Conflict' - Sakshi
Sakshi News home page

ఇది ప్రపంచానికే పెద్ద సమస్య.. పరిష్కారానికై హామీ ఇస్తున్నా: జెలెన్‌స్కీతో మోదీ

Published Sat, May 20 2023 6:18 PM | Last Updated on Sat, May 20 2023 6:37 PM

PM Modi Assure Ukraine President Volodymyr Zelensky At Hiroshima - Sakshi

.. అలా మీ పౌరుల ఆవేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను..

హిరోషిమా: ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ దేశ సమస్య కాదని, ఇది యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ7 సదస్సు కోసం హిరోషిమా(జపాన్‌) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని కలిశారు. 
  
‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య.  ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. దీనిని నేను ఓ రాజకీయ లేదంటే ఆర్థిక సమస్యగా పరిగణించను. నా దృష్టిలో ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలేంటో మా అందరికంటే మీకే బాగా తెలుసు. 

గత సంవత్సరం మా పిల్లలు(భారతీయ విద్యార్థులను ఉద్దేశించి..) ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ పౌరుల ఆవేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం,  వ్యక్తిగతంగా నేనూ.. మా సామర్థ్యం మేరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని ప్రధాని మోదీ, జెలన్‌స్కీకి హామీ ఇచ్చారు. 

జీ 7 శిఖరాగ్ర సదస్సు కోసం.. జపాన్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీలు హిరోషిమా నగరానికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఇరువురు నేతలు వర్చువల్‌గా, ఫోన్‌లో సంభాషించుకున్నారు. అయితే నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధం ఆగుతుందని, శాంతి నెలకొంటుందని ప్రధాని మోదీ మరోసారి జెలెన్‌స్కీ వద్ద ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్‌ ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement