రోమ్ : ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది. ఈ కీలక సమావేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జరుగుతోంది. అదే సమయంలో గత రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై జరుపుతున్న కాల్పుల్ని విరమిస్తామని తెలుపుతూనే షరతులు విధించారు.
జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయా ప్రపంచ దేశాది నేతలతో కీలక ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగిస్తున్నారు. సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, మోదీల మధ్య భేటీ జరిగింది. జెలెన్‌స్కీ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్,యూకే ప్రధాని రిషి సునక్‌లతో మోదీ భేటీ నిర్వహించారు.
ఇక, జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ భేటీ ప్రొడక్టీవ్‌తో కూడుకున్నదని, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడమే శాంతికి మార్గం అని ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై భారత్ వైఖరేంటో చెప్పకనే చెప్పారు మోదీ.
ఇక ఈ జీ7 సదస్సులో ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపగా.. జీ7 సదస్సు కొనసాగుతున్న తరుణంలో కాల్పుల విరమణకు ఆదేశిస్తామంటూ పుతిన్.. ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు.
అందుకు రెండు షరతులు విధించారు. యుద్ధ సమయంలో రష్యా నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవడం, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. తుది పరిష్కారం కోసం తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటన చేయడం గమనార్హం.
మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, మోదీల భేటీపై ఫ్రాన్స్‌లోని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, వాతావరణ చర్య, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజీలు, కనెక్టివిటీ, సంస్కృతి వంటి అంశాలతో సహా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. కీలకమైన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment