జపాన్‌లోని హిరోషిమా వేదికగా మూడు రోజులు సాగిన జీ7 దేశాల సదస్సు రష్యాపై మరిన్ని ఆంక్షలు, చైనాపై ఘాటు విమర్శలు, ఉక్రెయిన్ అధినేత ఆశ్చర్యకర సందర్శనతో ఆదివారం ముగిసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో కూడిన ‘జీ7’లో భాగం కానప్పటికీ, ఈ 49వ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్న భారతదేశం ప్రాధాన్యం ఈ వేదిక సాక్షిగా మరోసారి వెల్లడైంది.
భారత ప్రధానికి అమెరికా, ఆస్ట్రేలియా అధినేతల ప్రశంసల నుంచి పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన పాదాభివందనం దాకా అనేకం అందుకు నిదర్శనాలు. రష్యా దాడి నేపథ్యంలో యుద్ధబాధిత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన ఆయన సంక్షోభ పరిష్కారానికి వ్యక్తిగతంగానూ చొరవ చూపుతానడం పెద్ద వార్త. అంతటితో ఆగక ఆ మర్నాడే ఐరాసపై విమర్శల బాణం ఎక్కుపెట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేయకుంటే ఐరాస, భద్రతా మండలి కేవలం కబుర్లకే పరిమితమైన వేదికలుగా మిగిలిపోతాయనడం సంచలనమైంది.
నిష్ఠురమైనా భారత ప్రధాని వ్యాఖ్యలు నిజమే. మూడేళ్ళక్రితం తూర్పు లద్దాఖ్ వెంట భారత్‌తో చైనా ఘర్షణ మొదలు తాజా ఉక్రెయిన్ సంక్షోభం దాకా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించి, ఘర్షణల్ని నివారించాల్సిన ఐరాస ఆ పని చేయలేక ఇటీవల నామమాత్రంగా మారిన సంగతి చూస్తు న్నదే. సమస్యల్ని ఐరాసలో కాక, ఇతర వేదికలపై చర్చించాల్సి రావడం వర్తమాన విషాదం.
అదే సమయంలో అంతర్జాతీయ చట్టం, ఐరాస నియమావళి, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించి తీరాలంటూ జీ7 వేదికగా భారత ప్రధాని కుండ బద్దలు కొట్టారు. కాదని ఏకపక్షంగా వాస్తవస్థితిని మార్చే ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అన్న మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి జరుగుతున్న సుదీర్ఘ కాలయాపన కూడా మోదీ మాటలకు ఉత్ప్రేరకమైంది.
గమ్మత్తేమిటంటే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న భద్రతామండలిని వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ఎదుట అంగీకరించడం. ఇక, సాధారణ అలవాటుకు భిన్నంగా ఒక రోజు ముందు శనివారమే వెలువడ్డ జీ7 విధాన ప్రకటన డజన్ల కొద్దీ పేజీలున్నా – అందులో ప్రధానంగా చైనాపై విసిరిన బాణాలే ఎక్కువ.
కనీసం 20 సార్లు చైనా నామ స్మరణ సాగింది. తైవాన్, అణ్వస్త్రాలు, ఆర్థిక నిర్బంధం, మానవహక్కులకు విఘాతం, అమెరికా సహా పలు దేశాలతో బీజింగ్‌కు ఉన్న ఉద్రిక్తతలు ప్రకటనలో కనిపించాయి. సహజంగానే డ్రాగన్ ఈ ప్రకటనను ఖండించింది. ఇదంతా ‘పాశ్చాత్య ప్రపంచం అల్లుతున్న చైనా వ్యతిరేక వల’ అని తేల్చే సింది. రష్యా సైతం ఈ సదస్సు తమపైనా, చైనాపైనా విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నమంది.
యాభై ఏళ్ళ క్రితం ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏడు పారిశ్రామిక శక్తుల బృందమైన ‘జీ7’ దేశాలు ప్రపంచ సంపదలో దాదాపు 70 శాతానికి ప్రాతినిధ్యం వహించాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా 44 శాతమే. నిజానికి, 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ‘జీ20’ కూటమి ఏర్పాటయ్యాక అంతర్జాతీయ ఆర్థిక మేనేజర్‌గా ‘జీ7’ వెలుగు తగ్గింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఈ దేశాలు ఇప్పటికీ తామే ప్రపంచ విధాన నిర్ణేతలమని చూపాలనుకుంటున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంతో ఆ ఆలోచన, ఆకాంక్ష అత్యవసర మయ్యాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని సమర్థించే శక్తులన్నీ ఒక్కచోట చేరి ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి అంతర్జాతీయ సమాజ విధివిధానాలకే సవాలని జపాన్ ప్రధాని పదే పదే పేర్కొన్నది అందుకే! స్వదేశంలోని రాజకీయ అంశాలతో తన పర్యటనలో రెండో భాగాన్ని రద్దు చేసుకున్నా ‘జీ7’కు మాత్రం అమెరికా అధ్యక్షుడు హాజరైందీ అందుకే!
అదే సమయంలో 2.66 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, తమ సభ్యదేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను అనేకానేక కారణాల వల్ల జీ7 విస్మరించే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, సరఫరా వ్యవస్థల్లో చిక్కులతో అనేక పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో పడ్డాయి.
అటు రష్యాతో, ఇటు పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాల్లో సమతూకం పాటిస్తుండడం భారత్‌కు కలిసొస్తోంది. భవిష్యత్తులో చర్చలు, దౌత్యంతో యుద్ధం ఆగాలంటే – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్ మధ్యవర్తిత్వం కీలకం. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండేలా ‘జీ7’కు భారత్ ఆ రకంగా అవసరమే.
భారత్ సైతం ఒకపక్కన చైనా దూకుడును పరోక్షంగా నిరసిస్తూనే, రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థంగా ఉంటూ శాంతి ప్రవచనాలు చేయక తప్పని పరిస్థితి. భారత ప్రధాని అన్నట్టు చర్చలే అన్ని సమస్యలకూ పరిష్కారం. సమస్యను రాజకీయ, ఆర్థిక కోణంలో కాక మానవీయ కోణంలో చూడా లన్న హితవు చెవికెక్కించుకోదగ్గదే.
ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో వెనకబడ్డ దక్షిణార్ధగోళ దేశాలకు భారత్ గొంతుక కావడమూ బాగుంది. ప్రపంచ అధికార క్రమంలో గణనీయ మార్పుల నేపథ్యంలో ఇలాంటి శిఖరాగ్ర సదస్సులు, సమాలోచనలు జరగడం ఒకరకంగా మంచిదే. సమస్యల్ని ఏకరవు పెట్టడం సరే కానీ, సత్వర పరిష్కారాలపై జీ7 దృష్టి నిలిపిందా అంటే సందేహమే!
హిరోషిమాలో నిష్ఠుర నిజాలు
Published Tue, May 23 2023 1:18 AM | Last Updated on Tue, May 23 2023 1:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment