న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల నిమిత్తం రష్యాలో పర్యటిస్తున్నారు. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధ్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. మోదీ పర్యటన, పుతిన్‌ను ఆలింగనం చేసుకోవడంపై తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ఇది శాంతి ప్రయత్నాలలకు పెద్ద దెబ్బగా భావించారు.
రష్యా క్షిపణుల దాడికి గురైన పిల్లల ఆసుపత్రికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత(మోదీ) మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు ఓ వినాశకరమైన దెబ్బ’. అని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మోదీని ఆహ్వానించారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని ఇరువురు నేతలతో మాట్లాడారు.
మోదీ, పుతిన్ మధ్య.. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించిన అంశం, రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకు వచ్చింది. తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా పుతిన్ అంగీకరిస్తున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి లభించినట్లైంది.
కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. ఆ సమయంలో ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని పుతిన్‌తో అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదానికి పరిష్కారం కనుగొనగలమని నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment