G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ | G7 Summit: Democratise technology, build inclusive food system | Sakshi
Sakshi News home page

G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ

Published Sun, May 21 2023 5:21 AM | Last Updated on Sun, May 21 2023 5:21 AM

G7 Summit: Democratise technology, build inclusive food system - Sakshi

హిరోషిమాలో జీ–7 తదితర దేశాధినేతలతో మోదీ; రిషితో ఆత్మీయ ఆలింగనం

హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్‌ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు.

సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్‌ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు.

సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్‌ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

మోదీకి బైడెన్‌ ఆత్మీయ ఆలింగనం  
జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు.

అణు విలయపు నేలపై శాంతిమూర్తి
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్‌ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్‌ కూడా భాగస్వామి కావాలని జెలెన్‌స్కీ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement