
జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి 106 ఏళ్ల పూర్తవుతున్న వేళ ఊపందుకున్న ‘క్షమాపణ’ చర్చ
లండన్: తోటలో సమావేశమైన భారతీయులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి దాదాపు 1,500 మందిని బలితీసుకున్న జలియన్‌వాలా బాగ్ ఉదంతంలో బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్వాతంత్య్రసమరంలో భాగస్వాములైన వేలాది మంది అమాయకులపై జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ బలగాలు తుపాకులు ఎక్కుపెట్టి వందలాది మంది ప్రాణాలు తీసిన ఉదంతం జరిగి ఏప్రిల్ 13వ తేదీకి 106 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాటి దారుణ దాడికి బ్రిటన్ సర్కార్ సారీ చెప్పాలని యూకే పార్లమెంట్ సాక్షిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి.
దిగువసభలో కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మాన్ ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ ప్రసంగించారు. ‘‘నాటి బ్రిటిష్ పాలకుల అరాచకాలను అంగీకరిస్తూ నేటికైనా నాటి ఉదంతంపై క్షమాపణలు చెప్పాలి. 1919 ఏప్రిల్ 13నాటి ఘటన బ్రిటన్ చరిత్రలోనే మాయని మచ్చ. ప్రశాంత వాతావరణంలో సమావేశమైన నిరాయుధులపైకి తుటాలు అయిపోయేదాకా కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ తన సైన్యానికి ఆదేశాలిచ్చారు. తూటాలకు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా మరో 1,200 మంది గాయపడ్డారు. హేయమైన చర్యకు జనరల్ డయ్యర్ హత్యకు గురై తగిన మూల్యం చెల్లించుకున్నారు.
ఇది కూడా బ్రిటిష్ వలసపాలనలో మరో మాయని మచ్చగా మిగిలింది. ఇదంతా బ్రిటన్ పాలనలో చీకటి అధ్యాయంగా 2019లో అప్పటి బ్రిటన్ మహిళా ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి క్షమాపణలు తెలపలేదు. ఇకనైనా ప్రభుత్వం సారీ చెప్పాలి. ఏప్రిల్ 13న పార్లమెంట్ సమావేశాలు లేవుకాబట్టి ఆరోజు క్షమాపణలు చెబుతూ అధికారిక ప్రకటన అయినా వెలువరించాలి’’అని ఆయన డిమాండ్‌చేశారు. ఈ డిమాండ్‌కు మరో సభ్యుడు లూసీ పావెల్ మద్దతు పలికారు.