UK Parliament
-
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్‌ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
రిషి సునాక్ చరిత్ర సృష్టిస్తారా...!
-
హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సొంత పార్టీ సభ్యుల నుంచే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్.. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. వివరాల ప్రకారం... కొద్ది నెలల క్రితం బ్రిటన్‌లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగాయి. కాగా, బ్రిటన్‌లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని బోరిస్ హాజరైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి. దీనికి.. బోరిస్ సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. ఇక, పార్టీ గేట్ వ్యవహారంలో జాన్సన్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో భాగంగా బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇది నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్లు జాన్సన్ తెలిపారు. ఇక, 2019లో బోరిస్ జాన్సన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. We need to come together as a party and focus on what this government is doing to help people with the cost of living, to clear the COVID backlogs and to make our streets safer. We will continue to unite, level up and strengthen our economy. pic.twitter.com/vIWK81dDJC — Boris Johnson (@BorisJohnson) June 6, 2022 -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో) -
భారతీయుల హవా
బ్రిటన్ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లి విరిసింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై కొత్త రికార్డు నెలకొల్పారు. అటు అధికార కన్జర్వేటివ్ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఏడుగురు చొప్పున విజయం సాధించారు. లిబరల్ డెమొక్రాట్ పార్టీ తరఫున మరొకరు ఎన్నికయ్యారు. 12 మంది తమ సీట్లను నిలబెట్టుకుంటే ముగ్గురు కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీపడిన సిట్టింగ్ ఎంపీలందరూ తమ స్థానాలను నిలబెట్టుకోగా గగన్ మహీంద్రా, క్లెయిర్ కౌతినో కొత్తగా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నుంచి మొదటిసారిగా నవేంద్రూ మిశ్రా కొత్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా లిబరల్ డెమొక్రాట్ తరఫు మునీరా విల్సన్ ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ 10 మందిలో ఒకరు మైనార్టీ వర్గానికి చెందినవారు. బ్రిటన్‌లో 15 లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారు. వీరంతా కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. -
‘మధ్యంతర’ సందడిలో బ్రిటన్
చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఎట్టకేలకు వచ్చే నెల 12న పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్‌లో నాలుగేళ్లలో ఎన్నికలు రావడం ఇది రెండోసారి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే మార్గమని గత రెండు నెలలుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వాదిస్తున్నారు. అయితే సొంత పార్టీతోపాటు విపక్షమైన లేబర్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఆయన మాట నెగ్గలేదు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్)పై ఉన్న తుది గడువు అక్టోబర్ 31తో ముగియవలసి ఉండగా, వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగిం చడానికి ఈయూ అంగీకరించడంతో లేబర్ పార్టీ తన వైఖరి మార్చుకుంది. దాంతో మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమైంది. క్రిస్మస్ పండుగ హడావుడి ఉండే డిసెంబర్లో ఎన్నికలు రావడం 1923 తర్వాత బ్రిటన్‌లో ఇదే మొదటిసారి. అయితే ఈ ఎన్నికల తర్వాతనైనా ఇప్పుడున్న అనిశ్చితి తొలగుతుందని స్పష్టంగా చెప్పగల పరిస్థితి లేదు. ఎందుకంటే అటు రాజకీయ పక్షాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈయూ నుంచి వైదొలగడంపై అస్పష్టత ఉంది. ఒకప్పుడు బ్రెగ్జిట్‌కు బలంగా అనుకూ లత వ్యక్తం చేసిన వర్గాలు ఇప్పుడంత సుముఖంగా లేవు. 2015 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి అధికారం చేజారుతుందన్న భయం పట్టుకుంది. ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ నెగ్గుతుం దని జోస్యం చెప్పాయి. ఆ పార్టీ బ్రెగ్జిట్‌కు గట్టి వ్యతిరేకి. దాంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కామెరాన్ అలవిగాని హామీలిచ్చారు. తామొస్తే బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి అవసరమైతే ఈయూ నుంచి వైదొలగుతామన్నది ఆ హామీల్లో ఒకటి. నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని బ్రెగ్జిట్ అనుకూల పార్టీ వల్ల తమకు నష్టం ఉండకూడదని భావించే కామెరాన్ ఈ హామీ ఇచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. అంత వరకూ లిబరల్ డెమొక్రాట్లతో కలిసి అధికారాన్ని పంచుకున్న కన్సర్వేటివ్‌లకు ఊహించని స్థాయిలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో మెజారిటీ వచ్చింది. 650 స్థానా లున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆ పార్టీకి 331 స్థానాలు లభించాయి. అధికారం దక్కుతుందనుకున్న లేబర్ పార్టీ విపక్షంగా ఉండిపోయింది. లిబరల్ డెమొక్రాట్లు, బ్రెగ్జిట్ పార్టీ తుడిచిపెట్టుకు పోయాయి. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సాకు చూపి రిఫరెండం నుంచి తప్పించుకోవచ్చుననుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఇరుక్కుపోయింది. ఫలితంగా కామెరాన్‌కు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా 2016లో రిఫరెండం నిర్వహించకతప్పలేదు. అందులో 51.9 శాతంమంది ఈయూ నుంచి బయ టకు రావడంవైపే మొగ్గు చూపారు. ఫలితంగా కామెరాన్ వైదొలగి ఆ స్థానంలో థెరిస్సా మే ప్రధాని అయ్యారు. 2017 జూన్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగాక కన్సర్వేటివ్‌ల బలం బాగా తగ్గి పోయింది. అది 218 స్థానాలకు పరిమితమై, 10 స్థానాలున్న డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బ్రెగ్జిట్‌పై ఆమె ఈయూతో కుదుర్చుకొచ్చిన ఒప్పందాలను పార్లమెంటు వరసగా మూడుసార్లు తోసిపుచ్చడంతో థెరిస్సా రాజీ నామా చేయకతప్పలేదు. ఆమె స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్‌ను కూడా ఈ కష్టాలే వెంటా డాయి. పార్లమెంటులో అత్యధికులు ఆయన కుదుర్చుకొచ్చిన ఒప్పందాన్ని తిరస్కరించారు. ఆ ఒప్పందం వల్ల బ్రిటన్ 9వేల కోట్ల డాలర్లు నష్టపోవాల్సివస్తుందని నిపుణులు లెక్కలేశారు. బ్రెగ్జిట్ తుది గడువు దగ్గరపడుతుండగా పార్లమెంటులో ఎటూ తేలకపోవడంతో బోరిస్ జాన్సన్ చివరకు మధ్యంతర ఎన్నికల ప్రతిపాదన చేశారు. ఇప్పటికైతే ప్రజాభిప్రాయం ఆయనవైపే ఉంది. కానీ అది చివరివరకూ నిలబడుతుందన్న నమ్మకం లేదు. 2017 ఎన్నికల ముందు థెరిస్సా మే సైతం అందరి కన్నా ముందున్నారు. తీరా ఫలితాల్లో సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. పార్టీలో ఉన్న తన వ్యతిరేకుల ప్రాబల్యం పెరగకుండా చూడటం, ప్రజల్లో బ్రెగ్జిట్ అనుకూల తను మళ్లీ పెంచడం ఇప్పుడు బోరిస్ జాన్సన్ లక్ష్యాలు. వీటిల్లో ఆయన ఎంతవరకూ సఫలీకృతుల వుతారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాను ఈయూతో మెరుగైన ఒప్పందం కుదుర్చుకొచ్చినా పార్లమెంటులో తనకెవరూ సహకరించలేదని జాన్సన్ ప్రచారం చేస్తారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడంతా మారింది. ఆర్థిక అనిశ్చితి, సామాజిక అభద్రత చవిచూసిన అనేక ప్రాంతాలు 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసినా...ఆ తర్వాత లేబర్ పార్టీవైపు మొగ్గుచూపాయి. బ్రెగ్జిట్ అనుకూ లుర ఓట్లు దూరం చేసుకోకూడదన్న భావనతో లేబర్ పార్టీ మునపట్లా బ్రెగ్జిట్‌ను గట్టిగా వ్యతి రేకించడం లేదు. తాము వస్తే మరోసారి బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి దేశ ప్రయోజనాలు కాపా డతామని హామీ ఇస్తోంది. అదే సమయంలో దానితో సంబంధం లేని సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. ఇక తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న లిబరల్ డెమొక్రాట్లు అసలు బ్రెగ్జిట్ జోలికే పోవద్దన్న తమ పాత వాదనను బలంగా వినిపిస్తున్నారు. బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్య లకు ఈయూ సభ్యత్వాన్ని సాకుగా చూపడం రాజకీయ నేతలు చేసిన తప్పు. బ్రెగ్జిట్‌లో ఇమిడి ఉండే సమస్యలేమిటో ఈ నాలుగేళ్లలో ప్రజలకు బాగా అర్థమైంది. దేశంలో పేదరికం ఎన్నడూ లేనంత పెరిగింది. జాతీయ ఆరోగ్య సర్వీస్(ఎన్హెచ్ఎస్)కు నిధుల కేటాయింపు బాగా తగ్గింది. అదొక్కటే కాదు... మొత్తంగా సంక్షేమానికి భారీ కోతలు అమలవుతున్నాయి. వీటన్నిటా లేబర్ పార్టీ వైఖరిపై ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ సమర్థతపై పార్టీలోనే సందేహాలున్నాయి. వీటిని కోర్బిన్ అధిగమించవలసి ఉంది. తాజా ఎన్నికలు ఇప్పుడున్న అనిశ్చితికి తెరదించితే మళ్లీ బ్రిటన్ చురుగ్గా ముందుకెళ్తుంది. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
బ్రిటన్ ప్రధానికి గట్టి ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై థెరెసా మే ప్రవేశపెట్టన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా 432 మంది సభ్యులు ఓటేయగా, అనుకూలంగా 202 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో 230 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ ఎంపీలు తిరస్కరించారు. ఒప్పందంపై భారత సంతతికి చెందిన ఏడుగురు బ్రిటన్ ఎంపీలు కూడా బ్రిగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. బ్రిగ్జిట్పై థెరెసా మే చేసిన అభ్యర్థనను ఎంపీలెవరూ పట్టించుకోలేదు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరెసా ప్రభుత్వంపై అవిస్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ తీర్మానం ఆమోదం పొంది ప్రభుత్వం రాజీనామా చేసినట్లయితే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈయూ నేతలు ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే బిల్లుపై బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం లభించడం అంత సులభమైన విషయం కాదు. ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడంతో రానున్న కాలంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా బయటకు రావల్సి రావచ్చు లేదా, కొత్త ఒప్పందం కోసం థెరెసా మరోసారి చర్చలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలావుండగా మే ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు కూడా జరగొచ్చని ప్రతిపక్ష లేబర్‌పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
లండన్ పార్లమెంట్ అవార్డు అందుకున్న నటుడు
చాలెంజింగ్ స్టార్ దర్శన్ గురువారం లండన్ లో గ్లోబల్ డైవర్సిటీ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్లో లండన్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డును దక్షిణ భారత్‌లో తొలిసారిగా కన్నడ నటుడు అందుకుంటున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కుమారుడితో కలిసి లండన్ వెళ్లిన దర్శన్ ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. కన్నడ సినీ రంగంలో దర్శన్ సాధనను మెచ్చుకొని లండన్ ప్రభుత్వం ఈసారి సినిమా రంగంలో భారతదేశం నుంచి నటుడు దర్శన్ కు గౌరవ పురస్కారాన్ని అందించింది. లండన్ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన సాధకులను సన్మానిస్తున్నారు. లండన్ లో ఉన్న దర్శన్ కొడుకు వినీశ్తో తీసుకున్న ఫొటో ట్విటర్లో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది. All set to make it to the Event in London Along with my Son Vineesh 😊 pic.twitter.com/c3LLWheXCj — Darshan Thoogudeepa (@dasadarshan) 19 October 2017 -
ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్
లండన్: బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన 52 ఏళ్ల వ్యక్తి అసలు పేరు అడ్రియన్ రస్సెల్ అజావ్ అని ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఖలీద్ మసూద్‌గా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి మసూద్ సన్నద్ధత, ప్రేరణ, సహచరుల గురించి తెల్సుకునేందుకు ‘ఆపరేషన్ క్లాసిఫిక్’ పేరిట వందల మంది అధికారులతో కౌంటర్ టెర్రరిజం కమాండ్ విచారణను ముమ్మరం చేశారు. మసూద్‌కు ఎన్నోమారు పేర్లున్నా చిన్నతనంలో అతన్ని అడ్రియన్ రస్సెల్ అని పిలిచేవారు. గతంలోనూ నేరచరిత్ర ఉన్న అతను 2000లో ఓ మహిళ ముఖంపై కత్తితో దాడిచేయడంతో అతని కుటుంబాన్ని స్థానిక కోర్టు బహిష్కరిస్తూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, బ్రిటన్ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో గాయపడిన మరో వ్యక్తి గురువారం చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మరోవైపు, ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారని, ఉగ్రదాడులపై సంఘీభావాన్ని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్వీటర్లో తెలిపింది. -
2020 నుంచి బ్రిటిష్ ఎంపీలకు మద్యం ఉండదు!
లండన్: 2020 నాటికి బ్రిటిష్ ఎంపీలుగా ఉండేవారు కొద్దిరోజులపాటు మద్యం మానుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం వారు ఉంటున్న ‘ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్స్ పార్లమెంటు’ భవనం నవీకరణ పనులను 2020లో మొదలు పెట్టనున్నారు. ఆ సమయంలో వారికి తాత్కాలికంగా ‘రిచ్మండ్ హౌస్’లో వసతి కల్పిస్తారు. ఈ భవనంలో ఇస్లాం నిబంధనలు అమలవుతున్నందున మద్యం తాగడం నిషేధం. కాబట్టి రిచ్మండ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ ఎంపీలు మద్యం తాగకూడదు. పాత భవనం నవీకరణ పూర్తయ్యి, అక్కడికి మారేవరకు పరిస్థితి ఇంతే. -
బాంబు భయంతో బ్రిటన్ పార్లమెంట్ ఖాళీ
లండన్: బాంబు భయంతో బ్రిటన్ పార్లమెంట్ ను ఖాళీ చేయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువు కనిపిచండంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతాధికారులు రంగంలోకి దిగి ముందు జాగ్రత్తగా ఎంపీలను పార్లమెంట్ నుంచి వెలుపలకు పంపించారు. పార్లమెంట్ ఎదురుగా ఉన్న ఆఫీసు బిల్డింగ్, వెస్ట్ మినిస్టర్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ను కూడా ఖాళీ చేయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతాధికారులు అణువణువు సోదా చేస్తున్నారని లండన్ మెట్రో పోలీస్ అధికారులు వెల్లడించారు. అనుమానాస్పద వస్తువు కారణంగానే పార్లమెంట్ ఖాళీ చేయించామని తెలిపారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో రెండో అత్యంత ప్రమాదకర హెచ్చరికను ఆగస్టులో బ్రిటన్ జారీచేసింది.ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరు నేపథ్యంలో బ్రిటన్ కు ముప్పు పెరిగింది.