బ్రిటన్‌ ప్రధానికి గట్టి ఎదురుదెబ్బ | Brexit Bill Rejected By Britain Parliament | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ ప్రధానికి గట్టి ఎదురుదెబ్బ

Published Wed, Jan 16 2019 8:18 AM | Last Updated on Wed, Jan 16 2019 4:40 PM

Brexit Bill Rejected By Britain Parliament - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని థెరెసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై థెరెసా మే ప్రవేశపెట్టన బ్రెగ్జిట్‌ బిల్లును బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా 432 మంది సభ్యులు ఓటేయగా, అనుకూలంగా 202 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో 230 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని బ్రిటన్‌ ఎంపీలు తిరస్కరించారు. ఒప్పందంపై భారత సంతతికి చెందిన ఏడుగురు బ్రిటన్‌ ఎంపీలు కూడా బ్రిగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.

బ్రిగ్జిట్‌పై థెరెసా మే చేసిన అభ్యర్థనను ఎంపీలెవరూ పట్టించుకోలేదు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ థెరెసా ప్రభుత్వంపై అవిస్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ తీర్మానం ఆమోదం పొంది ప్రభుత్వం రాజీనామా చేసినట్లయితే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. బ్రెగ్జిట్‌ కోసం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో బ్రిటన్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈయూ నేతలు ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే.

అయితే బిల్లుపై బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆమోదం లభించడం అంత సులభమైన విషయం కాదు. ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు.

పార్లమెంట్‌లో బిల్లు వీగిపోవడంతో రానున్న కాలంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. పార్లమెంట్‌ ఆమోదం లేకుండా బయటకు రావల్సి రావచ్చు లేదా, కొత్త ఒప్పందం కోసం థెరెసా మరోసారి చర్చలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలావుండగా మే ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు కూడా జరగొచ్చని ప్రతిపక్ష లేబర్‌పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement