‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్‌సర్‌లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది.
దీప్తి నావల్‌కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్‌ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్‌సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్‌తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది.
70 ఏళ్ల వయసులో...
దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్‌సర్‌లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్‌సర్‌తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి.
ఇంటి పేరు మార్పు
దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్‌సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్‌సర్‌లోని హాల్ బజార్‌లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం.
దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్‌కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్.
20 ఏళ్ల కృషి
దీప్తి నావల్ పర్‌ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్‌గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్‌సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్‌ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్‌లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది.
జపాన్‌లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్‌గా పని చేస్తూ రాజ్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్‌ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే.
Comments
Please login to add a commentAdd a comment