పోలీసుల కాల్పులు అమానుషం- కేజ్రీవాల్
అమృత్సర్: అమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పంజాబ్లో పర్యటిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో సిక్కుల పవిత్ర గ్రంధం 'గురు గ్రంధ్ సాహెబ్' ను అవమానించడంతో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. పవిత్ర గ్రంధాన్ని అవమానించినందుకు గాను నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కేజ్రీవాల్ పంజాబ్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు మద్దతుగా స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వర్ణదేవాలయంలోకి వీఐపీలు వెళ్లే మార్గంలో కాకుండా సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో కేజ్రీవాల్ వెళ్లారు.
స్వర్ణదేవాలయంలో ప్రార్థనల అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాదిత కుటుంబాలను పరామర్శించడానికి కొట్కపురకు బయలుదేరి వెళ్లారు. గత లోక్సభ ఎన్నికలలో పంజాబ్లో నాలుగు ఎంపీ స్థానాలను ఆప్ గెలుచుకుంది. కాగా 2017లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ దృష్టి పెట్టింది.