స్మారకం వద్ద రాహుల్ మౌనం, రూ.100 స్మారక తపాలా బిళ్లలను ఆవిష్కరిస్తున్న వెంకయ్య
అమృత్‌సర్/న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ నరమేధంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకున్నారు. వెంకయ్య నాయుడు జలియన్‌వాలా బాగ్ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే సిక్కు గురువులు పాడిన శ్లోకాలను ఆలకించారు. ఈ నరమేధం జ్ఞాపకార్థం వెంకయ్య నాయుడు స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం ఎంత విలువైనదో జలియన్‌వాలా బాగ్ దురంతం మనందరికీ గుర్తు చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని మోదీ నివాళులు
జలియన్‌వాలా బాగ్ దురంతంలో అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ పోరాట వీరులు దేశం కోసం పనిచేయడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ ఘటనలో అమరులైన వారికి భారత్ నివాళులర్పిస్తోంది. వారి విలువైన ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. దేశం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి వారు స్ఫూర్తిగా నిలిచారు’అని మోదీ ట్వీట్ చేశారు.
స్మారకం వద్ద రాహుల్ నివాళి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జలియన్‌వాలాబాగ్ స్మారకం వద్ద నివాళులర్పించారు. రాహుల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అంజలి ఘటించారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ‘స్వాతంత్య్రపు విలువ ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రాణత్యాగం చేసిన నాటి పోరాట వీరులకు అభివాదం చేస్తున్నాం’అని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment