రాణీ లక్ష్మీబాయి నడిచిన నేల ఝాన్సీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది, ఆ అడవి. ఊర్చాహా అడవులంటారు. ఆ అడవి గుండా సతార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. 1920 దశకం నాటి మాట... ఆ నది ఒడ్డునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం దగ్గరగానే ఒక కుటీరం నిర్మించుకుని ఉండేవాడాయన. పేరు హరిశంకర్ బ్రహ్మచారి. ఆంజనేయస్వామికి వీరభక్తుడు. ఆ అడవులకు దగ్గరగా ఉన్న గ్రామం ధిమార్‌పురా, దాని చుట్టుపక్కల ఉన్న పల్లెలలోని పిల్లలకు ఆయన చదువు చెప్పేవాడు. కానీ వారెవరికీ తెలియకుండా మరొక పని కూడా చేసేవారు. కొండలలో తుపాకీ పేల్చడం నేర్చుకునేవాడాయన. అలాగే జబువా ప్రాంతంలో ఉన్న భిల్లుల దగ్గర విలువిద్య కూడా నేర్చుకునేవారు. ధిమార్‌పురా పేరును స్వాతంత్య్రం వచ్చిన తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆజాద్‌పురా అని మార్చింది. ఆ హరిశంకర్ బ్రహ్మచారి జ్ఞాపకార్థమే ఆ ఊరి పేరు అలా మార్చారు. ఆయన ఎవరో కాదు, భారత స్వాతంత్య్రోద్యమ పోరాటంలో మహోన్నతంగా కనిపించే చంద్రశేఖర్ ఆజాద్. జలియన్‌వాలా బాగ్ దురంతం ఆనాటి పలువురు యువకులని ‘రక్తానికి రక్తం’ అన్న సిద్ధాంతం గురించి ఆలోచించేటట్టు చేసింది. మూడేళ్ల తరువాత జరిగిన మరొక పరిణామం కూడా ఎందరో భారతీయ యువకులను అదే ఆలోచన వైపు అనూహ్యంగా నెట్టివేసింది. గాంధీజీ 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరా ఉదంతంతో ఆయనే హఠాత్తుగా నిలిపివేశారు. శాంతియుతంగా ఉద్యమం నిర్వహించగలిగినంత మానసిక సంస్కారం భారతీయులకు లేదని ప్రకటించి, చౌరీచౌరాలో మరణించిన పోలీసుల ఆత్మశాంతి కోసం నిరాహార దీక్ష కూడా చేశారు.
ఈ వైఖరే నాటి యువతరాన్ని కొత్త పుంతలు తొక్కేటట్టు చేసింది. జలియన్‌వాలాబాగ్ ఉదంతం గురించి విన్న తరువాత విప్లవోద్యమం వైపు ఆకర్షితుడైన చంద్రశేఖర్ ఆజాద్, మొదట్లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దృఢంగా ఆకాంక్షించారు. కానీ అ విప్లవ విధాత జీవితంలో అదొక చిన్న ఘట్టం. చిన్న దశ. నిజం చెప్పాలంటే ఆజాద్ అంతరంగమే ఒక విప్లవజ్వాల. బ్రిటిష్ జాతి మీద ద్వేషంతో ఆయన హృదయం దహించుకుపోతూ ఉండేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తన పదిహేనవ ఏటనే తీవ్రవాదం వైపు మొగ్గారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభంలో అందుకు అనుకూలంగా కొన్ని ఊరేగింపులు జరిగాయి. వారణాసిలో జరిగిన అలాంటి ప్రదర్శనలో పాల్గొన్న ఆజాద్‌ను పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెడితే న్యాయాధీశుడు అడిగాడు, ‘నీ పేరు?’ అని. మీసాలు కూడా సరిగా లేని ఆ కుర్రాడు చెప్పిన సమాధానానికి బహుశా ఆ నాయ్యా«ధీశుడు అదిరిపడి ఉండాలి. ఆ సమాధానమే– ‘నా పేరు స్వేచ్ఛ’ (ఆజాద్). నీ తండ్రి పేరేమిటి అంటే, ‘స్వాతంత్య్రం’ అన్నాడు. న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అప్పటి నుంచి ఆజాద్ ఆయన ఇంటిపేరయింది. ‘నీ రక్తం సలసల మరగకపోతే నీ నరాలలో ప్రవహిస్తున్నది నీరే అనుకోవాలి...’ అని ఆనాటి పరిస్థితిని చూసి ఆజాద్ భావించారు. జలియన్‌వాలాబాగ్ దురంతం గురించి తెలిసిన తరువాత రక్తం మండక తప్పదు కూడా.
చంద్రశేఖర్ (తివారీ) ఆజాద్ (జూలై 23, 1906– ఫిబ్రవరి 27, 1931) ప్రస్తుత మధ్య ప్రదేశ్‌లోని భవ్రాలో పుట్టారు. వారి స్వస్థలం ఉత్తర పరగణాలలోని (ఉత్తరప్రదేశ్) బదర్కా గ్రామం. తండ్రి పండిట్ సీతారామ్ తివారీ, తల్లి జగరాణీదేవి. తల్లి పట్టుదల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ సంస్కృత విద్య కోసం కాశీ విద్యాపీఠంలో చేరేందుకు వారణాసి వెళ్లారు. సంస్కృత విద్య వారి ఇంటి సంప్రదాయం. ఆయన మొదట హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఈ సంస్థను 1924లో రామ్‌ప్రసాద్ బిస్మిల్, యోగేశ్‌చంద్ర ఛటర్జీ, శచీంద్రనాథ్ సన్యాల్, శచీంద్రనాథ్ బక్షీ, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలీ బెంగాల్‌లోని బోలాచాంగ్ అనే గ్రామంలో ఆరంభించారు. ప్రణవేశ్ ఛటర్జీ అనే ఉద్యమకారుడి సాయంతో ఆజాద్ రామ్‌ప్రసాద్‌ను కలుసుకుని, హెచ్‌ఆర్‌ఏలో సభ్యుడయ్యారు. భారతదేశంలోని ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్య గణతంత్ర దేశంగా నిర్మించడం ఈ సంస్థ ఆశయం. ఈ ఆశయ సాధనలో మొదటి మెట్టు బ్రిటిష్ పాలనను నిర్మూలించడమే. ఇందుకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మారు.అందుకు అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతావని సోషలిస్టు దేశంగా ఉండాలని వారు ఆనాడే స్వప్నించడం ఒక అద్భుతం. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వీరికి ప్రేరణ అని ఒక వాదన ఉంది. అలాగే హెచ్‌ఆర్‌ఏ ఆనాడు బెంగాల్‌లో ఎంతో తీవ్రంగా పనిచేసిన తీవ్ర జాతీయ వాద రహస్య సంస్థ అనుశీలన సమితికి అనుబంధ సంస్థే. గదర్ పార్టీ తరువాత బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిన సంస్థలలో ఇది కూడా ఒకటి. సహాయ నిరాకరణోద్యమాన్ని రద్దు చేస్తూ గాంధీజీ తీసుకున్న నిర్ణయం ఒక శరాఘాతం కాగా, ఆయన అహింస చాలామంది యువకులకు నిరుత్సాహం కలిగించింది. అలాంటి ఒక సందిగ్ధ దశలో జనించినదే హెచ్‌ఆర్‌ఏ. బ్రిటిష్‌జాతి వంటి ఒక నిరంకుశ సమూహం నుంచి స్వాతంత్య్రం పొందాలంటే అహింసా పథంలో సాగితే ఎంతమాత్రం సాధ్యంకాదని నమ్మినవారంతా తీవ్రవాద కార్యకలాపాలను ఆశ్రయించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవడం ఒక్కటే వారికి కావాలి. బ్రిటిష్ జాతి నుంచి భారతదేశాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విముక్తం చేయడం వారి ఆశయం. అది సాయుధ పోరుతోనే సాధ్యమని కూడా వారు నమ్మారు. పైగా నాటి ప్రపంచంలో చాలాచోట్ల ర్యాడికల్ ఉద్యమాలు కూడా వీరికి ప్రేరణ ఇచ్చాయి.
తన ఉద్యమానికి ఆయుధాలు సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల కోసం హెచ్‌ఆర్‌ఏ చేసిన ఒక ప్రయత్నం చరిత్రలో నిలిచిపోయింది. అదే కకోరి రైలు దోపిడీ. దీనినే కకోరి కుట్ర కేసుగా చెబుతారు. ఆగస్టు 9, 1925న ఈ ఘటన జరిగింది. షాజహాన్‌పూర్ నుంచి లక్నో వచ్చే ఎనిమిదో నెంబర్ డౌన్ రైలులో రూ. 8,000 తీసుకువెళుతున్న సంగతి వీరికి తెలిసింది. ఈ డబ్బును లూటీ చేయడానికి పథకం పన్నారు. ఈ పథకాన్ని రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, శచీంద్ర బక్షీ, కేశబ్ చక్రవర్తి, మన్మథ్‌నాథ్ గుప్తా, మురారీలాల్ (అసలు పేరు మురళీలాల్ ఖన్నా), ముకుందీలాల్ (ముకుందీలాల్ గుప్తా), భన్వరీలాల్ అమలు చేశారు. ఆ రైలు లక్నోకు సమీపంలోని కకోరీ చేరగానే చైన్ లాగి, గార్డును బెదిరించి అతడి కేబిన్‌లో ఉన్న డబ్బును తీసుకుని వారు అదృశ్యమయ్యారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయాడు. దీనితో లూటీ, హత్య కింద కేసు నమోదు చేసి, బ్రిటిష్ ప్రభుత్వం అక్షరాలా హెచ్‌ఆర్‌ఏ సభ్యుల కోసం పరమ క్రూరంగా వేట సాగించింది.
కకోరి కేసులో దేశమంతా వెతికి మొత్తం నలభయ్ మందిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిలో పదిహేను మందిని వదిలి పెట్టారు. రామ్‌ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్ఫఖుల్లాఖాన్‌లకు న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. కొందరికి అండమాన్ ప్రవాసం విధించారు. ఇంకొందరకి యావజ్జీవం విధించారు. కానీ ఆజాద్‌తో పాటు ఇంకొందరు దొరకలేదు. ఆ తరువాత హెచ్‌ఆర్‌ఏ చెల్లాచెదరయిపోయింది. అప్పుడే ఆజాద్ ఆ సంస్థనే హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో పునరుద్ధరించారు. ఎన్నో కష్టాలు, అనేక ప్రయత్నాల తరువాత ఆజాద్ కాన్పూరును తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. 1928 నాటికి ఇది సాధ్యమైంది. అక్కడ ఉండగానే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటివారు ఆయన మార్గదర్శకత్వంలో నడిచారు. దీని తరువాత సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లాలా లజపతిరాయ్ మీద లాఠీని ప్రయోగించమని ఆదేశించిన స్కాట్‌ను హత్య చేయాలని హెచ్‌ఎస్‌ఆర్‌ఏ నిర్ణయించింది. భగత్‌సింగ్ తదితరులతో కలసి ఆజాద్ కూడా పాల్గొన్నారు. లాహోర్‌లో అతడిని హత్య చేయదలచుకుని స్కాట్ ఉన్నాడని భావించిన వాహనం మీద బాంబు విసిరారు. కానీ అందులో స్కాట్ లేడు. కానీ సాండర్స్ అనే మరొక పోలీసు అధికారి ఉన్నాడు. అతడు చనిపోయాడు. అంతకు ముందే వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలును పేల్చివేయడానికి కూడా ఆజాద్ నాయకత్వంలో ఒక ప్రయత్నం జరిగింది.
1931 ఫిబ్రవరిలో ఆజాద్ సీతాపూర్ కారాగారానికి వెళ్లారు. కకోరి కుట్ర కేసులో ఉన్నవారితో పాటు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను విడిపించడం గురించి గణేశ్‌శంకర్ విద్యార్థితో మాట్లాడడానికి వెళ్లారాయన.గణేశ్‌శంకర్ ఒక సలహా ఇచ్చారు. త్వరలోనే జరగబోయే గాంధీ–ఇర్విన్ చర్చలలో ఈ అంశం గురించి గాంధీ ద్వారా ఒత్తిడి తేవాలి. ఆ విషయం పండిట్ నెహ్రూ ద్వారా గాంధీకి చెప్పించాలి. ఇది గణేశ్ శంకర్ సలహా.ఆ మేరకే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం అలహాబాద్ వెళ్లి ఆనందభవన్‌లో నెహ్రూను ఆజాద్ కలుసుకున్నారు. ఆజాద్ ప్రతిపాదనను నెహ్రూ అంగీకరించలేదు. అంతేకాదు, ఆనందభవన్ నుంచి వెంటనే వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు. ఉగ్రుడైన ఆజాద్ అల్ఫ్రెడ్ పార్క్‌కు సైకిల్ మీద వచ్చారు. ఒక చెట్టు కింద తన సహచరులలో ఒకడైన సుఖదేవ్‌రాజ్‌తో (భగత్‌సింగ్‌తో కలసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేసిన సుఖదేవ్ కాదు) చర్చిస్తున్నారు. ఆజాద్ అక్కడ ఉన్న సంగతి పోలీసులకు ఎవరో సమాచారం అందించారు. మొదట పోలీస్ సూపరింటెండెంట్ బిశ్వేశ్వర్‌సింగ్, ఎస్‌ఎస్‌పి (సీఐడీ) నాట్ బోవర్ పార్కులోకి చొరబడ్డారు. ఆజాద్ కేసి తర్జని చూపుతూ బిశ్వేశ్వర్‌కి ఏదో చెబుతుండగానే ఆజాద్ గమనించారు. తన జేబులోని రివాల్వర్ తీసి కాల్చారు. సరిగ్గా గుండు వెళ్లి బోవర్ కుడి మణికట్టులో దిగింది. దీనితో బిశ్వేశ్వర్ తిట్లు లంఘించుకున్నాడు. దీనితో అతడి నోటి కేసి గురి పెట్టి మళ్లీ కాల్చాడు ఆజాద్. అతడి పళ్లు పగిలిపోయాయి. అయితే అంతలోనే అక్కడికి బలగాలు చేరుకుని చుట్టూ మోహరించడం కనిపించింది. కాల్పులు మొదలయ్యాయి. ఒక గుండు వచ్చి ఆజాద్ తొడలో దిగిపోయింది. కదలడం సాధ్యంకానంత గాయం. వెంటనే సుఖదేవ్‌రాజ్‌ను తప్పించుకోమని చెప్పి, అతడు తప్పించుకున్న సంగతి రూఢి అయిన తరువాత రివాల్వర్ కణతకు పెట్టుకుని కాల్చుకున్నాడాయన. తూటాలతో పోరాడతాం కానీ పోలీసులకు పట్టుబడే ప్రశ్నే లేదంటూ ఉద్యమకారునిగా జీవితం ఆరంభించిన నాడే ప్రతిజ్ఞ చేసిన ఆజాద్ అదే విధంగా పోలీసులు తనను సమీపిస్తుండగానే బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వేచ్ఛను ఇంటి పేరు చేసుకోగలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు మరే దేశ చరిత్రలో అయినా కనిపిస్తాడా?
- డా. గోపరాజు నారాయణరావు
ఇంటి పేరు స్వేచ్ఛ
Published Sun, Dec 2 2018 1:44 AM | Last Updated on Sun, Dec 2 2018 1:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment