జాతి గుండెపై మానని గాయం..
భారత దేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన ‘జలియన్ వాలాబాగ్’ మారణకాండ. బ్రిటీష్‌వారి దురహంకారానికి వెయ్యిమందికి పైగా భారతీయులు బలయ్యారు. దేశంలో ఆంగ్లేయుల పాలన ఎన్ని ఆకృత్యాలతో కూడి ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుందాం..
ఎక్కడ, ఎలా..
ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో ఈ ఘటన జరిగింది. ఆరోజు సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ. ఈ సందర్భంగా దాదాపు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఇలా వేల మంది ఒకేచోట సమావేశమై శాంతియుతంగా ప్రసంగిస్తుండగానే అనూహ్యంగా ఈ ఘటన జరిగింది.
ఒక్కసారిగా కాల్పులు..
ఈ సమావేశం గురించి సమాచారం అందుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకుల్లోని తూటాలు అన్నీ అయిపోయేంత వరకు ఈ కాల్పులు కొనసాగాయి. చివరకు మందుగుండు అయిపోవడంతో సైన్యం కాల్పులు ఆగిపోయాయి.
ఎటూ వెళ్లలేక..
ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. బుల్లెట్ల దాడినుంచి రక్షించుకునేందుకు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తోటలోని గేట్లవైపు వెళ్లి బయటపడదామని చూశారు. కానీ గేట్లు మూసి ఉండడం, తెరిచి ఉన్న ద్వారాల దగ్గర నిలబడి సైన్యం కాల్పులు జరపడంతో వారంతా తూటాలకు బలయ్యారు. మరోవైపు బయటికి వెళ్లేందుకు దారిలేక, లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోలేక కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. దీనివల్ల కూడా కొందరు మరణించారు. ఇలా ఓ వైపు తూటాలకు కొంతమంది, మరోవైపు బావిలోదూకడం వల్ల, తొక్కిసలాట వల్ల మరికొందరు మరణించారు. అప్పటివరకు శాంతియుతంగా సాగిన సమావేశం రక్తసిక్తమైంది.
వెయ్యి మందికిపైగా మృతి..
ఈ కాల్పుల్లో 379 మంది మాత్రమే మరణించినట్లు బ్రిటిష్ అధికారులు తేల్చారు. వారి అంచనా ప్రకారం 1,100 మంది గాయపడ్డారు. అయితే అసలు అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దాదాపు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. వేల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వారిలో ఆరువారాల చిన్నారి కూడా ఉండడం మరో విచారకర అంశం. కానీ ఈ వాస్తవాల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను తక్కువగా చూపి ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది.
డయ్యర్ కారణంగానే..
ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్. ఆయన దురహంకారపూరిత నిర్ణయం మూలంగానే ఈ మారణకాండ చోటుచేసుకుంది. సమావేశమైన ప్రజల్ని అణచి వేయడానికి అక్కడికి చేరుకున్న డయ్యర్ కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సమావేశం శాంతియుతంగా జరుగుతోందని, వారంతా నిరాయుధులని తెలిసినా అమాయకులపై కాల్పులు జరపమని ఆదేశించి డయ్యర్ ఈ మారణహోమానికి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. ఈ ఘటనపై డయ్యర్ స్పందిస్తూ తాను ఈ సమావేశాన్ని ఆపేందుకే వెళ్లానని, అయితే అంతమందిని అదుపులో పెట్టడం కష్టం కాబట్టి కాల్పులకు ఆదేశించానని వ్యాఖ్యానించాడు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
అందని సాయం..
కాల్పుల్లో వందలాది మంది మరణించడంతోపాటు, వేలాది మంది గాయపడ్డప్పటికీ వారికి వెంటనే ఎలాంటి వైద్య సాయం అందలేదు. కాల్పులు జరిపిన అనంతరం డయ్యర్, అతడి సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డయ్యర్ ప్రయత్నించలేదు. దీనిపై డయ్యర్ మాట్లాడుతూ వారికి వైద్య సేవలు అందించడం తన కర్తవ్యం కాదు కాబట్టి ఆ పని చేయలేదని చెప్పాడు. డయ్యర్ చర్యను కొందరు బ్రిటిష్ పాలకులు సమర్ధించారు. కానీ ఈ చర్యను ఖండిస్తూ బ్రిటీష్ పార్లమెంటు తీర్మానం చేసింది. విన్‌స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యపై విచారణ సాగుతుండగానే డయ్యర్ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు.
స్మారక చిహ్నం ఏర్పాటు..
వందలాది మంది మృతికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్వాతంత్య్ర ఉద్యమం మరింత విస్తృతమయ్యేందుకు ఈ ఘటన దోహదపడింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఇదేరోజు స్థూపంవద్దే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు జలియన్ వాలాబాగ్ మృతులకు నివాళులర్పిస్తారు.