
సాక్షి, బనశంకరి: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్‌వాలాబాగ్ హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్ చతుర్వేది కన్నుమూశారు. బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గాంధేయవాదిగా, సమరయోధునిగా, దేశంలో ఎక్కువకాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన వయసు 123 ఏళ్లుగా చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు హత్యకు గురైన 1919 జలియన్ వాలాబాగ్ హత్యాకాండ సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. జలియన్ వాలాబాగ్ నరమేధం లో అమరులైన వారికి గాంధీజీ ఆదేశాల మేరకు చతుర్వేది వేదోక్తంగా అంతిమసంస్కారాలు నిర్వహించారు. మహాత్మాగాంధీకి స్టెనోగ్రాఫర్‌గా చతుర్వేది పనిచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన 13 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు.
బెంగళూరులో జననం
1897లో రామనవమి రోజున బెంగళూరులో జన్మించిన సుధాకర్ చతుర్వేది 11 ఏళ్ల వయసులోనే ఉత్తరభారతంలో ప్రసిద్ధి చెందిన కాంగడి గురుకులంలో చేరి వేదాలను అధ్యయనం చేశారు. 25 ఏళ్ల పాటు వేదభ్యాసం చేసి 4 వేదాల్లోనూ ఆయన పట్టు సాధించడంతో సార్వదేశికా ఆర్యా ప్రతినిధి సభ నుంచి చతుర్వేది అనే బిరుదును అందుకు న్నారు. కన్నడ, సంస్కృత, ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్వాతంత్య్ర సంగ్రామం, గాంధీ తత్వాల గురించి అనేక పుస్తకాలు రాశారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక బాలున్ని దత్తత తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చామరాజపేటలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి.