కొరాపుట్(భువనేశ్వర్): అది 1942 ఆగస్టు 24వ తేదీ. భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన జలియన్ వాలా బాగ్ దురంతం వంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బ్రిటీష్ సైనికుల కాల్పులకు 19 మంది స్వాతంత్య్ర సమరయోధులు అశువులు బాశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున అమరులయ్యారు.
నాటి రోజుల్లోకి వెళ్తే..
దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు దక్షిణ ఒడిశాకు చేరడంతో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని దండకారణ్యంలో మన్యంవీరుల్లో కదలిక వచ్చింది. నందాహండి, తెంతులకుంటి, జొరిగాం, డాబుగాం, పపడాహండి సమితుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు జరిగాయి. 1942 ఆగస్టు 14న స్థానిక సమరయెధుడు మాధవ ప్రధాని భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఈ సభ నబరంగ్‌పూర్ సమీపంలోని చికిలి వద్ద జరగాల్సి ఉంది. సుమారు 200 మంది ప్రజలు గూమిగూడారు అని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిలి నది ఒడ్డుకు ఎవరూ చేరకుండా వంతెన కూల్చివేశారు.
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్వాతంత్య్ర సమరయెధుడు సోను మజ్జి నేతృత్వంలో ఉద్యమకారులు జఠాబల్ వంతెన కూల్చివేశారు. ఆగస్టు 24వ తేదీన సుమారు 500 మంది ఉద్యమకారులు పపడాహండి వద్ద టురి నదిపై ఉన్న వంతెన కూల్చి వేయడానికి బయల్దేరారు. వీరికి మాధవ ప్రధానితో ఉన్న 200 మంది ఉద్యమకారులు జత కలిశారు. దీంతో వీరిని నిలువరించేందుకు జయపురం, నబరంగ్‌పూర్‌ల నుంచి రిజర్వ్ పోలీసు బలగాలు టురి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వంతెనకు ఒకవైపు పోలీసులు మరోవైపు ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు వంతెనపైకి రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
నదిలో రక్తం ప్రవహించిన వేళ
పోలీసుల కాల్పులకు అక్కడికక్కడే 11 మంది స్వాతంత్య్ర సమరయోధులు కనుమూశారు. మరో 7గురు నబరంగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయారు. పదుల సంఖ్యలో నదిలో పడి గల్లంతయ్యారు. అనేక మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. 140 మంది అరెస్టై జైలు పాలయ్యారు. ఫలితంగా టురి నది రక్తంతో పారినట్లు నాటి ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం గల్లంతైన వారి కోసం గాలించినా లాభం లేకపోయింది. 1980 ఆగస్టు 24న అదే చోట అప్పటి రాష్ట్ర మంత్రి, స్వాతంత్య్ర సమరయెధుడు రాధాకృష్ట విశ్వాస్ రాయ్, స్థానిక ఎమ్మెల్యే హబిబుల్లాఖాన్‌లు సాయుధ స్థూపం కోసం శంకుస్థాపన చేశారు. 1984 మే 23న అప్పటి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ పాండే ఈ స్థూపాన్ని ప్రారంభించారు. స్థూపం మీద చనిపోయిన 19 మంది ఉద్యమకారుల పేర్లు లిఖించారు. నాటి నుండి నేటి వరకు అగస్టు 24న ఉద్యమకారుల కుటుంబాలను అక్కడ సత్కరిస్తున్నారు. వారి ఆచారాలకు అనుగుణంగా టురి నదిలో పిండ ప్రధానం చేస్తున్నారు. అనంతరం 2011లో డాబుగాం ఎమ్మెల్యే భుజబల్ మజ్జి తన కోటా నిధులతో అక్కడ స్మారక మందిరం నిర్మించారు. ప్రభుత్వం 24 మంది స్వాతంత్య్ర సమరయెధుల విగ్రహాలు, 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బుధవారం జరగనున్న కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment