పరాజయ ‘పట్టాభి’షిక్తుడు | Special story to bhogaraju pattabhi sitaramayya | Sakshi
Sakshi News home page

పరాజయ ‘పట్టాభి’షిక్తుడు

Published Sun, Nov 4 2018 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Special story to bhogaraju pattabhi sitaramayya - Sakshi

‘పట్టాభి పరాజయం నా పరాజయమే’భారత జాతీయ కాంగ్రెస్‌ చర్రితలోనే కాదు, స్వాతంత్య్రం సమరంలో కూడా అత్యంత వివాదాస్పదమైన ప్రకటన ఇది. సాక్షాత్తు గాంధీగారి నోటి నుంచి వచ్చింది.సుభాష్‌చంద్రబోస్‌ వంటి ఒక మహోన్నత వ్యక్తికి దేశంలో, కాంగ్రెస్‌లో నిలువ నీడ లేకుండా చేసిన మాటలు కూడా ఆ రెండే అన్నది విస్మరించరానిది. 1938–1939 త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో సుభాష్‌ బోస్‌ మీద ఓటమి తరువాత తన గురించి గాంధీజీ వెలిబుచ్చిన ఆ ఆక్రోశం గురించి పట్టాభి (భోగరాజు పట్టాభిసీతారామయ్య) ఏమన్నారో బయటకు రాలేదు. జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధిం చినా ‘త్రిపుర’ ఓటమిపై ఎవరో చేసిన వ్యాఖ్య ఫలితం గా పట్టాభి చరిత్రలో పరాజయ పట్టాభిషిక్తుడిగా మిగిలిపోయారు. కానీ గాంధీజీ అంతరంగాన్ని వడబోసిన గాంధేయులలో పట్టాభి ప్రప్రథముడు. శాసనోల్లంఘన ఉద్యమంలో (1932) అరెస్టయిన పట్టాభి (డిసెంబర్‌ 24,1880–డిసెంబర్‌ 17, 1959) జైలు శిక్ష తరువాత ఇల్లు చేరారు. మళ్లీ గాంధీ ఆదేశం రావడంతో అరెస్టుకు సిద్ధమవుతున్నారు.అప్పుడే గాంధీజీ నుంచి టెలిగ్రాం. వెంటనే వార్దా Ðð ళ్లారు పట్టాభి. ‘చెల్లని రూపాయిలాగా ఇలా వచ్చావేం, జైలుకు వెళ్లకుండా!’ నవ్వుతూ అన్నారట గాంధీజీ. ‘నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ టెలిగ్రాం వల్లే వచ్చాను’ అన్నారట పట్టాభి, అది చూపిస్తూ. అది గాంధీగారి కార్యదిర్శి పేరుతో ఉంది. ‘నేను ఇచ్చినట్టు ఎలా అవుతుంది మరి!’ అన్నారట గాంధీ మళ్లీ నవ్వేస్తూ. కానీ భాష మీదే అన్నారట పట్టాభి. నా భాషకి ప్రత్యేతక ఏమిటో? అడిగారట గాంధీ. టెలిగ్రాంలో ఉన్నది చూపించారు పట్టాభి. ‘విధిగా రా, వీలుంటే’ ఇదీ సారాంశం. ‘మరి విధిగా రా అంటే ఏమిటి? వీలుంటే అనడం ఏమిటి?’ నిలదీసినట్టు బదులిచ్చారట పట్టాభి, గడుసుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ బోస్‌ మీద పట్టాభి ఓటమి అనంతరం గాంధీజీ చేసిన ప్రకటనతో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో, దక్షిణ భారత చరిత్రలో పట్టాభి వంటి మేరునగధీరునికి దక్కవలసిన స్థానం దక్కకుండా పోయింది. 

పట్టాభి గుండుగొలను (ప్రస్తుతం పశ్చిమ గోదావరి, నాడు కృష్ణా జిల్లా)లో ఒక పేద కుటుంబంలో పుట్టారు. తల్లి గంగమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. పట్టాభి నాలుగో సంవత్సరంలో ఉండగానే తండ్రిని కోల్పోయారు. తన నలుగురు పిల్లలను చదివించాలన్న పట్టుదలతో గంగమ్మగారు ఏలూరుకు మకాం మార్చారు. పినతండ్రి పంపించే ఏడు రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం.  అలాంటి స్థితిలో ఆయన ఎఫ్‌ఏ (నోబెల్‌ కళాశాల, మచిలీపట్నం), బీఏ.(క్రిస్టియన్‌ కళాశాల, చెన్నపట్నం) ఆపై ఎంబీసీఎం అనే ఆనాటి వైద్య విద్యలో ఉత్తీర్ణులయ్యారు. పేదరికంగా కారణంగా వచ్చే పొదుపరితనం, కష్టాలతో వచ్చిన పట్టుదల, దానితో చదువులో వచ్చిన ఏక్రాగత, జీవితం పట్ల ఏర్పడిన ముందుచూపు; రఘుపతి వేంకటరత్నంనాయుడు వంటి గురువుల వద్ద శిష్యరికం ఒక విశిష్ట వ్యక్తిగా పట్టాభి తనను తాను మలుచుకోవడానికి దోహదం చేశాయి. ఈ విద్యార్థి దశ నుంచే పట్టాభిలో స్వాతంత్య్రోద్యమ కాంక్ష మొదలయింది. 1898లో మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, అందులో ఆనందమోహన్‌ బోస్‌ ఇచ్చిన ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1903లో మళ్లీ మద్రాస్‌లోనే జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సభలు జరిగాయి. బెంగాల్‌కు చెందిన మేధావి, మహావక్త లాల్‌మోహన్‌ ఘోష్‌ ఆ సభలకు అధ్యక్షులు. ఆయన ఉపన్యాసాన్ని తన గురుదేవులు రఘుపతి వేంకటరత్నంనాయుడుగారి సరసనే కూర్చుని పట్టాభి ఆలకించారు. మరో ఐదేళ్లకి అక్కడే మళ్లీ కాంగ్రెస్‌ సభలు జరిగాయి. ఈసారి రాస్‌బిహారీ బోస్‌ అధ్యక్షులు. అప్పటికి పట్టాభి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారారు.  ఎంబీసీఎం పూర్తి చేసి మచిలీపట్నంలో వృత్తిని ఆరంభించారు. గాంధీగారి కంటే ఎంతో ముందు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్న చాలామంది మహనీయులలో  పట్టాభి ఒకరు. ఎంతో లాభసాటిగా ఉన్నప్పటికి వైద్యవృత్తిని వీడి పట్టాభి స్వాతంత్య్రోద్యమంలో చేరారు. ఉద్యమం కోసం విరివిగా ఆదాయాన్ని తెస్తున్న వైద్యవృత్తిని పక్కన పెట్టినవారిలో పట్టాభి ప్రథములు. అంటే పూర్తి న్యాయం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వృత్తిలో ఆయన కొనసాగినది ఒక దశాబ్దం మాత్రమే. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం వచ్చింది. ఆ సమయంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పనిచేశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాల వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం స్ఫూర్తితోనే ఆ కళాశాల ఆవిర్భవించింది. పట్టాభి వైద్యవృత్తిని వీడిన 1916. అంటే హోమ్‌రూల్‌ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలం. అందులో అనీబిసెంట్‌ నాయకత్వంలో పనిచేశారాయన. 

స్వాతంత్య్రోద్యమం ఒక ఎత్తయితే, మద్రాస్‌ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1906లో ఉద్యమం ఆరంభమైంది. ఇందులో కూడా పట్టాభి పాత్ర విశిష్టమైనది. ఆ సందర్భంలోనే ‘ఆంధ్ర రాష్ట్రం అసరమా? కాదా?’ అనే శీర్షికతో (1912లో) పట్టాభి ఒక పుస్తకం రాశారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన అనే గ్రంథాన్ని కూడా రాశారాయన. దేశంలో భాషల ప్రాతిపదికగా ప్రాంతాలను పునర్విభజించాలన్న వాదాన్ని ఆయన గట్టిగా ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగానే 1917 బొంబాయి కాంగ్రెస్‌ సభలలో ఆంధ్ర ప్రాంతం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిని గాంధీజీ సమర్థించలేదు. అనిబీసెంట్‌ కూడా పట్టాభి ప్రతిపాదనను వ్యతిరేకించారు. చాలా వాదోపవాదాలు జరిగాయి. ఇక్కడే లోకమాన్య తిలక్‌ పట్టాభి పక్షం వహించి, కాంగ్రెస్‌కు సంబంధించి ప్రత్యేక రాష్ట్రంఆ ఏర్పాటు చేయడానికి అవసరమైన తీర్మానం ఆమోదం పొందేటట్టు చేశారు. అప్పటికి గాంధీ స్వాతంత్య్ర సమరంలో కీలకంగా లేరు. అనిబీసెంట్‌ మాత్రం జాతీయ నాయకురాలిగా అవతరించారు. ఈ ఇద్దరి వాదనలను పూర్వపక్షం చేసి, తన ప్రతిపాదనకు విజయం చేకూరేటట్టు చేసుకునేందుకు,  తిలక్‌ వంటి అగ్రనేతను తన వైపు తిప్పుకొనేటట్టు చేసుకునేందుకు ఆయన చేసిన వాదనలు ఆ సభలను విస్తుపోయేటట్టు చేశాయి. 1920లో కాంగ్రెస్‌  నాగపూర్‌లో ప్రత్యేక సమావేశాలు జరుపుకునే నాటికి గాంధీయే పట్టాభి అభిప్రాయానికి దగ్గరయ్యారు.ఆ సమావేశాల తరువాత రాష్ట్రాల పునర్విభజన గురించి నీకు అవగాహన ఉన్నది కాబట్టి దానిని పూర్తి చేయవలసిందని గాంధీయే పట్టాభిని కోరారు. ఆ ఆదేశానికి అనుగుణంగానే పట్టాభి దేశాన్ని 20 కాంగ్రెస్‌ రాష్ట్రాలుగా విభజించారు. 

గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలోను పట్టాభి తన వంతు పాత్రను నిర్వహించారు. కాంగ్రెస్‌ సభలలో వచ్చిన వివాదాలను పరిష్కరించడంలో కూడా ఆయన కీలకంగా ఉండేవారు. 1922, 23లలో శాసనసభల బహిష్కరణ ప్రతిపాదనను ఆయన సమర్థించారు. చిత్తరంజన్‌దాస్, విఠల్‌భాయ్‌ పటేల్‌ వంటి నాయకులతో ఆయన వాదించి మెప్పించారు. ఆయనను ఆ రోజులలో ‘ప్రతివాద భయంకరుడు’ అనేవారట. 1928లో భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసంఘం ఏర్పడింది. ఆ సంఘానికి పట్టాభి అధ్యక్షులు. నవంబర్‌ 28, 1923న ఆయన ప్రారంభించిన ‘ఆంధ్రాబ్యాంక్‌’ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంకుగా సేవలు అందిస్తున్నది.  పట్టాభి స్వయంగా రచయిత. అంతంతమాత్రంగా నడుస్తున్న కృష్ణాపత్రికను ఆయనను లాభాల బాట పట్టించారు.తాను జన్మభూమి అనే పత్రికను నిర్వహించారు. ఆయన రాసిన భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర 1935లోనే వెలుగులోకి వచ్చింది (అయితే ఇది పూర్తిగా అసమగ్రమని చెప్పడానికి సంకోచించవలసిన అవసరం లేదు). 

త్రిపుర కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక (1938) ఉదంతం రెండు విధాలుగా బాధాకరమైనది. ఒకటి బోస్‌ వంటి మహనీయుడిని దేశం నుంచి వెళ్లిపోయేటట్టు చేసింది. ఆ తరువాత ఆ మహావ్యక్తి పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదట్లో కమ్యూనిస్టులు ఆయనను అపార్థం చేసుకుని, విమర్శలు గుప్పించి వారు కూడా అపకీర్తి పాలయ్యారు. తరువాత అంశం– పట్టాభి చరిత్ర వేదిక నుంచి తెరమరుగు కావడం. పట్టాభి పరాజయం తన పరాజయమేనంటూ గాంధీ చేసిన ప్రకటనలోని అసంబద్ధతని నాటి కాంగ్రెస్‌ వాదులే కాదు, నేటి చరిత్రకారులు కూడా అర్థం చేసుకోలేదు. ఫలితమే చరిత్రలో పట్టాభి స్థానం మీద ఈ చీకటితెర. ఈ ప్రకటనలో పట్టాభికి ఎంతవరకు సంబంధం? ఇదే అసలు ప్రశ్న. డాక్టర్‌ పట్టాభి అధ్యక్షునిగా ఉండాలని కాంగ్రెస్‌ కార్యవర్గం, అగ్రనాయకత్వం భావించింది. కానీ బోస్‌ దీనిని తిరస్కరించి పట్టాభి మీద పోటీ చేశారు. గెలిచారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడేందుకు ఏర్పడిన సంస్థలో బోస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా ఎలా తప్పు పట్టగలరు? ఆ సంస్థ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే సంప్రదాయం కూడా స్థిరంగా లేదు. చిత్రం ఏమిటంటే, గాంధీ ప్రకటన తరువాత పార్టీలో తనకు ప్రతికూల వాతావరణం ఏర్పడిన తరువాత బోస్‌ రాజీనామా ఇచ్చారు. అప్పుడు మళ్లీ పట్టాభిని అధ్యక్ష పదవిని స్వీకరించమని పార్టీ కోరింది. ఆయన నిరాకరించారు. ఇది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అయినా పట్టాభి ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహిస్తూనే ఉన్నారు. 1942 నాటి క్రిప్స్‌ రాయబారం సమయంలోను ఆయనది కీలక పాత్రే. కాంగ్రెస్‌కీ, సంస్థాన ప్రజామండలి మధ్య రాజీకి మంతనాలు జరిగాయి. ఆ సమయంలో సంస్థాన మండలి ఉపాధ్యక్షుడు పట్టాభి. క్రిప్స్‌ రాయబారం విఫలం కావడం, ఫలితంగా క్విట్‌ ఇండియా ఉద్యమం వెల్లువెత్తడం తెలిసినదే. ఆ సమయంలో పట్టాభి కూడా అరెస్టయ్యారు. పూనా జైలులోనే ఉన్నారు. డిసెంబర్‌ 9, 1946 భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. దీనికి మద్రాసు రాష్ట్రం నుంచి ఎన్నికైన విఖ్యాతులలో పట్టాభి ఒకరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పట్టాభి కృషి చేశారు.ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలోని సాధక బాధకాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్‌ కార్యవర్గం జవహర్‌లాల్, వల్లభ్‌భాయ్‌ పటేల్‌. పట్టాభిలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. వీరు ఇచ్చినదే∙జేవీపీ నివేదిక.1952లో భారత ప్రభుత్వం పట్టాభిని మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించింది. 1957 వరకు ఆ పదవిలో ఉన్న పట్టాభి తరువాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన కుమారుని వద్దకు వచ్చారు.అక్కడే కన్నుమూశారు. 

పట్టాభి ఒక స్వాతంత్య్రం సమరయోధుడే కాదు. ఆయన ప్రచురణకర్త. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించారు. ఆరోగ్యసూత్రాలతో పుస్తకం రాశారు. ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేశారు.ఆంధ్రాబ్యాంక్‌ వంటి వ్యవస్థకు రూపకల్పన చేశారు. అవటపల్లి నారాయణరావుగారు (జర్నలిస్టు, చరిత్రకారుడు) పట్టాభి మేధాశక్తి, అందులోని ఆర్థిక కోణం నుంచి చూస్తూ ఒక చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘‘పట్టాభిని ఎరిగినవాళ్లు ఆయన బ్రాహ్మణ శిరస్సు, వైశ్య హృదయం గల మనిషి అని చెప్పుకుంటారు.’’              
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement