bhogaraju pattabhi sitaramayya
-
ఆంధ్రాబ్యాంక్ మటుమాయం!
ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్‌ని నెలకొల్పడం. బందరులో డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. బ్యాంక్‌ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్ బ్యాంక్ బందరు మేనేజర్ గార్డన్ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్ వెళ్లి ప్రాంతీయ మేనేజర్ ల్యాంబ్‌ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం. వ్యాసకర్త: ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం -
పరాజయ ‘పట్టాభి’షిక్తుడు
‘పట్టాభి పరాజయం నా పరాజయమే’భారత జాతీయ కాంగ్రెస్ చర్రితలోనే కాదు, స్వాతంత్య్రం సమరంలో కూడా అత్యంత వివాదాస్పదమైన ప్రకటన ఇది. సాక్షాత్తు గాంధీగారి నోటి నుంచి వచ్చింది.సుభాష్‌చంద్రబోస్ వంటి ఒక మహోన్నత వ్యక్తికి దేశంలో, కాంగ్రెస్‌లో నిలువ నీడ లేకుండా చేసిన మాటలు కూడా ఆ రెండే అన్నది విస్మరించరానిది. 1938–1939 త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సుభాష్ బోస్ మీద ఓటమి తరువాత తన గురించి గాంధీజీ వెలిబుచ్చిన ఆ ఆక్రోశం గురించి పట్టాభి (భోగరాజు పట్టాభిసీతారామయ్య) ఏమన్నారో బయటకు రాలేదు. జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధిం చినా ‘త్రిపుర’ ఓటమిపై ఎవరో చేసిన వ్యాఖ్య ఫలితం గా పట్టాభి చరిత్రలో పరాజయ పట్టాభిషిక్తుడిగా మిగిలిపోయారు. కానీ గాంధీజీ అంతరంగాన్ని వడబోసిన గాంధేయులలో పట్టాభి ప్రప్రథముడు. శాసనోల్లంఘన ఉద్యమంలో (1932) అరెస్టయిన పట్టాభి (డిసెంబర్ 24,1880–డిసెంబర్ 17, 1959) జైలు శిక్ష తరువాత ఇల్లు చేరారు. మళ్లీ గాంధీ ఆదేశం రావడంతో అరెస్టుకు సిద్ధమవుతున్నారు.అప్పుడే గాంధీజీ నుంచి టెలిగ్రాం. వెంటనే వార్దా Ðð ళ్లారు పట్టాభి. ‘చెల్లని రూపాయిలాగా ఇలా వచ్చావేం, జైలుకు వెళ్లకుండా!’ నవ్వుతూ అన్నారట గాంధీజీ. ‘నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ టెలిగ్రాం వల్లే వచ్చాను’ అన్నారట పట్టాభి, అది చూపిస్తూ. అది గాంధీగారి కార్యదిర్శి పేరుతో ఉంది. ‘నేను ఇచ్చినట్టు ఎలా అవుతుంది మరి!’ అన్నారట గాంధీ మళ్లీ నవ్వేస్తూ. కానీ భాష మీదే అన్నారట పట్టాభి. నా భాషకి ప్రత్యేతక ఏమిటో? అడిగారట గాంధీ. టెలిగ్రాంలో ఉన్నది చూపించారు పట్టాభి. ‘విధిగా రా, వీలుంటే’ ఇదీ సారాంశం. ‘మరి విధిగా రా అంటే ఏమిటి? వీలుంటే అనడం ఏమిటి?’ నిలదీసినట్టు బదులిచ్చారట పట్టాభి, గడుసుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ బోస్ మీద పట్టాభి ఓటమి అనంతరం గాంధీజీ చేసిన ప్రకటనతో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో, దక్షిణ భారత చరిత్రలో పట్టాభి వంటి మేరునగధీరునికి దక్కవలసిన స్థానం దక్కకుండా పోయింది. పట్టాభి గుండుగొలను (ప్రస్తుతం పశ్చిమ గోదావరి, నాడు కృష్ణా జిల్లా)లో ఒక పేద కుటుంబంలో పుట్టారు. తల్లి గంగమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. పట్టాభి నాలుగో సంవత్సరంలో ఉండగానే తండ్రిని కోల్పోయారు. తన నలుగురు పిల్లలను చదివించాలన్న పట్టుదలతో గంగమ్మగారు ఏలూరుకు మకాం మార్చారు. పినతండ్రి పంపించే ఏడు రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం. అలాంటి స్థితిలో ఆయన ఎఫ్ఏ (నోబెల్ కళాశాల, మచిలీపట్నం), బీఏ.(క్రిస్టియన్ కళాశాల, చెన్నపట్నం) ఆపై ఎంబీసీఎం అనే ఆనాటి వైద్య విద్యలో ఉత్తీర్ణులయ్యారు. పేదరికంగా కారణంగా వచ్చే పొదుపరితనం, కష్టాలతో వచ్చిన పట్టుదల, దానితో చదువులో వచ్చిన ఏక్రాగత, జీవితం పట్ల ఏర్పడిన ముందుచూపు; రఘుపతి వేంకటరత్నంనాయుడు వంటి గురువుల వద్ద శిష్యరికం ఒక విశిష్ట వ్యక్తిగా పట్టాభి తనను తాను మలుచుకోవడానికి దోహదం చేశాయి. ఈ విద్యార్థి దశ నుంచే పట్టాభిలో స్వాతంత్య్రోద్యమ కాంక్ష మొదలయింది. 1898లో మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలు, అందులో ఆనందమోహన్ బోస్ ఇచ్చిన ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1903లో మళ్లీ మద్రాస్‌లోనే జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలు జరిగాయి. బెంగాల్‌కు చెందిన మేధావి, మహావక్త లాల్మోహన్ ఘోష్ ఆ సభలకు అధ్యక్షులు. ఆయన ఉపన్యాసాన్ని తన గురుదేవులు రఘుపతి వేంకటరత్నంనాయుడుగారి సరసనే కూర్చుని పట్టాభి ఆలకించారు. మరో ఐదేళ్లకి అక్కడే మళ్లీ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఈసారి రాస్బిహారీ బోస్ అధ్యక్షులు. అప్పటికి పట్టాభి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారారు. ఎంబీసీఎం పూర్తి చేసి మచిలీపట్నంలో వృత్తిని ఆరంభించారు. గాంధీగారి కంటే ఎంతో ముందు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్న చాలామంది మహనీయులలో పట్టాభి ఒకరు. ఎంతో లాభసాటిగా ఉన్నప్పటికి వైద్యవృత్తిని వీడి పట్టాభి స్వాతంత్య్రోద్యమంలో చేరారు. ఉద్యమం కోసం విరివిగా ఆదాయాన్ని తెస్తున్న వైద్యవృత్తిని పక్కన పెట్టినవారిలో పట్టాభి ప్రథములు. అంటే పూర్తి న్యాయం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వృత్తిలో ఆయన కొనసాగినది ఒక దశాబ్దం మాత్రమే. 1905లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం వచ్చింది. ఆ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పనిచేశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాల వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం స్ఫూర్తితోనే ఆ కళాశాల ఆవిర్భవించింది. పట్టాభి వైద్యవృత్తిని వీడిన 1916. అంటే హోమ్‌రూల్ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలం. అందులో అనీబిసెంట్ నాయకత్వంలో పనిచేశారాయన. స్వాతంత్య్రోద్యమం ఒక ఎత్తయితే, మద్రాస్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1906లో ఉద్యమం ఆరంభమైంది. ఇందులో కూడా పట్టాభి పాత్ర విశిష్టమైనది. ఆ సందర్భంలోనే ‘ఆంధ్ర రాష్ట్రం అసరమా? కాదా?’ అనే శీర్షికతో (1912లో) పట్టాభి ఒక పుస్తకం రాశారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన అనే గ్రంథాన్ని కూడా రాశారాయన. దేశంలో భాషల ప్రాతిపదికగా ప్రాంతాలను పునర్విభజించాలన్న వాదాన్ని ఆయన గట్టిగా ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగానే 1917 బొంబాయి కాంగ్రెస్ సభలలో ఆంధ్ర ప్రాంతం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనిని గాంధీజీ సమర్థించలేదు. అనిబీసెంట్ కూడా పట్టాభి ప్రతిపాదనను వ్యతిరేకించారు. చాలా వాదోపవాదాలు జరిగాయి. ఇక్కడే లోకమాన్య తిలక్ పట్టాభి పక్షం వహించి, కాంగ్రెస్‌కు సంబంధించి ప్రత్యేక రాష్ట్రంఆ ఏర్పాటు చేయడానికి అవసరమైన తీర్మానం ఆమోదం పొందేటట్టు చేశారు. అప్పటికి గాంధీ స్వాతంత్య్ర సమరంలో కీలకంగా లేరు. అనిబీసెంట్ మాత్రం జాతీయ నాయకురాలిగా అవతరించారు. ఈ ఇద్దరి వాదనలను పూర్వపక్షం చేసి, తన ప్రతిపాదనకు విజయం చేకూరేటట్టు చేసుకునేందుకు, తిలక్ వంటి అగ్రనేతను తన వైపు తిప్పుకొనేటట్టు చేసుకునేందుకు ఆయన చేసిన వాదనలు ఆ సభలను విస్తుపోయేటట్టు చేశాయి. 1920లో కాంగ్రెస్ నాగపూర్‌లో ప్రత్యేక సమావేశాలు జరుపుకునే నాటికి గాంధీయే పట్టాభి అభిప్రాయానికి దగ్గరయ్యారు.ఆ సమావేశాల తరువాత రాష్ట్రాల పునర్విభజన గురించి నీకు అవగాహన ఉన్నది కాబట్టి దానిని పూర్తి చేయవలసిందని గాంధీయే పట్టాభిని కోరారు. ఆ ఆదేశానికి అనుగుణంగానే పట్టాభి దేశాన్ని 20 కాంగ్రెస్ రాష్ట్రాలుగా విభజించారు. గాంధీజీతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలోను పట్టాభి తన వంతు పాత్రను నిర్వహించారు. కాంగ్రెస్ సభలలో వచ్చిన వివాదాలను పరిష్కరించడంలో కూడా ఆయన కీలకంగా ఉండేవారు. 1922, 23లలో శాసనసభల బహిష్కరణ ప్రతిపాదనను ఆయన సమర్థించారు. చిత్తరంజన్‌దాస్, విఠల్‌భాయ్ పటేల్ వంటి నాయకులతో ఆయన వాదించి మెప్పించారు. ఆయనను ఆ రోజులలో ‘ప్రతివాద భయంకరుడు’ అనేవారట. 1928లో భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసంఘం ఏర్పడింది. ఆ సంఘానికి పట్టాభి అధ్యక్షులు. నవంబర్ 28, 1923న ఆయన ప్రారంభించిన ‘ఆంధ్రాబ్యాంక్’ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంకుగా సేవలు అందిస్తున్నది. పట్టాభి స్వయంగా రచయిత. అంతంతమాత్రంగా నడుస్తున్న కృష్ణాపత్రికను ఆయనను లాభాల బాట పట్టించారు.తాను జన్మభూమి అనే పత్రికను నిర్వహించారు. ఆయన రాసిన భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర 1935లోనే వెలుగులోకి వచ్చింది (అయితే ఇది పూర్తిగా అసమగ్రమని చెప్పడానికి సంకోచించవలసిన అవసరం లేదు). త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక (1938) ఉదంతం రెండు విధాలుగా బాధాకరమైనది. ఒకటి బోస్ వంటి మహనీయుడిని దేశం నుంచి వెళ్లిపోయేటట్టు చేసింది. ఆ తరువాత ఆ మహావ్యక్తి పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదట్లో కమ్యూనిస్టులు ఆయనను అపార్థం చేసుకుని, విమర్శలు గుప్పించి వారు కూడా అపకీర్తి పాలయ్యారు. తరువాత అంశం– పట్టాభి చరిత్ర వేదిక నుంచి తెరమరుగు కావడం. పట్టాభి పరాజయం తన పరాజయమేనంటూ గాంధీ చేసిన ప్రకటనలోని అసంబద్ధతని నాటి కాంగ్రెస్ వాదులే కాదు, నేటి చరిత్రకారులు కూడా అర్థం చేసుకోలేదు. ఫలితమే చరిత్రలో పట్టాభి స్థానం మీద ఈ చీకటితెర. ఈ ప్రకటనలో పట్టాభికి ఎంతవరకు సంబంధం? ఇదే అసలు ప్రశ్న. డాక్టర్ పట్టాభి అధ్యక్షునిగా ఉండాలని కాంగ్రెస్ కార్యవర్గం, అగ్రనాయకత్వం భావించింది. కానీ బోస్ దీనిని తిరస్కరించి పట్టాభి మీద పోటీ చేశారు. గెలిచారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడేందుకు ఏర్పడిన సంస్థలో బోస్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా ఎలా తప్పు పట్టగలరు? ఆ సంస్థ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే సంప్రదాయం కూడా స్థిరంగా లేదు. చిత్రం ఏమిటంటే, గాంధీ ప్రకటన తరువాత పార్టీలో తనకు ప్రతికూల వాతావరణం ఏర్పడిన తరువాత బోస్ రాజీనామా ఇచ్చారు. అప్పుడు మళ్లీ పట్టాభిని అధ్యక్ష పదవిని స్వీకరించమని పార్టీ కోరింది. ఆయన నిరాకరించారు. ఇది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అయినా పట్టాభి ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహిస్తూనే ఉన్నారు. 1942 నాటి క్రిప్స్ రాయబారం సమయంలోను ఆయనది కీలక పాత్రే. కాంగ్రెస్కీ, సంస్థాన ప్రజామండలి మధ్య రాజీకి మంతనాలు జరిగాయి. ఆ సమయంలో సంస్థాన మండలి ఉపాధ్యక్షుడు పట్టాభి. క్రిప్స్ రాయబారం విఫలం కావడం, ఫలితంగా క్విట్ ఇండియా ఉద్యమం వెల్లువెత్తడం తెలిసినదే. ఆ సమయంలో పట్టాభి కూడా అరెస్టయ్యారు. పూనా జైలులోనే ఉన్నారు. డిసెంబర్ 9, 1946 భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. దీనికి మద్రాసు రాష్ట్రం నుంచి ఎన్నికైన విఖ్యాతులలో పట్టాభి ఒకరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పట్టాభి కృషి చేశారు.ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలోని సాధక బాధకాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ కార్యవర్గం జవహర్లాల్, వల్లభ్‌భాయ్ పటేల్. పట్టాభిలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. వీరు ఇచ్చినదే∙జేవీపీ నివేదిక.1952లో భారత ప్రభుత్వం పట్టాభిని మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. 1957 వరకు ఆ పదవిలో ఉన్న పట్టాభి తరువాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన కుమారుని వద్దకు వచ్చారు.అక్కడే కన్నుమూశారు. పట్టాభి ఒక స్వాతంత్య్రం సమరయోధుడే కాదు. ఆయన ప్రచురణకర్త. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించారు. ఆరోగ్యసూత్రాలతో పుస్తకం రాశారు. ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేశారు.ఆంధ్రాబ్యాంక్ వంటి వ్యవస్థకు రూపకల్పన చేశారు. అవటపల్లి నారాయణరావుగారు (జర్నలిస్టు, చరిత్రకారుడు) పట్టాభి మేధాశక్తి, అందులోని ఆర్థిక కోణం నుంచి చూస్తూ ఒక చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘‘పట్టాభిని ఎరిగినవాళ్లు ఆయన బ్రాహ్మణ శిరస్సు, వైశ్య హృదయం గల మనిషి అని చెప్పుకుంటారు.’’ - డా. గోపరాజు నారాయణరావు -
అప్పిచ్చు వైద్యుడు...
మన దిగ్గజాలు బ్యాంకులు, బీమా అంటేనే తెలియని రోజులవి. బ్యాంకులంటే డబ్బున్నోళ్లకు మాత్రమే చెందిన సంస్థలని జనం అనుకునే రోజులవి. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వృత్తికి వైద్యుడే అయినా... ఆ రోజుల్లోనే ఆయన తన ఇంటి అరుగు మీద ఆంధ్రాబ్యాంకుకు పురుడు పోశాడు. లక్ష రూపాయల మూల ధనంతో ప్రారంభమైన ఆంధ్రాబ్యాంకు అంచెలంచెలుగా విస్తరించి, జాతీయ బ్యాంకుగా మారింది. ఇప్పుడా బ్యాంకు ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. తెలుగు నేల మీద పుట్టిన ఒక బ్యాంకు దేశమంతటా వేళ్లూనుకుని, ఇంతగా విస్తరించిందంటే... అదంతా ఆయన చేతి చలవే! భోగరాజు పట్టాభి సీతారామయ్య బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన 1880 నవంబర్ 24న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి కృష్ణాజిల్లాలోని గుండుగొలను గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాలుగారే పసివయసులో ఒంటిమీద కనీసం చొక్కా కూడా లేకుండా చలికి వణుకుతూ బడికి వెళుతున్న పట్టాభిని చూసి గ్రామస్తులు జాలి పడేవారు. తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడంతో తోటి విద్యార్థుల పుస్తకాలను చదివి, వాటినే రోజంతా మననం చేసుకునేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా మెసలుకోవడం ఆయనకు బాల్యం నుంచే అలవాటైంది. ఇంటికి కావలసిన కట్టెలు కూడా నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చేవారు. అది చూసి నవ్విన తోటి విద్యార్థితో ‘నేను నా ఇంటి పనులు చేసుకోవడానికి సిగ్గు పడను. అనవసర భేషజాలకు పోయి డబ్బు వృథా చేయను. మీరు నవ్వినందున నాకొచ్చే నష్టం లేదు’ అని సమాధానమిచ్చిన ధీశాలి ఆయన. ప్రతిభా పాటవాలతో సంపాదించుకున్న ఉపకార వేతనంతో చదువు సాగించారు. తర్వాత పిల్లనిచ్చిన మామ సహాయంతో మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసి, బందరులో ప్రాక్టీసు పెట్టారు. హస్తవాసి గల వైద్యుడిగా పేరుపొంది ఆ రోజుల్లోనే లక్షల ఆదాయాన్ని గడించారు. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభం ఒకరోజు సీతారామయ్య గారు వారింటి అరుగుపై కూర్చొని ఉండగా ఎదురుగా ఉన్న వైశ్యుల ఇంట్లో సోదరుల మధ్య గలాటా ప్రారంభమైంది. డబ్బు దాచడంలో వచ్చిన తగాదా అని తెలుసుకుని, తన దగ్గిర దాచడానికి అంగీకరించారు. అప్పటికప్పుడే వారి పేరు మీద ఖాతాలు ప్రారంభించి జమా ఖర్చులు రాశారు. అలా వీధి అరుగు మీద ప్రారంభమైన ఆర్థిక సంస్థ తర్వాత ఆం«ధ్రాబ్యాంకుగా అవతరించింది.. బందరు ప్రముఖులు సమకూర్చిన లక్ష రూపాయల మూలధనంతో 1923 నవంబర్ 23న అధికారికంగా ఆంధ్రాబ్యాంకు ప్రారంభమైంది. ప్రజల నుంచి చిన్నమొత్తాలు సేకరించి రైతులకు రుణాలు ఇచ్చేవారు.1980లో ఆంధ్రాబ్యాంకును జాతీయం చేశారు. తెలుగు గడ్డపై జన్మించిన ఏకైక జాతీయ బ్యాంకు ఇదొక్కటే. దేశంలోనే తొలిసారిగా 1981లోనే క్రెడిట్‌కార్డులను జారీ చేసిన ఘనత ఆంధ్రాబ్యాంకుదే. బయోమెట్రిక్ ఎటీ ఎంలు, విద్యా రుణాలను కూడా ఆంద్రాబ్యాంకే ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 3 వేల శాఖలు, 30 వేల సిబ్బంది ఉన్నారు. లక్ష రూపాయలతో మొదలైన వ్యాపార ప్రస్థానం ఇప్పుడు లక్ష కోట్లను అధిగమించింది. డిపాజిట్ల సేకరణలో ఆసియాలోనే తొలి స్థానంలో ఉంది. సగం రుణాలను వ్యవసాయ రంగానికి కేటాయించి నేటికీ పట్టాభి స్ఫూర్తిని కొనసాగిస్తోంది. బీమా రంగంలోనూ హస్తవాసి ఆం్ర«ధాబ్యాంకుతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు, 1927లో ఒడ్డమన్నాడ భూమి తనఖా బ్యాంకు, 1923లో భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించారు. బీమా రంగంలోనూ అడుగుపెట్టి 1925లో ఆంధ్రా ఇన్సూరెన్స్, 1935లో హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీలను స్థాపించారు. తర్వాతి కాలంలో అవి ఎల్ఐసీలో విలీనమయ్యాయి. విద్యారంగానికి ఊతమిచ్చేందుకు ఆంధ్ర జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. ‘కృష్ణాపత్రిక’ను గాడిలో పెట్టారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌లో చేరి, జాతీయోద్యమ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. స్వతంత్ర దేశంలో తొలి ఏఐసీసీ అధ్యక్షులు... తెలుగు వాళ్ల గొప్పేంటట అన్న ప్రత్యేక రాష్ట్ర కమిటీ ముందు జేబులో నుంచి అణా నాణాన్ని తీసి గిరాటేసి ‘దీనిపైన ఆంగ్లేయులు వన్ అణా అని ఇంగ్లీషులో, ఒక అణా అని తెలుగులో తప్ప మరే భారతీయ భాషలోను ముద్రించలేదు.. అదే మా గొప్ప’ అని బదులిచ్చిన ధీశాలి. బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమంలో పట్టాభిని మూడేళ్లు అహ్మద్‌నగర్ కోటలో ఉంచి చిత్రహింసలు పెట్టింది. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ తొలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఘనత భోగరాజుకే దక్కుతుంది. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచే సి 1959 డిసెంబర్ 17న కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. -
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!
ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే. టంగుటూరి ప్రకాశం పంతులు : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.