అప్పిచ్చు వైద్యుడు... | Banks, Insurance, unknown days | Sakshi
Sakshi News home page

అప్పిచ్చు వైద్యుడు...

Published Sat, Dec 24 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

అప్పిచ్చు వైద్యుడు...

అప్పిచ్చు వైద్యుడు...

మన దిగ్గజాలు

బ్యాంకులు, బీమా అంటేనే తెలియని రోజులవి. బ్యాంకులంటే డబ్బున్నోళ్లకు మాత్రమే చెందిన సంస్థలని జనం అనుకునే రోజులవి. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య వృత్తికి వైద్యుడే అయినా... ఆ రోజుల్లోనే ఆయన తన ఇంటి అరుగు మీద ఆంధ్రాబ్యాంకుకు పురుడు పోశాడు. లక్ష రూపాయల మూల ధనంతో ప్రారంభమైన ఆంధ్రాబ్యాంకు అంచెలంచెలుగా విస్తరించి, జాతీయ బ్యాంకుగా మారింది. ఇప్పుడా బ్యాంకు ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. తెలుగు నేల మీద పుట్టిన ఒక బ్యాంకు దేశమంతటా వేళ్లూనుకుని, ఇంతగా విస్తరించిందంటే... అదంతా ఆయన చేతి చలవే!

భోగరాజు పట్టాభి సీతారామయ్య బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన 1880 నవంబర్‌ 24న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి కృష్ణాజిల్లాలోని గుండుగొలను గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాలుగారే పసివయసులో ఒంటిమీద కనీసం చొక్కా కూడా లేకుండా చలికి వణుకుతూ బడికి వెళుతున్న పట్టాభిని చూసి గ్రామస్తులు జాలి పడేవారు. తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్థోమత లేకపోవడంతో తోటి విద్యార్థుల పుస్తకాలను చదివి, వాటినే రోజంతా మననం చేసుకునేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా మెసలుకోవడం ఆయనకు బాల్యం నుంచే అలవాటైంది. ఇంటికి కావలసిన కట్టెలు కూడా నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చేవారు. అది చూసి నవ్విన తోటి విద్యార్థితో ‘నేను నా ఇంటి పనులు చేసుకోవడానికి సిగ్గు పడను. అనవసర భేషజాలకు పోయి డబ్బు వృథా చేయను. మీరు నవ్వినందున నాకొచ్చే నష్టం లేదు’ అని సమాధానమిచ్చిన ధీశాలి ఆయన. ప్రతిభా పాటవాలతో సంపాదించుకున్న ఉపకార వేతనంతో చదువు సాగించారు. తర్వాత పిల్లనిచ్చిన మామ సహాయంతో మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసి, బందరులో ప్రాక్టీసు పెట్టారు. హస్తవాసి గల వైద్యుడిగా పేరుపొంది ఆ రోజుల్లోనే లక్షల ఆదాయాన్ని గడించారు.

లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభం
ఒకరోజు సీతారామయ్య గారు వారింటి అరుగుపై కూర్చొని ఉండగా ఎదురుగా ఉన్న వైశ్యుల ఇంట్లో సోదరుల మధ్య గలాటా ప్రారంభమైంది. డబ్బు దాచడంలో వచ్చిన తగాదా అని తెలుసుకుని, తన దగ్గిర దాచడానికి అంగీకరించారు. అప్పటికప్పుడే వారి పేరు మీద ఖాతాలు ప్రారంభించి జమా ఖర్చులు రాశారు. అలా వీధి అరుగు మీద ప్రారంభమైన ఆర్థిక సంస్థ తర్వాత ఆం«ధ్రాబ్యాంకుగా అవతరించింది.. బందరు ప్రముఖులు సమకూర్చిన లక్ష రూపాయల మూలధనంతో 1923 నవంబర్‌ 23న అధికారికంగా ఆంధ్రాబ్యాంకు ప్రారంభమైంది. ప్రజల నుంచి చిన్నమొత్తాలు సేకరించి రైతులకు రుణాలు ఇచ్చేవారు.1980లో ఆంధ్రాబ్యాంకును జాతీయం చేశారు. తెలుగు గడ్డపై జన్మించిన ఏకైక జాతీయ బ్యాంకు ఇదొక్కటే. దేశంలోనే తొలిసారిగా 1981లోనే క్రెడిట్‌కార్డులను జారీ చేసిన ఘనత ఆంధ్రాబ్యాంకుదే. బయోమెట్రిక్‌ ఎటీ ఎంలు, విద్యా రుణాలను కూడా ఆంద్రాబ్యాంకే ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 3 వేల శాఖలు, 30 వేల సిబ్బంది ఉన్నారు. లక్ష రూపాయలతో మొదలైన వ్యాపార ప్రస్థానం ఇప్పుడు లక్ష కోట్లను అధిగమించింది. డిపాజిట్ల సేకరణలో ఆసియాలోనే తొలి స్థానంలో ఉంది. సగం రుణాలను వ్యవసాయ రంగానికి కేటాయించి నేటికీ పట్టాభి స్ఫూర్తిని కొనసాగిస్తోంది.

బీమా రంగంలోనూ హస్తవాసి
ఆం్ర«ధాబ్యాంకుతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కృష్ణా కోఆపరేటివ్‌ బ్యాంకు, 1927లో ఒడ్డమన్నాడ భూమి తనఖా బ్యాంకు, 1923లో భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించారు. బీమా రంగంలోనూ అడుగుపెట్టి 1925లో ఆంధ్రా ఇన్సూరెన్స్, 1935లో హిందుస్థాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను స్థాపించారు. తర్వాతి కాలంలో అవి ఎల్‌ఐసీలో విలీనమయ్యాయి. విద్యారంగానికి ఊతమిచ్చేందుకు ఆంధ్ర జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. ‘కృష్ణాపత్రిక’ను గాడిలో పెట్టారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌లో చేరి, జాతీయోద్యమ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.

స్వతంత్ర దేశంలో తొలి ఏఐసీసీ అధ్యక్షులు...
 తెలుగు వాళ్ల గొప్పేంటట అన్న ప్రత్యేక రాష్ట్ర కమిటీ ముందు జేబులో నుంచి అణా నాణాన్ని తీసి గిరాటేసి ‘దీనిపైన ఆంగ్లేయులు వన్‌ అణా అని ఇంగ్లీషులో, ఒక అణా అని తెలుగులో తప్ప మరే భారతీయ భాషలోను ముద్రించలేదు.. అదే మా గొప్ప’ అని బదులిచ్చిన ధీశాలి. బ్రిటిష్‌ ప్రభుత్వం క్విట్‌ ఇండియా ఉద్యమంలో పట్టాభిని మూడేళ్లు అహ్మద్‌నగర్‌ కోటలో ఉంచి చిత్రహింసలు పెట్టింది. స్వతంత్ర భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఘనత భోగరాజుకే దక్కుతుంది. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచే సి 1959 డిసెంబర్‌ 17న కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement