ఆ దేవుడు కోరుకునేదీ అదేనని నా నమ్మకం!
మండలి బుద్ధప్రసాద్... మానవతామూర్తి, స్నేహశీలి, అజాతశత్రువు, నిరాడంబరతకు ప్రతిరూపం... ఒక వ్యక్తిలో ఇన్ని విశేషాలు రూపుదిద్దుకోవడానికి కారణం? ‘గాంధీజీని పలుమార్లు చదవడమే’ అంటారాయన! గాంధీజీని చదివి, ‘గాంధీక్షేత్రం’ పత్రిక నడిపిన అనుభవంతో గాంధేయవాదిగా మారిన ఆయన మనోగత వీక్షణం ‘సాక్షి’ పాఠకుల కోసం...
అంతర్వీక్షణం: మండలి బుద్ధప్రసాద్
♦ నిరాడంబరతకు స్ఫూర్తి... మొదట గాంధీజీ, తర్వాత మా నాన్న వెంకట కృష్ణారావు. నిరాడంబరత మనిషిని అవినీతికి దూరంగా ఉంచుతుంది. ఆర్థిక స్థాయికి మించిన జీవనశైలికి అలవాటు పడినప్పుడు అవినీతికి పాల్పడడమే సులువైన మార్గంగా అనిపిస్తుంది.
♦ ఆడంబరంగా జరిగే వేడుకలకు హాజరవుతున్నప్పుడు... అక్కడి దుబారా చూస్తే బాధేస్తుంది. ఒక పెళ్లిలో అయ్యే వృథా ఖర్చుతో ఎంతోమందిని చదివించవచ్చు.
♦ విమర్శలను తీసుకొనే విషయంలో... సద్విమర్శను స్వీకరిస్తాను. ఆరోపణ కోసమే విమర్శిస్తే బాధేస్తుంది.
♦ మీలో మీకు నచ్చే లక్షణం... నేను ఎవరినీ విమర్శించను. ఎప్పుడైనా అంశాన్ని, సిద్ధాంతపరంగా విమర్శిస్తాను తప్ప వ్యక్తితో విభేదించను. అయితే అది నచ్చే లక్షణం అని చెప్పలేను. అది నా అలవాటు!
♦ ఎదుటి వ్యక్తిని చూసే కోణం... రాజకీయాల్లో చాలామంది పరిచయమవుతుంటారు. ఎవరినీ సునిశితంగా పరిశీలించను. అందరినీ నమ్మాలనే తత్వం నాది. అలాగే నమ్ముతాను కూడా.
♦ దూరంగా ఉండాలనుకొనే వ్యక్తులు... పితూరీలు చెప్పేవారంటే నాకిష్టం ఉండదు. నాకు కోపం వచ్చేది కూడా అప్పుడే. నా ప్రత్యర్థి గురించి పితూరీలు మోసుకొచ్చినా సరే... సమర్థించను.
♦ తప్పనిసరిగా పాటించే సిద్ధాంతం... స్వదేశీ వస్తువులను మాత్రమే వాడటాన్ని చాలాకాలం పాటించాను. ఇప్పుడు విదేశీ కంపెనీల ఉత్పత్తులను వాడక తప్పడం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి మాత్రం వెళ్లను.
♦ పూలదండలు వేయించుకున్నప్పుడు కలిగే భావన... ఆ డబ్బుతో ఏదైనా పుస్తకాన్ని కొని బహూకరించమని చాలాసార్లు చెప్పి చూశాను. చివరికి పుస్తకావిష్కరణ సభల్లో కూడా పూలదండలు వేస్తుంటారు.
♦ మీ బలం, బలహీనత? బలం ఏమిటో తెలియదు, బలహీనత మాత్రం క్షణికావేశంతో కేకలెయ్యడం.
♦ దేవుణ్ణి కోరుకునేది... మంచిబుద్ధిని ప్రసాదించమని కోరుకుంటా. సాటి మనిషికి సేవ చేస్తే దేవుడు మెచ్చు కుంటాడు. ఆ దేవుడు కోరుకునేదీ అదేననీ, కేవలం పూజలు చేసి, మొక్కడాన్ని ఇష్టపడడనీ నా నమ్మకం.
♦ కృష్ణాజిల్లా పులిగడ్డ - గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం అత్యంత సంతోషాన్నిచ్చింది. అది మా నాన్న కోరిక. చనిపోయే ముందు కూడా దాని గురించే అడిగారు. ఆ వంతెన కోసం చివరకు పెద్దయెత్తున ప్రజాపోరాటం చేయాల్సి వచ్చింది.
♦ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించినట్లే అనిపిస్తోంది! ఆ పేరు వెనక ఉన్న కథ...
నేను 1956 మే 26వ తేదీన పుట్టాను. బుద్ధజయంతి సందర్భంగా పుట్టానని ఆ పేరు పెట్టారు.
♦ బుద్ధుడు, బౌద్ధం పట్ల అభిప్రాయం... బౌద్ధధర్మం చాలా ఇష్టం. దలైలామాను కలిశాను కూడా.
♦ ఇష్టమైన వ్యక్తులు... మదర్ థెరిస్సా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ). వీరినీ కలిశాను.
♦ తెలుగు భాష కోసం ఉద్యమించారు. తెలుగు గురించి ఉన్న కోరికలు... తెలుగుకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావాలి. ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించాను. మన తెలుగు ఫాంట్స్‌ని తీసుకుని, ఆంగ్లంలో ఉన్న విషయం తెలుగులోకి అనువాదం చేయడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
♦ ఆచరణలో గాంధేయవాదం... ఒకప్పుడు పూర్తిగా ఆచరించేవాడిని. మద్యం సేవించే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఇప్పుడు సమాజంలో ఎక్కువ శాతం వారే. మాట్లాడకపోతే కుదరదు. దాంతో గాంధీజీని తరచూ ప్రస్తావించే అలవాటును తగ్గించుకున్నాను.
♦ అత్యంత బాధ కలిగిన సందర్భం... తెలుగు జాతి రెండుగా విడిపోవడం. రాష్ట్రాలు రెండైనా తెలుగు వాళ్లంతా మానసికంగా కలిసి ఉండాలని, సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న జాతిగా నిలవాలనేది నా కోరిక.
♦ ప్రజాస్వామ్య భారతంలో గమనించిన మార్పు! సామాన్యులు చట్టం చేసే అవకాశానికి దూరమవుతున్నారు. సామాన్య ఉపాధ్యాయుడైన మా నాన్న మంత్రయ్యారు. ఇప్పుడలా లేదు. దురదృష్టం ఏంటంటే... ప్రజలు కూడా ధనవంతుడు పోటీలో ఉంటే బావుణ్ణనుకుంటున్నారు. ఇక సేవ చేస్తానని ముందుకు వచ్చే వారిని ఆదరించేదెవరు?! - వాకా మంజులారెడ్డి