Mandali Buddhaprasad
-
దివి ఉప్పెన ఓ దుర్దినం
అవనిగడ్డ : 1977 ఉప్పెన దివిసీమకు దుర్దినమని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీక్షేత్రంలో శనివారం ఉప్పెన మృతుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉప్పెన అనంతరం దివిసీమ పునరుజ్జీవనానికి దాతల సేవలు మరువలేనివన్నారు. దివిసీమకు రక్షణ కల్పించేందుకు విస్తృతంగా మడ అడవుల పెంపకం, ఇంటింటా చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్థిరావు, కేడీసీసీ డైరెక్టర్ ముద్దినేని చంద్రరావు, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి సత్యనారాయణ, నాయకులు మత్తి శ్రీనివాసరావు, బచ్చు వెంకటనాథ్, యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, పంచకర్ల స్వప్న పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో.. 1977 ఉప్పెన మృతులకు దివిసీమలో పలు పార్టీలకు చెందిన నాయకులు శనివారం ఘనంగా నివాళులర్పించారు. పలుచోట్ల కొవ్వొత్తులతో నివాళులర్పించగా, మరికొన్నిచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో నాయకులు పులిగడ్డ పైలాన్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, అవనిగడ్డ పట్టణ కన్వీనర్ అన్నపరెడ్డి రాందాస్, నాయకులు చింతలపూడి లక్ష్మీనారాయణ, కేజీ నాగేశ్వరరావు, గరికపాటి కృష్ణ, సుదర్శన్, నలుకుర్తి నగధర్, రాకేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ మత్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పులిగడ్డ పైలాన్ వద్ద నివాళులర్పించారు. కాగా, ఉప్పెన మృతుల ఆత్మకు శాంతి కలగాలని మండల పరిధిలోని కోటగిరిలంక ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
నవీన భారత నిర్మాత పీవీ
ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సాక్షి, హైదరాబాద్: నవ భారత నిర్మాత పండిట్ నెహ్రూ అయితే, నవీన భారత నిర్మాత మన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో, పెంగ్విన్ పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థల నేతృత్వంలో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘నరసింహుడు’, ‘హాఫ్ లయన్’ పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమతుల్యతను సాధించిన వారెవరైనా ఉన్నారంటే అది పీవీయేనని ఆయన స్పష్టం చేశారు. భారత హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పీవీ నర్సింహారావుపై ఆయన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరనే అభాండం వేశారని, కానీ ఆయనంత వేగంగా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మరొకరు లేరన్నారు. మాజీ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ పీవీ జీవితం రాజకీయవేత్తలకు ఓ సందేశం అన్నారు. సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ రామారావు మాట్లాడుతూ అయోధ్య ఘటనలో పీవీ నర్సింహారావును నిందించడం సరికాదన్నారు. రచయిత వినయ్ సీతాపతి మాట్లాడుతూ భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన మహానుభావుడి గురించి ఈ పుస్తకం రాయడం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. పీవీని గుర్తించే సమయం ఆసన్నమైంది పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల అమలుతో పాటు అణ్వాయుధ తయారీలో ఎంతో నిగూఢంగా వ్యవహరించారన్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. మార్గరెట్ థాచర్, డెంగ్‌తో సమానంగా పీవీని గుర్తించే సమయం ఆసన్నమైందని కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన ఎమెస్కో విజయ్‌కుమార్ మాట్లాడుతూ పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల ఫలితమే నేటి భారతమన్నారు. పెంగ్విన్ సీనియర్ ఎడిటర్ రజని మాట్లాడుతూ భారతీయ చరిత్రలో పీవీ స్థానాన్ని మననం చేసుకొనే సందర్భమిదేనన్నారు. . పీవీ ఆర్థిక సంస్కరణలను హర్షించలేని వారిలో తానూ ఒకరినని, అయినా చరిత్రలో పీవీ స్థానాన్ని చెరిపేయాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం కాదని ఎడిటర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో ప్రధాన సంపాదకులు డాక్టర్ . చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన పనే అయినా రచయిత నిష్పాక్షికంగా, సమకాలీన ఆధారాలతో ఈ పుస్తకాన్ని మనకందించారన్నారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, టంకశాల అశోక్, కె.బి.గోపాలంలకు ఎమెస్కో విజయ్ కుమార్ కృత జ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు తన తండ్రితో అనుభవాలను నెమరేసుకున్నారు. -
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..
గుంటూరు: తెలుగు రాష్ట్రంలో రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే మాతృభాష ఉన్నత స్థితికి చేరుకుంటుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష రక్షణ, అభివృద్ధి మహాసభ, సదస్సు జరిగింది. తమిళనాట భాష రాజకీయాలను శాసిస్తున్న కారణంగా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యునెస్కో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని అన్ని దేశాలకు సూచించిన విషయాన్ని ఉటంకించారు. సమస్యకు అసలు మూలాలు గుర్తించి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టినప్పుడే తెలుగు భాషకు మహర్ధశ అని వ్యాఖ్యానించారు. గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాషను మరిస్తే పుట్టగతులుండవన్న మహాత్మగాంధీ మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోను తెలుగు వారు తమ పిల్లలకు శని, ఆదివారాల్లో తెలుగు భాష నేర్పి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతిక పదాలు తెలుగులోకి తర్జుమా చేయడం, మన భాషను పరిపుష్టం చేస్తాయని చెప్పారు. మంచి పదాలు ఇతర భాషల నుంచి, తీసుకోవడం, కొత్తపదాలు అనువదించడం, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన భాషలో అందించడానికి మీడియా కృషి చేస్తున్నదని, ఇంకా చాలా చేయాల్సిన ఉందన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తెలుగు భాషా పరిషత్ ఏర్పాటు చేసి తెలుగీకరించిన పదాలను, విషయాలను అన్ని పత్రికలకు అందించే బృహత్తర కార్యక్రమం కొన్నాళ్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషోద్యమ సమాఖ్య చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ఉపన్యసిస్తూ.. గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభ తీర్మానాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు. -
ఆ దేవుడు కోరుకునేదీ అదేనని నా నమ్మకం!
మండలి బుద్ధప్రసాద్... మానవతామూర్తి, స్నేహశీలి, అజాతశత్రువు, నిరాడంబరతకు ప్రతిరూపం... ఒక వ్యక్తిలో ఇన్ని విశేషాలు రూపుదిద్దుకోవడానికి కారణం? ‘గాంధీజీని పలుమార్లు చదవడమే’ అంటారాయన! గాంధీజీని చదివి, ‘గాంధీక్షేత్రం’ పత్రిక నడిపిన అనుభవంతో గాంధేయవాదిగా మారిన ఆయన మనోగత వీక్షణం ‘సాక్షి’ పాఠకుల కోసం... అంతర్వీక్షణం: మండలి బుద్ధప్రసాద్ ♦ నిరాడంబరతకు స్ఫూర్తి... మొదట గాంధీజీ, తర్వాత మా నాన్న వెంకట కృష్ణారావు. నిరాడంబరత మనిషిని అవినీతికి దూరంగా ఉంచుతుంది. ఆర్థిక స్థాయికి మించిన జీవనశైలికి అలవాటు పడినప్పుడు అవినీతికి పాల్పడడమే సులువైన మార్గంగా అనిపిస్తుంది. ♦ ఆడంబరంగా జరిగే వేడుకలకు హాజరవుతున్నప్పుడు... అక్కడి దుబారా చూస్తే బాధేస్తుంది. ఒక పెళ్లిలో అయ్యే వృథా ఖర్చుతో ఎంతోమందిని చదివించవచ్చు. ♦ విమర్శలను తీసుకొనే విషయంలో... సద్విమర్శను స్వీకరిస్తాను. ఆరోపణ కోసమే విమర్శిస్తే బాధేస్తుంది. ♦ మీలో మీకు నచ్చే లక్షణం... నేను ఎవరినీ విమర్శించను. ఎప్పుడైనా అంశాన్ని, సిద్ధాంతపరంగా విమర్శిస్తాను తప్ప వ్యక్తితో విభేదించను. అయితే అది నచ్చే లక్షణం అని చెప్పలేను. అది నా అలవాటు! ♦ ఎదుటి వ్యక్తిని చూసే కోణం... రాజకీయాల్లో చాలామంది పరిచయమవుతుంటారు. ఎవరినీ సునిశితంగా పరిశీలించను. అందరినీ నమ్మాలనే తత్వం నాది. అలాగే నమ్ముతాను కూడా. ♦ దూరంగా ఉండాలనుకొనే వ్యక్తులు... పితూరీలు చెప్పేవారంటే నాకిష్టం ఉండదు. నాకు కోపం వచ్చేది కూడా అప్పుడే. నా ప్రత్యర్థి గురించి పితూరీలు మోసుకొచ్చినా సరే... సమర్థించను. ♦ తప్పనిసరిగా పాటించే సిద్ధాంతం... స్వదేశీ వస్తువులను మాత్రమే వాడటాన్ని చాలాకాలం పాటించాను. ఇప్పుడు విదేశీ కంపెనీల ఉత్పత్తులను వాడక తప్పడం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి మాత్రం వెళ్లను. ♦ పూలదండలు వేయించుకున్నప్పుడు కలిగే భావన... ఆ డబ్బుతో ఏదైనా పుస్తకాన్ని కొని బహూకరించమని చాలాసార్లు చెప్పి చూశాను. చివరికి పుస్తకావిష్కరణ సభల్లో కూడా పూలదండలు వేస్తుంటారు. ♦ మీ బలం, బలహీనత? బలం ఏమిటో తెలియదు, బలహీనత మాత్రం క్షణికావేశంతో కేకలెయ్యడం. ♦ దేవుణ్ణి కోరుకునేది... మంచిబుద్ధిని ప్రసాదించమని కోరుకుంటా. సాటి మనిషికి సేవ చేస్తే దేవుడు మెచ్చు కుంటాడు. ఆ దేవుడు కోరుకునేదీ అదేననీ, కేవలం పూజలు చేసి, మొక్కడాన్ని ఇష్టపడడనీ నా నమ్మకం. ♦ కృష్ణాజిల్లా పులిగడ్డ - గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం అత్యంత సంతోషాన్నిచ్చింది. అది మా నాన్న కోరిక. చనిపోయే ముందు కూడా దాని గురించే అడిగారు. ఆ వంతెన కోసం చివరకు పెద్దయెత్తున ప్రజాపోరాటం చేయాల్సి వచ్చింది. ♦ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించినట్లే అనిపిస్తోంది! ఆ పేరు వెనక ఉన్న కథ... నేను 1956 మే 26వ తేదీన పుట్టాను. బుద్ధజయంతి సందర్భంగా పుట్టానని ఆ పేరు పెట్టారు. ♦ బుద్ధుడు, బౌద్ధం పట్ల అభిప్రాయం... బౌద్ధధర్మం చాలా ఇష్టం. దలైలామాను కలిశాను కూడా. ♦ ఇష్టమైన వ్యక్తులు... మదర్ థెరిస్సా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (సరిహద్దు గాంధీ). వీరినీ కలిశాను. ♦ తెలుగు భాష కోసం ఉద్యమించారు. తెలుగు గురించి ఉన్న కోరికలు... తెలుగుకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావాలి. ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించాను. మన తెలుగు ఫాంట్స్‌ని తీసుకుని, ఆంగ్లంలో ఉన్న విషయం తెలుగులోకి అనువాదం చేయడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ♦ ఆచరణలో గాంధేయవాదం... ఒకప్పుడు పూర్తిగా ఆచరించేవాడిని. మద్యం సేవించే వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఇప్పుడు సమాజంలో ఎక్కువ శాతం వారే. మాట్లాడకపోతే కుదరదు. దాంతో గాంధీజీని తరచూ ప్రస్తావించే అలవాటును తగ్గించుకున్నాను. ♦ అత్యంత బాధ కలిగిన సందర్భం... తెలుగు జాతి రెండుగా విడిపోవడం. రాష్ట్రాలు రెండైనా తెలుగు వాళ్లంతా మానసికంగా కలిసి ఉండాలని, సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న జాతిగా నిలవాలనేది నా కోరిక. ♦ ప్రజాస్వామ్య భారతంలో గమనించిన మార్పు! సామాన్యులు చట్టం చేసే అవకాశానికి దూరమవుతున్నారు. సామాన్య ఉపాధ్యాయుడైన మా నాన్న మంత్రయ్యారు. ఇప్పుడలా లేదు. దురదృష్టం ఏంటంటే... ప్రజలు కూడా ధనవంతుడు పోటీలో ఉంటే బావుణ్ణనుకుంటున్నారు. ఇక సేవ చేస్తానని ముందుకు వచ్చే వారిని ఆదరించేదెవరు?! - వాకా మంజులారెడ్డి