గుంటూరు: తెలుగు రాష్ట్రంలో రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే మాతృభాష ఉన్నత స్థితికి చేరుకుంటుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష రక్షణ, అభివృద్ధి మహాసభ, సదస్సు జరిగింది. తమిళనాట భాష రాజకీయాలను శాసిస్తున్న కారణంగా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యునెస్కో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని అన్ని దేశాలకు సూచించిన విషయాన్ని ఉటంకించారు. సమస్యకు అసలు మూలాలు గుర్తించి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టినప్పుడే తెలుగు భాషకు మహర్ధశ అని వ్యాఖ్యానించారు.
గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలి
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాషను మరిస్తే పుట్టగతులుండవన్న మహాత్మగాంధీ మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోను తెలుగు వారు తమ పిల్లలకు శని, ఆదివారాల్లో తెలుగు భాష నేర్పి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతిక పదాలు తెలుగులోకి తర్జుమా చేయడం, మన భాషను పరిపుష్టం చేస్తాయని చెప్పారు. మంచి పదాలు ఇతర భాషల నుంచి, తీసుకోవడం, కొత్తపదాలు అనువదించడం, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన భాషలో అందించడానికి మీడియా కృషి చేస్తున్నదని, ఇంకా చాలా చేయాల్సిన ఉందన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తెలుగు భాషా పరిషత్ ఏర్పాటు చేసి తెలుగీకరించిన పదాలను, విషయాలను అన్ని పత్రికలకు అందించే బృహత్తర కార్యక్రమం కొన్నాళ్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషోద్యమ సమాఖ్య చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ఉపన్యసిస్తూ.. గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభ తీర్మానాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు.
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..
Published Fri, Aug 28 2015 7:25 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement