మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. పాల పాకెట్టు, పాల వ్యాను– ఇలా వాడమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ఇక పత్రికల్లో సరేసరి. ఆంబులెన్స్ సేవలు, అకౌంట్ బదిలీ, కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు– ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న మిశ్రమ పదాలను వివరిస్తుంది సరికొత్త ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’.
‘‘నిఘంటు రచన మతి చెడిన వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ‘నా బొందో’ అంటూ
కేంద్రీకరించి మరీ జరగాల్సిన పని. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కానీ, ఒకటి మాత్రం నిజం. అప్పుడప్పుడూ ఈ వృత్తి, నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది’’. – ఫ్రాన్స్ సాహిత్య చరిత్రను, ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘంటువును ఎలా నిర్మించాను’ అన్న అత్యుత్తమ గ్రంథాన్ని రచించిన ఎమిలీ లిత్రే.
ఇప్పుడు మనం చర్చించుకునేది ఒక్కో అక్షరానికే కాదు, ఒక్కో పదానికి ఉన్న భిన్నార్థాలను గురించే కాదు, బహుశా ఇతర భాషా నిఘంటువులలో కూడా రాని, ఒక్క తెలుగులో మాత్రమే ఇటీవల వెలువడిన తొలి ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’ గురించి. పత్రికా భాషా నిఘంటువులు అనేక భాషల్లో ఎన్నో ఉండవచ్చు. కానీ, రెండు భాషలతో కూడుకున్న మిశ్ర సమాస నిఘంటువులు మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రత్యేక నిఘంటువును విద్యారంగంలో, బోధనా రంగంలో ఉస్మానియా, హైదరాబాద్, ద్రవిడియన్ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా గడించిన అనుభవంతో ఆచార్య పులికొండ సుబ్బాచారి రూపొందించారు. పత్రికలు నిత్యం వాడుతూ పాఠకులకు అందించే కొత్త కొత్త మిశ్ర సమాసాల లోగుట్టును బయట పెట్టారు.
ఆఫీసరమ్మ ఏ భాష?
పదాల వాడకంలో మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. ఉదాహరణకు ‘ఆంబులెన్స్ సేవలు’, ‘అకౌంట్ బదిలీ’, ‘ఈడీ లేఖ’, ‘ఈ’ పుస్తకం (ఎలక్ట్రానిక్ పుస్తకం), కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, ఆఫీసరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు, పెళ్లి వీడియోలు, పేపరు ప్రకటన, ప్లాస్టిక్ చెత్త, పాల పాకెట్టు, కోళ్ల ఫారం, యూనియన్ ఎన్నికలు, సమ్మె హారన్, సీల్డు కవర్ ముఖ్యమంత్రి, స్పీకర్ నిర్ణయం – ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న తెలుగాంగ్ల మిశ్రమ సమాసాలకు ఆధారాలు, అర్థ వివరణలను సుబ్బాచారి ఎంతో శ్రమపడి అందు బాటులోకి తెచ్చారు. ఇందులో 1,600 సమా సాలకు పొందికైన వివరణలున్నాయి. సంప్ర దాయ వ్యాకరణాలు చూపించని సంధి సమాసాల నియమాలను రచయిత ప్రత్యేకించి చూపారు. ఇంతకు ముందు తెలుగు భాషలో ఉన్న అందమైన పదాలకు ‘ఒక్క పదం – అర్థాలెన్నో’ మకుటంతో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి తెలుగు పదాల అందచందాలను, ప్రత్యే కతను తెల్పడానికి విశిష్టమైన తొలి ప్రయత్నం చేశారు.
నిఘంటు చరిత్ర ప్రాచీనం
ఇలా ఒక్కో పదానికే కాదు, ఒక్కో ‘వర్ణా’నికి (అక్షరానికి) కూడా భిన్నార్థాలుంటాయన్నాడు క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. ప్రపంచంలో తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్ల నాటి సుమేరియన్, అక్కాడియన్ ప్రతి. ప్రపంచంలో తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్ – బాబిలోనియన్ – హిట్డయిట్ భాషల్లో వెలువడింది. అలాగే ఔషధ శాస్త్రానికి సంబంధించిన ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) తొలిసారిగా మెసపటోమియా మట్టి ఫలకలపై వెలుగు చూసిందంటారు. ఎటు తిరిగీ మానవాళి విజ్ఞాన, వికాస దశల్లోకి కాలిడిన తర్వాతనే శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగునాట వైద్య భాషకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని వెల్లడించారు. మన చరకుడి ఆయుర్వేద వైద్య శాస్త్రం, శుశ్రుత కృషినీ మరవలేం. వన మూలికల ప్రాశస్త్యం తెలిపిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుపరాతి యుగం) నాటిది. అనారోగ్యం అనేది ‘విధి నిర్ణయం కాద’ని చెబుతూ, మానవ ప్రయత్నం ద్వారా, సంకల్ప బలం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని చరకుడు తన వైద్య సంపుటం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు.
వ్యవహార నిఘంటువు
ఆధునిక యుగంలో అలాంటి గొప్ప ప్రయత్నంలో భాగమే, సరికొత్త ప్రత్యేక మిశ్ర సమాస నిఘంటు నిర్మాణం అనీ, ఇది ‘ఆహ్వానించదగిన’ పరిణామమనీ అన్న భాషా శాస్త్రజ్ఞులు, మిత్రులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వర్రావు అభిభాషణతో ఏకీభవించని వారుండరు. తెలుగు వినియోగంలోకి వచ్చేసిన ‘పాల క్యాను, పాల మీటరు, పాల పాకెట్టు, పాల వ్యాను, పాల ట్యాంకరు’ లాంటి కొత్త సమాసాలు చేయమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. లేదా ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ‘ఇలా వాడొద్దు, ఇంగ్లిష్ పదాన్ని తెలుగు చేసుకొని వాడుకోమని ఎవరైనా పండితుడు చెప్పినా లేదా ప్రభుత్వం వారు నిర్దేశించినా ఫలితం ఉండదు. జన వ్యవహారాన్ని ఎవరూ మార్చలేరు. ఇది అనివార్యంగా జరుగుతూ ఉన్న భాషా పరిణామం అని అర్థం చేసుకోవా’లన్న సుబ్బాచారి వ్యవహార పరిజ్ఞానం మెచ్చుకోదగింది.
భాషా పరిణామం అనేది ‘సమాజ సహజ పరిణామంలో భాగంగా’ జరుగుతున్నది కాబట్టే, ఇలా తెలుగాంగ్ల పదాల కలయికతో మిశ్రమ సమాసాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి భాషావేత్తలు ఈ పరిణామాన్ని విధిగా అధ్యయనం చేయవలసి ఉందన్న రచయిత భావన ప్రశంసనీయమైనది. ముందు పదాల విదేశీకరణం, దేశీయ పదాలు క్రమంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దేశీకరణ, అవసరాన్ని బట్టి మిశ్ర భాషా సమాసాలూ భాషా పరిణామంలో అనివార్యమని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – సకల భాషా, సంస్కృతుల సమ్మేళనమే ఒక మిశ్ర సమాస నిఘంటువు!
-ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment